నేనూ - ఇంపోర్టెడ్ కెమేరా

Listen Audio File :

నేనూ - ఇంపోర్టెడ్ కెమేరా

 

 

- మల్లిక్

పార్ట్ - 4

 

  చంచల్రావు కారుకి జారపడి నిలబడిన ఫోటో ఒకటి, కారు ఫ్రంట్ డోరు దగ్గర చేతులు కట్టుకుని నిలబడిన దొకటి, బాయ్ నెట్ మీద మోచేయి ఆనించి గెడ్డం కింద చెయ్యి పెట్టుకుని ఉన్నట్లు మరొకటి తీశాను.
 "డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నట్లు తీయించుకుంటే బాగుంటుంది" అన్నాను.చంచల్రావు కారు తలుపు లాగిచూసి "లాక్ చేసుంది" అన్నాడు.

    "పోన్లే! కారుతో తీయించుకున్నావుగా, ఇప్పుడు నేను నిలబడతాను. నువ్వు తియ్యి" అంటూ కెమెరా చంచల్రావు చేతికిచ్చి నేను నిలబడ్డాను.

    చంచల్రావు కెమెరా అడ్జెస్టు చేసుకుంటూ "రెడీ" అన్నాడు.

    నేను నవ్వాను.

    "ఏంటా వెధవ నవ్వు? నువ్వేమైనా టీవీ యనౌన్సరువా? నువ్వేం నవ్వక్కర్లా, మామూలుగా నిలబడు" పళ్ళు కొరుకుతూ అన్నాడు చంచల్రావు  

    కారుదగ్గర నాకు మూడు నాలుగు ఫోటోలు తీశాడు చంచల్రావు.

    ఇంతలో నలుగురు పోలీసుల్ని వెంటబెట్టుకుని ఒకతను హడావిడిగా మా దగ్గరకు వచ్చాడు.

    "వీళ్ళే... వీళ్ళే పట్టుకోండి" అన్నాడతను.

    "ఏమిటి?" అన్నాం మేమిద్దరం తెల్లబోయి.

    "వీరి కారు దొంగతనం చెయ్యాలని మీరు ప్రయత్నస్తున్నట్టు ఈయన మాకు కంప్లయింట్ ఇచ్చారు" ఒక పోలీసు అన్నాడు.

    "అబద్దం. మేము కారు బాగుందికదా అని దాని దగ్గర ఫోటోలు తీయించు కుంటున్నాం" అన్నాను నేను

    "పచ్చి అబద్దం. వీళ్ళు నా కారు తలుపులు పట్టిలాగూతూ తెరవడానికి ప్రయత్నించడం నేను చూశాను. కారు దొంగలు మేము కారు దొంగలం అని చెప్పుకుంటారా? అసలే ఈ మధ్య సిటీలో కారు దొంగతనాలూ, స్కూటర్ దొంగ తనాలూ చాలా అవుతున్నాయ్. ఆ ముఠాతో వీళ్ళకు సంబంధం ఉందనుకుంటా" అన్నాడు కారు ఓనరు.

    అక్కడ కాలనీ జనం అంతా మూగారు. మేము అలాంటి వాళ్ళం కాదని వాళ్ళు పోలీసులకి చెప్పి చూశారు.

    మేము ఎంత మెత్తుకున్నా పోలీసులు మా మాట వినకుండా పోలీసు స్టేషన్ కి లాక్కెళ్ళారు.

    ఆ ఇన్ స్పెక్టర్ నన్ను అమాంతం కౌగిలించుకున్నాడు. అతని బిగికౌగిలికి నా షర్టు గుండీలు పటపట తెగి రాలిపోయాయ్.

     "నిజంసార్. దొంగని కాను, నన్ను వదలండి" అన్నాను అతని కౌగిలినుండి విడిపించుకుంటూ.

    "వదలనుగాక వదలను హ్హహ్హహ్హ" అంటూ నవ్వాడు.

    నేను ఆశ్చర్యంగా ఇన్ స్పెక్టర్ మొహం లోకి చూశాను.

    "నేన్రా శివరాంని, నీ క్లాస్ మేట్ ని.ఇక్కడ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాను" అన్నాడు శివరాం.