నేనూ - ఇంపోర్టెడ్ కెమేరా

Listen Audio File :

నేనూ - ఇంపోర్టెడ్ కెమేరా

 

 

- మల్లిక్

పార్ట్ - 5

యూనిఫాంలో ఉండడంవల్ల నేను వాడిని గుర్తుపట్టలేదు.

    ఓరి నువ్వటరా...." అంటూ నేను శివరాంని కౌగిలించుకున్నాను.

    ఈ సారి శివరాం యూనిఫారమ్ గుండీలు పటపట తెగిపోయాయి.

    నేను శివరాంకి జరిగిన సంగతంతా వివరంగా చెప్పాను.

    "అదన్నమాట సంగతి. కానీ కెమెరా మట్టుకు చాలా బాగుందిరా" అన్నాడు.

    "సార్... సార్! మనమందరం ఫోటోలు తీయించుకుందాం సార్!" అన్నారు కానిస్టేబుల్సు.

    మా వాళ్ళు సర్దాపడ్తున్నారు, కొన్ని స్నాపులు తియ్యవోయ్" అన్నాడు శివరాం.

    కానిస్టేబుల్స్ అందర్నీ కలిపి ఒక ఫోటో, కానిస్టేబుల్సుని ఒక్కొక్కడికి విడివిడిగా ఒక్కోఫోటో, శివరాం ఒక్కడిని ఒక ఫోటో, చంచల్రావు, శివరాం, నేను,కానిస్టేబుల్స్...ఇలా ఫోటోలు తీయించుకున్నాం.

    "సార్! నా మరి నా ఫోటోనీ?" అన్నాడు కారు ఓనరు.

    "ఫిల్ము అయిపోయింది"అన్నాను నేను పళ్ళు కొరుకుతూ

    శివరాం దగ్గర శలవు తీసుకుని మేము బయట పడ్డాము.

    "ఒరేయ్!మొత్తం రీలు అయిపోయిందిగా. స్టూడియోలో కడగడానికి ఇచ్చేస్తేనో?" అన్నాడు చంచల్రావు.

    కొత్త కెమెరాతో తీసిన ఫోటోలు ఎలా వస్తాయో చూడాలన్న ఆత్రుత నాకుకూడా ఉంది.

    "పద వెళదాం" అన్నాను.

    ఫోటో స్టుడియోలోకి అడుగు పెట్టి యాదగిరికి రీలు ఇచ్చాము.

     "కాస్త దీన్ని కడిగి ప్రింట్సు వేసి పెట్టాలి" అన్నాను.

    "అర్రేకిషన్... రెండు చాయ్ లు చెప్పరా!"అని అరిచాడు యాదగిరి.

    "ఎంతౌతుంది?" అన్నాను.గిపుడే పైసల్ గురించి ఎందుకు సార్! ఎన్ని ప్రింటు వస్తాయో చూసి, గప్పుడు బిల్లు చెప్తా. రేపు రాండ్రి ఫోటోలు ఇస్త" అన్నాడు యాదగిరి.

    మర్నాడు మళ్ళీ స్టూడియోకి వెళ్ళాం. మా ముందు కవరొకటి ఉంచాడు యాదగిరి.

    "తీస్కోండి సార్, ఫోటోలు ముప్పై వచ్చినయ్. ప్రింటుకి నాల్గు రూపాయలు. ముప్పై ప్రింటులకి నూటఇరవై రూపాయల్. డెవలపింగ్ కి పద్గేను రూపాయల్. మొత్తం నూటముప్పైఅయిదు రూపాయల్."

    నేను గుండెలు బాదుకున్నాను.

    ఈలోగా చంచల్రావు ఫోటోలు చూస్తూ పళ్ళు కొరకడం మొదలుబెట్టాడు.

    "ఏంట్రా ఈ ఫోటోలు?" అని రంకె వేస్తూ ఫోటోలు నా చేతిలో పెట్టాడు.

    నేను చంచల్రావును కారుతోబాటు తీద్దామని ప్రయత్నించిన ఫోటోలు అవి.

    ఒకదాంట్లో చంచల్రావు తలకాయ ఒక్కటే పడింది. ఇంకో దాంట్లో చంచల్రావు కాళ్లు, కారుటైరు పడింది.మరోదాంట్లో బోయ్ నెట్, చంచల్రావు చెయ్యి పడింది.

    పోలీసు స్టేషన్లో ఫోటోలుకూడా అలానే వచ్చాయి. వరసగా పోలీసుల టోపీలు ఒక దాంట్లో, ఇంకో దాంట్లో వరుసగా వాళ్ల నిక్కర్లు. నేనూ శివరాం తీయించుకున్న దాంట్లో (ఆ ఫోటో చంచల్రావుగాడు తీశాడు) మా తలకాయలు లేకుండా వట్టి మొండేలు పడ్డాయి. మిగతా ఫోటోలుకూడా ఇదే మోస్తరుగా ఉన్నాయి.

    ఈ ఫోటోలకి నూటడెబ్బై అయిదు రూపాయలా?

    బేర్ మన్నాను నేను.

    "బాధపడకూండ్రి సార్! ఫోటోలు తీసుడు మొదటిసారిగదా. షురు షురుల గట్లనే వస్తయ్. తర్వాత మంచి గొస్తయ్" అన్నాడు యాదగిరి నన్ను ఊరడిస్తూ.