మహిళల మనసు దెబ్బతింటోంది   ఒక పక్క ఇంటి బాధ్యతలు, మరో పక్క ఉద్యోగం. రెండింటిలోనూ మహిళలు నెగ్గుకువస్తున్నా, ఆ పోరాటంలో వారి మీద ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతోంది. అది వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతోంది, మానసిక సమస్యలను సృష్టిస్తోంది. ఈ విషయాన్నే ప్రతిబింబిస్తోంది ఓ పరిశోధన. ఇదేదో ఆషామాషీ వ్యక్తులు సాగించిన పరిశోధన కాదు. ఇంగ్లండు వైద్య శాఖ ఆధ్వర్యంలో నడిచే National Health Service (NHS) అనే సంస్థ రూపొందించిన నివేదిక.   పరిస్థితులు విషమిస్తున్నాయి.. NHS ప్రతి ఏడేళ్లకి ఓసారి దేశంలోని పౌరుల మానసిక స్థితిగతుల మీద ఓ నివేదికను రూపొందిస్తూ వస్తోంది. అలా తాజాగా రూపొందిన నివేదికలో పురుషులతో పోలిస్తే మహిళల మానసిక ఆరోగ్యం చాలా ఆటుపోట్లలో ఉన్నట్లు తేలింది. ఉదాహరణకు 16-24 వయసు మధ్యగల పురుషులలో 9 శాతంమంది మానసిక సమస్యలతో బాధపడుతుంటే, స్త్రీలలో మాత్రం ఇది 26 శాతంగా నమోదైంది. గత నివేదికలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కవేనట! పురుషుల మానసిక ఆరోగ్యంలో మాత్రం గతానికి ఇప్పటికీ పెద్దగా మార్పు లేదని తేలింది. ఇంకా ఈ నివేదికలో ఏమని తేలిందంటే... - 14 శాతం మహిళలు ఒత్తిడి నుంచి నిదానంగా డిప్రెషన్‌లోకి జారుకుంటున్నారని తేలింది. - 4 శాతం మహిళలు తీవ్రమైన బైపోలార్‌ డిజార్డర్‌ అనే మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారట. - 10 శాతం మహిళలు తమ మానసిక సమస్యకి చికిత్సను తీసుకుంటున్నారు. - డిప్రెషన్‌లో తమకు తాము హాని కలిగించుకుంటున్నవారి సంఖ్య 19 శాతానికి చేరుకుంది.   కారణాలు లేకపోలేదు: మునుపటితో పోలిస్తే మహిళలు మరిన్ని మానసిక సమస్యలను ఎదుర్కోవడానికి ఖచ్చితమైన కారణాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. పనిచేసే పరిస్థితులలో ఒత్తిడి పెరిగిపోవడం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలకు తోడు లైంగిక వేధింపులు కూడా మహిళలను క్రుంగుబాటుకి లోను చేస్తున్నాయని చెబుతున్నారు. ఇక సమాజం నుంచి నానాటికీ పెరిగిపోతున్న ఒత్తిడి ఎలాగూ ఉంది. టీవీ, సినిమా, సోషల్‌ మీడియాలతో ఒంటరితనం తగ్గుతున్నట్లు అనిపించినా... వాటిలో చూస్తున్న దృశ్యాలు, ఎదుర్కొంటున్న కామెంట్లు మనలో ఉన్న కాస్త మనశ్శాంతినీ దూరం చేస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా విషాదకరమైన గతం ఉన్నవారిలో అవి పాతగాయాలని రేపుతున్నాయని హెచ్చరిస్తున్నారు.   మార్గాలూ లేకపోలేదు: ఒత్తిడికి లోను చేసే పరిస్థితుల నుంచి దూరంగా ఉండటం, సరైన ఆహారం, తగిన వ్యాయామం, తరచూ ధ్యానం చేయడం, సామాజిక బంధాలను దృఢంగా ఉంచుకోవడం వంటి చర్యలతో ప్రయోజనం ఉంటుందంటున్నారు. అన్నింటికీ మించి తమ మనసులోని అలజడి అదుపు తప్పినట్లు తోస్తే తప్పకుండా వైద్యుని సంప్రదించి కౌన్సిలింగ్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు.   - నిర్జర.  

  సైనికుల‌కు స‌లాం చేస్తున్న జ‌య `జై- హింద్‌`!   వాళ్లు ఎండావాన‌ల‌కి చ‌లించ‌రు, కొండాకోన‌ల‌కి త‌ల‌వంచ‌రు. ప‌చ్చ‌ద‌న‌మే ఎరుగ‌ని ఎడారిలో ఉన్నా, నేల‌నేది క‌నిపించ‌ని న‌డిసంద్రంలో ఉన్నా... వాళ్ల మ‌న‌సుల్లో ఒకటే ఆలోచ‌న‌, వాళ్ల జీవితాల్లో ఒక‌టే ల‌క్ష్యం, వాళ్ల చేత‌ల్లో ఒక‌టే త‌ప‌న‌ - అదే దేశ ర‌క్ష‌ణ‌! మ‌న భ‌ద్ర‌తా ద‌ళాల గురించి ఇలా ఎన్ని విష‌యాలు చెప్పుకున్నా, చెప్పాల్సింది ఇంకా మిగిలిపోయిన‌ట్లే తోస్తుంది. వారికి ఎన్ని వేల కృత‌జ్ఞ‌త‌లు అందించినా, మిగిలిపోయే రుణం ఏదో ఉంది. అందుకే వారి ఔన్న‌త్యం గురించి ప్ర‌జ‌ల‌కు తెలిపేందుకు, వారి మ‌న‌సులోని మాట‌ల‌ను మ‌న‌కి చేర‌వేసేందుకు ఒక కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు `జ‌యపీస‌పాటి`. అదే జై - హింద్‌!!!   హాంగ్‌కాంగ్ నుంచీ తెలుగువారందికీ ఆత్మీయ‌వార‌థిగా నిలిచేందుకు `టోరీ` అనే ఇంట‌ర్నెట్ రేడియోని మొద‌లుపెట్టింది `తెలుగువ‌న్` సంస్థ‌. అందులో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఉన్న‌చోట నుంచే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ టోరీని విజ‌య‌వంతం చేశారు. హాంగ్‌కాంగ్ నుంచి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించే జ‌య‌పీస‌పాటి వారిలో ఒక్క‌రు. అప్ప‌టికే జ‌య హాంగ్‌కాంగ్‌లో ఉంటున్న తెలుగువారికోసం కె.పి.రావు దంప‌తుల‌తో క‌లిసి `హాంక్‌కాంగ్ తెలుగు స‌మాఖ్య‌` అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. వంద‌కు పైగా తెలుగు కుటుంబాల‌కు ఆ స‌మాఖ్య ఒక వేదిక‌గా ఉంది.     సైనికుల కోసం ఏద‌న్నా మొద‌ట్లో జ‌యపీస‌పాటి శ‌ని, ఆదివారాల్లో రెండేసి గంట‌ల పాటు రేడియో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేవారు. ఇవ‌న్నీ స‌ర‌దాస‌ర‌దాగా సాగిపోయేవి. కానీ దాంతో ఆమెకు ఎందుకో తృప్తి క‌ల‌గ‌లేదు. జ‌య‌కు చిన్న‌ప్ప‌టి నుంచి సాయుధ‌ద‌ళాల‌కు అనుబంధంగా ప‌నిచేయాల‌నే కోరిక తీవ్రంగా ఉండేది. అదెలాగూ సాధ్య‌ప‌డ‌లేదు. క‌నీసం మ‌న చీక‌టి రాత్రులు సుర‌క్షితంగా ఉండేందుకు త‌మ జీవితాల‌ను వెలిగిస్తున్న సైనికుల కోసం ఏద‌న్నా చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉండేవారు. సైనికుల గురించి ఎక్క‌డో స్కూళ్ల‌లోనో, కాలేజీల్లోనో చెప్ప‌డం త‌ప్ప మిగ‌తా మాధ్య‌మాలు అంత శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేద‌ని గ్ర‌హించారు జ‌య‌. దేశం కోసం త‌మ ఆశ‌ల‌ను ప‌ణంగా పెట్టిన వారి మ‌న‌సులో ఏముంటుంది! ఆ ఉన్న‌త భావాలు మిగ‌తా ప్ర‌జ‌ల‌కు చేరితే అవెంత ప్ర‌భావ‌వంతంగా ఉంటాయో క‌దా అనిపించింది ఆమెకు! అలా రూపుదిద్దుకున్న‌దే `జై- హింద్` కార్య‌క్ర‌మం!   సైనికులు మాట్లాడితే `జై-హింద్‌` కార్య‌క్ర‌మం గురించిన ఆలోచ‌న‌ను చెప్ప‌గానే చాలా ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. ఒక చిన్న‌పాటి కార్య‌క్ర‌మంలో మాట్లాడేందుకు సైనికులు ఒప్ప‌కుంటారా! ఒక‌వేళ వాళ్లు ఒప్పుకుని ఏద‌న్నా మాట్లాడినా అది చ‌ట్టాన్ని ఉల్లంఘంచిన‌ట్లు కాదా! సెల‌బ్రిటీలు కాకుండా ఎవ‌రో సైనికులు మాట్లాడితే వినేది ఎవ‌రు!... లాంటి స‌వాల‌క్ష స‌వాళ్ల‌ను జ‌య ఎదుర్కొన్నారు. కానీ జ‌య వాట‌న్నింటినీ దాటి విజ‌యం సాధించారు. సెల‌బ్రిటీలు మాట్లాడితే ఆస‌క్తితో వింటార‌నీ, సైనికులు మాట్లాడితే అభిమానంతో వింటార‌నీ నిరూపించారు.    మూడేళ్ల విజ‌యం 2012 మ‌ధ్య‌కాలంలో మొద‌లైన జైహింద్ కార్య‌క్ర‌మం ఇప్ప‌టికి మూడు సంవ‌త్స‌రాల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసుకుంది. ఈ మూడు సంవ‌త్స‌రాల ప్ర‌యాణం ఏమంత తేలిక‌గా సాగ‌లేదు. మొద‌ట్లో...  సైనికుల‌ను ఎలా సంప్ర‌దించాలి. మాట‌ల సంద‌ర్భంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఎలా మెల‌గాలిలాంటి స‌మస్య‌లెన్నో ఆమె ఎదుర్కొన్నారు. పైగా జ‌య‌కు ఇంట్లో ఇద్ద‌రు చిన్న‌పిల్ల‌లు ఉన్నారు. భ‌ర్త ఉద్యోగ‌రీత్యా త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి రావ‌డంతో, ఆ ఇద్ద‌రి పిల్ల‌ల బాధ్య‌త‌నీ పూర్తిగా చూసుకోవాల్సి వ‌చ్చేంది. పైగా తాను ఒక పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్నారు. ఇన్ని బాధ్య‌త‌ల మధ్య కూడా, ఆమెకు దేశం ప‌ట్ల ఉన్న నిబ‌ద్ధ‌తే `జై-హింద్‌` కార్య‌క్ర‌మాన్ని ముందుకు న‌డిపించింది.     నొప్పించ‌క తానొవ్వ‌క‌ `జై-హింద్‌` కార్య‌క్ర‌మం కేవ‌లం సైనికుల‌తో స‌ర‌దాగా సాగిపోయే సంభాష‌ణ‌లా ఉండ‌దు. వారి నేప‌థ్యం ఏమిటి, సైనిక‌ద‌ళాల‌లో చేరేందుకు వారిని పురికొల్పిన ప‌రిస్థితులు ఏంటి, వారి అభిరుచులు, కుటుంబం... వంటి విష‌యాల‌ను చ‌ర్చిస్తూనే వాటిని తిరిగి శ్రోత‌ల‌కు తెలుగులో చెబుతారు జ‌య‌. ఒక‌వైపు సైన్యంలో ఉండే ద‌ళాలు ఎంత‌టి క‌ష్ట‌న‌ష్టాల‌ను ఎదుర్కొంటాయో తెలియ‌చేస్తూనే,  సైన్యంలో ఉండేవారికి ప్ర‌భుత్వం క‌ల్పించే స‌దుపాయాలను సంద‌ర్భానుసారంగా వివ‌రిస్తుంటారు. సైనికుల‌తో ఒకో ముఖాముఖి సాగే కొద్దీ `నొప్పించ‌క తానొవ్వ‌క‌` రీతిలో సంభాష‌ణ‌ను సాగించే నేర్పు జ‌య‌కు పూర్తిగా అల‌వ‌డిపోయిన‌ట్లే తోస్తుంది. సైనికుల బాధ్య‌త ఒక్క స‌రిహ‌ద్దుల‌కే ప‌రిమితం అనుకునే సామాన్య‌ల‌కు, సైన్యం అందించే సేవ‌లు విని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఉదా|| ప్ర‌భుత్వ రంగ ఉద్యోగులు ఏద‌న్నా స‌మ్మెను చేప‌డితే, దానివ‌ల్ల ర‌వాణా ఆగిపోకుండా ఉండేంద‌కు `రైల్వే టెరిటోరియ‌ల్ ఆర్మీ` స‌దా సిద్ధంగా ఉంటుంద‌న్న విష‌యం చాలామందికి తెలియ‌దు. సైన్యానికి చేతులెక్కి మొక్కాల‌నిపించే ఇలాంటి విష‌యాలు కోకొల్ల‌లుగా `జై-హింద్‌`లో వినిపిస్తాయి.   కార్య‌క్ర‌మం తీరుతెన్న‌లు: సైనికుల కోసం జరిగే `జై-హింద్‌` జాతీయ గేయంతో మొద‌లై, జాతీయ గీతంతో ముగియ‌డం స‌ముచితంగా తోస్తుంది. మ‌న కోసం ప్రాణాలు అర్పించ‌డానికి కూడా వెనుకాడ‌రు సైనికులు. అందుకే వారు నిండునూరేళ్లూ జీవించాలంటూ, ఈ కార్య‌క్ర‌మం ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లను అంద‌చేస్తారు. ఆ త‌రువాత ప్రోగ్రాంలోకి విచ్చేసే విశిష్ట అతిథులు చెప్పే విష‌యాల‌కు మ‌న‌సంతా దేశ‌భ‌క్తితో నిండిపోతుంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో మంచిమంచి పాట‌లూ విన‌వ‌స్తాయి, శ్రోత‌ల‌ ప్ర‌శ్న‌లూ కార్య‌క్ర‌మానికి మ‌రింత వ‌న్నె తెస్తాయి. ఇందులో పాల్గొనే ప్ర‌తి ఒక్క సైనికుడూ ప్ర‌త్యేక‌మే! మ‌న సికింద‌రాబాదులోనే ప‌నిచేస్తున్న మేజ‌ర్ నిషాసింగ్ చిన్న‌నాటి క‌బుర్లు; కార్గిల్ పోరులో కాలు పోగొట్టుకుని, రెండు సంవ‌త్స‌రాలు ఆసుప‌త్రిలో గ‌డిపినా కూడా మార‌థాన్లో పాల్గొంటున్న మేజ‌ర్ డి.పి.సింగ్ పోరాటం;  కార్గిల్ యుద్ధంలో వీర‌మ‌ర‌ణం పొందిన కేప్ట‌న్ సౌర‌భ్ కాలియా గురించి ఆయ‌న తండ్రి ఎన్‌.కె.కాలియా పంచుకున్న జ్ఞాప‌కాలు... ఇలా ఒక్కో కార్య‌క్ర‌మం ఒక్కో స్ఫూర్తిచిహ్నంగా మిగిలిపోతుంది.     జ‌య‌పీస‌పాటి నిర్వ‌హించే ఈ కార్యక్ర‌మం గురించి జాతీయ‌, అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. `జై-హింద్‌` అనే కార్య‌క్ర‌మం ఒక‌టి న‌డుస్తోంద‌ని అంద‌రికీ తెలిసింది. కానీ ఎవ్వ‌రికీ తెలియ‌కుండా... జ‌రుగుతున్న ఓ నిశ్శ‌బ్ద విప్ల‌వం కూడా ఉంది. బ‌తికితే రాజాలాగానే బ‌త‌కాలి, సంపాదిస్తే ల‌క్ష‌ల్లోనే సంపాదించాలి అనుకునే యువ‌త దీని నుంచి ప్ర‌భావితం అవుతోంది. ఏదో ఒక రోజున ఒక సైనికుడిని `మీరు సైనికుడిగా ప్రేర‌ణ క‌లిగించిన సంద‌ర్భం ఏంటి?` అని జ‌య‌పీస‌పాటి అడిగితే `మీ కార్య‌క్ర‌మాన్ని వినే సైనికుడిగా మారాల‌నుకున్నాను` అని ఎవ‌ర‌న్నా చెప్పే రోజు కూడా వ‌స్తుందేమో! - జై - హింద్‌!!!   - నిర్జ‌ర‌.

మనకీ కావాలి  " ఒక బడ్జెట్ "     ఈ రోజు అంతా అందరూ బడ్జెట్ కోసం మాట్లాడుతున్నారు ..ఏవి పెరిగాయి ? ఏవి తగ్గాయి అంటూ... నాకు ఎందుకో మా అమ్మ గుర్తుకు వచ్చింది ..తన నల్ల డైరీ..లో మా ఇంటి బడ్జెట్ ..వుండేది. ఆ లెక్కలు చూస్తే మాకు భయం వేసేది..నాన్న జీతం ..మా ఇంటి అవసరాలకి మద్య బోలెడంత దూరం వుండేది. అమ్మ ఆ నెల ఖర్చు ఏంటో ఓ లిస్టు రాసేది ముందు ..నాన్న జీతం వచ్చాకా ..దాని బట్టి ఏవి ముఖ్యమ్..ఏవి ఈ నెల వాయిదా వేయచ్చు అని నిర్ణయించేది. అమ్మ ఆ నిర్ణయం లో మా అవసరాలు వాయిదా పడకుండా ఉండాలి అని గట్టిగా కోరుకునే వాళ్ళం. అయితే ఒకో నెల ఒకొక్కరి కోరికలు తీరేవి. ఒకోక్కరివి వాయిదా పడేవి ..వున్నా ఆదాయం తో అందరిని సంతృప్తి పరచేందుకు అమ్మ పెద్ద కసరత్తే చేసేది ..   చిన్నప్పుడు ఆ ప్రహసనమంతా ..మాకు కొంచం చిరాకు ని , కోపాన్ని తెప్పించిన మాట మాత్రం వాస్తవం. అమ్మ మా కోరిక వాయిదా వేసినప్పుడు ..అమ్మ కి మా మీద ప్రేమ లేదని బాధపడి పోయేవాళ్ళం. మా కోరిక తీరిన రోజున అమ్మ దేవత అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ కోపాలు, అలకలు , అన్ని తలుచు కుంటే నవ్వు వస్తుంది ..కాని చాలా విషయాలు ఆ బడ్జెట్ అలాట్మెంట్ ద్వారా అమ్మ మాకు నేర్పింది అన్న సత్యం ఇప్పుడు మాకు అర్ధం అవుతోంది. అందులో ముఖ్యమయినవి ..   సహనం ... అవును ..మనసులో ఒక కోరిక వచ్చిందే తడువుగా కొత్త మొబైల్ నుంచి ..కొత్త కార్ దాకా ఏవయినా అందుబాటులో ఉంచుతున్నారు ఇప్పటి తల్లి తండ్రులు . .దానితో తీరని కోరికలు ఏవి లేవు ఇప్పటి పిల్లలకి. కాని అమ్మా నాన్నా కాదుగా "జీవితం "...అన్ని అమర్చి పెట్టదు..కొన్నిటిని ఊరించి , ఊరించి అందిస్తుంది ..కాని అడగగానే అమ్మ అన్ని అందించటం అలవాటు పడిన పిల్లలకి ..ఈ సహనం పట్టటం ఎలా తెలుస్తుంది ? బాధ పడతారు ..అసంతృప్తి తో కుమిలి పోతారు. అదిగో అదే ఇప్పటి జనరేషన్ లో చాలా మంది ని  ఇబ్బంది పెట్టే విషయం ...ఈ రోజు కాకా పోయినా రేపు మనకి కావలసినది దొరుకుతుంది లే ..అనే ఆశ ని కలిగించింది చిన్నప్పటి అమ్మ బడ్జెట్ ..   ఎదురు చూపలలో ఆనందం: ఒక్కసారి ఆలోచించండి ..అనుకున్నదే తడువుగా, తలుచు కున్న క్షణం లో మీకు కావలసినది మీ చేతిలో ఉన్నప్పటి ఆనందాన్ని , ఎంతో ఎదురు చూసి దక్కించుకున్న వస్తువు ..చేతి లో పడిన క్షణాన్న కలిగిన ఆనందాన్ని పోల్చి చూడండి ..రెండో అనుభవం జీవితాంతం గుర్తు వుంటుంది ..అందుకే మన చిన్నప్పుడు పండగ రోజున వేసుకున్న బట్టలు ఇప్పటికి  మనకి తీపి జ్ఞాపకాలు ..ఇప్పుడో ..ఎన్ని కొనుక్కున్నా ..ఆ తృప్తి ..ఆ ఆనందం రుచి చూడలేక పోతున్నాం ..ఎదురు చూపులలో వుండే ఆ తీపిని మిస్ అయిపోతున్నాం . ఇప్పటి పిల్లలకి అయితే ఆ రుచే తెలియదని చెప్పచ్చు.    రూపాయి విలువ..  అవును..రూపాయి విలువ పడిపోయింది అన్న మాట నిజమే నేమో అనిపిస్తుంది, ఇప్పటి మన ఖర్చు లు చూస్తుంటే ..ఒకప్పుడు చేతిలో ఉంటేనే మన రూపాయి ..అప్పుడే ఖర్చు ...గురించి ఆలోచన. ఇప్పుడో  ? కార్డు లో మన రూపాయి లేక పోయినా కావలసినంత ఖర్చు పెట్టె వీలు ..దానితో ఖర్చు పెట్టేటప్పుడు ముందు , వెనకా చూడటం మర్చి పోయాం. ఆ తర్వాత తీరిగ్గా ..బాధ పడుతుంటాం . పిల్లలకి అయితే ఆ నొప్పి కూడా తెలియదు , కాబట్టి ..తీరని, తీర్చలేని కోరికలు అంటూ వారికి పెద్దగా ఏవి వుండటం లేదేమో కూడా .   ఇలా ఒకటా .రెండా  ? ఎన్నో ఎన్నెన్నో నేర్చుకున్నాం అమ్మ బడ్జెట్ ప్రణాళిక వల్ల మనమంతా. మరి అమ్మలుగా మన పిల్లలకి ఆ విలువలు నేర్పాలంటే మనం కూడా బడ్జెట్ వేయటం మొదలు పెట్టాలి కదా ! దేశ బడ్జెట్ ఎలా వుందో చూసేసాం..ఇక మన ఇంటి బడ్జెట్ వేసుకుందాం ..రాబడి బట్టి ఖర్చు ని నిర్ణయించుకుందాం ..కొన్నిటిని వాయిదా వేద్దాం ..కొన్నిటిని పూర్తిగా వద్దనుకుందాం . పిల్లలకి నో చెప్పటం నేర్చుకుందాం. వాళ్ళ కి ఓర్పుని, ఎదురుచూడటం లోని ఆనందాన్ని రుచి చూబిద్దాం..ఇవే  అతి విలువయిన జీవిత పాఠాలు..  

మరకలు పోగొట్టేద్దాం... మెరిపించేద్దాం...! మనం నచ్చిన బట్టల పైన కానీ, ఏదైనా వస్తువుల పైన కానీ మరకలు పడిన లేదా జిడ్డుగా మారి దుర్వాసన వచ్చేలా అయితే మనకు చాలా బాధగా ఉంటుంది కదా! మరి అలాంటపుడు ఆ మరకల నుండి, దుర్వాసనల నుండి మన వస్తువులను ఎలా కాపాడుకోవాలో ఒకసారి చూద్దామా...!   చెమట మరకలు :- చెమట మూలంగా షర్టులు, బ్లౌజులు మరకలతో దారుణంగా తయారవుతాయి. చూడడానికి కూడా ఎంతో అసహ్యంగా ఉంటాయి. అందువల్ల ముందుగా ఆ మరకల వద్ద లిక్విడ్ డిటర్జెంట్ సబ్బుతో రుద్ది, ఆ తర్వాతే సబ్బుతో ఉతికి చూడండి. మరీ మొండి చెమట మరకలైతే మాత్రం వెనిగర్ తో కేవలం ఆ ప్రాంతాన్నిమాత్రమే రుద్ది, ఆ తర్వాత మాములుగా సబ్బుతో కడిగేయవచ్చు. వెనిగర్ లేకుండా గోరువెచ్చని నీటిలో నాలుగు ఆస్పరిన్ బిళ్ళలు వేసి, ఆ నీటిలో దుస్తులు నానబెట్టి ఉతికేయండి. మరకలు మాయమైతాయి. తెల్లని దుస్తులైతే మాత్రం కాస్త హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను మరకలపై కొద్దిగా రాసి అయిదు నిముషాల తర్వాత ఉతకండి.   లిప్ స్టిక్ బాల్ పెన్ మార్క్స్ :- ముందుగా మరకపడిన బట్టను ఓ పాత టవల్ పై ఉంచండి. మరకపైకి వచ్చేలా ఉంచి ఓ చిన్న పాత గుడ్డను ఆల్కాహాలులో ముంచి దాన్ని మరకపై తట్టినట్టుగా పదేపదే చేయండి. ఆ తర్వాత వాష్ చేయండి. మరకలు మరీ జిడ్డుగా అంటుకున్నట్లుగా అనిపిస్తే కిరోసిన్ తీసుకుని మరకపై పూసి అయిదు నిముషాల తర్వాత శెనగపిండితో గట్టిగా రుద్ది కడిగేయండి.   కార్పెట్ పై క్యాండిల్ చుక్కలు :- అందమైన, ఖరీదైన కార్పెట్ పై క్యాండిల్ చుక్కలు పడితే... అందుకే ఓ స్టీలు గిన్నెలో ఐసుముక్కలు వేసి దాన్ని ఈ క్యాండిల్ చుక్కలపై కాసేపు ఉంచండి. చల్లదనానికి ఈ క్యాండిల్ వ్యాక్స్ మరింతగా గట్టిగా మారుతుంది. అప్పుడు ఏదైనా స్పూన్ మొనతో దానిని చెక్కేసి బ్రష్ తో శుభ్రంగా తొలగిస్తే సరిపోతుంది.   డిన్నర్ ప్లేట్ లపై పసుపు రంగు :- ప్లాస్టిక్ ప్లేట్లపై పసుపు మరకలు తొలగించాలంటే ప్లేట్లను గోధుమ పిండితో గట్టిగా రుద్ది కడిగేయండి చాలు. నిత్యం వాడే బకెట్లు మగ్ లపై ఉండే జిడ్డు మరకలు పోవాలంటే ముందుగా వాటిని కిరోసిన్ లో తడిపిన గుడ్డతో గట్టిగ తుడిచి, ఆ తర్వాత సబ్బుతో కడగాలి.   ప్లాస్కు దుర్వాసన:- ప్లాస్కు లో దుర్వాసన పోవాలంటే నాలుగైదు కోడిగుడ్డు పెంకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని ప్లాస్కులో వెయ్యాలి. దానిపై వేడినీటిని పోసి మూతపెట్టాలి. మధ్యమధ్యలో బాగా కదిలిస్తూ ఓ గంటన్నర పాటు ఉంచండి. ఆ తర్వాత సబ్బుతో కడిగేయండి. ఇక పొడిగా ఉండేలా తుడుచుకున్న తర్వాత ఓ చెంచాడు పంచదార అందులో వేసి మూతపెట్టి దాచుకోండి. దుర్వాసన రాకుండా తాజాగా ఉంటుంది.  

మొగవారికే మొదటి ప్రాధాన్యం     ఒకప్పుడు ఆడవాళ్లంటే చాలా చులకన ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఆడవాళ్లు ఏ రంగంలోనూ మగవారికి తీసిపోవడం లేదు. కాబట్టి సమాజం కూడా వాళ్లిద్దరికీ సమానమైన గౌరవం ఇస్తోంది. ఈ మాటలు మీరు కూడా నమ్ముతున్నారా? కానీ నిజంగా మనం మురిసిపోవాల్సినంత మార్పేమీ సమాజంలో రాలేదని అంటున్నారు పరిశోధకులు. అందుకు రుజువుగా ఒకటి కాదు రెండు కాదు, మూడు పరిశోధనలు చేసి చూపిస్తున్నారు. సామాన్యంగా ఒక జంటను సంభోదించేందుకు Mr. & Mrs అంటాము. అలాగే ఎవరన్నా అమరప్రేమికుల గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు రోమియోజూలియట్ లాంటి పోలికలు చేస్తాము. ఇందులో మగవారినే మొదటగా పేర్కొంటాం కదా! ఈ వ్యవహారం లోతుపాతులని చూడాలనుకున్నారు Dr. Hegarty అనే పరిశోధకుడు. అందుకోసం ఓ మూడు పరిశోధనలు చేసి చూశారు. ఆ పరిశోధనలు, వాటి ఫలితాలు ఇవిగో...   మొదటి పరిశోధన: Dr. Hegarty మొదటగా ఇంటర్నెట్లో జంటగా కనిపించే పదాలను వెతికి చూశారు. ఇందుకోసం అటు అమెరికాలోనూ, ఇటు ఇంగ్లండులోనూ తరచూ వినిపించే కొన్ని పేర్లను నెట్లో సెర్చ్ చేశారు. ఉదాహరణకి డేవిడ్ అనే మగ పేరు, మేరీ అనే స్త్రీ పేరు ఉన్నాయనుకోండి. David and Mary అని మగవారి పేరు ముందు వచ్చేట్లుగా, అలాగే Mary and David అని ఆడవారి పేరు ముందు వచ్చేట్లుగా నెట్లో వెతికారు. ఈ ఫలితాలలో వచ్చిన పేర్లలో దాదాపు 80 శాతం సందర్భాలలో మగవారి పేరే ముందు కనిపించింది!   రెండో పరిశోధన: ఈ పరిశోధనలో ఓ 121 మందిని కొన్ని జంటలను ఊహించుకోమని చెప్పారు. ఆ జంటలలో కొన్ని జంటలు సంప్రదాయబద్ధంగా ఉంటాయనీ, మరికొన్ని జంటలు ఆధునికంగా ఉంటాయనీ ఊహించుకోమన్నారు. ఆ జంటల పేర్లు చెప్పమన్నప్పుడు.... సంప్రదాయబద్ధంగా ఉండే జంటల పేర్లలో ఎక్కువగా మగవాడి పేరు ముందు వచ్చింది. ఆధునికంగా ఉండే జంటల పేర్లు చెప్పినప్పుడు మరీ అంత వ్యత్యాసం కనిపించలేదు.   మూడో పరిశోధన: ఈసారి పరిశోధన కోసం ఓ 86 మందిని ఎన్నుకొన్నారు. వీరందరినీ కూడా కొన్ని జంటలని ఊహించుకోమని చెప్పారు. అలా ఊహించుకున్న జంటల మధ్య తేడాలని రాయమన్నారు. ఇలా రాసేటప్పుడు మగవారికి సంబంధించిన లక్షణాలే ఎక్కువగా రాయడాన్ని గమనించారు. అతను ఆమెకంటే బలంగా ఉంటాడు; ఆమె అతనికంటే దూకుడుగా ఉంటుంది; అతను క్రికెట్ బాగా ఆడతాడు లాంటి లక్షణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకానీ వంటావార్పూ, ఇంటిపని, కుటుంబం, నాట్యం.... లాంటి స్త్రీ సంబంధమైన లక్షణాల గురించి అంతగా ప్రస్తావించలేదు. అదీ విషయం! పైకి మనం ఆడవారి పట్ల అంతగా వివక్ష లేదని చెబుతున్నా, మన మెదడు మగవారికి ప్రాధాన్యత ఇచ్చేందుకే అలవాటుపడిపోయాయి. అదే రాతలోనూ కనిపిస్తోంది. మరి ఆ పరిస్థితి మారేదెప్పుడో!!! - నిర్జర.  

బొప్పాయి బ్రెస్ట్ మిల్క్ ను పెంచుతుందా   ‘నేను పుష్టిగా భోజనం చేసినా మా బాబుకి పాలు సరిపోవట్లేదు’ అని కొత్తగా తల్లయిన వాళ్ళు అనటం మనం వింటూనే ఉంటాం. అన్నం ఎక్కువగా తినేస్తే పాలు సమృద్దిగా పడతాయి అనుకోవటం పొరపాటే. మనం తీసుకునే ఆహారంలో పాలను ఉత్పత్తి చేసే పదార్థాలు అదిక శాతం ఉండేలా చూసుకోవాలి. మనకి అందుబాటులో ఉండే కొన్ని రకాల కూరగాయల్లో, మెంతులు, వెల్లుల్లి, తులసి, వాము, కాకరకాయి, బొప్పాయి మొదలైన వాటిలో పాలను ఉత్పత్తి చేసే గుణం అధికంగా ఉంటుంది. వీటిని మన రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలు ఇక ఏ దిగులు ఉండదు. మెంతులు ఈ సమస్యకి ఒక మంచి పరిష్కారం. బాలింతకు ఎక్కువగా మెంతిపొడి, మెంతికూర మొదలైనవి పెట్టాలి. నార్త్ ఇండియన్స్ అయితే మెంతులతో చేసిన హల్వా తినిపిస్తూ ఉంటారు. మెంతులను నేతిలో వేయించి, పోసి చేసి వంతులు గోధుమ పిండిని కలిపి వాటిలో పంచదారపొడి వేసి హల్వా లా తయారు చేస్తారు.     సోంఫు కూడా బాలింతలకు మంచిది. పాలు తాగే పిల్లలకి కడుపులో నొప్పి లేదా గ్యాస్ కు సంబందించిన సమస్యలు దీని వల్ల బాగా తగ్గుముఖం పడతాయి. తల్లి ఈ సోంఫుని ఎంత తింటే పిల్లలకి అంత మంచిది. దీనిని పొడిగా చేసుకుని కూరల్లో తినచ్చు లేదా నీళ్ళల్లో వేసి కాచుకుని కషాయంలా కూడా తీసుకోవచ్చు. వెల్లుల్లి పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకే కాదు పాలకు మంచి రుచిని కూడా తెచ్చిపెడుతుందని ఒక అధ్యయనం తేల్చి చెప్పింది. వెల్లుల్లి తిన్న తల్లుల పిల్లలు తల్లి దగ్గర ఎక్కువ పాలు తాగారట. ఈ వెల్లుల్లిని బాలింత తినే అన్ని వంటకాల్లో కలుపుకోవచ్చు. అలాగే వాము కూడా పాలు పడటంలో ఎక్కువ సహాయం చేస్తుంది. వాము పొడిలో కాని కషాయంలో కాని తేనె కలిపి తినిపిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.యుటరస్ కి సంబంధించి  ఏదైనా సమస్య ఉన్నా అది కూడా తగ్గుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైనడి బొప్పాయి పండు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దీన్ని అస్సలు తినకూడదని చెప్తారు అదే పండు డెలివరీ అయ్యాకా మాత్రం ఎక్కువగా తినాలి. ఇందులో తగినన్ని ప్రోటీన్స్, విటమిన్స్ ఉండటమే కాకుండా పాలు సమృద్దిగా తయారుకావటానికి దోహదం చేస్తాయి. బాలింతలు దీన్ని ఎంత తింటే అంత మంచిది. ఓట్స్ లో ఐరన్, కాల్షియం, ఫైబర్ ఇంకా విటమిన్ బి ఎక్కువగా ఉండటంవల్ల దీనిని తీసుకుంటే డిప్రెషన్ కూడా తగ్గుతుందిట. కొత్తగా తల్లి అయిన వాళ్ళలో తెలియని భయం ఉంటుంది. అలాంటి సమస్యలన్నీ ఓట్స్ తినటం వల్ల పోతాయని తేల్చి చెప్పాయి కొన్ని అధ్యయనాలు. వీటితో పాటు బ్రెడ్ తింటే కూడా మంచిది. తల్లులు తీసుకునే ఆహారంలోనే ఏది పాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందో తెలుసుకుని తీసుకుంటే చాలు, పిల్లలకి పోత పాలు పట్టాల్సిన పని ఉండదు. ..కళ్యాణి

జనం నోరు మూయించిన ‘నల్లపిల్ల’   ఇది నలుపు తెలుపుల ప్రపంచం. పైకి ఎన్ని కబుర్లు వినిపించినా తెల్లగా ఉండేవారి పట్లే మోజు ఎక్కువగా ఉంటుంది. నల్లగా ఉండేవారి పట్ల వివక్షా ఉంటుంది. ఆడవారి విషయంలో అయితే చెప్పనే అక్కర్లేదు. వాళ్లు తెల్లగా అయ్యే క్రీంని రాసుకుంటేనే విజయాలను సాధిస్తారంటూ బహిరంగంగానే ప్రకటనలు కనిపిస్తుంటాయి. అలాంటిది ఒక కారు నలుపు రంగులో ఉన్న అమ్మాయి ఏం చేయాలి. ‘నన్ను ఇలా ఎందుకు పుట్టించావురా భగవంతుడా!’ అంటూ జీవితాంతం కుమిలికుమిలి ఏడుస్తూ బతకాలా?’ ఈ ప్రశ్నకు సమాధానం ఖౌదియా (Khoudia) దగ్గర ఉంది...     ఖౌదియా ఆఫ్రికా ఖండంలోని సెనగల్‌ దేశంలో పుట్టింది. ఆమెకు 15 ఏళ్లు వచ్చేసరికి కుటుంబం, ఫ్యాషన్‌ ప్రపంచం అయిన ఫ్రాన్స్‌లో స్థిరపడింది. ఖౌదియా బాగా నల్లగా ఉండేది. దాంతో సహజంగానే ఆమె తీవ్రమైన వివక్షకు గురయ్యేది. చిన్నప్పటి నుంచీ ఆమెను తోటి పిల్లలు వెంటాడి వెంటాడి ఏడిపించేవారు. ఇక ఫ్రాన్స్‌లోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. నలుగురిలోనూ భిన్నంగా కనిపించే ఆమె ఒంటి రంగుని చూడగానే ఆకతాయిల మాటలకు హద్దులుండేవి కావు.     ‘నన్ను ఏడిపించేవారిని చూసీచూసీ... నన్ను నేనే ప్రేమించుకోవాలని నిశ్చయించుకున్నాను. విమర్శించేవారిని నిదానంగా పట్టించుకోవడం మానేశాను. ఆ దృక్పథం నాకు ఎంతగానో ఉపయోగపడింది,’ అంటుంది ఖౌదియా. అలా ఎదిగిన విశ్వాసంతో ఖౌదియా రెండేళ్ల క్రితం మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించింది. తెలుపు రంగుకి మాత్రమే ప్రాధాన్యత ఉన్న రంగంలోనే తనేమిటో నిరూపించుకోవాలనుకుంది. అలా తొలిసారి నల్లజాతీయులకు సంబంధించిన ఒక ఫొటోషూట్‌లో స్థానాన్ని సంపాదించింది.     తొలి ఫొటోషూట్‌ తరువాత ఖౌదియాకు నిదానంగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. కానీ అదే స్థాయిలో విమర్శలూ వినిపించసాగాయి. ‘నల్ల పిల్ల’, ‘చీకటి పిల్ల’ లాంటి మారుపేర్లతో ఆమెను పిలవడం మొదలుపెట్టారు. కానీ ఖౌదియా అవేవీ పట్టించుకోలేదు సరికదా... ఇంకా దూకుడుగా అవకాశాల కోసం ప్రయత్నించసాగింది. ‘నన్ను వాళ్లు నానారకాల పేర్లతోనూ ఏడిపించేందుకు ప్రయత్నించేవారు. నా రంగుని చూసి నేను బాధపడాలని వాళ్లు కోరుకునేవారు. కానీ నన్ను నా రంగుతో పిలిచిని ప్రతి పిలుపునీ నేను ప్రేమించాను. వాళ్లకి నేనేమిటో నిరూపించాలని అనుకున్నాను,’ అంటుంది ఖౌదియా. ఖౌదియాకు ఇప్పుడు 19 ఏళ్లు. ఆమె ఆత్మవిశ్వాసాన్నీ, పట్టుదలనీ చూసిన The Colored Girl Inc అనే సంస్థ ఆమె మోడలింగ్‌ బాధ్యతలు చూసుకునేందుకు ముందుకువచ్చింది. ఖౌదియా ఇప్పుడో సెలబ్రెటీ! ప్యారిస్‌, న్యూయార్క్‌ ఫ్యాషన్‌ ప్రపంచంలో ఆమె పేరు విననివారు ఉండరు. ఖౌదియా ఇన్‌స్టాగ్రాం అకౌంటుని తెరవగానే దాదాపు మూడులక్షల మంది ఆమెను అనుసరించడం మొదలుపెట్టారంటేనే అర్థం చేసుకోవచ్చు... ఆమె విజయం ఏ స్థాయికి చేరుకుందో!       ఖౌదియా ఏదో అనుకోకుండా ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టలేదు- ‘ఆడవాళ్లు నలుపు రంగులో ఉన్నప్పటికీ, వాళ్ల కలలన్నింటినీ నిజం చేసుకోవచ్చు అని నిరూపించేందుకే ఈ రంగంలోకి అడుగుపెట్టానని’ అంటోంది. అంతేకాదు! ‘అందానికి నిర్వచనం ఇదీ అనీ... నువ్వు ఇలాగే కనిపించాలనీ చెప్పే అధికారం ఎవ్వరికీ లేద’ని ఖచ్చితంగా చెప్పేస్తోంది. మన అందం పట్ల విశ్వాసం ఉన్నంతవరకూ, బయటకి ఎలా కనిపించామన్నది ఎమాత్రం ముఖ్యం కాదన్నది ఖౌదియా వాదన. ఖౌదియా విజయం వేలాదిమంది నల్లజాతీయులకు ఓ ప్రేరణగా నిలుస్తోంది. కొందరైతే ఏకంగా ఆమెను అనుసరిస్తూ ఫ్యాషన్‌ ప్రపంచంలో అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు- ‘ఈ ఫ్యాషన్‌ సామ్రాజ్యంలో చాలామంది నల్లజాతీయులకు చోటు ఉంది,’ అంటూ వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది ఖౌదియా. -నిర్జర.  

పనులు పెండింగ్ లో పడుతున్నాయా..     చెయ్యాలనుకునే పనుల లిస్టు పెరుగుతూ మీకు టెన్షన్ తెచ్చిపెడుతోందా. అయితే కొన్ని కిటుకులు పాటిస్తే చాలు,పనులన్నీ చకచకా అయిపోయి మీ టెన్షన్ ని దూరం చేస్తాయి. దీనికోసం ముందుగా మనం చెయ్యాలనుకున్న పనుల జాబితా మన బుర్రలో కాకుండా ఒక పేపరుపై పెట్టి వరుసగా రాసుకోండి. అందులో ఇంటికి సంభందించిన పనులన్నీ ఒక వైపు,బయటకెళ్ళి చెయ్యాల్సినవి మరో వైపు, అలాగే ఇంట్లో వాళ్ళ సహాయంతో చేసేవి ఇంకోవైపు చక్కగా డివైడ్ చేసి పెట్టుకోండి. ఇలా డివైడ్ చేసుకోవటం వల్ల మనం చెయ్యాల్సిన పనులపట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది.       ఇంట్లో చెయ్యాల్సిన పనులలో దేనికి ఎక్కువ ప్రిఫెరెన్సు ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద ముందుగా దృష్టి పెట్టండి. ఇలా మన ప్రిఫెరేన్సు కి అనుగుణంగా పనుల లిస్టులో కాస్త మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల పనులు తొందరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అన్ని పనులని ఒకేసారి తలచుకోవటం వల్ల వచ్చే అలజడి తగ్గి మనకు తెలియకుండానే పనులు చకచకా అయిపోతాయి. ఇక బయట చెయ్యాల్సిన పనుల లిస్టులో కూడా ఆ పనుల కోసం వెళ్ళాల్సిన ప్లేస్ పేరు పక్కన రాసుకోండి. ఎక్కువగా ఏ ప్లేస్ కి వెళితే చాలా  పనులు పూర్తి చెయ్యచ్చో మనకి క్లియర్ గా అర్ధమవుతుంది. దానికి తగ్గట్టుగా వెళితే మన లిస్టులో పనులూ తగ్గుతాయి. మీకున్న పనులకి ఇంట్లో వాళ్ళ సాయం కూడా తోడయితే ఇంకా హాయి కదా. మొహమాటం పక్కన పెట్టి కాస్త ఆప్యాయంగా అడిగి చూడండి. చేసే పనులు ఎన్ని ఉండి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా వెళితే కొండంత పనయినా చిటికెలో చేసి చూపించే సత్తా మీ సొంతమవుతుంది.   ..కళ్యాణి 

కాళ్లు,చేతులు లేకపోతేనేం... కలలున్నాయిగా!   జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితీ కలిసిరాకపోతే తెగ బెంగపడిపోతాం. ఇక ఏదన్నా వైకల్యం ఉందా ఇక చెప్పనే అక్కర్లేదు. అలాంటి పుట్టినప్పటి నుంచి కాళ్లూ, చేతులూ లేని మనిషి ఓ గొప్ప చిత్రకారిణిగా రూపొందడం ఎంత ప్రేరణని ఇస్తుందో కదా! అలాంటి ప్రేరణని అందించే కథే అను జైన్‌ది. ఖరగ్‌పూర్‌కి చెందిన అను జైన్‌ని పుట్టుక నుంచే దురదృష్టం వెన్నాడింది. ఆమెకు మోకాళ్ల నుంచి కాళ్లు లేవు. మోచేతుల నుంచి చేతులూ లేవు. అయినా ఉన్న అవయవాలతోనే తన రోజువారీ పనులను చకచకా చేసేసుకునేది అను. దానికి తోడు అనుకి కావల్సినంత స్థైర్యాన్ని అందించే కుటుంబం ఎలాగూ ఉండేది. అందుకని అను ఏ రోజూ తను బలహీనురాలని అనుకోలేదు. తన జీవితంలో ఏదో లోటు ఉందని అంగీకరించలేదు. ఒక రోజు అను వాళ్లమ్మ అనుకి పెయింట్లూ, బష్షులూ అందించింది. ఇక అంతే! మిగతావారితో కలిసి జీవితంలో దూసుకుపోయేందుకు ఆమెకో మార్గం కనిపించింది. అనుకి గులాబీలు అంటే చాలా ఇష్టం. అలా మొట్టమొదటి మంచిమంచి రంగురంగుల గులాబీలు గీయడం మొదలుపెట్టింది.   రోజులు గడిచేకొద్దీ అను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నంతా తనదైన శైలిలో కాన్వాసు మీద చిత్రించడం మొదలుపెట్టింది. అలాగని ఆమెవి ఏదో సాదాసీతా చిత్రాల్లాగా కనిపించవు. ఆధునిక కళాఖండాలకు ఏమాత్రం తీసిపోనట్లుగా ఆమె చిత్రాలు ఉంటాయి. ఎందకంటే అను ఏదో కాలక్షేపం కోసం గీసిన చిత్రాలు కావవి. తనలోని చిత్రకళను మెరుగుపర్చుకునేందుకు ఆమె చండీఘడ్‌లోని ప్రాచీన కళా కేంద్రం నుంచి ఏడేళ్లుగా చిత్రకళలో మెలకువలు నేర్చుకుంటున్నారు కూడా. కేవలం చిత్రకళే కాదు... ఖరగ్‌పూర్‌లో తనలాంటివారి అవసరాలకు అనుగుణమైన పాఠశాల లేకపోయినప్పటికీ, తండ్రి సాయంతో, కంప్యూటర్ తోడుగా హైస్కూలు స్థాయి విద్యను కూడా నేర్చుకుంది.   అనుకి ఇప్పుడు 32 ఏళ్ల వయసు. తన వయసువారికి ఉండే అచ్చటా ముచ్చటా అనుకి లేకపోలేదు. కానీ ఆమె జీవితం హాయిగా, తృప్తిగా సాగిపోతోంది. తండ్రి రిటైరైన తరువాత ఇప్పుడా కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. బెంగళూరులోనూ అను ప్రభకేం లోటురాలేదు. ఈ మధ్యే అక్కడి భారతీయ విద్యాభవన్‌లో తన చిత్రకళను ప్రదర్శించారు అను. పెన్సిల్ దగ్గర్నుంచీ వాటర్‌ కలర్స్‌ దాకా... గ్లాస్‌ మొదల్కొని ఫ్యాబ్రిక్‌ దాకా ఏ మాధ్యమంలో అయినా, ఏ పరికరం మీద అయినా అను కళాఖండాన్ని తీర్చిదిద్దేస్తుంది. అను తన ఇంటి చుట్టూ ఉన్న పిల్లలందరినీ చేరదీసి చిత్రకళలో మెలకువలు కూడా నేర్పేస్తోంది.     కేవలం చిత్రకళే కాదు! ఫొటోలు, సంగీతం, కవిత్వం... చెప్పుకుంటూ పోతే అనుకి చాలా రంగాల్లో ప్రవేశం ఉంది. అను పియానోని అద్భుతంగా వాయిస్తుంది. టెర్రకోటాతో బొమ్మలు చేస్తుంది. తీరిక సమయాలలో పిల్లలతో ఆడుతుంది. మనసు బాగున్నప్పుడో, బాగోలేనప్పుడో గొంతు సవరించుకుని పాడుతుంది. ఇంతకీ అను తనకంటూ గుర్తింపుని సాధించడానికి కారణం ఏంటి? అన్న ప్రశ్నలోనే జవాబు ఉంది. తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చాటుకోవడం కోసమే ఇదంతా సాధించగలిగానని అంటోంది అను. పైగా తన సాధనలో ఏమంత కష్టం తోచలేదని చెప్పుకొస్తోంది. మనం ఏ పనిలో అయితే సంతోషాన్ని పొందుతామో, ఆ పని చివరికి ఒక అందమైన ఫలితాన్ని ఇస్తుందంటోంది అను. ఇంక అంతకు మించి చెప్పేదేముంది. - నిర్జర.  

వంటింటి చిట్కాలు.. మీకోసం...    వంట చేసేటపుడు చాల జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కాస్త అటు ఇటు అయినా ఆ వంట రుచే మారిపోతుంది. కానీ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎలాంటి టెన్షన్ ఉండదు..    * వండిన కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి అందులో కాస్త బియ్యం పిండి కలిపితే సరిపోతుంది.   * చపాతీలు వేడిగా ఉన్నపుడు మాత్రమే మెత్తగా ఉంటున్నాయి, కాసేపు అవగానే గట్టిగ అప్పడాలు లాగా అయిపోతున్నాయి. అనుకున్నవాళ్ళు చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో కొంచెం పాలు పోసి కలపాలి, ఇంకా చపాతీలు ఒత్తేటపుడు కాస్త నూనె రాసి మళ్లీ ఒత్తుకుంటే అపుడు చపాతీలు చాలా సాఫ్ట్ గ ఉంటాయి, ఇంకా ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి.   * అన్నం వండేటప్పుడు అందులో కొంచెం నూనె వేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుంది.   * అల్లం చాయ్ అంటే అందరు ఇష్టపడతారు, మరి అల్లం రోజు దంచి వేయకుండా ఈ చిన్న టిప్ పాటిస్తే చాలు.. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటపుడు అల్లాన్ని బాగా శుభ్రం చేసి అపుడు పొట్టు తీస్తాం కదా దాన్ని పడేయకుండా కాసేపు ఎండలో పెట్టి ఆరిన తర్వాత ఒక డబ్బా లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎపుడు కావాలంటే అప్పుడు చాయి లో వేస్కొవచ్చు.   * వెండి వస్తువులు మెరుస్తూ ఉంటేనే బాగుంటుంది, కాస్త నల్లబడినా కూడా అవి వేసుకోవడానికి ఇష్టపడం, అందుకే వెండి వస్తువుల్ని టూత్ పేస్ట్ తో శుభ్రపరిస్తే కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి.  

ఆఫీస్ లవ్ బర్డ్స్ ఈ పనులు చేస్తే తంటాలు తప్పువు!   ఇప్పటికీ ఇండియాలో వెస్టన్ కల్చర్ అంటే ముఖం చిట్లిస్తారు.పాశ్చాత్య సంస్కృతి అంటే బూతు పదం అన్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇస్తారు. కాని,ఫ్యాక్ట్ ఏంటంటే వద్దు వద్దంటూనే మన వాళ్లు ఎప్పుడో అమెరికనైజ్ అయిపోయారు. మన సినిమాల్లో హీరోయిన్స్ కన్నాంబ నుంచీ కత్రీనా కైఫ్ దాకా ఛేంజ్ అవుతూ వచ్చారు. అలాగే మన సమాజం కూడా మారిపోతూ వస్తోంది. ఇది మంచికా చెడుకా అనేది పెద్ద చర్చ.కాని,దాన్ని మనం ఎదుర్కోక తప్పదు. మనల్ని మనం అడ్జెస్ట్ అండ్ అప్డేట్ చేసుకోక తప్పదు. మన దేశంలో పెరిగిపోయిన వెస్టన్ కల్చర్ లో భాగంగా ఇప్పుడు రిలేషన్ షిప్సు,బ్రకప్స్  కూడా మామూలైపోయాయి. ఉద్యోగం చేసినంత కామన్ గా ఆఫీసుల్లో రొమాన్స్ లు కూడా నడిపించేస్తున్నారు యూత్.అందులో సీరియస్ ప్రేమలు ఎన్ని,సరదాగా కొనసాగించేవి ఎన్ని అనేది ఎవ్వరికీ తెలియదు. కాని, కారణం ఏదైనా ఆపీస్ లో లవ్ స్టోరీ మొదలెడితే తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని వుంటాయి.మరీ ముఖ్యంగా, అమ్మాయిలు పాటించాల్సిన సూత్రాలేవో ఇప్పుడు చూద్దాం...  లవ్వర్స్ ఇద్దరూ ఆఫీస్ లో ఒకే దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు పనిని,ప్రేమని అస్సలు కలవనివ్వద్దు. ఇది చెప్పినంత ఈజీకాకున్నా ప్రేమ, దాని వల్ల పుట్టే భావోద్వేగాలు పనిని ప్రభావితం చేస్తే అనేక ఇబ్బందులు మొదలవుతాయి.దీర్ఘకాలంలో అనేక చికాకులకు దారి తీస్తుంది. ఇక మరో ముఖ్య విషయం,మీ రిలేషన్ షిప్ ని పది మందికి తెలిసేలా ప్రవర్తించకండి. ప్రేమలో వున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ సంగతి లోకమంతా తెలిసిపోతుంటుంది. అందుకు, ప్రేమలో మునిగితేలుతున్న లవ్ బర్డ్స్ బిహేవియరే కారణం. కాబట్టి సాధ్యమైనంత వరకూ మీ బంధాన్ని పర్సనల్ గా వుంచటానికీ ప్రయత్నించండి. దీని వల్ల అందరి దృష్టీ మీ మీద అనవసరంగా పడకుండా వుంటుంది.  ఈ మధ్య అగ్ని సాక్షిగా చేసుకున్న పెళ్లిల్లే కోర్టులు,జడ్జీల సాక్షిగా పెటాకులైపోతున్నాయి. మరి ఆఫీస్ లో మొదలైన అట్రాక్షన్స్ శాశ్వతంగా వుంటాయా? వుండే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకే, మీరు మీ పార్టనర్ తో బ్రేకప్ కు సిద్ధమైతే గౌరవంగా, గంభీరంగా విడిపోండి. అంతే తప్ప ఎంత ఎక్కువగా గొడవలు పడి విడిపోతే అంత ఇబ్బందిగా వుంటుంది. తరువాతి పరిస్థితి!బ్రేకప్ తరువాత ప్రతీ రోజూ ఆఫీస్ లో మీరు ఒకర్నొకరు చూసుకుంటూ పని చేయాల్సి వుంటుందని మరిచిపోకండి. ఆఫీస్ లో ఒక జాబ్ చేస్తున్నప్పుడు సహజంగానే కొన్ని అధికారాలు లభిస్తూ వుంటాయి. వాట్ని ఎప్పుడూ ప్రేమ కోసం,ప్రియుడి కోసం ఉపయోగించకండి. అలా చేస్తే ఏనాటికైనా ఆఫీస్ లోని మిగతా వారంతా చెవులు కొరుక్కోవటం మొదలెడతారు. సాధారణంగా ఒక స్త్రీ తనకంటే పై స్థాయిలో వున్న వ్యక్తితో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తే ఆమెకు లభించే ప్రయోషన్, అప్ రైజల్ అన్నీ అతడి చలువే అనటం జనాల బలహీనత.ఇది జరగకూడదంటే జాబ్ ని ఎంత క్రమశిక్షణతో చేస్తే అంత మంచిది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే... రొమాంటిక్ రిలేషన్ షిప్స్ అన్నాక ఫిజికల్ అట్రాక్షన్ సహజంగానే వుంటుంది. కాని, దాన్ని అదుపులో వుంచుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఆఫీస్ లో వున్న కొలీగ్ తో సంబంధం వున్నంత మాత్రాన ఆఫీస్ పరిసరాల్లో హాట్ రొమాన్స్ అస్సలు మంచిది కాదు. మగవారికన్నా ఇది ఆడవారికే ఎక్కువ ఇబ్బంది, అపవాదు తెస్తుంది.కాబట్టి,ముద్దు మురిపెం అన్నీ ఆఫీస్ టైమింగ్స్ అయ్యాక ఆఫీస్ కి ఆవలే...   

Home Remedies to Get rid of Unwanted Facial Hair     One of the main reasons why women have to face the issue of unwanted hair is, there is a hormone called androgen, males produce high levels of these hormones, if the levels of these hormones increases in women, unwanted hair start to grow and the condition is called “Hirsutism”. Usually Polycystic Ovarian Syndrome is the major cause of Hirsutism. Hirsutism can also be hereditary. Sometimes use of certain medicines can also cause facial hair to grow. Here we bring you some amazing an effective home remedies to get rid of that troublesome unwanted hair. Though there are numerous options available in the market to get a silky smooth skin, like waxing, threading, laser etc, there are certain home remedies that work wonders. It rather saves you the visit to the parlor every time you need to get rid of your upper lip hair in the middle of your super busy schedule.   Turmeric powder:  Turmeric powder has often been used as an ingredient in beauty products. It cleanses your skin, beautifies it and ensures that you glow all the time. Milk is also beneficial for your skin. The combination of these two can help in removing upper lip hair naturally. This is how you should go about it. Take one tablespoon of turmeric and milk each and mix them in a bowl. Once the mixture is prepared, apply it gently to your upper lip using your fingers. Wait till it dries, after which you can rub it off your skin. Wash off with cold water.   Besan or Chickpea flour: Besan or Chickpea flour is widely available in the market. It is used to exfoliate the skin and remove dead skin cells along with unwanted hair. This is widely used options by a lot of women to get rid of unwanted hair. For this Mix 1 tablespoon of chickpea flour with 1 quarter teaspoon of turmeric powder. Next, add enough milk so that it forms a thick paste. Mix the three ingredients well. Apply the thick paste on your skin using clean fingers. Let the paste sit on your skin for 15 minutes. Use your fingers or a wet washcloth to gently scrub your skin. Rinse with cold water.   Egg Whites: Egg whites are another good remedy for upper lip hair. It soothes your skin and ensures great results. Take one egg white and mix it with some corn flour and sugar. Whisk the mix until it forms a sticky paste. Now apply the paste on the upper lip region. Let it dry for around 30 minutes and peel it off. For best results, repeat this therapy twice in a week. Within a month, you will notice that the hair growth has considerably reduced.   Sugar and Lemon:  Sugar is used as a natural exfoliator; it helps clear the skin by removing the dead skin cells. Lemon works to brighten the skin, it also helps remove dirt and oil. These two ingredients when combined together form the perfect home remedy used to remove facial hair. For this add 2 tablespoons of sugar in a bowl with little quantity of water. Squeeze in the juice of a lemon. Mix until well combined. Apply this sugar and lemon mixture on your face. Let it sit on the skin for 15 minutes. Wash your face with cold water. You need to be a little cautious as the lemon juice might irritate your skin.   Besan, Yogurt and Turmeric: Yoghurt, besan and turmeric can be combined to form a smooth mixture. Take equal amounts of yoghurt, besan and turmeric in a bowl. Mix it well and massage the upper lip with this paste. Wait for 15-20 minutes. Rub it off. Wash with cold water.   ...Divya

విధికి ఎదురు నిలిచిన... ఓ సెల్వి కథ     ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కోట్లమంది ఆడపిల్లలకు 18 ఏళ్లలోపు వయసులోనే పెళ్లి జరిగిపోతోంది. అందులో మూడోవంతు బాల్య వివాహాలు మన దేశంలో జరుగుతున్నట్లు అంచనా. ఆడపిల్లలను గుండెల మీద కుంపటిలాగా భావించేసి, వారిని ఎలాగైనా వదిలించేసుకోవాలనుకునే తల్లిదండ్రుల ఆలోచనలకు ఇది ప్రతిఫలం కావచ్చు. కానీ అలా వదిలించుకున్న తరువాత ఆ పిల్లల పరిస్థితి నిజంగానే కుంపట్లపాలవ్వడం విషాదకరం. అత్తింతి ఆరళ్ల దగ్గర్నుంచీ అనారోగ్య సమస్యల వరకూ వీరి జీవితం ఓ నరకంగా మారిపోతోంది. అలాంటి నరకం నుంచి బయటపడే ప్రయత్నం చేసిన ఓ సెల్వి కథే ఇది.     బాల్యవివాహంతో మొదలు కర్ణాటకకు చెందిన సెల్వికి 14వ ఏటే పెళ్లి జరిగిపోయింది. మొగుడు మహా దుర్మార్గుడు! తిట్టడం, కొట్టడం, అదనపు కట్నం కోసం వేధించడంలాంటి అవలక్షణాలతో పాటుగా... సెల్వితో వ్యభిచారం చేయించి పబ్బం గడుపుకొనేవాడు. అలాంటి భర్తతో కలిసి జీవించడంకంటే ఈ లోకం నుంచి నిష్క్రమించడం మేలనుకుంది సెల్వి. ‘‘కానీ అలా చేస్తే నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఉండదు కదా! అందుకనే నేను పారిపోయాను’’ అంటుంది సెల్వి.     ఆశ్రయం లభించినా సెల్వి తన భర్త నుంచి పారిపోయాక అటుతిరిగీ ఇటుతిరిగీ మైసూరులోని ‘ఒడనాడి’ అనే స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం తీసుకుంది. వ్యభిచార వృత్తిలో చిక్కుకున్న మహిళలకు ఆ సంస్థ ఆశ్రయం కల్పిస్తూ ఉండేది. జీవితంలో అన్నేసి కష్టాలు పడిన సెల్వికి నిజంగానే అది ఒక ఊరట. కానీ తను అక్కడితో ఊరుకోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలని అనుకొంది. అదే సమయంలో తన ప్రత్యేకతని చాటుకోవాలని అనుకుంది. అలా సెల్వికి కారు డ్రైవింగ్ మీద మనసైంది. సెల్వికి సంస్థ అధికారులు తోడుగా నిలవడంతో ఆమె టాక్సీ డ్రైవరుగా జీవనం మొదలుపెట్టింది. కొన్ని పత్రికల ప్రకారం ఆమె దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళా టాక్సీ డ్రైవర్‌!     అయినా ఆగలేదు సైకిల్‌ కూడా తొక్కడం రాని సెల్వి టాక్సీ డ్రైవర్‌గా నిలదొక్కుకుంది. మగవాళ్లకే పరిమితం అనుకునే రంగంలో.... అనుమానపు చూపులనీ, ఆకతాయి ప్రశ్నలనీ దాటుకుని సత్తా చాటుకుంది. కానీ ఆమె అక్కడ కూడా ఆగలేదు. ప్రస్తుతం మహిళా డ్రైవర్లు మాత్రమే ఉండే ఒక టాక్సీ సంస్థకి యజమానురాలిగా మారింది. సెల్వి వ్యక్తిత్వాన్ని చూసి మనసుపడిన విజీ అనే తోటి డ్రైవర్‌ని వివాహం చేసుకుంది. వారికిప్పుడు ఇద్దరు పిల్లలు.     డ్రైవింగ్‌ విత్‌ సెల్వి 2004లో సెల్వి ఆశ్రయం తీసుకొంటున్న సంస్థని చూసేందుకు కెనడాకి చెందిన ఒక పర్యటకురాలు వచ్చారు. ఆమె పేరు ‘ఎలిసా పొలాస్చి’. ఎలిసా ఏదో సరదాగా సెల్వి గురించి అప్పట్లో వీడియో తీసుకుని కెనడాకు వెళ్లిపోయింది. కానీ కొన్నాళ్ల తరువాత ఇండియాకి మళ్లీ వచ్చిన ఎలిసా, సెల్వీ సాధిస్తున్న విజయాలను గమనించింది. దాంతో గత 11 సంవత్సరాలుగా ఆమె సెల్వీ జీవితాన్ని వీడియోల ద్వారా రికార్డు చేస్తూ వచ్చింది. వాటన్నింటినీ కలిపి గత ఏడాది ‘డ్రైవింగ్ విత్‌ సెల్వీ’ పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో చోటు సంపాదించుకుంది. ఆ డాక్యుమెంటరీతో పాటుగా సెల్వి పేరు కూడా మారుమోగిపోతోంది. స్త్రీలకు సంబంధించిన అనేక సెమినార్లలో పాల్గొనాలంటూ సెల్వీకి అనేక ఆహ్వానాలు అందుతున్నాయి. కర్ణాటకలోని వాడవాడలా సెల్వితో కలిసి స్త్రీల హక్కుల గురించి ప్రచారం చేయాలని స్వచ్ఛంద సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.   సెల్వి సాధించిన విజయం ఏదో అయాచితంగా లభించినది కాదు. దాని వెనుక దాచలేని కష్టాలున్నాయి, మర్చిపోలేనంత శ్రమ ఉంది. కానీ ఇంత దూరం వచ్చిన తరువాత సెల్వి తన తోటివారందరికీ చెప్పే మాట ఒక్కటే- ‘‘కష్టాల్లో ఉన్న మనల్ని ఆదుకునేందుకు అన్నో, అమ్మో వస్తారనుకుని ఎదరుచూస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు. మనకోసం మనం ఏం చేయగలమో ఆలోచించాలి. మనం ఏం సాధించగలమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత మనమే అడుగు ముందుకు వేయాలి!’’ సెల్వి చెబుతున్న మాటలు వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నాయో కదా! ఆ మాటల వెనుక ఆమె జీవితమే ఉందయ్యే...   - నిర్జర.  

  అమ్మతో కాసేపు   గోరుముద్దలు - గోరింటాకులు, పాల బుగ్గలు - పట్టుపావడాలు, చందమామ కథలు - చద్దిఅన్నాలు ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ మనకిచ్చే తీపి జ్ఞాపకాలు ఎన్నో లెక్కకి కూడా అందవు. మనసు వాకిటిని తడితే చాలు దొర్లుకుంటూ వచ్చే తల్లి తలపులకు ఆనకట్ట వెయ్యటం కొంచెం కష్టమే. స్కూల్ నుంచి వచ్చాకా అక్కడ జరిగినవన్నీ అమ్మకి చెప్పకపోతే  నిద్ర పట్టదు. మనం సైకిల్ తొక్కినా అమ్మ చూడాలి, చెట్టెక్కి గెంతాలన్నా అమ్మే చూడాలి. మొత్తానికి మనం ఏం చేసినా అమ్మ పక్కనే ఉండాలి. మనతో ఇంతలా అల్లుకుపోయిన అమ్మని విడిచి దూరంగా వెళ్ళాల్సి వస్తే మన ప్రాణాలని ఎవరో తెలియకుండా లాగేసుకుంటునట్టు ఉండదూ. ఎన్నేళ్ళు వచ్చినా మనం ఇంకొకరికి అమ్మ అయినా మన అమ్మ మీదున్న ప్రేమ ఇసుమంతైనా తగ్గదు.   పెద్ద చదువులకి వెళ్ళాకా పెద్ద ఉద్యోగాలు వచ్చాకా అమ్మతో గడిపే సమయం కరువవుతుంటే ఏం చేయటం. నిజంగానే మీకు అమ్మతో కాసేపు గడపి ఆమెని సంతోషంగా ఉంచాలంటే  ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూద్దామా.   అమ్మకి ఇష్టమైన కాఫీని ఆమె లేచే లోపే తయారుచేసి రెడీగా ఉంచితే? లేవగానే ఒక చిరునవ్వుతో కాఫీని అందించి చూడండి. తనకోసం ఎవరెస్ట్ శిఖరాన్ని గుమ్మం ముందు తెచ్చి ఉంచితే ఎంత ఆశ్చర్యపోతుందో అంత ఆశ్చర్యాన్ని, దాని వెనక ఆనందాన్ని అమ్మ కళ్ళల్లో చూడచ్చు.     అలాగే తనకిష్టమైన ప్లేస్ ఏముందో తెలుసుకుని ఆ ప్లేస్ కి సడన్ గా తీసుకెళ్ళి ఆమె కళ్ళల్లోకి తొంగి చూడండి. ఆ రోజంతా అమ్మని అంటిపెట్టుకుని ఉండి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బయటనే చేసి ఇంటికి తిరిగి రండి. అంతలా తిరిగి వచ్చినా అమ్మ కళ్ళల్లో కనిపించని నీరసాన్ని చూసి మీకు నీరసం రావాలి.   అమ్మకిష్టమైన వ్యక్తులని ఇంటికి పిలిచి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసి ఆమెకి ఆనందాన్ని ఇవ్వచ్చు. ఎప్పుడూ మన పనులతో బిజీగా ఉండే ఆవిడ తనకిష్టమైన వాళ్ళతో గడిపుతూ ఎలా సేద తీరుతుందో మీ కళ్ళతో మీరే చూడచ్చు.   ఒక మంచి ఫోటో ఆల్బం కొని  అమ్మకి సంబందించిన అన్నీ ఫొటోస్ పెట్టి  దాన్ని గిఫ్ట్ గా ఇవ్వచ్చు. తనే మరిచిపోయిన ప్రపంచాన్ని తన కళ్ళ ముందు పరవచ్చు. ప్రతిక్షణం  మనకోసమే అలోచించి తన ఉనికినే మర్చిపోయే అమ్మకి ఆనందాన్ని గుర్తుచేద్దాం.   ఇలా ఒక రోజు అమ్మని ఆనందంలో ముంచెత్తి మిగిలిన రోజుల్లో తన గురించి ఆలోచించకుండా ఉండటం మాత్రం ఎంతమాత్రం సబబు కాదు. నిజంగా అమ్మంటే ప్రేముంటే ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచిద్దాం. ప్రతి క్షణం ఆమెని సంతోషంగా ఉంచుదాం.   కళ్యాణి

  ఆ మూడు రోజులూ!   ఆడవాళ్లను అన్నిటికంటే ఇబ్బంది పెట్టే సమస్య... నెలసరి. నెల నెలా వచ్చే ఈ ఇబ్బందిని భరించడం అంత తేలికేమీ కాదు. కడుపునొప్పి, కాళ్లు లాగడం, వికారం, విసుగు... ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఆ సమయంలో ఎన్నో రకాల సమస్యలు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, కొన్ని నియమాలు పాటిస్తూ ఆ మూడు రోజుల్నీ మూడు క్షణాల్లా గడిపేయవచ్చంటున్నారు నిపుణులు. దానికేం చేయాలంటే...   చాలామంది కడుపు నొప్పిగా ఉందనో, విసుగ్గా ఉందనో భోజనం సరిగ్గా చేయరు. ఏదో కాస్త తినేసి ఊరుకుంటారు. అది చాలా తప్పు. రక్తస్రావం వల్ల శరీరంలోని శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. కాబట్టి సమయానుకూలంగా తగిన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే వీలైనంతవరకూ కష్టతరమైన పనులు చేయకూడదు. బరువులు ఎత్తడం లాంటివి చేయడం వల్ల కడుపు, నడుము నొప్పులు ఎక్కవవుతాయి. శానిటరీ న్యాప్ కిన్ ని తరచూ మార్చుకుంటూ ఉంటే చిరాకు ఉండదు. కొందరు రోజంతా ఒక్కటే న్యాప్ కిన్ తో నెట్టుకొచ్చేస్తుంటారు. దానివల్ల మనకు తెలియకుండా కాస్తంత చిరాకు ఉంటుంది. అది లేకుండా ఉండాలంటే రెండు మూడుసార్లు న్యాప్ కిన్ మార్చుకోవాలి. రక్తస్రావం అవుతోంది కదా అని జననాంగాలను పదే పదే శుభ్రం చేసుకోవడం కూడా పొరపాటే. అక్కడ మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మితిమీరి శుభ్రం చేయడం వల్ల అది పోతుంది. అంతేకాదు... ఈ సమయంలో వీలైనంత వరకూ శృంగారానికి దూరంగా ఉండాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు రావడమే కాదు... కడుపు, నడుము నొప్పి తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది.   బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే... మనసుకు నచ్చే పనులు చేయాలి. ఎందుకంటే నెలసరి సమయంలో మానసికంగా కూడా కొన్ని తేడాలు వస్తుంటాయి. అందుకే నచ్చని పనులు చేస్తే విసుగు, కోపం, ఒత్తిడి వంటివి కలుగుతాయి. దానికి అవకాశం లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయాలి. మ్యూజిక్ వినడం లాంటి హాయిపర్చే ఇష్టాలకు సమయం కేటాయించండి. అలాగే ఏది పడితే అది తినేయకూడదు. ఈ సమయంలో వీలైనంత వరకూ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. నూనె, కారం, మసాలాల జోలికి పోవద్దు. లైట్ ఫుడ్ తీసుకుంటేనే అంతా పీరియడ్స్ ఇబ్బందుల్ని కూడా లైట్ గా తీసుకోగలం.   ఇప్పటివరకూ మీరు కనుక ఈ కేర్ తీసుకుని ఉండకపోతే ఇప్పుడు తీసుకుని చూడండి. కచ్చితంగా తేడాను గమనిస్తారు. ఎప్పడూ ఇబ్బందిగా ఫీలయ్యే ఆ మూడు రోజులూ ఈసారి ఎప్పుడు గడిచిపోయాయో తెలియనంతగా రిలీఫ్ ఫీలవుతారు. ట్రై చేయండి. - Sameera

అన్ని పనులూ ఒకేసారి - ఆడవారికే సాధ్యం!   ప్రపంచం మారిపోతోంది. ఆ ప్రపంచంతో పాటు మన జీవనశైలీ మారిపోతోంది. మగవారి సంగతేమో కానీ... ఆడవారు  ఇంటాబయటా తామేంటో నిరూపించుకుంటున్నారు. అయితే ఇలా అన్ని రంగాలలోనూ నెగ్గుకురావడం ఆడవారికి వెన్నతో పెట్టిన విద్య అని రుజువు చేస్తోంది ఓ పరిశోధన. మల్టీ టాస్కింగ్: ఒకేసారి వేర్వేరు పనులు చేయగలగడాన్ని మనం మల్టీ టాస్కింగ్ అంటాము. ఉరుకుల పరుగుల జీవితంలో ఈ మల్టీ టాస్కింగ్‌లో నిష్ణాతులు అయితే కానీ ముందుకు సాగలేని పరిస్థితి. ఇక మహిళల జీవితంలో అయితే ఈ మల్టీ టాస్కింగ్‌ తప్పనిసరిగా మారిపోయింది. ఒక పక్క కూరలో తాలింపు వేశామో లేదో చూసుకోవాలి, మరోపక్క పిల్లల్ని బడికి సిద్ధం చేయాలి, ఇంకో పక్క ఇంటికి వచ్చేవారికి సమాధానం చెప్పుకోవాలి. ఇక తాము కూడా ఏదన్నా ఆఫీసులో పనిచేస్తుంటే, ఆ హడావుడి పరాకాష్టకి చేరుకుంటుంది. మొత్తానికి ఇంట్లోనే ఉండే గృహిణులైనా, ఆఫీసుల్లో పనిచేస్తున్న స్త్రీలైనా... మల్టీ టాస్కింగ్‌ మాత్రం తప్పనిసరిగా మారిపోయింది.   ఓ ప్రయోగం: మల్టీటాస్కింగ్ చేయడంలో మగవారికీ, ఆడవారికీ మధ్య ఏమన్నా తేడా ఉందేమో అన్న అనుమానం వచ్చింది కొందరు పరిశోధకులకి. రష్యాకి చెందిన సదరు పరిశోధకులు తమ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకుగాను ఓ 140 మంది అభ్యర్థులను ఎంచుకున్నారు. వీరిలో 69 మంది మగవారు కాగా, 71 మంది ఆడవారు. వీరిలో 20 నుంచి 65 ఏళ్లలోపు వయసు కలిగినవారు ఉన్నారు. వీరందరికీ కూడా ఒకేసారి వేర్వేరు పనులను పురమాయించారు పరిశోధకులు. ఉదాహరణకు ఒక చేత్తో వేర్వేరు ఆకారాలలో ఉన్న వస్తువులను వేరు చేస్తూ, మరో చేత్తో వేరు వేరు అంకెలని వరుసక్రమంలో ఉంచమన్నారు.   ఫలితం! అభ్యర్థులు మల్టీటాస్కింగ్‌ చేస్తున్న సమయంలో వారి మెదడు ఎలా పనిచేస్తోందో తెలుసుకొనేందుకు MRI పరీక్షలు చేసి చూశారు. దీంతో మల్టీటాస్కింగ్ చేసే సమయంలో మగవారి మెదడు ఆడవారి మెదడుకంటే ఎక్కువ శక్తిని వినియోగించుకోవడాన్ని గమనించారు. అంతేనా! వేర్వేరు పనులు ఒకేసారి చేయాల్సి వచ్చినప్పుడు, వారి మెదడులోని వేర్వేరు భాగాలన్నీ కలసి పనిచేయాల్సి వచ్చిందట. కానీ ఆడవారిలో మెదళ్లు మాత్రం ఎలాంటి హడావుడీ లేకుండా అతి తక్కువ సమయంలో, అతి తక్కువ శక్తిని ఉపయోగిస్తూ... వేర్వేరు పనులను నిర్వహించేశాయి. ఎప్పుడో 50 ఏళ్లు దాటిన తరువాతగానీ ఆడవారిలో మల్టీటాస్కింగ్‌ సామర్థ్యంలో తగ్గుదల కనిపించలేదు. ఆడవారిలో కనిపించిన ఈ ప్రత్యేకతకి కారణం ఏమిటన్నది మాత్రం పరిశోధకులకు అంతుపట్టలేదు. బహుశా ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఆడవారికి అప్రయత్నంగానే ఈ విద్య అబ్బి ఉంటుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే మనోనిబ్బరంతోనే ఇది సాధ్యపడి ఉంటుంది. కానీ ఒకేసారి ఇన్నేసి పనులు చేస్తున్నారు కదా అని... వారితో వీలైనంత చాకిరీ చేయించుకోవడమే విషాదకరం!   - నిర్జర.  

మార్నింగ్ సిక్‌నెస్‌ మంచిదే!   మాతృత్వం గొప్ప వరమే! కానీ అదో క్లిష్టమైన ప్రయాణం కూడా. తల్లిని కాబోతున్నానని తెలిసిన క్షణం నుంచి బిడ్డను ప్రసవించేదాకా, స్త్రీని రకరకాల సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో ‘మార్నింగ్‌ సిక్‌నెస్‌’ ఒకటి. అయితే ఈ మార్నింగ్‌ సిక్‌నెస్‌ విషయమై జరిగిన ఓ పరిశోధనతో... ఈ సమస్య వల్ల లాభమే కానీ నష్టం లేదని తెలుస్తోంది. ఈ వివరాలు ఇవీ... ఏమిటీ మార్నింగ్‌ సిక్‌నెస్‌! గర్భవతిగా ఉన్నప్పుడు వాంతులు, వికారంతో కూడిన ఇబ్బందినే మార్నింగ్‌ సిక్‌నెస్‌ అంటారు. ఈ సమస్య సాధారణంగా ఉదయం వేళల్లో మొదలై, రోజు గడిచేకొద్దీ సర్దుకుంటుంది కనుక ఆ పేరు వచ్చింది. గర్భవతులుగా ఉన్న స్త్రీలలో కనీసం 80 శాతం మందిలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనిని ఓ తప్పనిసరి పరిస్థితిగానే భావిస్తుంటారు.   ఇంతకీ ఈ మార్నింగ్‌ సిక్‌నెస్‌ ఎందుకు వస్తుందన్నదానిమీద ఇప్పటివరకూ ఓ స్పష్టత లేదు. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలోని హార్మోనులలో వచ్చే మార్పుల కారణంగానే మార్నింగ్ సిక్‌నెస్‌ వస్తుందని మాత్రం ఊహిస్తున్నారు. మార్నింగ్ సిక్‌నెస్‌ వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తనప్పటికీ... చిన్నా చితకా ఇబ్బందులు మాత్రం తప్పవు. మనసంతా అలజడిగా, పనులు చేసుకునేందుకు అడ్డంకిగా ఉండే ఈ సమస్య ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూడటం తప్ప మందులు కూడా అంతగా ఉపయోగం ఉండవు.   మంచిదేనట! మార్నింగ్‌ సిక్‌నెస్‌ వల్ల ఇబ్బందులు ఉన్నమాట నిజమే. మరి దీని వల్ల గర్భవతులకు ఏమన్నా మేలు జరుగుతోందా అని పరిశీలించే ప్రయత్నం చేశారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం గర్భం దాల్చిన ఓ 797 మందిని ఎన్నుకొన్నారు. వారందరినీ కూడా రెండో నెల మొదలుకొని ఎనిమిదో నెల వరకూ ఒక డైరీని రాస్తూ ఉండమన్నారు. అందులో తమ ఆరోగ్యం సమస్యలను నమోదు చేయమని సూచించారు.   పరిశోధన కోసం ఎన్నుకొన్న 797 మంది అభ్యర్థులలో దాదాపు 60 శాతం మంది మార్నింగ్‌ సిక్‌నెస్‌కు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొన్నారని తేలింది. ఆశ్చర్యకరంగా వీరిలో గర్భస్రావం మాత్రం చాలా తక్కువగా నమోదైంది. మార్నింగ్ సిక్‌నెస్‌ ఇబ్బంది పడని స్త్రీలతో పోల్చుకుంటే, ఆ సమస్యను ఎదుర్కొన్న గర్భవతులలో గర్భస్రావం అయ్యే ప్రమాదం దాదాపు 75 శాతం తక్కువ నమోదైంది.   ఇంతకీ మార్నింగ్‌ సిక్‌నెస్‌ రావడానికీ పిండం ఆరోగ్యంగా ఉండటానికీ కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు స్పష్టమైన జవాబు ఉందంటున్నారు పరిశోధకులు. గర్భవతులు తినే ఆహారంతో పాటుగా రకరకాల సూక్ష్మక్రిములు కూడా శరీరంలోకి ప్రవేశించవచ్చు. ఇవి గర్భస్థ శిశువుకి హాని చేసే ప్రమాదం లేకపోలేదు. ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మన శరీరం చేసే పోరాటంలో భాగంగా కలిగే ఇబ్బందే మార్నింగ్‌ సిక్‌నెస్‌. కాబట్టి ఇకమీదట మార్నింగ్‌ సిక్‌నెస్‌ వస్తే అదేదో వ్యాధి అనుకుని బెంబేలెత్తిపోవడం మానుకుని... కడుపులో శిశువు క్షేమంగా ఉండబోతోందని తృప్తి చెందాలన్న మాట!   - నిర్జర.

  గ్రీన్ కాఫీతో బరువు తగ్గడం ఖాయం!     ఆరోగ్యానికి గ్రీన్ టీ మంచిదని మనకి తెలిసిందే. మరి గ్రీన్ కాఫీ గురించి ఎంతమందికి తెలుసు? ఇంకా చాలామందికి తెలియదు. ఎందుకంటే దీని వాడకం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. రోస్ట్ చేయని కాఫీ గింజల్ని నానబెట్టి, వాటి నుంచి ఎక్స్ ట్రాక్ట్ చేసేదే గ్రీన్ కాఫీ. దీనిలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ ను బాగా కరిగిస్తుంది. అంతేకాదు... ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా మెరుగు పరుస్తుందట.   దానివల్ల చక్కెర వ్యాధి వచ్చే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగు చేస్తుంది. డీటాక్సిఫికేషన్ కి ఉపయోగపడుతుంది. ఆకలిని కూడా అదుపు చేస్తుందట. తద్వారా ఫుడ్ తక్కువ తీసుకుంటాం కాబట్టి బరువు పెరిగే ప్రమాదం తగ్గిపోతుంది. ఇది మెదడును కూడా ఫ్రెష్ గా ఉంచుతుందట. కాబట్టి గ్రీన్ కాఫీని హ్యపీగా తాగేయమంటున్నారు వైద్యులు.     మార్కెట్లో గ్రీన్ కాఫీ మూడు రకాలుగా దొరుకుతోంది. పౌడర్ రూపంలో, డ్రై చేసి ఫ్రీజ్ చేసిన గింజలు, గ్రాన్యూల్స్... ఇలా మూడు రూపాల్లో లభ్యమవుతోంది. వీటితో దేన్ని వాడినా ఫర్వాలేదు. అయితే వీలైనంత వరకూ షుగర్ కానీ తేనె కానీ కలుపుకోకుండా తాగితేనే మంచిది.   మరింత ఉపయోగకరంగా ఉండటానికి పుదీనా ఆకులను కానీ, దాల్చినచెక్క కానీ, అల్లం కానీ వేసి మరిగించి తాగితే మరీ మంచిదట. కాస్త పసుపు కలిపి తాగినా కూడా చాలా మంచిదంటున్నారు. అయితే ఆహరం తిన్న వెంటనే మాత్రం ఎప్పుడూ తాగకూడదట.    రోజుకు ఓ మూడు కప్పులు గ్రీన్ కాఫీ తాగితే వెయిట్ లాస్ చాలా త్వరగా జరుగుతుందని, అంతకు మించి తాగకపోవడం మంచిదని కూడా సూచిస్తున్నారు. ఇంకెందుకాలస్యం... వెంటనే గ్రీన్ కాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి మరి! - Sameera