Rating:             Avg Rating:       839 Ratings (Avg 2.86)

నేనూ - ఇంటాయన 3

Listen Audio File :

Mallik Audio Telugu Short Stories: Latest Collection of  Telugu Short Stories Comedy Three in One by Teluguone

 

నేనూ - ఇంటాయన - 3

 

- మల్లిక్

 

మళ్ళీ ఏడుగంటలకు లేచి బ్రష్షు తీసుకుని కొళాయి దగ్గరకి వెళ్ళాను.
వరదరాజులు కూడా అప్పుడే ముఖం కడుక్కుంటున్నాడు.
"ఇంకా పూర్తిగా తెల్లారాక ముందే మీ ఇంట్లోంచి కూ కూ అని వినిపించింది. ఫ్లూటు ప్రాక్టీసు చేస్తున్నారా?''
"అవునోయ్ ... చీకటితోనే లేచి సంగీతం సాధన చేయడం మంచిదట! పీతాంబరం చెప్పాడు.
ఆ రోజు సాయంత్రం ఆఫీసునుండి చంచల్రావు ఇంటికి వెళ్ళాను.
"అలా బయటికి రా నీతో మాట్లాడాలి. నీ సహాయం కావాలి'' అన్నాను.
ఇద్దరం ఓ హోటల్లో మూలనున టేబులు దగ్గర కూర్చున్నాం.
"చెప్పు ఏమిటి నీ సమస్య?''
మా వరదరాజులు ఫ్లూటు సాధనా ... నా పరీక్షల గురించి వివరంగా చెప్పాను.
"పోనీ ఈ మూడు వారాలూ రాత్రిళ్ళు మీ యింటికి వచ్చి చదువుకోనా?'' ఆశగా అడిగాను.
"అబ్బే, లాభంలేదు ... ఇంటినిండా చుట్టాలు, ఇందాక నువ్వు చూశావుగా, నీ చదువు అస్సలు సాగదు ... మా పిల్లల గోలకంటే ఆ ఫ్లూటు గోలే నయం''
"అయితే మరెలా?''
నిముషం గడిచింది.
హఠాత్తుగా టేబులు మీద ఓ గుద్దుగుద్దాడు చంచల్రావు.
"దొరికింది ... మీ ఇంటికి తక్షణం పద, నోరు మూసుకుని జరిగేది చూడు''
మేమిద్దరం ఇంటికి వెళ్ళేసరికి వరదరాజులు ఫ్లూటు వాయిస్తున్నాడు.
"వహ్వా ... వహ్వా'' చప్పట్లు కొడుతూ లోపలికి అడుగుపెట్టాడు చంచల్రావు.
"చాలా బాగా వాయిస్తున్నారండీ ...''
నాకు మతిపోయింది. వీడు అతన్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నాడేమిటి?! ...
గట్టిగా వెనకనుండి వాది పిర్రమీద గిల్లేశాను."అమ్మో! .... '' హఠాత్తుగా గిల్లడంవలన కంగారుగా అరిచాడు చంచల్రావు.
"ఏమయింది బాబూ?'' వరదరాజులు కూడా కంగారుపడ్డాడు.
"అబ్బే ... ఇప్పుడు ఫ్లూటు మీద మీరు వేసిన సంగతులకి సంతోషం పట్టలేక అరిచానండీ ...''
మళ్ళీ గిల్లుతానేమోనని చటుక్కున నా వైపు తిరిగి కన్ను కొట్టాడు చంచల్రావు.
"కూర్చోండి ... కూర్చోండి .... ఇంకా వినిపిస్తాను'' అంటూ ఫ్లూటు అందుకున్నాడు వరదరాజులు.
ఒక అరగంటపాటు "కూకూ ...'' అంటూ వాయించాడు.
చంచల్రావు ఆహా ... ఓహో అంటూ ఆ కూతలనేనే వింటున్నాడు.
వాడు అలా తలూపడం చూసి వరదరాజులు మర్నాటి నుండి తన సంగీత సాధన ఇంకా ఎక్కువ చేస్తాడని భయం వేసింది నాకు.
"ఇప్పుడు ఇంటర్వెల్  ... '' అన్నాడు ఫ్లూటు పక్కన పెడ్తూ.
ఏమేవ్ గారు టీలు ఇచ్చారు.
టీలు త్రాగడం అయిన తరువాత చంచల్రావు మొదలు పెట్టాడు.
"అన్నట్టు వరదరాజులుగారూ ... మీకు ఉబ్బసం ఉంది కదూ?''
"అవును ... ఏం?''
"అయ్యో పాపం ...'' అన్నాడు చంచల్రావు చాల బాధపడిపోతూ.
"అదేమిటి?'' అంది వరదరాజులు భార్య కంగారుగా.
"సంగీతం పట్ల ఆయనకున్న ఇష్టాన్ని చంపుకోవాల్సిందే ... ఆయన ఫ్లూటు వాయించడానికి వీల్లేదు''
"ఎందుకూ?'' వరదరాజులు అయోమయంగా చూశాడు.
"మీకు ఉబ్బసం ఉంది కదా? .. ఫ్లూటు వాయించడంవల్ల ఆయాసం మరీ ఎక్కువై ఉబ్బస వ్యాధి ఎక్కువై పోతుంది.''
హమ్మ చంచల్రావు ... మొత్తానికి కొట్టేవు దెబ్బ.
వరదరాజులు బిక్కముఖం పెట్టాడు.
"ఏం చేస్తాం? ఫ్లూటు వాయించే యోగం నాకు లేదు'' అన్నాడు వరదరాజులు దీనంగా.
"చివరిసారిగా ... ఒకసారి ఊది మానేస్తాను''
"కూ ...''
హృదయ విదారకంగా ఒకసారి కూత పెట్టి ఫ్లూటుని ప్రక్కన పెట్టి కళ్ళు తుడుచుకున్నాడు వరదరాజులు.
ఆరోజు చంచల్రావుకి ఓ రెస్టారెంటులో బ్రహ్మాండమయిన పార్టీ యిచ్చాను.
ఓ నాలుగు రోజులపాటు నా చదువు నిరాటంకంగా సాగిపోయింది.కానీ ఆరోజు ...
ఆ రోజు మామూలుగా మెస్ కి వెళ్ళి భోజనం చేసి వచ్చి రాత్రి తొమ్మిదిగంటలకు ఎక్కౌంటెన్సీ పుస్తకం తెరిచాను.
"కూ ... కూ''
ఫ్లూటు కూత నా చెవులకు భయంకరంగా సోకింది.
వరదరాజులు మళ్ళీ ఫ్లూటు వాయించడం మొదలు పెట్టాడా? ఆరోగ్యానికేం ఫరవాలేదని ఆయనకు చెప్పారా?
ఇలా నేను ఆలోచిస్తుండగానే ...
 ఢం ఢం ఢం ... టక టక ఢమా ఢమా ఠక్ ఠక్''
"కూ ... కూ''
చవులు పగిలేలా మోత ..
కంగారుగా వరదరాజులు పోర్షనులోకి పరుగెత్తాను.
అక్కడి శీను చూస్తే వేరేవాళ్ళకు నవ్వు వచ్చేదేమోగానీ నాకు మాత్రం ఏడుపు వచ్చింది.
వరదరాజులు తన చుట్టూ డ్రమ్స్ పెట్టుకుని వాయిస్తున్నాడు. అతని ఎదురుగా ఆవిడ ఫ్లూటు వాయిస్తుంది.
"రావోయ్ రా ... ఈ సంగీతం మీద మమకారం చంపుకోలేక, నేను ఫ్లూటు వాయించకూడదు కాబట్టి ఈ డ్రమ్స్ వాయించడం నేర్చుకుంటున్నాను .. ఇదైతే ప్రమాదం లేదుకదా?'' అన్నాడు వరదరాజులు.
"ఇంట్లో ఫ్లూటుని ఊరికే మూలపడేసి ఉంచడంమ ఎందుకని అది నేను నేర్చుకుంటున్నాను నాయనా'' అంది అతని భార్య.
"కూర్చో ... కాస్సేపు విను ...''
ఢమ ఢమ టకటక టర టర చిక చిక ఢం ఢం ఠక్ ... కూ ... కూకూ ... కూ''
నా కళ్ళు తిరిగాయ్ ... నాకేమౌతుందో నాకే తెలీడం లేదు.
    --- అయిపొయింది ---