తాతా ధిత్తై తరిగిణతోం 43

తాతా ధిత్తై తరిగిణతోం 43

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

విష్ణుమూర్తి మాత్రం 'కంట్రోల్' చేసుకోలేకపోయాడు. శ్రీరామ్ తో పాటు కారెక్కుతున్న అశ్వినిని మరోసారి దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత శ్రీరామ్ చేయిపట్టుకుని కన్నీటి పొరలమధ్యనించి అతన్ని చూస్తూ చెప్పాడు.

"ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయిపోయిందికదా అని ప్రేమించు కోవటం మానేయకండి. జీవితాంతం ఇలాగే ప్రేమించుకుంటూ హాయిగా వుండండి" అంటూ ఆశీర్వదించాడు.

"ఇట్టాగే వుండిపోతే ఎట్టాబాబూ? వచ్చేఏడు ఈపాటికి ఈళ్ళిద్దరూ ముగ్గురైపోవాలా. అప్పుడు తమరూ, మా అయ్యగారూ తాతలైపోవాల. మీసాలట్టుకుని  'తధికిణ తోం' అంటూ మనవడు గారూ మిమ్మల్ని ఆటపట్టించాల." కారు డిక్కీలో సామాన్లు సర్డుతున్న నారాయణ అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదపరచడానికే ప్రయత్నిస్తూ చెప్పాడు.

"అఘోరించారు. తమరిపని తమరు చెయ్యండి." చురుక్కున చూస్తూ మండిపడ్డాడు వీరభద్రం.

"వాడేం తప్పుడుమాటన్లేదు...మీరు కారెక్కండి!" అంటూ భర్తను మందలించింది పార్వతమ్మ

అప్పటికే పూలతో అందంగా అలంకరించబడిన ఓ కారులో శ్రీరామ్, అశ్వినీ ఎక్కికూర్చున్నారు.

"రేపు మా ఇంట్లో వ్రతానికి మీరు తప్పక విచ్చేయాలి." అంటూ విష్ణుమూర్తిని ఆహ్వానించి, మరో కార్లో ఎక్కి కూర్చున్నాడు వీరభద్రం. రెండు కార్లూ బరువుగా కదిలి సాగిపోయాయి.

గేటు దగ్గరే నిలబడి అప్పగింతలు కార్యక్రమాన్ని విధిలేక చూస్తూ నిలబడిన హనుమంతు విష్ణుమూర్తిని సమీపించి అతని భుజం మీద చేయివేసి లోపలకు తీసుకెళ్లాడు.

"అమ్మాయి ఈ గడపదాటి వెళ్లి పోయేసరికి నిన్నటిదాకా పొంగిపొర్లిన  ఈ 'పాలసముద్రం' ఎలా వెలవెలా పోతోందో చూశావా బావమరిదీ?" అన్నాడు దిగులు నిండిన స్వరంతో విష్ణుమూర్తి.

"ఉరుకోబావా. ఆడపిల్లను కన్న తల్లితండ్రులందరికీ ఏదో ఒకనాడు ఇలాంటి ఆవేదన తప్పదు. వాళ్ళ కాపురం పదికాలాల పాటు పిల్లపాపలతో చల్లగా సాగిపోవాలని కోరుకోవాలే తప్ప ఇలాంటి సమయంలో కన్నీరు పెట్టుకోకూడదు. మీ వియ్యంకుడు చెప్పినట్టు, అమ్మాయి ఏమంత దూరాభారంలో వుందనీ? ఇంటిముందు కారెక్కి కూచుంటే గంటలో నిన్నక్కడ దింపుతాడు డ్రైవరు. వారంవారం వెళ్లి అమ్మాయిని చూసివస్తూండచ్చు." అంటూ ఓదార్చాడు హనుమంతు.

కళ్ళుతుడుచుకుని నెమ్మదిగా తన గదిలోకి వచ్చిన విష్ణుమూర్తి గోడకు అలంకరించివున్న భార్య ఫోటో దగ్గరకు నడిచాడు.

"సావిత్రీ...అమ్మాయిని అత్తవారింటికి పంపించేశాను. ఇప్పుడు నామనసంతా వెలితిగా మారిపోయింది. నువ్వే బ్రతికివుంటే నా గుండె బరువుని నువ్వూ కొంచ పంచుకునేదానివి అత్తవారింట్లో మన బేబినీ అదృశ్య రూపంలో నువ్వే గమనిస్తుండాలి. అది ఎలాంటి కష్టాలు పడకుండా నువ్వే కాపాడుకోవాలి." భార్యఫోటోలోకి చూస్తూ చెప్పాడు.

ఆపక్క నున్న మరో గదిలో గోపాలం అప్పటికే విస్కీ బాటిల్ ఓపెన్ చేసి రెండుగ్లాసుల్లో మందుపోసి తండ్రిరాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అంతలోనే  హనుమంతు లోపలకు వచ్చి తలుపులు మూశాడు.

"హమ్మయ్య ఆ మహాతల్లి వెళ్లిపోయింది. మనకింక 'లైను' క్లియరైపోయినట్టే!" అన్నాడు ఉత్సాహంగా.

తండ్రికి ఒక గ్లాసు అందించాడు గోపాలం.

"మావయ్య కూడా వెళ్లాడా?" అడిగాడు. లేదు...కన్నీళ్లు తుడుచుకుని తన బెడ్ రూమ్ లోకి పోయాడు. ఇక ఈరాత్రికి బయటకు రాడులే. అంతేకాదు కూతురు, దగ్గరలేని బెంగతో కొంతకాలం పాటు కంపెనీ విషయాల్ని పట్టించుకోవటం కూడా మానేస్తాడు. అప్పుడు అధికారమంతా నీదే అవుతుంది. ఆయనకి ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహారాల్ని చక్కబెట్టుకోవాలి. సీటులో వుంటూనే మూటలు కట్టుకోవాలి." అంటూ గ్లాసెత్తి కొడుక్కి 'ఛీర్స్' చెప్పాడు హనుమంతు.

*                 *             *            *

రాజుపాలెంలో వీరభద్రం ఇల్లు మహా సందడిగా వుంది. గుమ్మాలన్నింటికీ మామిడి తోరణాలు వ్రేలాడుతున్నాయి. ఇంటిముందు వీధికి ఆపొడుగునించి ఈ పొడుగుదాకా వేసిన తాటాకు పందిరికింద ఊరిపెద్దలూ, స్కూలు మాస్టర్లు కూర్చుని విందు భోజనం తాలూకు భుక్తాయాసం తీర్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూన్నారు.

"మన వీరభద్రం మేష్టారు 'సత్యనారాయణవ్రతాన్ని' కూడా పెళ్లిలాగా జరిపించారు." అన్నారు రంగారావు మాస్టారు.

"నిజమే అప్పుడెప్పుడో జరిగిన అమ్మాయి పెళ్లికంటే ఇప్పుడీ వ్రతానికి బోలెడంత ఖర్చుపెట్టి వుంటారు." శరభయ్య మేస్టారు చెప్పారు.

"సరేలెండి. ఆడపిల్ల పెళ్ళంటే ఎలాగైనా ఖర్చుతో కూడిన వ్యవహారమే తప్పదు. కానీ ఇప్పుడు జరిగింది అబ్బాయి పెళ్లికదా. రాబడి బాగానే వుంటుంది.

కనీసం రెండు మూడు లక్షలు కట్నం తీసుకుని వుంటాడు." డ్రిల్లు మేస్టారు కామెంట్ చేశాడు.

"భలేవారే. మీకు తెలీదా? వియ్యంకుడు లక్షల్లో కట్నం ఇవ్వటానికి సిద్ధపడ్డా వీరభద్రం గారు 'ససేమిరా' అన్నార్ట. మావల సంఘానికి అధ్యక్షుడు కదా? కట్నకానుకలు ఇవ్వటం, పుచ్చుకోవటం, కంప్లీటుగా నిషేధం." ఇంగ్లీషు మాస్టారు చెప్పాడు.

రంగారావు మాస్టారు ముక్కుపొడుం ఓ పట్టుపట్టి తుమ్మింతర్వాత చెప్పాడు. "అయితే ఏం లెండి. ఆ వియ్యంకుడి గారికి ఒక్కగానొక్కకూతురు కదా. కోట్లకు వారసురాలు మనం పెళ్లికి వెళ్లలేదుగానీ అటెండరు గురవయ్య వెల్లొచ్చాడుగా. నిన్నరాత్రి అతనే చెప్పాడు. దేవలోకంలో పెళ్ళిళ్ళు కూడా అంత వైభవంగా జరగవేమో అనిపించిందట. భోజనంలో మొత్తం ఇరవై ఆరు వంటకాల్ని సిద్ధం చేశారట. కేటరింగు వాళ్ళంతా హైదరాబాదులోని అదేదో స్టారు హోటల్నించి వచ్చారట. ఇక పెళ్ళికొచ్చిన మగవాళ్ళందరికీ మైసూరు నించి తెప్పించిన సిల్కు శాలువాలూ, ఆడవాళ్ళకి వెండిగ్లాసులూ పంచిపెట్టారట."

"మంచి 'ఛాన్సే' మిస్సయిపోయామన్నమాట. ముహూర్తం ఏ శలవురోజునో అయ్యుంటే మనమూ పెళ్లికి వెళ్లే వాళ్లం." నిరాశగా నిట్టూరుస్తూ అన్నాడు డ్రిల్లు మేస్టారు.

అదే క్షణంలో ఓ గంభీర స్వరం వినిపించింది.

"స్వామీ. వీరభద్రుడు ఎక్కడ?"

అందరూ ఉలిక్కిపడ్డట్టుగా ఆ గొంతు వినవచ్చిన వైపు చూశారు.

వాళ్లకు ఎదురుగా ఆరడుగుల ఆజానుబాహువు నిలబడి వున్నాడు. తెల్లటి దేహచ్ఛాయ...పొడవైనగడ్డం...కాషాయరంగు దుస్తులు మెడలో అయిదారు రకాల రుద్రాక్షమాలలు కుడిముంజేతకి బంగారు కడియం నుదుటి విభూతి రేఖలు చూడగానే చేతులు జోడించి నమస్కరింప చేసే పవిత్రమైన వర్చస్సు ఆయన ముఖంలో తాండవిస్తోంది.