నేనూ - ఇంపోర్టెడ్ కెమేరా -2

Listen Audio File :

నేనూ - ఇంపోర్టెడ్ కెమేరా

 

 

- మల్లిక్

పార్ట్ - 2

మర్నాడు జేమ్స్ ఆంధ్రవైపు వూళ్ళు తిరగడానికి వెళ్ళిపోయాడు.

    చాలా కాలంగా ఒక మంచి కెమెరా కొందామని అనుకుంటున్నా కానీ, కుదర్లేదు.అనుకోకుండా జేమ్స్ మంచి కెమెరా ప్రెజెంట్ చేశాడు.

    ఇంపోర్టెడ్ కెమెరా!

    నా మనసు ఆనందంతో ఊయల లూగింది.

    "ఏంటలా ఊగిపోతున్నావ్? తాగావా?...ఇన్నాళ్ళూ బుద్దిమంతుడిలా ఉండేవాడివి... ఈ ముదనష్టపు అలవాటెలా అబ్బిందిరా నీకు?" చంచల్రావు గొంతు వినిపించింది నాకు.

    తూలకుండా తమాయించుకుని నిలబడిచూశాను.

    గుమ్మంలో చంచల్రావు నిలబడి ఉన్నాడు.

    నాకు చచ్చేంత నవ్వొచ్చింది. ఘొల్లున నవ్వేశాను." హోరి అమాయకప్పక్షీ...నేనా... తాగడవాం?

    "అంటే నువ్వు తాగలేదని అంటావ్?"

    "ఏం తాగినట్టు కనిపిస్తున్నానా?"

    "మరి తూగిపోతున్నావేం?"

    "ఆనందం... మనసు ఉయ్యాల ఊగిపోతోంది." అన్నాను ఊగిపోతూ.
చంచల్రావు నన్ను కదలకుండా పట్టుకున్నాడు." ఎందుకు ఊగుతుంది?" అని అరిచాను సస్పెన్సు భరించలేక.

    వాడి పట్టు విడిపించుకుని అల్మారు లోంచి కెమెరా తీసి చూపించాను.

    చంచల్రావు కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఆశ్చర్యంగా."ఇంపోర్టెడ్ కెమెరా! నీ కెక్కడిది?"

    నేను జరిగినదంతా చెప్పాను.

    "కెమెరా చాలా బాగుంది. చాలా ఎడ్జస్టుమెంట్సున్నాయే... ఎలా ఉపయోగించాలో నీకు తెలుసా బుచ్చిబాబూ?"

    "లేదురా... జేమ్స్ మళ్ళీ వారంలో ఇక్కడికి వస్తాడు. అప్పుడు అడిగి తెలుసుకుంటాను."అన్నాను.

    "అప్పటిదాకా ఎందుకురా బుచ్చీ... మన కాలనీలో ఫోటో స్టూడియో ఉందిగా, అక్కడికి వెళ్ళి కెమెరా చూపించి దీన్నెలా ఉపయోగించాలో వాడినడుగుదాం..." అన్నాడు చంచల్రావు.

    వాడి సలహా నాకు నచ్చింది.

    ఇద్దరం కలిసి ఫోటో స్టూడియో కెళ్ళాము.

    స్టూడియో ముందు "ఇచ్చట మీ మొహం లాగే ఫోటోలు తియ్యబడును" అని బోర్డుంది.

    "స్టూడియో ముందు ఇలాంటి బోర్డు పెట్టాడంటే వీడెంతో నిజాయితీ పరుడై ఉండాలి" అన్నాడు చంచల్రావు.

    ఇద్దరం స్టూడియోలోకి అడుగుపెట్టాం

    "రాండి సార్...రాండి" అంటూ మా ఇద్దర్నీ సాదరంగా ఆహ్వానించాడు స్టూడియో యజమాని యాదగిరి.

    "ఒరేయ్ కిషన్! సార్ లకి రెండు చాయ్ లు చెప్పరా" అని లోపలికి చూస్తూ అరిచాడు యాదగిరి.

    "అబ్బే.. మేం ఫోటో తీయించుకోడానికి రాలేదు యాదగిరిగారూ" అన్నాడు చంచల్రావు.

    మళ్ళీ లోపలికి చూస్తూ అరిచాడు యాదగిరి"కిషస్...చాయ్ లు కాన్సిలని చెప్పరా..."

    మేము ఇబ్బందిగా నవ్వాము.

    "ఫోటోలు తీయించుకోడానికి కాబోతే మల్లెందుకొచ్చిండ్రు ఈడికి?" అన్నాడు యాదగిరి చిరాగ్గా చూస్తూ.

    నేను నా చేతిలోకి కెమెరాని టేబుల్ మీద యాదగిరిముందు పెట్టాను.

    చంచల్రావు విషయం చెప్పాడు.
   యాదగిరి కెమెరాని చేతిలోకి తీసుకున్నాడు. అతని కళ్ళు వెలిగిపోయాయ్."వారెవ్వా... కెమెరా జబర్ దస్తే ఉందిసార్.ఫారెన్ది లే?"

    అవునన్నట్టు మే మిద్దరం తల లూపాము.

    "నాకు అమ్మేయండి, సార్... మీ అస్మంటోళ్ళకి గిస్మంటి కెమెరా ఎందుకు సార్...గిది స్టూడియోల పంజేస్తది... నాకిచ్చేయండి, సాబ్... అర్రే కిషస్! రెండు చాయ్ లు చెప్రా..." అని లోపలికి చూస్తూ అరిచాడు యాదగిరి."అబ్బే... ఇది అమ్మడానికి కుదర్దోయ్. నాకు ఒకతను ప్రజెంటేషను ఇచ్చాడు. దీన్ని ఎవ్వరికీ ఇవ్వను" అన్నాను నేను కెమెరాని యాదగిరి చేతిలోంచి లాక్కుంటూ.

    "అర్రే కిషస్.. చాయ్ లు కాన్సిలని చెప్పరా" అన్నాడు యాదగిరి మళ్ళీ లోపలికి అరుస్తూ "మల్లెందు కొచ్చిన్రు సాబ్, నాది వకత్ ఖరాబ్ చేసేస్దుకు?" చిర్రుబుర్రు లాడాడు యాదగిరి.

    "చెప్పేంకదండీ యాదగిరిగారూ... దీని అడ్జస్టుమెంట్లవీ ఎలా చెయ్యాలో, ఫోటోలు ఎలా తియ్యాలో మీరు చెప్తారని" అని మర్యాద ఒలకబోస్తూ అన్నాడు చంచల్రావు.