సిల్లీ ఫెలో - 5

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 5

- మల్లిక్

 

"ఎందుకులే సిల్లీగా అనవసరమైన గొడవనీ...." నసిగాడు బుచ్చిబాబు.

"అవును... నీకిది సిల్లీగానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం నేనేం కానుగా? అదేగా నేను నీ భార్యనైవుండి నామీద ఎవడో చెయ్యేస్తే నువ్విలాగే ఊర్కుంటావా?" ఉక్రోషంగా అడిగింది సీత. లా అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళలో నీళ్ళు ఉబికాయి.

బుచ్చిబాబుకి పౌరుషం వచ్చింది.

"ఉండు... నీమీద చెయ్యేసినవాడి పనీ, నిన్ను కాలితో నొక్కినవాడి పనీ ఇప్పుడే పట్టేస్తా" అని సీతని అక్కడే ఒంటరిగా వదిలేసి థియేటర్ లోకి ఆవేశంగా వెళ్ళాడు బుచ్చిబాబు.

పావు గంట గడిచిన తరువాత బుచ్చిబాబు రేగిన జుట్టుతో చిరిగిన ప్యాంటూ షర్టుతో బయటకి వచ్చాడు.

"ఏంటిది? ఏమైంది??" కంగారుగా అడిగింది సీత.

"కనబడ్డంలేదూ..... తన్నారు!" నీరసంగా అన్నాడు బుచ్చిబాబు.

"అదేంటి.. నాతో మిస్ బిహేవ్ చేసింది కాకుండా అడిగిన నిన్ను కూడా తన్నారా?"

"తన్నింది వాళ్ళు కాదు"

"మరి?"

"నీతో మిస్ బిహేవ్ చేస్తున్నవారితో వాదిస్తుంటే ఈ సినిమా హీరో అభిమానులు తన్నారు"

"అదేంటి? ఈ విషయంతో వాళ్ళకేం సంబంధం?" ఆశ్చర్యంగా అడిగింది సీత.

వాళ్ళ అభిమాన హీరో సినిమాని చూసి చూడనివ్వకుండా గొడవ చేసానని వాళ్ళకి సిల్లీగా కోపం వచ్చింది.

పళ్ళు కొరికాడు.

*            *              *


పర్వతాలరావ్ టీవీ చూస్తున్నాడన్న మాటేగానీ ఆయన ధ్యాస టీవీ మీద లేదు మాటిమాటికీ గోడ గడియారం వంక చూస్తున్నాడు. ఆయన్ని పార్వతమ్మ గమనిస్తూనే వుంది. ఆయన మనసులోని ఆలోచనలే ఆవిడ మనసులో కూడా వున్నాయి.

చివరికి ఆవిడే అంది "ఆఫీసు అయిదు గంటలకే అయిపోతుంది కదా... అయినా వీడింకా ఇంటికి రాలేదేంటో!"

"ఫ్రెండ్స్ తో తిరుగుళ్లు ఎక్కువయ్యాయ్. పింజారీ వెధవ!" కస్సున లేస్తూ అన్నాడు పర్వతాలరావ్.

"పాపం తిట్టకండీ"

"తిడ్తానా చీరేస్తానా వెధవన్నర వెధవ! రోజూ అర్దరాత్రిదాకా వీడు రోడ్డు మీద వెలగబెట్టే రాచకార్యం ఏమిటో?"

"అందుకే వాడికి త్వరగా పెళ్ళి చేసేద్దామండీ. అప్పుడైనా ఇంటి పట్టునవుంటాడని నేను మొత్తుకునేది" నెత్తి కొట్టుకుంటూ అంది పార్వతమ్మ.

"అందుకేగా రేపు పిచ్చికవారి అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాం. పిల్ల నచ్చితే వెంటనే తాంబూలాలు పుచ్చేస్కుని పెళ్ళి చేసెయ్యడమే! రేపు ఈ సన్నాసి వెధవని ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి రమ్మను."

"పాపం తిట్టకండీ.... నేను వాడికి చెప్తాగా? రేపు మనం పిల్లని చూడ్డానికి వెళ్తున్నామే! వాళ్ళ ఇంటిపేరు పిచ్చిక అయినా పిల్లలు మాత్రం ఏనుగుల్లా ఉంటారట కదండీ?"

"ఎవడలా కూసిన తింగారి వెధవ? మనుష్యులకి పుట్టినవాళ్ళు ఏనుగుల్లా ఎందుకుంటారు? ఏదో కాస్త బొద్దుగా వుంటారేమో... అంతే" పర్వతాలరావు ఇలా అంటుండగానే బుచ్చిబాబు లోపలికొచ్చాడు. బుచ్చిబాబుని ఏదో అనాలని అనుకుని అతన్ని చూసి పర్వతాలరావు అలాగే నోరు తెరుచుకుని కొన్ని క్షణాలపాటు వుండిపోయాడు. పార్వతమ్మ పరిస్థితీ అంతే. ముందుగా పర్వతాలరావు తేరుకున్నాడు.

"ఏంట్రా వెధవాయ్ ఆ వాలకం. ఆ చిరిగిపోయిన డ్రస్సేంటీ, ఆ రేగిపోయిన జుట్టేంటీ.. ఏ జులాయ్ వెధవతోనైనా కుస్తీ పట్లుగానీ పట్టావా?" అన్నాడు పర్వతాలరావు.

"ఏంటి నాన్నా మరీ సిల్లీగా? నేనేమైనా స్ట్రీట్ రౌడీనా రోడ్లమీద కుస్తీపట్లు పట్టడానికి? ఏదో చిన్న యాక్సిడెంట్ అంతే!" అన్నాడు బుచ్చిబాబు నేల చూపులు చూస్తూ.

"బాబూ..." పార్వతమ్మ ఒక్క పెట్టున గావుకేక పెట్టింది. తరువాత చెంగున బుచ్చిబాబు ముందుకు గెంతి అతని తల, ఆ తర్వాత ఒళ్ళంతా నిమురుతూ "నీకేం కాలేదుకదు బాబూ..... చెప్పు బాబూ" అంది.

"ఏమైనా అయితే ఇంటికెలా వస్తాను... మరీ సిల్లీగా సినిమా తల్లిలా ఓవర్ యాక్షన చెయ్యకు. రోడ్డు దాటుతుంటే ఎవడో మోటార్ సైకిల్ తో గుద్దాడు. పెద్ద దెబ్బలేం తగల్లేదు" అన్నాడు బుచ్చిబాబు.

"అది సరేనోయ్... మరి ఇంటికి రావడం ఇంతాలశ్యం అయ్యిందేం?" కోరగా చూస్తూ అడిగాడు పర్వతాలరావు.

"ఆఫీసులో పనెక్కువుంటేనూ?" నసిగాడు బుచ్చిబాబు.

"ఉంటుంది వుంటుంది వెధవాఫీసు. పెళ్ళి చేసేస్తే ఆఫీసులో నిజంగా పనివున్నా ఎగ్గొట్టి ఇంటికి త్వరగా తగలడ్తావ్".

"అన్నట్లు రేపు నీకు పెళ్ళిచూపులు బాబూ... ఆఫీసు నుండి త్వరగా వచ్చేయ్" అంది పార్వతమ్మ.

"ఊహూ... పెళ్ళి చూపులు నాకొద్దు. అయినా ననక్కడకుండా పెళ్ళిచూపులు ఎవరు పెట్టమన్నారు సిల్లీగా!?" బుంగమూతి పెట్టాడు బుచ్చిబాబు.

"నిన్నడగడమేంటోయ్ వెధవాయ్... నేను వస్తామని వాళ్ళకి మాటిచ్చా... నోరు మూస్కుని మాతోరా... లేకపోతే మా అబ్బాయి సంసారానికి పనికిరాడని నేనే పనిగట్టుకుని ప్రతి వెధవ దగ్గరా ప్రచారం చేసేస్తా... అప్పుడు నువ్వు కావాలని అనుకున్నా నీకు పెళ్లికాదు..." చిందులేసాడు పర్వతాలరావు.

పార్వతమ్మ "హవ్వ... హవ్వ!" అని నోటిమీద అరచేత్తో కొట్టుకుంది.

బుచ్చిబాబు తల పట్టుకుని సోఫాలో కూర్చుండిపోయాడు.