తాతా ధిత్తై తరిగిణతోం 41

తాతా ధిత్తై తరిగిణతోం 41

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

"ఏంట్రా? సినీమా హీరోలాగా చొక్కాచేతులు మడుస్తున్నావ్? నీ చేతిలో దెబ్బలు తిని పారిపోవడానికి ఇది సిన్మాకాడు. నీ అంతు చూసీ మరీ వెడతాం." వాళ్ల నలుగురిలో నల్లగా, లావుగావున్న ఓ రౌడీ తన 'టీ షర్టు' వెనకనించి ఓ కత్తిని బయటకు లాగుతూ చెప్పాడు. అప్పటికీ 'స్టీరింగు' వదిలిపెట్టి కిందకు దిగివచ్చిన డ్రైవర్ ఆ రౌడీ ముందుకు వచ్చి నమస్కారం పెట్టి చెప్పాడు." బాబూ...ఆర్నేం చెయ్యకండి. మా అయ్యాగారికి ఆ అబ్బాయి గారు కాబోయే అల్లుడు ఇంక పది రోజుల్లో ఆరికి పెళ్లవుతోంది."

ఆ 'పెళ్ళి' కాదురా! వీడి 'పెళ్ళి' మేం ఇప్పుడే చేస్తాం. నువ్వడ్డొస్తే నిన్నుకూడా ఏసేస్తాం. లే!" చూయింగ్ గమ్' నముల్తున్న మెల్లకన్ను రౌడీ, డ్రైవర్ని పట్టుకుని భయంగా చెప్పాడు.

"బాబుగారూ. ఈళ్ళ జోలికెళ్ళద్దు...మీరు కొన్నవన్నీ ఆళ్ల మొకాన కొట్టేయండి నగలు పోయినా ప్రాణాలతో బయటపడవచ్చు."

"నోర్మూయ్ రా! మక్కావల్సింది ఆళ్ళుకొన్న నగలు కాదు...ఈడి ప్రాణాలు" అంటూ మొదటి రౌడీ డ్రైవర్నీ బయటకు లాగి పారేసి శ్రీరామ్ ని కత్తితో పొడవబోయాడు.

తాయెత్తున్న తన ఎడం చేత్తో వాడి చేతిని బలంగా పట్టుకుని వెనక్కి విరిచాడు శ్రీరామ్. వాడి చేతిలో కత్తికింద పడిపోయింది. ఇంతలో రెండోవాడు శ్రీరామ్ మీదకు రాబోయాడు. వాడు అల్లంత దూరంలో వుండగానే ఒక్కసారి పైకి ఎగిరి, తన ఎడంకాలి బూటుతో 'ఫోర్సు'గా వాడి ముఖం మీద తన్నేడు శ్రీరామ్.

ఆ దెబ్బకు తట్టుకోలేక 'అబ్బా' అంటూ మూల్గి ఓ మూల కెళ్లిపడ్డాడువాడు. శ్రీరామ్ లోని హీరోయిజాన్ని చూసేసరికి డ్రైవర్ కి కూడా ఉత్సాహం ఉబికి వచ్చింది. గబగబా కారుడిక్కీ తెరచి అందులోంచి 'ఇనపరాడ్' తీసుకు వచ్చాడు? దాన్ని అటూ ఇటూ తిప్పుతూ తమ దగ్గరికి వచ్చిన వాళ్ళనాలా చావుదెబ్బలు కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళల్లో ముగ్గురు కాళ్ళకు బుద్ధి చెప్పారు. శ్రీరామ్ బూటికాలి దెబ్బతో మూలపడ్డ రౌడీ మాత్రం లేవలేక తంటాలు పడుతుంటే వాడి జుట్టు పట్టుకుని పైకి లేవతీశాడు శ్రీరామ్.

"దున్నపోతుల్లా వున్నారు. ఇలా దారికాసి దొంగతనాలు చేసుకోక పోతే ఎక్కడైనా కూలిపని చూసుకుని బతకవచ్చుగా." అంటూ వాడి దవడ మీద మళ్ళీ కొట్టాడు.

వాడు ఉక్రోషంగా చూశాడు.

"మేం దొంగలం కాదు. బాషా మనుషులం. ఇవాళ కాకపోతే రేపైనా నీ అంతు చూస్తాడు బాషా!" అన్నాడు.

"బాషా ఎవర్రా బాషా" అంటూ వాణ్ణి అటూ ఇటూ ఊపి మరో చెంప పగలకొట్టాడు శ్రీరామ్.

"బాషా తెలీదా? హైదరాబాద్ పాతబస్తీ కొచ్చి అడుగు పసిబిడ్డ కూడా చెప్తుంది.?" పొగరుగా బదులు చెప్పాడు వాడు.

అంతలోనే అక్కడకు పోలీసు జీపొచ్చి ఆగింది. అందులోంచి పోలీసు బలగంతో పాటు విష్ణుమూర్తి కూడా క్రిందకు దిగాడు.

కార్లోంచి అశ్విని క్రిందకు దిగి ఒక్క పరుగున వచ్చి తండ్రిని చేరుకుంది.

"వాట్ బేబీ. వాట్ హేపెండ్?" అడిగాడు విష్ణుమూర్తి ఆమెను దగ్గరకు తీసుకుంటూ.

"ఎవరో రౌడీలు మా వెంట పడ్డారు డాడీ. శ్రీరామ్ వాళ్లకు బలే బుద్ధిచెప్పాడులే చావు దెబ్బలు తిని పారిపోయారు. అడిగో ఆ గ్యాంగ్ లో వాడొక్కడు మాత్రం మిగిలిపోయాడు. అంటూ ఆ రౌడీని చూపించింది అశ్విని.

అప్పటికే పోలీసులు వాడి చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకుని జీపులో ఎక్కిస్తున్నారు.