Rating:             Avg Rating:       393 Ratings (Avg 2.92)

సిల్లీ ఫెలో - 12

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 12

- మల్లిక్

 

"మా ఇంట్లో ఆడపిల్లలు ఉద్యోగాలు చేసి ఎరుగరు. నువ్వు చూస్తే...." ఏదో చెప్పబోయాడు పర్వతాలరావు.

"పెళ్ళయాక సంసారానికి నా ఉద్యోగం అడ్డమనిపిస్తే మానేస్తానండీ" అంటూ అతనిమాట పూర్తికాకుండానే చెప్పింది సీత.

పర్వాతలరావు తల పంకించాడు.

అప్పుడు సాయంత్రం ఆరు గంటలైంది.


*         *              *

రాత్రి భోజనాల దగ్గర....

"ఓహ్... మటన్ బిర్యానీ! అబ్బో... చికెన్ ఫ్రయ్!! బాబోయ్... ఫ్రాన్స్ కర్రీ! హుర్రే... ములక్కాడల సాంబార్..." తన ముందున్న ఐటమ్స్ చూసి ఆశ్చర్యంతో ఆనందంతో కేకలు పెడుతున్నాడు పర్వతాలరావు.

"ఏంటీ ఈవేళ అన్నీ నాకిష్టమైన ఐటమ్స్ చేశావ్. కొంపదీసి ఈరోజు నా పుట్టినరోజో లేకపోతే మన పెళ్ళిరోజో కాదు కదా?"

భార్యతో అన్నాడు పర్వతాలరావు.

"చాల్లెండి మీ హాస్యాలు" పార్వతమ్మ సిగ్గుపడుతూ అంది. "ఇవన్నీ ఈ అమ్మాయే చేసింది" సీత వంక చూస్తూ అంది.

"ఓ..... అలాగా?" కళ్ళు పెద్దవిచేసి సీతవంక చూస్తూ అన్నాడు పర్వతాలరావు.

తర్వాత మెల్లగా అన్ని ఐటమ్స్ రుచి చూశాడు. అతని మొహం  విప్పారింది.

"ఓహ్... అద్భుతం! అన్నీ చాలా బాగున్నాయ్ అమ్మాయ్. అమృతం అనుకో!" సీతని మెచ్చుకోలుగా చూస్తూ అని "పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైంది. ఏనాడైనా నువ్వింత రుచిగా వండి తగలెట్టావా... దరిద్రంగా తగలెడ్తావ్ గానీ?" పార్వతమ్మను మందలిస్తూ అన్నాడు.

"యాహూ" గట్టిగా అరిచాడు బుచ్చిబాబు.

అతని అరుపుకు పర్వతాలరావు ఉలిక్కి పడ్డాడు.

"సడెన్ గా ఏ మొచ్చింది రా ఏబ్రాసెదవా?" బుచ్చిబాబు వంక ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు.

బుచ్చిబాబు నాలిక కొరుకున్నాడు.

"అంటే ఈ కూరలన్నీ నాక్కూడా నచ్చి సంతోషం పట్టలేక అరిచానన్నమాట" బుర్ర గోక్కుంటూ అన్నాడు.

*                *             *

మర్నాడు

తెల్లవారి ఆరు కావస్తోంది. ఇంకా పూర్తిగా చీకట్లు వీడలేదు.

పర్వతాలరావు, పార్వతమ్మలు ఇంకా నిద్రలేవలేదు. కానీ ఎన్నడూ ఏడు కొట్టందే నిద్ర లేవని బుచ్చిబాబు, సీతలు మాత్రం అప్పుడే నిద్రలేచి మొహాలు కూడా కడుకున్నారు. సీతైతే తలకి స్నానం కూడా చేసేసింది.

బుచ్చిబాబు ఓ చీపురూ, ముగ్గు చెప్పా తెచ్చి సీత చేతిలో పెట్టాడు.

"ఊ కానీయ్" అన్నాడు.

సీత అతనివంక ఇబ్బందిగా చూసింది.

"ఇలా బాగుంటుందంటావా?" అడిగింది.

"ఇలాగే బాగుంటుంది. సినిమాల్లో చూళ్ళేదూ? ఊ... ఊ... త్వరగా పద. వాళ్ళు నిద్ర లేవకముందే నువ్వు మొదలెట్టాలి!" కంగారు పెట్టాడు బుచ్చిబాబు.

సీత వాకిట్లోకి బయలుదేరింది.

"ఉట్టినే సైలెంట్ గా కాదు. పాటపాడ్తూ ముగ్గు పెట్టాలి! మరి మావాళ్ళు లేవద్దూ?" వెనుకనుండి అన్నాడు బుచ్చిబాబు.

సీత వాకిట్లో నేలమీద చీపురుతో కాస్త ఊడ్చింది. తర్వాత కళ్ళాపి చల్లింది. ఆ తర్వాత ముగ్గు చిప్ప పట్టుకుని గొంతుక్కూచుంది. బుచ్చిబాబు చాటుగా నిలబడి ఆత్రంగా వినసాగాడు.

హఠాత్తుగా పాటందుకుంది సీత.

"అమ్మనీ కమ్మనీ దెబ్బ... ఎంత వెచ్చగా వుందిరోయబ్బ. పురుషుల్లోనా పుంగవా?"

ఆ పాట వినగానే బుచ్చిబాబుకి గాభరాఎత్తిపోయింది.లబలబలాడ్తూ బయటికి పరుగుతీశాడు.

"ఏంటా పాట? మా నాన్నగారు విన్నారంటే ఈ క్షణమే నిన్ను ఇంట్లోంచి గెంటేస్తారు!" అన్నాడు సీతతో ఎగశ్వాస పీలుస్తూ.

"ఏం? ఈ పాటకేమైంది?" మంచి హిట్ సాంగే పాడుతున్నాగా?'

వేస్తున్న ముగ్గు ఆపి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సీత.

"హిట్ సాంగే కానీ ఆపాట పాడ్డానికి ఇది సమయమూ కాదు. సందర్భమూ కాదు. ముగ్గేసేటప్పుడు పాడే పాటేనా అది?"

సీత నాలుక కొరుక్కుంది.