TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
అద్గదీ సద్గతి
రాజా
త్రిపురనేని మహారథి గారబ్బాయి దర్శకుడిగా తీసే సినిమా ప్రారంభోత్సవం రికార్డింగ్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ ముగిశాక, కొందరు ఫిలిం జర్నలిస్ట్ లు సరదాగా ' మహతి రికార్డింగ్ స్టూడియో ' బయట చెట్టు నీడన పిచ్చాపాటి కబుర్లలో పడ్డారు.
అక్కడున్న వారిలో ' చిత్రం ' పత్రిక ఎడిటర్ బాబురావు, ' ఇండియన్ ఎక్స్ ప్రెస్ ' ఛీప్ సబ్ ఎడిటర్ యస్. యస్. శివకుమార్. ' నంబర్ వన్ ' పత్రిక రిపోర్టర్ నారాయణ రాజు, ' ' ఆంధ్రభూమి ' దిన పత్రిక రిపోర్టర్ నారాయణ, ' తెలుగు పత్రిక ' సీనియర్ రిపోర్టర్ వెంకట్రావ్....అందరూ ఉన్నారు.
తెలుగు సినిమా కథల తీరు తెన్నులపై చర్చ మొదలైంది. “ నా దగ్గర ఓ అద్భుతమైన కథ ఉంది. ఆ కథలో అన్ని యాస్పెక్ట్ లూ కవరవుతాయి. క్లయిమాక్స్ కూడా ఎవ్వరూ ఊహించలేని విధంగా ఉంటుంది. కావాలంటే మన నారాయణని అడగండి " అని అన్నాడు శివకుమార్.
“ అవును. నేను ఆంధ్రప్రభలో వర్క్ చేసే రోజుల్లో చెప్పేవాడీ కథని చాలా సరదాగా ఉంటుంది. వినండి , వినండి. ” అంటూ సర్టి పై చేశాడు నారాయణ.
“ చెప్పు మరి... ఆలస్యం దేనికి ? అడ్వాన్స్ ఇచ్చి హోటల్లో రూమ్ బుక్ చేస్తే గాని చెప్పవా ?”అన్నాడు నారాయణరాజు.
“ సరే వినండి. హీరోయిన్ గ్లామరస్ గా ఉంటుంది. భక్తి ఎక్కువ చిన్నప్పట్నించీ పుట్టలో పాలుపోసి పాటలు పాడుతూ ఉంటుంది. దాన్తో ఉమెన్ యాస్పెక్ట్. పెద్దవాళ్ళ యాస్పెక్ట్ రెండూ కవరవుతాయి. పక్కింటి కుర్రాడే కదా అని ఓ నికృష్ణుడుతో పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు "
“ నికృష్ణుడుతో తెలిసి తెలిసి ఎలా పెళ్లి చేస్తారయ్యా ? ” అడిగాడు వెంకట్రావ్.
“ ఉండండి సార్... నన్ను చెప్పనివ్వండి. వాడు నికృష్ణుడని వాళ్లకి తెలియదు. మనకు తెలుస్తూ ఉంటుంది . ఎలాగంటే కృష్ణుడి లెవెల్లో అమ్మాయిల్ని వెంటేసుకుని స్టెప్పుల డ్యూయెట్లు పాడుతూ ఉంటాడు...”
“ ఎందుకూ కృష్ణుడు, నికృష్ణుడు అనే ప్రాస కలవటం కోసమా ? ” అని అడిగారు బాబూరావు.
“ అది కాద్సార్... అదంతా యూత్ కోసం... అలా యూత్ ని కవర్ చేస్తాం అన్నమాట "
“ ఎంత యూత్ అయితే మాత్రం అలా అమ్మాయిల్తో తిరిగితే రోగాలంటుకుని చావడా !? ”అన్నాడు నారాయణరాజు.
“ రోగాలంటుకోవడం, చావడం రెండూ జరిగాయి. దాన్తో వాడి శవాన్నిపుట్టముందేసుకుని ' ఓ నాగదేవా నా పతిని బ్రతికించలేవా ' అని పాడుతుంది హీరోయిన్. అక్కడ సెంట్ మెంట్ పార్టు వర్కవుట్ అవుతుంది.”
“ అవార్డు యాస్పెక్ట్ చెప్పావ్ కాదు !? ” అన్నాడు నారాయణ.
“ ఆ పాయింట్ కే కదా వస్తున్నా....! అలా ఆ హీరోయిన్ పాడగానే పుట్టలోంచి పాము వచ్చి' పిచ్చిదానా...అసలు పాములు మనిషిని బ్రతికించడం అన్నది సినిమాల్లోనే తప్ప బైట ఎక్కడైనా చూశావా. నీకు భక్తి తప్ప బుర్ర లేనట్టుందే ' అని అంటుంది "
“ పాములు మాట్లాడం అదీ మనకర్థమయ్యే తెలుగులో మాట్లాడం ఫాంటసీ యాస్పెక్టా ? ” అన్నాడు నారాయణరాజు.
“ నువ్వలా అనుకుంటే నాకభ్యంతరం లేదు గానీ అక్కడ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా హేతువాదానికి అనుగుణంగా డైలాగులు చెప్తాం కాబట్టి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అది అవార్డు యాస్పెక్ట్ " అన్నాడు శివకుమార్.
" క్లయిమాక్స్ ఊహించని విధంగా ఉంటుందన్నావు కదయ్యా అది ఇదేనా ? ” అడిగారు బాబూరావు.
“ అబ్బే, ఇది జస్ట్ ప్రీ క్లయిమాక్స్. అసలు క్లయిమాక్స్ వేరే ఉంది. ”
“ సస్పెన్స్ తో చంపక త్వరగా చెప్పవయ్యా " అన్నాడు వెంకట్రావ్. “ అప్పుడు హీరోయిన్ ' అంతేనా అయితే నేను నా పతితో కలిసుండే మార్గమే లేదంటావా...?! ' అని అంటుంది. ' అలా అన్నావ్ బావుంది... నీ పతిని బ్రతికించలేనన్నాను గాని నిన్ను అతని దగ్గరికి చేర్చలేనన్నానా ఇద్దరూ కలిసుండండి !' అంటూ ' ఫట్ ' మని కాటు వేసి పోతుందా పాము. అదీ క్లయిమాక్స్ " అంటూ ముగించాడు శివకుమార్.
|