Rating:             Avg Rating:       798 Ratings (Avg 2.98)

వేధించే రోగులూ – మీకు జోహార్లు

మన జనం 70 శాతం ఇంకా డాక్టర్ల మీద గౌరవం, అభిమానం, నమ్మకం చూపించే వాళ్ళే. వీళ్ళందరూ స్వతహాగా నిరాడంబరు. భేషజాలు లేనివాళ్ళు. శారీరక రుగ్మత ఉన్నా మానసికంగా స్వచ్చమైన వాళ్ళు. వీళ్లందరి వల్లే మన దేశంలో ఇంకా మాలాంటి డాక్టర్లు బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. వీరందరికీ మా డాక్టర్లందరి తరపునా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ మిగిలిన ఆ 30 శాతం పేషంట్ల గురించి సరదాగా మాట్లాడుకుందాం.

కొంతమంది డాక్టర్లుతోటి గడిపే పది నిమిషాల్లో అన్ని రోగాల గురించి ఏకబిగిన చెప్పెయ్యాలనే తాపత్రయంలో ఉంటారు. అసలు డాక్టరుకి సరిగా మాట్లాడే అవకాశం ఇవ్వరు. మేం ట్రీట్ మెంట్ గురించి మాట్లాడ్డం మొదలెట్టగానే బ్రేకులు వేసేసి, మళ్ళీ ఏదో ఒక రోగ లక్షణం చెబుతారు. ఒక్కోసారి అన్పిస్తూ ఉంటుంది. ఈ సదరు పేషంట్లు రోగం చెప్పడానికి వచ్చారని, ట్రీట్ మెంట్ గురించి వాళ్ళకక్కర్లేదని.

మరికొంత మంది మనం చెప్పే ట్రీట్ మెంట్ వింటారు. కానీ వీళ్ళు మేం చెప్పే ప్రతి చికిత్సా మార్గానికి ఓ ఇబ్బంది చెప్తారు. అంటే ఇబ్బందికి చికిత్స కాదు ఇక్కడ వ్యవహారం. చికిత్సకు ఇబ్బంది అసలు సంగతి. ఉదాహరణకు ఓ లావాటి నడుంనొప్పి ఆడ పేషంటు ( ఆడవాళ్ళకి క్షమాపణలు, కానీ నిజం ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు ఆడవారే చెప్తుంటారు) “అమ్మా మీరు లావు తగ్గాలి” అన్నామనుకోండి. – “నాకు థైరాయిడ్ డాక్టర్ గారూ. తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్.అందుకనే లావు. అసలు నేను తినడం చాలా తక్కువండి”,

“అమ్మా మీరు ఈ బిళ్లలు వేసుకోండి”, “బిళ్లలు అసలు పడవండి. కడుపులో వికారం, ఒళ్ళంతా దద్దుర్లు’ “అమ్మా ఈ ఆయింట్ మెంట్ రాసుకోండి”, - “నాకు స్కిన్ అలర్జీ డాక్టర్ గారూ”, చివరగా “అమ్మా మీరు ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చెయ్యాలి” అన్నామనుకోండి – ఎక్సర్ సైజులు చేస్తే కళ్లు తిరిగి ఆయాసం వస్తుంది. డాక్టర్ గారూ”. ఇక ఈ పేషంట్ ని నేను ఏ రకంగా ఉద్దరించాలో మీరే చెప్పండి.

ఒకవేళ నిజంగా ఆపరేషన్ అవసరం అయి ఆ సంగతి చెప్పామనుకోండి “నడుం ఆపరేషన్ చేయించుకుంటే కాళ్ళు పడిపోతాయని చెప్పారండి కొందరు” అని తేల్చి చెప్పేస్తుంది సదరు పేషంట్ మారాణి. శివరాత్రి జాగారంలో ఒక టిక్కెట్టుపై రెండు సిన్మాలు చూపించేవాళ్ళు ఆ రోజుల్లో. అ టైప్ లో ఒక కన్సల్టేషన్ ఫీజుతో ఇద్దరు ఒక్కోసారి ముగ్గురు చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు.

మొగుడేమో మోకాళ్ల నొప్పులకి వచ్చి ఉంటాడు. మన ప్రిస్ర్కిప్షన్ చేతికి రాగానే “డాక్టర్ గారూ మా ఆడోళ్ళకి ఈ గూడ చాలారోజుల్నించి నొప్పి అంటుందండి. కాస్త చూసి మందులు రాయరూ” అని అభ్యర్థన. ఒక్కోసారి కొంతమంది ఇక్కడితో ఆగరు. ఆడోళ్ల పని కూడా అయిపోయాక సంచిలోంచి ఓ ఎక్సరే తీసి “డాక్టర్ గారూ మా అత్తగారిదండి. ఆమె నడవలేదు. కాస్త ఎక్సరే చూసి మందులివ్వండి” అని దీనంగా ఇంకో అభ్యర్ధన.

ఇంకో టైప్ ఉంటారు. వీళ్ళు హాస్పిటల్ కి వచ్చే తీరిక లేని బిజీ పుర ప్రముఖులు. కాకపొతే బయట ఎక్కడైనా సిన్మాహాల్లో, పెళ్లి మండపాల్లో డాక్టర్ కనబడ్డాడనుకోండి అక్కడే కన్సల్టేషన్. “ఇది సరైన ప్రదేశం, సరైన సమయం కాదు. పైగా డాక్టర్ ఇక్కడ రిలాక్స్ కావడానికి వచ్చాడు. మనం వేధించకూడదు” అన్న ఇంగింతజ్ఞానం వీళ్లకి శూన్యం. ఇలాంటి వాళ్ళు తారసపడ్డప్పుడల్లా “నేను ఏ యూరాలజీస్టో, గైనకాలజీస్టో అయి ఉంటే బాగుండేది” అని అనుకుంటుంటాను.

ఆధునిక పరిజ్ఞానం వల్ల డాక్టర్లకు కొన్ని లాభాలతో పాటు నష్టాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా సెల్ ఫోన్. కన్సల్టింగ్ రూమ్ ల బయట, తాటికాయంత అక్షరాలతో ‘సెల్ ఫోన్ బంద్ చేసి లోపలికి రండి’ అని పెట్టినా పట్టించుకునే నాధులు తక్కువ. ప్రస్తుతం మన దేశంలో ప్రాక్టీసు కత్తిమీద సాము అయిపొయింది.

పరీక్షలు రాస్తే “ఈ డాక్టరు అనవసరమైనవన్నీ రాస్తాడు” అంటారు. అలా అని రాయకపోతే ‘అయిదొందలు తీసుకున్నాడు. అయిదు నిమిషాల్లో పంపేశాడు. కనీసం ఎక్సరే అన్నా రాయలేదు’ అంటారు. మామూలు నడుం నొప్పిరా బాబూ అంటే వినకుండా ‘స్కాన్ తీయించండి సార్’ అని వేధించే వాళ్లు ఎంతమందో! ఇవన్నీ ఒక ఎత్తు – కాంప్లికేషన్ వచ్చిన పేషంటు ఒక ఎత్తు. మన పేషెంట్లు ఇంకా కాంప్లికేషన్ ని సరైన అవగాహనతో అర్థం చేసుకునే స్థితికి రాలేదు.

ఏ రకమైన ఇబ్బంది వచ్చినా, అది డాక్టరు అజాగ్రత్త వల్లేనని, అది చికిత్సా లోపమేనని చాలా మంది నమ్మకం. అలా అని డాక్టర్ల నిర్లక్ష్యం అసలు వుండదని నేను చేతులు కడుక్కోవడం లేదు. కాని డాక్టర్ల అసమర్ధత వల్ల వచ్చే ఇబ్బందులు పది శాతం మాత్రమే వుంటాయి. చాలా సార్లు కాంప్లికేషన్స్ మీద మాకు ఏరకమైన నియంత్రణా వుండదు. ఎందుకంటే వైద్య వృత్తిలో డాక్టరూ, పేషంటు ఇద్దరూ మనుషులే. యంత్రాలు కాదు. రెండు రెండు కలిపితే నాలుగు అనేది గణితంలోనూ, గ్రీన్ బటన్ నొక్కితే స్టార్ట్, రెడ్ బటన్ నొక్కితే స్టాప్ అనేది ఇంజనీరింగ్ లోనూ మాత్రమే సాధ్యం.

కాంప్లీకేషన్స్ వల్ల జరిగే నష్టం, తద్వారా పేషెంటుకి బంధువులకి సంక్రమించే మానసిన, శారిరక, ఆర్ధిక ఒత్తిళ్లు వీటన్నిటి గురించీ డాక్టర్లందరికీ సానుభూతి మనసులో, ఆ పరిస్థితి నుంచి పేషెంట్లను బయట పడేయడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. కాకపొతే ఇబ్బందల్లా ఎక్కడ వస్తుందంటే అప్పటిదాకా ‘మీరు దేవుడు’ అన్న వాళ్లందరూ, ఇప్పుడు ‘ఈ దుస్థితి కంతటికీ నువ్వే కారణం’ అని డాక్టర్ని ఓ ముద్దాయి కింద తూలనాడడం మొదలెడతారు.

ఏ సమయంలోనయితే పేషెంటు బంధువులు, డాక్టరు కలిసికట్టుగా నడవడం ముఖ్యమో అ సమయంలో డాక్టరు ఈ వైపు, బంధువులు ఆ వైపు అవడం చాల దురదృష్టకరం. చివరకు పేషెంటుకి చాలా నష్టం. చివరగా ఓ ముఖ్యమైన విషయం. డాక్టరు కూడా మనిషే. వాడికీ పెళ్లాం, పిల్లలుంటారు. వాడికీ కొంత పర్సనల్ టైమ్ అవసరం.

డాక్టరు కనబడగానే చాలా మంది అడిగే మొదటి మాట ‘నీ సెల్ నెంబరిస్తారా’, రాత్రి 11 గంటలకి ఇంటికి ఫోన్ చేసి, ‘డాక్టరు గారు రేపు వుంటారా? నేను రైలు దిగాను’ ఇలాంటి ప్రశ్నలతో దయచేసి డాక్టరు ప్రైవసీని భంగం చేయకండి. ఈ పనికిమాలిన ప్రశ్నలకి విసిగిన డాక్టరు ఒక్కోసారి నిజమైన ఎమర్జన్సీలో కూడా దొరక్కుండాపోతాడు. మీ ఇష్టం