నేనూ - ఇంపోర్టెడ్ కెమేరా

Listen Audio File :

 

- మల్లిక్

పార్ట్ - 7

నేను తలపట్టుకుని కూలబడి పోయాను. మర్నాడు ఉదయం నా గదికి కానిస్టేబుల్ వచ్చాడు. "మా సర్కిలిస్ స్పెక్టరు గారింట్లో ఫంక్షనేదో ఉందండి. సాయంత్రం కెమెరా పట్టుకుని రమ్మన్నారు మిమ్మల్ని ఫోటోలు తియ్యాలంట" అన్నాడు.

    వీల్లేదు. ఈ వేళ సాయంత్రం నాకు పన్లున్నాయి" అని అరిచాను నేను.

    "అసలే మీదగ్గరున్నది ఇంపోర్టెడ్ కెమెరా. మీకు ఏ స్మగ్లర్ తోనో సంబంధం ఉందని కేసెట్టించి బొక్కలో తోసేస్తారండి. ఆనక మీ ఇష్టం" అని వెళ్ళిపోయాడు కానిస్టేబులు.

    సాయంత్రం నేను సర్కిల్ ఇన్ స్పెక్టరు ఇంటికి వెళ్ళక తప్పలేదు.

    ఆ రోజు సాయంత్రం పోలీసులతో మా గదిముందు గొడవఅవడం మూలాన కాలనీలో అందరికీ తెలిసిపోయింది నా దగ్గర ఇంపోర్టెడ్ కెమెరా ఉందని. రోజూ ఎవడో ఒకడు ఫోటోలు తీయించుకోవ డానికి వస్తున్నాడు. నాకు రాను రాను మనశ్శాంతి కరువైంది. మొదట్లో ఎంతో ముద్దొచ్చిన ఆ కెమెరాని చూస్తుంటే ఇప్పుడు ఒళ్ళు మండిపోసాగింది.

    చంచల్రావు సలహామీద ఆ కెమెరాని యాదగిరికి అమ్మెయ్యడానికి నిర్ణయించు కున్నాను.

    నేను, చంచల్రావు స్టూడియోకి వెళ్ళాము. ఈ కెమెరాని నీకు అమ్మెయ్యమని ఆ రోజు అడిగావుగా నీకు అమ్మేద్దామని నిర్ణయించుకుని వచ్చాను. ఏమిస్తావ్?" అని అడిగాను.

    "రెండొందలిస్తా" అన్నాడు యాదగిరి
                                     
       "ఏమిటీ...రెండొందలేనా? ఈ కెమెరా రెండు వేలు ఖరీదు చేస్తుంది తెల్సా?" అన్నాడు చంచల్రావు.

    "ఆయనకి ఊరికినే వచ్చింది కద్సార్. అయినా, ఈ కెమెరాతో ఆయన గెట్ల బాధలు పడ్తున్నడో నాకెరికైంది. అందుకే జాలి పడి కొంటున్నా" అన్నాడు యాదగిరి నన్నేదో ఉద్దరిస్తున్నట్టు.

    ఆ కెమెరాని వదుల్చుకోవడమే నాకు ముఖ్యం అనిపించింది. అందుకే యాదగిరి చెప్పిన రేటుకి ఒప్పుకుని రెండొందలకే కెమెరా అమ్మేశాను.

    మర్నాడు ఆంధ్రా అంతా తిరిగి జేమ్స్ నా దగ్గరి కొచ్చాడు." ఈ వేళ సాయంత్రం ప్లెయిట్ లో నేను బొంబాయి వెళ్తున్నా. రేపు అమెరికా వెళ్తాను" అన్నాడు.

    సాయంత్రం జేమ్స్ తో బాటు నేనూ ఏర్ పోర్టుకి వెళ్ళాను.

    చెక్ ఇన్ లోంచి వెళ్ళేముందు జేమ్స్ తను ఇచ్చిన కెమెరా ఎలా ఉందని నన్ను అడిగాడు. అలా అడుగుతాడని ముందే ఊహించిన నేను డానికి సమాధానం కూడా రెడీగా పెట్టుకున్నా.

    "కెమెరా చాలా బాగుందందీ. రిజల్టు కూడా బాగా వస్తోంది. కానీ నా దురదృష్టం మొన్న నేను ఆఫీసుకెళ్ళినప్పుడు నా గదిలో దొంగపడి కెమెరా దోచుకుపోయాడు. నాకు చాలా బాధ కలిగింది" అన్నాను విపరీతంగా బాధ నటిస్తూ.

    "ఏం ఫర్వాలేదు. మీరు షానా మంచివాడు" అని తన ఎయిర్ బాగ్ జిప్ సర్రుమని లాగి ఇంకో కెమెరాతీసి నా చేతిలోపెట్టి "ఇది తీష్కోండి. దానికంటే మంచి కెమెరా" అని నాకు గట్టిగా షేక్ హాండ్ ఇచ్చి అంతకన్నా గట్టిగా కౌగిలించుకుని, "వష్టాను!లెటర్స్ రాయండి అని చరచరా వెళ్ళి పోయాడు.

    నాకు ఏడుపు వచ్చింది.

    మర్నాడు నేను ఆఫీసుకు వెళ్ళేముందు నా గదికి ఒకాయన ఫామిలీతో వచ్చాడు. ఎవరు కావాలని అడిగాను.

    "ఒక్కడేదో కొత్తగా ఫోటోస్టూడియో పెట్టారని ఎవరో చెప్పారు. ఫోటో తీయించు కుందామని వచ్చాంబాబూ" అన్నాడు.                             

      నేను గట్టిగా కేక పెట్టి మూర్ఛపోయాను.