మై డియర్ రోమియో - 13

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 13

 

స్వప్న కంఠంనేని

 

"వైభవ్ గాడు ఓవర్ చేస్తున్నాడు. అసలేంటనుకుంటున్నాడు'' అంది హనిత చేతులు కడుక్కుంటూ.
"పోన్లేవే. అంతకన్నా ఎక్కువగానే మనం ఇప్పటికే ఎందరినో ఏడిపించాం కదా'' అంది మీనా.
"అవున్లే. నిన్ననలేదుగా నీకలాగా ఉంటుంది'' అంది హనిత కోపంగా.
"అది కాదు హనీ'' సర్ది చెప్పబోయింది మీనా.
"నాతో మాట్లాడకు'' హనిత విసురుగా మీనాని నెట్టుకుని క్లాస్ రూమ్ లోకి వచ్చింది.
హనిత ఒక్కతే క్లాస్ లోకి రావటం చూసిన వైభవ్ అన్నాడు.
"పీనుగొక్కటే లోపలికి వచ్చిందేమిటి? వెళ్ళేటప్పుడు ఏనుగు కూడా వెళ్ళిందిగా''
హనితకి అరికాలిమంట నెత్తికెక్కింది.
వైభవ్ ని పట్టుకుని దులిపేద్దామనుకుంది.
మళ్ళీ తనలో తనే "ఎందుకులే. ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో! నా కిస్మత్ అసలు బాగుండలేదీరోజు. వీళ్ళు నన్ను టీజ్ చేస్తున్నారు. మీనా, నేను కటాఫ్ అయ్యాం. ఈ రాజా కూడా ఈరోజే రాలేదు'' అనుకుంది విసుగ్గా.
వైభవ్ ని క్రూరంగా చూస్తూ కూర్చుంది. కాసేపయ్యాక ఆమెకెందుకో అనీజీగా అనిపించింది. బెంచ్ మీదంతా తడిగా ఉన్నట్లు ఏదో ఫీలింగ్. ఇబ్బందిగా అటూ ఇటూ కదిలింది.
తర్వాత తాను కూర్చున్న బెంచ్ ని చూసుకుంది. ఆమే గుండాగినంత పనయింది.
"ఇది కూడా వైభవ్ పనే అయుంటుంది'' అనుకుంది మనసులో.
"అసలే ఈరోజు  వైట్ స్కర్ట్ వేసుకున్నా, ఎలాగో ఏమో'' అనుకుంది తనున్న పరిస్థితికి హనితకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఇంటి బెల్ అయి అందరూ వెళ్ళిపోతున్నా హనిత మాత్రం అక్కడే కూర్చుంది.
అందరూ వెళ్ళిపోయుంటారానుకుని నిశ్చయించుకున్న తరువాత నెమ్మదిగా లేచి నిలబడింది. వెనక్కి తిరిగింది.
లాస్ట్ బెంచ్ లో చిరునవ్వుతో వైభవ్.
"చూశావా? నిన్నేడిపించటం ఎంత తేలికో ..'' ఇంకా ఏదో అంటున్నాడతను. వినిపించుకోకుండా బయటికి పరిగెత్తింది హనిత.
హనిత ఇంటికెలా చేరిందో ఆమెకే తెలీదు. ఇంటికి రాగానే ఆమే చేసిన మొదటి పని - ఎవరూ చూడకుండా లోపలి పరిగెత్తి డ్రెస్ చేంజ్ చేసుకోవటం.
తర్వాత మంచం మీద పడుకుని కసిగా తిట్టుకుంది.
"కంట్రీ బ్రూట్!''
మళ్ళీ కాసేపు అటూ ఇటూ పచార్లు చేసింది. సడెన్ గా ఆగిపోయి కసిగా అరిచింది.
"యూ బాస్టర్డ్! ఐ విల్ సీ యువర్ ఎండ్''
సరిగ్గా అప్పుడే హనిత కోసం వచ్చిన రాజా లోపలి రాబోతూ ఆమే అరుపుకి భయపడి అక్కడే ఆగిపోయాడు.
కాసేపటికి గుండె దిటవు చేసుకుని భయం భయంగానే లోపలికి వెళ్ళాడు.
రాజాని చూసేసరికి హనితకి ఆనందంగా అనిపించింది.
ఎదురెళ్ళి మరీ అడిగింది "హాయ్ రాజా! ఇవాళ కాలేజీకి రాలేదేం?''
అతను సమాధానం చెప్పెలోపుగా తనే అంది మళ్ళీ "ఇదిగో రేపట్నుంచీ మనం మీనాతో మాట్లాడొద్దు. దాంతో నేను కటాఫ్ అయిపోయాను. ఇక నుంచీ కాలేజీలో నీ ఒక్కడితోనే మాట్లాడతాను నేను''
హనిత తనతో అంత చనువుగా మాట్లాడేసరికి రాజా సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. రాజాకి అతిగా సంతోషం వేసినా అతిగా బాధనిపించినా, భయం వేసినా ఒకదానికొకటి సంబంధం లేని మాటలు మాట్లాడేస్తుంటాడు. ఇప్పుడూ అదే జరిగింది.
"సురేష్ లేడా? సుధేష్ణ మంచిదే గానీ క్లాస్ ఫస్టు వస్తుందెందుకు? 'ప్రేమకాకులు' సినిమా భలే బావుంది. అన్నట్టు మన కొళ్ళేవి? పెన్ పట్టుకురా అన్నం తింటాను'' అన్నాడు.
హనిత నెత్తి బాదుకుంది.
"నీతో ఇదే గోల. అసలు నీతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడతావ్'' అంది.
కోపంగా ఉన్న హనితం ఆహం చూసి రాజా సంబరమంతా దిగిపోయింది.
"ఏమైందసలు ఇవాళ కాలేజీలో'' అన్నాడు అయోమయంగా.
"ఏమైందా? ఆ  వైభవ్ గాడికి భూమ్మీద నూకలు అయిపోవచ్చినట్టున్నాయ్!పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. వాడి అంతు చూస్తాను. వాడి భరతం పడతాను. వాడినెప్పుడో చంపేస్తాను'' పూనకం వచ్చినట్టు కసిగా అంది.
తర్వాత జరిగిందంతా రాజాకి వివరించింది హనిత.
"వైభవ్ నేం చేయాలా?'' అని ఆలోచిస్తూ ఇద్దరూ బుర్రలు బద్దలు కొట్టుకోసాగారు.