Rating:             Avg Rating:       872 Ratings (Avg 2.94)

నయాగరా – కొత్త జంటలకు వయాగరా

 

న్యూయార్క్ తర్వాత మా మజిలీ నయాగరా. మా హోస్ట్స్ మధు, శిరీష ఎంచక్కా మమ్మల్ని విమానం ఎక్కించి ‘జాగర్తగా వెళ్ళిరండి – మరచెంబులో నీళ్ళు, బుట్టలో జంతికలు పెట్టాం’ అని చెప్పి సర్దుకోవచ్చు. కానీ, ముందే చెప్పాగా – మా వాళ్ళ ఆప్యాయత – అభిమానం. వాళ్ళిద్దరూ నయాగరా ఫాల్స్ ఒడ్డులో ఎన్ని సిమెంటు బెంచీలున్నాయో లెక్కచెప్పగల్గినన్ని సార్లు చూసుంటారు.

అయినా వాళ్ళిద్దరూ కూడా బోల్డన్ని డాలర్లు పెట్టి టిక్కెట్లు కొనుక్కొని – మాకు తోడు వచ్చారు. ఉదయమే లగ్వాడియా విమానాశ్రయంలో విమానమెక్కి ఓ గంటలో బఫలో అనే ఊరు చేరుకున్నాం. ఓ కారు అద్దెకు తీసుకుని, ఓ అరగంట ప్రయాణంతో నయాగరా చేరిపోయాం. అమెరికాలో కొత్త జంటలు తమ హనీమూన్ సందర్భంగా నయాగరా జలపాతం వద్ద గడపాలని ఎక్కువగా కోరుకుంటారట.

“ఓ వృద్ద మొగుడా (మగడా), నీ పెళ్ళి అయి ఇరవయి సంవత్సరాలయింది కదా – నీకెందుకురా న(వ)యాగరా” అని మీరంతా గుంభనంగా నవ్వుకోనక్కరలేదు.

“కొత్త దంపతులనంతగా ఆనందపుటంచులకి తీసుకెళ్ళే కత ఏమిటబ్బా” అని కనుక్కుందామని వెళ్ళానండి బాబూ. అంతకు మించి ఏం లేదు.

నయాగరా ఫాల్స్ అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రానికి కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ కి మధ్య ఉన్నాయి. కెనాడా వేపు నుంచి చూస్తే ఇంకా అద్భుతం అన్నారు. అందుకనే ముందుగానే కెనడా వీసా సిద్దం చేసుకున్నాం. అక్కడ కెనడా బార్డర్ దగ్గర ఓ ఇమిగ్రేషన్ అధికారిణి మమ్మల్ని చీమలగానో, దోమలగానో అనుకుని మాతో ప్రవర్తించిన తీరు మా అందరి మూడ్ చెడగొట్టేసింది.

కొంతమంది ఇలా అసహ్యంగా ఎందుకు ప్రవర్తిస్తారో? కాసింత మర్యాద, మరి కాసింత సంస్కారం తోటి మానవుల పట్ల చూపించవచ్చు కదా. మమ్మల్నేం – ఇల్లరికపుటల్లుళ్ళ లాగా చూసుకోమని అడిగామా? ఆ కెనడా నారిని, మాకు వచ్చిన, నచ్చిన భాషలో తెగ తిట్లు తిట్టుకుంటూ, ముందుకెళ్ళాం.

అలా చూద్దుమ్ కదా – వర్ణనాతీతమైన అపురూప దృశ్యం. ఏబై వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ జలపాతం అద్భుత సుందర దృశ్యాల సుమహారం. లేక్ ఎరిక్, లేక్ ఒంటారియోల మధ్య ఉండే ఈ జలపాతం హొయలు, సొగసులు చూడాలే కాని చెప్ప తరం కాదు. ఈ అందాల జలపాతంలో సెకనుకు 7,40,000 లీటర్ల నీరు ప్రవహిస్తుందని అంచనా. నయాగరా చూడాలని ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్న మా ఆవిడ కోరిక తీరినందుకు, చాలా ఆనందంగా అనిపించింది.

పాపం మా ఆవిడ డైమండ్లు కొనిపెట్టండని కానీ అడగదు. సిన్మాలు చూపించమని అంతకంటే అడగదు. ఏదో అడపాదడపా నయాగరా చూపించమనో – పెర్రారీ కారు కొన్నివ్వమనో, బిల్ క్లింటన్ తో బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేయమనో – ఇలాంటి చిన్న చిన్న కోరికలు మాత్రమే కోరుతూ ఉంటుంది.

కెనడా వైపు ఉండే జలపాతాన్ని హార్స్ షూ ఫాల్స్ అనీ, అమెరికా వైపు అమెరికన్ ఫాల్స్ అని అంటారు. ఈ జలపాతం 176 అడుగుల ఎత్తు నుంచి చండ ప్రచండంగా దూకుతున్నప్పుడు అ హోరు, ఆ నీటి తుంపరలు – తెల్ల చీరమ్మాయికి అమరిన పూలజడలా – ఇంద్ర ధనుస్సు, చుట్టూతా పొగమంచు లాంటి వాతావరణం – ఓహ్ వర్ణనాతీతం.

ఆ జలపాతం ఒడ్డున కూచుని, ‘అందమే ఆనందం – ఆనందమె జీవిత మకరందం’ పాట వింటూ తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ పుస్తకమో – యండమూరి ‘అంతర్ముఖమో’ చదువుకుంటూ ఉండిపోవాలనిపించింది.

‘నయాగరా జలపాతం, చలిలో మంచుగా మారుతుందా?’ అని చాలా మందికి సందేహం వస్తుంది. జలపాతం నుంచి దూకే నీరు ఎప్పటికీ ఆగదు. కానీ జలపాతం ఒడ్డులో మంచు ఏర్పడుతుంది. ఈ మంచు 50అడుగుల మందం దాకా ఉంటుంది.

చలికాలం ఎక్కువగా వున్నప్పుడు – చిన్న మంచు పర్వతాలు కలిసిపోయి ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డు దాకా ఓ మంచు వంతెన ఏర్పడుతుంది. మొన్న మొన్నటిదాకా ఆ వంతెన మీద జనాల్ని నడవనిచ్చే వారట. అలా మంచు వంతెన మీద వెళ్ళి జలపాతాన్ని క్రిందనుంచి చూడ్డం ఊహించుకోండి.

అలాంటి ఊహల్ని, అందమైన అనుభూతుల్ని మూట కట్టుకుని – రాత్రికి న్యూయార్క్ చేరాం.