మా అమ్మా నేనూ నాకు అంతా బాగా గుర్తు లేదు కానీ ఆరోజు పెరట్లో కెళ్ళగానే కాకర పాదుకు పూసిన పసుపు పచ్చని పూలు చూసి , "అమ్మా! కాకరపూలు చూడవే భలే ఉన్నాయ్ పసుపురంగు " అంటూ పెద్దగా కేకేశాను. అమ్మ నవ్వుతూ నా కోసం పాల గ్లాసు పట్టు కుని వచ్చింది."ఇంకేం కావాల్సినన్ని కాకర కాయలు.నీకూ నాన్నగారికీనీ" అంటూ కాకరపుల కేసి చూసి, " తమాషా అన్నీ పిందె పూలే!" అంది. " అంటే !"అన్న నామాటలకు అర్ధం వివరించింది. పిందె ఉండి పూసేవి మాత్రమే కాయలవు తాయని, ఉత్తిపూలూ కాయలుకావనీనీ.అలా రోజూ ఆ కాకర పూలనూ, పిందెలనూ, కాయలనూ, చూస్తూ వాటి మీద మమకారం పెంచుకున్నట్లున్నాను. అమ్మ షుమారుగా మూడు వారాల తర్వాత చేసి నా కంచంలో పెట్టిన కాకరకాయ కాకరపు కాయ కూర లొట్ట లేసుకుంటూ తిన్నగుర్తుంది. అప్పుడు నాకు ఏడెని మిదేళ్ళుండవచ్చు.అలా కాకరకాయ కూరం టే నాకు ఇష్టం ఏర్పడింది. మా నాన్నగారికీ మా అమ్మ చేసే ఈ కూర చాలా ఇష్టం. ఆకూర తింటూంటే నాన్న గుర్తువచ్చేవారు. నాన్న హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. అలా ఆ ఆకూర మీద ఇష్టం తగ్గిపోయింది. ఇద్దరం కల్సి ఆ కూర తినే వాళ్ళం . మా అమ్మ కాకరకాయను చాలా విధాలుగా  చేసేది. కాయను  నాల్గుగా  చీల్చి గుత్తొంకాయలా  కారం పెట్టి  చేసేది . చిన్నముక్క లుగా చేసి బాగా  వేపి కరకర కాకర కూర చేసేది.ఉల్లికారం పెట్టి వేపేకూర మరొకటి. పండు కాకర కాయలతోనూ ఆమె కమ్మగా కూర చేసేవారు.మజ్జిగ పోసి ఉడికించి మసాలా వేసి చేసేకూర ఒకటి. అన్నిట్లోకీ నాకు, నాన్నగారికీ ఇష్టమైనది  కారపు కాకర కాయ కూర. చదువు ,పెళ్ళి, భర్త ,పిల్లలూ  నా సంసార సాగరంలో పడి ఈదుకోసాగాను. అమ్మతన ఇంట్లో వంటరిగా ఉండేది.నాకూ, మా వారికీ అదే టౌన్ లో ఉద్యోగాలు కావటాన అక్కడే స్వంత గూడొకటి కట్టుకుని ఉండేవారం. ఆరోజు ఇంట్లో కూరలు తగినన్నిలేక పిల్లలకు టమోటా కూర చేసి లంచ్ బాక్సుల్లో  పెట్టిచ్చాను. మావారికి ఉత్తి పప్పూ , చింత పండు పచ్చిపులుసు , ఆవకాయా, అప్పడం ఉంటే చాలు.స్కూల్ కు టైమవు తుందని గబ గబా వంట ముగించి బయల్దేరాను. నేను స్కూల్ కె ళ్ళాక H.M ని కావటాన  క్లాసులూ , ఆఫీస్ వర్కూ, నెలాఖరు కనుక పంపాల్సిన  పేబిల్స్ , క్లర్క్ తో పూర్తి చేయించి చెక్ చేసుకుని , పంపేసరికి స్కూల్ టైమై అంతా లంచ్ కెళ్ళిపోయారు .మార్చి ఎండ మండుతున్నది. గొడుగేసుకుని  పదడు లేశానో లేదో స్టూడెంట్  ఒకడు పరుగు పరుగున వచ్చి నాచేతికి ఒక చిన్న క్యారీబ్యాగ్ ఇచ్చాడు. " ఏంటిరా ఇది?" అని అడుగు తుండగానే , వాడు స్కూల్ గేటు వైపు చూపాడు. అక్కడ ఎండలో చెపటలు కక్కుతూ ,ఆయాస  పడుతూ అమ్మ  నిల్చుని ఉంది. నేను వెనక్కు వచ్చి "ఏంటమ్మా! ఇది? ఇంత ఎండ లో వచ్చావ్?" అని అడిగాను. "మన పెరట్లో కాచిన కాకరకాయలు, నీకు ఇష్టమని కారపు కాయ చేసి తెచ్చాను" అంది. అమ్మ ఇంట్లో పెద్దపెరడు, జామ, సపోటా, మూడు మామిడి చెట్లు ,  నిమ్మ, బత్తాయి, దానిమ్మ చెట్లు వెనక ఉండగా ముందం తా కూరపాదులూ, 4,5 రకాల గులాబీ మొక్కలూ, ఇంట్లోకి వెళ్ళేదార్లో బాటకిరు వైపులా వేసి పోషించేది అమ్మ.ఇక ముద్ద మందారం, రెక్కమందారం, మూడురకాల గుట్ట మల్లెలూ, జాజి,లిల్లీ లకు కొదవ లేదు. చేమంతి , మరువం తొట్లోలో వేసి నిండుగా పూయించేది. బాటకిరు వైపులా కనుల పండువుగా పూల బాలల పరకరింపులే! ఇవికాక దొండ, కాకర, చిక్కుడు పాదులూ, ఉండేవి. ఇల్లంతా పంట లక్ష్మీ కళతో కళాకళలాడుతూ ఉండేది.ఏసీజన్ లో ఆపండ్లు మోసుకుని మాఇంటికి వచ్చేది 3 కి.మీటర్లూ నడుచు కుంటూ ఆయాసంతో రొప్పుకుంటూనూ." అమ్మా!ఎందుకూ ఇంతెండలో వచ్చావ్, గొడుగైనా లేకుండా ? సాయంకాలం తెస్తే సరి పోనుకదా!" అన్నాను. " నువ్వు రాత్రులు భోజనం చేయవుకదా !అందుకనే వేడివేడిగా తింటావని తెచ్చాను." అంది ముఖానికి పట్టిన చెమట తుడు చు కుంటూ. ఏమీ అనలేక ” ఈగొడుగు తీసుకెళ్ళు “ అంటూ చేతిలో గొడుగుఇవ్వబోతే , " నీవు మళ్ళా ఎండలో పడి నడిచి రావాలి కదా!వద్దు లే నీవే వేసుకెళ్ళు, కొంగుకప్పుకుపోతాన్లే, నీవుపద మళ్ళా అన్నం తినేసి రావాలికదా! వస్తా" అంటూ వెనక్కు తిరిగి నడిచి వెళ్ళింది. నేనూ నడుచు కుంటూ ఒకటిన్నరకిలో మీటర్ల దూరంలో ఉన్న మాఇంటికెళ్ళి, ఆరోజు లంచ్ లోకి కూర లేకుండా వంటచేసిన నాకు, నాకు ఇష్టమైన  కాకరకాయ కూర తింటుంటే కళ్ళ నిండుగా నీరువచ్చింది. ఒకపాత సంఘటన గురొచ్చొ మనస్సు పిండేసి నట్లైంది ,ఒకమారు నాన్నగారుపోయాక, అమ్మ కు రావల్సిన పెన్షన్ పేపర్స్ సంతకాలుచేసి పోస్ట్ చేయవలసి వచ్చి, అమ్మ కబురుచేసింది, అప్పటికింకా ల్యాండ్ ఫోన్స్ కూడా రాలేదు."ఈపేపర్స్ తీసుకెళ్ళి పోస్త్ ఎచేయిస్తావా? " అని.అప్పుడు నాకు టెంత్ పరీక్షలు దగ్గరపడి తీరికేలేకుండా ఉన్నాను." నేను చాలా బిజీగ ఔన్నానమ్మ! నీవే ఎలాగో తంటాలుపడు." అని కబురంపాను. పాపం అమ్మ తనే ఎండలో ప్[ఓస్తాఫీస్ కెళ్ళి పనిముగించుకుని వచ్చింది.ఆరోజు సాయంకాలం మా అబ్బాయి తనస్కూల్ షూ పాడైపోయిందనీ కొత్తది కొనమని గొడవచేస్తే , స్కూల్ నుంచీ షాపుకెళ్ళి కొనిచ్చాను. అమ్మపని పక్కకు నెట్టి , బిడ్డపనిమాత్రం చేసిన ఆసంఘటన గుర్తువచ్చి కళ్ళలోనీరు తిరిగింది. నామీద నాకే ఏహ్యం కలిగింది. అమ్మకు నామీద ఉన్నప్రేమదేనితోనూ వెలకట్టలేనిది.మరో రోజు సాయంకాలం శలవు లవటాన పిల్లలు ఇంట్లోనే  ఉన్నారు.  H.Mస్ మీటింగ్ నుంచీ  రాగానే  మాపిల్లలు " అమ్మా! నీకోసం అమ్మమ్మ ఈ స్వీట్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళింది " అంటూ నాకో ప్యాకెట్ అందించారు. అది సింగ్ స్వీట్  షాపుది.లోపల జిలేబీ, కాజూ బర్ఫీ, పకోడీ  ఉన్నాయి. అమ్మ యింటికి 3కిలో మీటర్ల దూరంలోని సింగ్ స్వీట్ షాపుకెళ్ళి కొని , మళ్ళా ఒకటి న్నర కిలో మీటర్ల దూరంలోని మాయింటికి నడిచొచ్చి ఇచ్చి మళ్ళా అంతదూరం నడిచి వెళ్ళింది. అమ్మప్రేమకు దూరం, కాలం,  ఎండ, శ్రమ అడ్దురావు.  అమ్మకు నేనేం చేశాను? కనీసం నాన్నగారు పోయాక  వెళ్ళికొంత కాలమైనా ఆమెదగ్గర ఉన్నానా ?నా ఇల్లు, నా పిల్లలు , నా ఉద్యోగం అని తపన పడు తున్నానే తప్ప అమ్మకోసం ఏం చేశాను.అనుకుంటూ స్వీట్స్ వైపుచూస్తుంటే " అమ్మా! నీవు టీ తాగాక ఇక రాత్రికి ఏమీ తినవుకదా! అందుకే అమ్మమ్మ’ ఇప్పుడే తిని టీ తాగమని  మీ అమ్మకు చెప్పండి , అమ్మతిన్నాకే మీరు తినండి’  , ‘మీరు అన్నీ తినేయకండి, అమ్మ వచ్చాకే ప్యాకెట్ విప్పండి '  అని కూడా అమ్మమ్మ చెప్పి ఇచ్చి వెళ్ళింది,  ఏదీ నీవు తిని మాకూ ఇవ్వు , ‘అని.  ‘మీ అమ్మకు నీవంటే ఎంత ప్రేమ! “ చిన్న పాపాయ్ ఏదీ నోరుతెరిచి తినమ్మా! " అంటూ పిల్లలు నన్ను ఆట పట్టించి  నానోట్లో బర్ఫీముక్క పెట్టి, వారూ తినసాగారు. అమ్మ తన ఇష్టం కన్నా బిడ్డల ఇష్టం  గమనిస్తుందని మరోమారు రుజువుచేసింది  మా అమ్మ.  నేను అమ్మ నైనా అమ్మ నే నింకా చిన్న పిల్లనే అనుకుంటుంది, పిల్లలకు తీసుకోడం తప్పమళ్ళా  తిరిగి ఇవ్వడం రాదా! అనే భావనతో, నేను అమ్మకేం చేశాను?’ అనే ఆలోచన మరీ మరీ వేధించసాగింది . ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలో మా పిల్ల లు " హేపీ మదర్స్ డే అమ్మా!" అంటూ ఒకపూల బొకే ఒక  కార్డ్ ఇచ్చారు. వాళ్ళకు థాంక్స్ చెప్పి"పిల్లలూ! పదండి అందరం వెళ్ళి అమ్మమ్మ కు ‘మరర్స్ డే చెప్పి, గ్రీట్  చేసి వద్దాం." అంటూ  బయల్దే రాను. ఆదూరి .హైమావతి

అమ్మతో అమ్మ ఒక తెరిచిన పుస్తకం... చదవాలనుకుంటే అక్షరమాలలా కనిపిస్తుంది... వ్రాయాలనుకుంటే తెల్ల కాగితమై నిలుస్తుంది.. కనుకొలుకుల నిలిచిన కన్నీటితెర అమ్మ.. మాతృదినోత్సవం కోసమని అమ్మ గురించి రాయాలని అనుకున్నప్పటి నుంచి నా కనుపాపల వెనుక ఉన్న బాల్యంలోనికి వెళ్ళిపోయి అమ్మని ప్రేమతో  ఆలింగనం చేసుకున్నా... అమ్మకి అమ్మామ్మావాళ్ళు (తన అమ్మ ) పెట్టిన పేరు ప్రమీల ..నాన్నగారితో ఏడడుగులూ నడచి వచ్చి, ‘లీల’గా, లీలమ్మగా మారిపోయింది... అమాయకత్వానికి మారు రూపమయినా అన్నీ తన ఇష్టప్రకారమే జరగాలనే మనస్తత్వం ఆమెది. 'పాప'గా నేను ఒక్కదాన్నే అవటం మూలాన నేను ‘ఇది కావాలి’ అని అడిగే అవసరం లేకుండా నాకు  అన్నీ అమర్చిపెట్టేది... అయినా, నేనెప్పుడూ మా నాన్నపార్టీనే...కానీ ఆ మురిపాలన్ని ఆమెవే... ప్రతీ పుట్టిన రోజుకీ తనే స్వయంగా బూందీ లడ్డూలు చేసి (అప్పుడు కట్టెల పొయ్యి కదా..పాపం చాలా శ్రమ  పడవలసి వచ్చేది..) ఆ వీధిలో ఉన్న పిల్లలందరికీ నా చేతితో ఇప్పించేది.. ముఖ్యంగా వడియాలు .. వేసవి వచ్చిందంటే చాలు రకరకాలైన వడియాలు పెట్టి, ఎండిన తరువాత  డబ్బాల్లోకి ఎత్తి పెట్టేది... వర్షం వస్తూ ఉంటే ప్లేటు నిండా అమ్మ వేయించి ఇచ్చిన వడియాలు తింటూ కిటికీలో కూర్చుని వర్షపు ధారలను చూస్తూ.. ఎంతో సంబరపడేదాన్ని... స్కూలు డ్రెస్సు తళతళ మెరిసిపోయేలా  ఉతకటమేకాదు, ప్రతీ వారం బొగ్గుల ఇస్త్రీ పెట్టెతో చక్కగా ఇస్త్రీ చేసి పెట్టేది... నేను బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని ఆమె కోరిక... (ప్చ్! నేను తీర్చలేకపోయాను) తనకి వకీలు (లాయర్) అంటే ఎంతో ఇష్టం. ఆడవాళ్ళు అలా నల్లకోటు వేసుకొని న్యాయం కోసం  వాదిస్తూ ఉంటే అలాగే  చూస్తూ ఉండి పోయేది..(సినిమాలో టివిలో..) ... నాకు పదమూడేళ్ళకి ఒక అపురూపమయిన వరప్రసాదంలా తమ్ముడ్ని ఇచ్చింది అమ్మ.. వాడి  ఆలనా పాలన అంతా నా చేతిలోనే... అనుకోకుండా  నాకు  మంచి సంబంధం రావడంతో ‘వద్దు’ అనలేకపోయింది, కానీ అమ్మకి  అప్పుడే నా పెళ్ళి చేయడం మనస్ఫూర్తిగా అంత ఇష్టం లేకపోయింది. నా పిల్లలు పుట్టాక, నా ఇద్దరు అమ్మాయిలతో తన గోడు వెళ్ళబోసుకునేది... (మా నాన్నతో కలిసి ఆమె మాట వినక పోయేదాన్ని కదా...! ఆవిషయాలన్నీ..) ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే .. తమ వీధి చివర దుకాణం లోంచి టెలిఫోను  చేయించి... "నాన్న దగ్గుతున్నారు బాగా... నిన్ను ఒక్కటే అడుగుతున్నరు...ఒకసారి వచ్చి చూసి వెళ్ళు పాపా!" అని చెప్పి పెట్టేసేది... మేము ఉండేది బేగం పేటలో... అమ్మా వాళ్ళు అంబర్ పేటలో ఉండే వాళ్ళు. మరుసటిరోజు పిల్లలు స్కూలుకు వెళ్ళగానే రెండు బస్సులు మారి మరీ వెళ్ళి చూద్దును గదా..! "నాకేమయింది? చూడు నేను పర్ ఫెక్ట్లీ ఆల్రైట్..." అంటూ నాన్న పెద్దగా నవ్వేసేవారు. అప్పుడు అర్థమయ్యేది  నాకు ఇదంతా అమ్మ చేసిన పనేనని. 'ధనియాలపొడి, కారంపొడి, చారు పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్...’ మొదలయినవి అన్నీ ముందు రోజే తయారు చేసి మరీ ఉంచేది... ఇవన్నీ నాకు ఇవ్వడం  కోసం అన్నమాట ఈ పన్నాగమంతా... సూర్య బింబం లాగా  ఎఱ్ఱగా కుంకుమని తన నుదుట నిండుగా దిద్దుకుని, అపర పార్వతీ దేవిలాగ ఉండేది మా అమ్మ. ఎప్పుడైనా చేయి జారి కుంకుమ కిందికి  ఒలికిందా, ఇక చూడండి ఆమె బాధ... తనని ఓదార్చటం ఎంతో కష్టం అయేది మాకు... ఆమె అంతిమ కోరిక ‘ఒడి బియ్యం పోయించుకుని మళ్ళీ  పెళ్ళికూతురిగా వెళ్ళిపోవాలని...’ అది ఆమె నిత్యం కొలిచే ఆ దైవం విన్నాడేమో, నాన్నని ఒంటరిగా వదిలేసి మమ్ముల్ని విషాద సాగరంలో ముంచేసి తను మాత్రం అన్ని జరిపించుకొని మరీ చెదరని చిరునవ్వుతో వెళ్ళిపోయింది... 'అఆలు’ నేర్వని అమ్మ అయినా ప్రతి అక్షరమూ తానే అయింది..ఈ పాపని కన్న ఆ అమ్మ...మా అమ్మ..! సుజాత తిమ్మన  (కవయిత్రి)

మాతృ హృదయం మా అమ్మ పేరు సులోచనాదేవి . ఆరోజుల్లోనే HSLC చదివింది వరంగల్ లో , వాళ్ళ అమ్మమ్మ ,పెద్దమ్మ గారిళ్ళలో ఉండి. తెల్లగా ,5 అడుగుల ఎత్తు ,కోల ముఖం ,చక్కని చిరునవ్వుతో అమ్మ అందంగా ఉండేది. నాన్న అమ్మని ప్రేమగా “లోచన్” అని పిలిచేవారు. అమ్మకి 12 ఏళ్ల వయసులోనే వివాహమైందట.. 14 సం.లకే అన్నయ్య పుట్టాడు . 19 ఏళ్ళకి నేను ..మూడో సంతానంగా .ఇద్దరు మొగపిల్లల తరువాత. పెద్దగారం చేసినట్టు కనపడేది కాదు గానీ ,కోరకముందే అన్ని కోరికలూ తీర్చేసేవారు అమ్మా,నాన్నా. నాన్న పెద్ద జమిందారు . అమ్మ చాలా తెలివైనది అనేవారు మా బంధువులంతా . చాలా ఓపిక .వంటలు అద్భుతంగా చేసేది. పుస్తకాలు బాగా చదివేది. అప్పట్లో వచ్చే అన్ని వార,మాస పత్రికలూ కొనేది అమ్మ. అలాగే ప్రసిద్ధ రచయిత్రుల /రచయితల నవలలు కూడా చాలా కలెక్షన్ ఉండేది. ప్రమదావనంలో మాలతీచందూర్ గారి వంటలు చదివి ,కొత్తవంటలు చేసేది. నాన్న ఏదైనా హోటళ్ళలో తిని ,రుచి ఇలా ఉంది అని వర్ణించి చెప్పేవారు . అలాగే చేయగలిగేది. అమ్మ ఊరగాయల స్పెషలిస్ట్ కూడా.. దాదాపు 10,12 రకాల ఊరగాయలు ,మామిడికాయతోనే వేసేది. ఆవకాయ ,మాగాయ, వెల్లుల్లి ఆవకాయ , నువ్వుగాయ,కొబ్బరికారం, మెంతికాయ, నీళ్ళావ ,తురుము పచ్చడి , పెసరావ, బెల్లపావ ,సన్నముక్కల తొక్కు పచ్చడి, పచ్చావ ..అబ్బో ..ఎన్నిరకాలో. మాకు మామిడి తోట వుండేది. తోటనుండి వెయ్యి కాయలు తెప్పించి ..మరీ వేసేది. అమ్మ-నేను             అమ్మకు రాని  విద్య ఉండేదికాదు. అన్నింటిలో కొద్దిగా ప్రవేశం ఉండేది. రకరకాల జడలు (హెయిర్ స్టయిల్ ) వేసేది నాకు. ఎండాకాలంలో మల్లె పూలజడ తప్పనిసరి. సీజన్ అయిపోయేలోపు ఒక 5,6 సార్లు వేసేది ..తనకే సరదా వెయ్యాలని. నేను అడిగకపోయినా పెద్ద సైజు మల్లెమొగ్గలు వచ్చినరోజున ఎక్కువగా తీసుకుని నాకు పూలజడ వేసేది. ఇంట్లో ఉన్న గోరింటాకు మెత్తగా రుబ్బించి , చేతిమీద అగ్గిపుల్లతో డిజైన్లు పెట్టేది. వెన్నెల రాత్రులు పెద్ద బేసిన్ లో అన్నం ,ఆవకాయ ముద్దలు కలిపి పెట్టేది మా అందరికీ..  ఇవన్నీ 12 సం.లోపు జ్ఞాపకాలు. ఒక అమ్మగా ..కూతురుకి ఎవ్వరికీ చెప్పుకోలేని కష్టం వస్తే ఎలా పరిష్కరించిందో చూడండి. ఇప్పటివరకూ ఎవ్వరికీ చెప్పుకోలేదు నేను కూడా..కానీ ఇప్పుడు అనిపిస్తోంది..ఇది ఇప్పటి తల్లులకు కూడా ఉపయోగపడుతుంది అనిపించింది .అందుకే పంచుకుంటున్నా. మేం చదువులకోసం ,పల్లెటూరినుండి , దగ్గరలో ఉన్న చిన్న టౌన్ కి షిఫ్ట్ అయ్యాము. అక్కడే నాన్న ఇల్లు కట్టకముందు ,మూడు పోర్షన్లు ఉన్న ఇంట్లో పెద్ద పోర్షన్ లో అద్దెకు ఉన్నాము. పక్కన రెండు వాటాల్లో మాకు దూరపు బంధువులే ఉండేవారు. అందరం చాలా కలిసిమెలిసి ప్రేమగా ఉండేవారం. నేను ఇంటర్ చదువుతున్న రోజులవి.ఎండాకాలంలో ,ఆరుబయట అందరం మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళం. చాలా అల్లరి చేస్తూ,పాటలు పాడుతూ..ఎంతోసందడిగా ఉండేది మాయిల్లు.  ఒక రాత్రి అలాగే బయట వాకిట్లో అందరం మంచాలువేసుకున్నాము . కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయాము.  ఒకరాత్రివేళ నాకు సడెన్ గా మెలకువ వచ్చింది. నామంచం మీద పక్కింటి బంధువుల ఇంటికి వచ్చిన ఒక అబ్బాయి కూర్చుని ,చెయ్యి నిమురుతున్నాడు .  గబుక్కున కూర్చుని అరవబోయ్యా..నోరుమూసి , దండం పెట్టి ప్లీజ్ అరవకు అని ,లేచి వెళ్ళిపోయాడు..కానీ నా గుండె వేగంగా , ఇక ఆగిపోతుందేమో అన్నంతగట్టిగా కొట్టుకుంటోంది. భయంతో నాలుక పిడచగట్టుకుపోయి..మాటకూడా రాలేదు.. అమ్మ మంచు పడదని లోపలే పడుకుంది. దబదబా తలుపుకోట్టా..అమ్మ తలుపుతీయగానే లోపలికి పరుగెత్తా.. అమ్మ దగ్గరికి వచ్చి ‘ ‘ఏమైందే” అనేలోపే ,గట్టిగా కౌగలించుకొని ఏడుపు మొదలుపెట్టాను. అమ్మ వీపు నిమురుతూ .. “ భయపడ్డావా ,కలవచ్చి౦దా ...” అంది..మెల్లగా జరిగింది చెప్పా.. అమ్మ ఏమీ మాట్లాడలేదు .. షాక్ తో అలా ఉండిపోయింది. మర్నాటినుండి ఎవర్ని చూసినా నేను భయంతో వణికిపోతున్నా.. అమ్మను వదిలేదాన్ని కాదు ..కూడాతిరుగుతూ , బెడ్ రూమ్లోనుండి బయటికి వచ్చేదాన్ని కాదు. ఆ పక్కింటి వాళ్ళ బంధువుల కుర్రాడు మర్నాడే పరార్..వెళ్ళిపోయాడు. కానీ నాకు భయం పోలేదు. అమ్మ ఒక మధ్యాహన్నం నాదగ్గర కూర్చుని ,ఒక బుక్ చేతిలోపెట్టి ఇది చదువు అంది. “ఏమిటమ్మా ఇదీ”..అని అడిగా..అమ్మ “చదువు నీకే తెలుస్తుంది” అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. నాకు నవలలు చదవడం ఇంకా అలవాటులేదు. వారపత్రికలలో కొన్ని సీరియల్స్ , కథలు చదవడం 10 th సెలవుల్లో మొదలుపెట్టినా ,నవలలు చదవలేదు. చందమామ,బొమ్మరిల్లు, కార్టూన్స్ ,చిన్న కథలూ అంతే.. పెద్దగా టైం ఉండేదికాదు. ఎప్పుడూ చదువు గోలే నాకు..ఇంటర్ లో Bipc కూడా.. రికార్డులూ , బొమ్మలూ ..అదే సరిపోయేది. అది ఒక రచయిత్రి రాసిన నవల ..పేరు నాకు గుర్తులేదు..నవలపేరు కూడాగుర్తు లేదు. ..కానీ అందులో ఒక చిన్న10 సం. పాప మానసిక వేదన , ఇంటికి వచ్చిన కొందరు మగవాళ్ళు ఆ అమ్మాయిని ముద్దు చేయడం పేరుతో ,ఎక్కడెక్కడో తాకడం, అసహ్యంగా మాట్లాడడం ..ఆపిల్ల తట్టుకోలేక తల్లికి చెప్తుంది . తల్లి ఆమ్మాయినే తిడుతుంది..ఇంత చిన్నప్పటినుండే నీకు ఇవన్నీ ఎలాతెలుసు..? నీ బుద్దే మంచిదికాదు. వాళ్ళకి అలాంటి ఆలోచనలేకపోయినా , నీకే పాడు బుద్ధులు ..అని తిడుతుంది. ఆ అమ్మాయి మేనమామకూడా అలాగే చేస్తాడు.. అపుడు అమ్మమ్మకి చెప్పుకుని ఏడుస్తుంది . అమ్మమ్మ ధైర్యం చెప్తుంది. మగవారి ప్రవర్తన, ఎలాజాగ్రత్తగా ఉండాలో ,వంటరిగా ఉన్నప్పుడు ,ఎవరైనా వస్తే ఏమిచేయాలో ..వాళ్ళని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో చెప్తుంది. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండమని , దగ్గర షార్ప్ గా ఉండే పిన్నీసు,సూది లాంటివి దగ్గరపెట్టుకుని , ఎవరైనా మగవాళ్ళు తాకితే , అదికూడా తప్పుగా అనిపిస్తేనే ..గట్టిగా పొడవమని, భయపడవద్దని , ఎవ్వర్నీ నమ్మవద్దనీ ..చాలా ఎడ్యుకేట్ చేస్తుంది.ఆతరువాత ఆ అమ్మాయి బాగా చదువుకుని, ధైర్యంగా ఎదుగుతుంది. ఆ నవల చదివాక నాకు చాలా ధైర్యం వచ్చింది.  అందులో అమ్మమ్మ చెప్పినట్టు ,నేనొక్కదాన్నే కాదు..చాలామందికి ఇలాంటి చేదు అనుభవాలు ఉంటాయి ..వాటిని ధైర్యంగా ఎదుర్కొని వాళ్లకు బుద్ధి చెప్పాలి..అన్నమాటలు నాకు బాగా నచ్చాయి. బుక్ చదివాక , అమ్మ ఏమీ అడగలేదు..కళ్ళతోనే ..అర్ధమయ్యిందా అన్నట్టు చూసింది. మితభాషి కదా. ఆతరువాత నేను ఎవ్వరికీ భయపడలేదు. ఎప్పుడూ దగ్గిర పెద్ద పిన్నీసు ఉంచుకునేదాన్ని . బస్సులో , సినిమాహాళ్ళలో , రద్దీగా ఉన్న ప్లేస్ లలో ...నా పిన్నీసు బాగా పనిచేసేది. అమ్మ ఏమీ మాట్లాడకుండానే, హితబోధ చెయ్యకుండానే, నా సమస్య పరిష్కరించేసింది . పదునైన చూపుతోనే ,ఆమడ దూరంలో ఉంచి మాట్లాడేదాన్ని నచ్చనివారితో . ఉషారాణి నూతులపాటి-

నాలో నిండి పోయిన అమ్మ అమ్మ గురించి రాయమంటే చేయి చిందులు వేస్తోంది ..నాలో నిండి పోయి ఉన్న అమ్మ గురించి ఎక్కడని మొదలు పెట్టి రాయను ! అమ్మ లా అయిపోతున్నాను నేను అరే అమ్మ లాగే ఆలోచిస్తున్నాను నేను ? అని ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఆశ్చర్యం లో నేను .అమ్మా ! ఏమిటీ ఈ చాదస్తం ?   అని మొన్నే కదా అమ్మని విసుక్కున్నాను ..అదే చాదస్తం తో ఇప్పుడు నేను ..పిల్లలెలా ఉన్నారో అని ఎందుకమ్మా బెంగ ? ఫోనులు రాలేదంటే క్షేమం గా ఉన్నారని అర్దం ..అనే నేను ఇప్పుడు ఎందుకు వారం అయింది పెద్ద వాడి నుంచి ఫోన్‌ వచ్చి అని ఎందుకు రోజుల లెక్కలు కొలుస్తున్నాను ..ఆకలి గా ఉంటే మేం వచ్చి తింటాం అమ్మా !వండి బల్ల  మీద పెట్టావు కదా , ఇంక నీ పని అయిపోయింది ,హాయిగా నిద్రపో కాసేపు అన్నా , వినకుండా .. చల్లారి పోతాయే ఆ కబుర్లు ఆపి వచ్చి భోజనాలు తినండి పిల్లలూ అని బ్రతిమాలే అమ్మ , ఇప్పుడు నాలో నూ కనిపిస్తోంది ..వాళ్ళ కిష్టమైనవి చేసి పెడితే వచ్చి తినరేం ? అని ఉక్రోషం తో నేనూ ..అమ్మ నే కదా .. మా అమ్మ ,ఏమిటి ఇలా నాలో అణువణువూ నిండి పోయింది ? తప్పులు చేసినా క్షమించే అమ్మ , పిల్లల పిల్లల కీ ఇంకా వండి పెట్టాలని బలం తెచ్చుకునే అమ్మ , మీకెందుకే ఇబ్బంది అంటూ తన ఆరోగ్య సమస్యలు దాచుకునే అమ్మ , ఇంకా ఎందుకమ్మా ఈ తాపత్రయం అంటే నవ్వే అమ్మ , వేడి కాఫీ కి ఉదయం నిద్ర లేవడానికీ ఒక్క ఐదు నిముషాలు తేడా కూడా భరించ లేని అమ్మ , వేడి వేడి గా పొగలు కక్కుతూ అన్నం ఉంటే చాలు ,పచ్చడి  , చారు అయినా చాలు , పరమాన్నమే అనే అమ్మ , నా బాంక్ పనులు అవీ నేను చూసుకుంటున్నాను అంటే అదొక కాలక్సేపమే నాకు అంటూ ,మేము దగ్గర లేక పోవడాన్ని సద్దు కుని పోయే అమ్మ , బాంక్ లో ఉద్యోగులు ఎందుకమ్మా మీరు  వస్తారు ? మీ పిల్లలెవరూ లేరా ? అంటే పిల్లలే పంపిస్తున్నారు బాబూ ..ఈ డబ్బు అంతా , దగ్గర లేక పోవడమేం ? పిలిస్తే పలుకుతారు , మొన్నే వచ్చి వెళ్ళింది మా పెద్ద అమ్మాయి అంటూ నవ్వుతూ జవాబిచ్చే అమ్మ .. ఊరంతా స్నేహితులే , పిలిస్తే పలికే వారు కొందరైతే ,పిలవక పోయిన వచ్చి పలక రించే వారు ఎందరో ? ఫోన్‌ కి ఒక్క క్షణం విశ్రాంతి ఉండదు , అమ్మా ! అమ్మా ! అని ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు ..నీ చేతి కంది పొడి అన్నం తిన్నాం , నీ  సాంబారు రుచి ఎంత చెప్పినా నా భార్యకి రావడం లేదు , ఈ సారి అమ్మ దగ్గర నేర్చుకో అని చెప్పాను అంటూ , మా ఊరు ఏలురు నుంచి , నాన్న గారి స్నేహితులూ , వారి కుటుంబ సభ్యులూ ,మా పిల్లలందరి స్నేహితులూ ,స్నేహితురాళ్ళూ , మా అత్తగారి వేపు బంధువులూ ,చెలెళ్ళ వేపూనూ , విశ్వ బంధువు తను ,,అమ్మ .. మేం తను పంచే ప్రేమకి అమ్మ లా వారసులం అవుతామా ? ఏమో కాలమే చెప్పాలి .. అమ్మ ,మా అమ్మ ..ఎంత మందికో అమ్మ ..మాకెంత గర్వమో .. అమ్మా ! అని పిలుస్తే చాలు ..కోట్లు తన దగ్గర ఒంపినంత సంతోషం ..పని వారు ప్రాణం పెడతారు ..పోటీ పడతారు ..తన ఇంట్లో పని చేయడానికి , ఎవరైనా ఇంట్లో అడుగు పెడితే చాలు ,ఆటో డ్రైవెర్ అయినా సరే ,ముందు ఆకలేస్తోందా ? అని ఆరా తీసి ఇంత అన్నం వడ్డించే మా అమ్మ .. ఎంత చెప్పినా ఇంకా సరిపోదు .నా దగ్గర అంత పద సంపద లేదు ..మా అమ్మ గురించి రాయడానికి ..అమ్మ నే తలుచుకుని ..ఈ నాలుగు మాటలూ రాస్తున్నాను ..ఈ రోజు .. అమ్మా ..ఐ లవ్ యూ ..అని ఎప్పుడూ అనని మాటని ఈ రోజు అంటున్నాను ..బయటకి . పుల్లాభొట్ల వసంత (లక్ష్మీ వసంత.)

అమ్మంటే అప్పుడు రెండో క్లాసు చదువుతున్నా.. ఆరేళ్ళుంటాయి.  మా చిన్నప్పుడు కృష్ణాష్టమికి బడికి సెలవుండేది కాదు. నాలుగింటికి వచ్చేసి, పాలు తాగి ఆటలాడుకుని వచ్చే సరికి పట్టుచీర కట్టుకున్న అమ్మ కనిపించింది. రాగయుక్తంగా భాగవతంలో పద్యాలు పాడుతూ, సాయంత్రం అమ్మ తులసి కోట చుట్టూ కడిగి ముగ్గులేసి తులసమ్మకి అలంకారం చేస్తుంటే అనుమానం వచ్చింది. తెల్లారకట్ల మామూలుగా అయిపోయింది కదా! ఇప్పుడెందుకూ అని.   అమ్మ పిండివంటలేమైనా చేసిందేమో అని ఒక కన్ను తెరిచి చూస్తున్నా.. ఊహూ.. చలిమిడి, వడపప్పు, పానకం, పచ్చి కొబ్బరి, బెల్లం కలిపి దంచిన ఉండలు, అరటిపళ్ళు.. అంతే.. నాకు చాలా నిరుత్సాహం.. బొండాలు, బజ్జీలు, మైసూర్ పాక్, లడ్డూలు.. పోనీ బొబ్బట్లు.. ఊహూ! ఆలోగా అమ్మ, వీధి గుమ్మం నుంచి చిన్న చిన్న పాదాలు ముగ్గేసింది. అమ్మ భలే తొందరగా ఒక్క నిముషంలో వేసేసింది. “ఏంటమ్మా ఇవేళ?” కృషుడి విగ్రహాన్ని కూడా తులసమ్మ పక్కన పెట్టి, దీపం వెలిగిస్తున్న అమ్మని అడిగాను. “కృష్ణాష్టమి. కృష్ణుడు పుట్టిన రోజు. అందుకే మనింటికి పిలుస్తున్నామన్నమాట. ఆ పాదాల మీద అడుగులేసి వచ్చేస్తాడు.” “పుట్టిన వెంటనే ఎలా నడుస్తాడు?” “దేముడు కదా.. అందుకని నడవగలుగుతాడు..” “మరి.. రోటిక్కట్టేస్తే పాకుతూ చెట్ల మధ్యనించి వెళ్ళాడని చెప్పావు కదా అప్పుడు..” “అది వేరు యశోదమ్మ ఇంట్లో అది.. అయినా నీ ప్రశ్నలన్నింటికీ మీ నాన్నగారు జవాబు చెప్తారు. నువ్వు మాట్లాడకుండా అక్కడ కూర్చుని పూజ చూడు.” ఓహో.. అర్ధమయింది. పుట్టగానే అందరిళ్ళకీ నడుచుకుంటూ వెళ్ళి, నేనొచ్చానోచ్ అని చెప్పి, ఆ తరువాత యశోదమ్మ ఇంట్లో పాకుతూ, అల్లరి చేస్తూ.... అయినా అమ్మకి చెప్పడం చాతకాపోతే.. మీ నాన్నగారంటుంది. సరే.. పూజంతా అయ్యాక, నాకు మా ఆఖరన్నకీ (మిగిలిన అన్నలు వేరే ఊళ్లలొ చదువుతున్నారు)..  చలిమిడి, వడపప్పు వగైరాల ప్రసాదం.. బంగాళ దుంపల వేపుడు,  చారన్నం, పెరుగన్నం పెట్టేసి, తను ప్రసాదం మాత్రం తింటోంది. మా నాన్నగారు కాంపుకెళ్ళారు. “ఇదేం పండగ.. చలిమిడి..” మా అన్న చిందులు తొక్కాడు. నేను కొబ్బరి ఉండలు తింటుండగా.. “అది అంతే.. నేనైతే ఉపోషం.. ఉడికించినవేం తినకూడదు. కడుపు చలవ. నూనెలో వేయించినవి అస్సలు నైవేద్యం పెట్టకూడదు.” “కడుపు మాడ్చుకుని చలవంటావేంటమ్మా! చాదస్తం..” యస్సస్సెల్సీ చదువుతున్న అన్నయ్య అడిగాడు. నిజమే.. అన్నయ్యంటుంటే నాకూ అనుమానం వచ్చింది. “అంటే.. ఆకలేసే కడుపు కాదు.. కడుపున పుట్టిన పిల్లలంతా సుఖంగా ఉండేలా చూడమని కృష్ణుణ్ణి వేడుకుంటాం.. పొద్దుట్నుంచీ కన్నయ్యనే తలుచుకుంటూ, పాటలు, పద్యాలు పాడుకుంటూ ఆయన ధ్యానం లోనే గడుపుతామన్నమాట.” అమ్మ మాటలకి అన్నయ్య అయోమయంగా చూస్తూ వెళ్ళిపోయాడు. “నేనైతే.. కడుపు నిండాతిని, బోలెడు పిండివంటలు చేసి.. కన్నయ్యకి నైవేద్యం పెట్టి, కడుపు చలవ చూడమంటా..” ప్రకటించేశాను. అమ్మ పకపకా నవ్వి, నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. అమ్మకి నిర్వచనం చెప్పాలంటే ఎలా? అమ్మంటే అన్నీ.. మన ఉనికి, మన ఉన్నతి, మన స్వభావం, మన జీవితం.. కొంచెం ఒళ్ళు వెచ్చబడితే తల్లడిల్లుతుంది. మన సమస్యలకి మన కంటే ఎక్కువ కన్నీరు కారుస్తుంది. నిత్యం మన వెంటే తోడుగా నీడగా ఉంటుంది.. మన మధ్యనున్నా లేకున్నా. మా అమ్మకి ఆఖరి సంతానంగా తన నలభయ్యో ఏట నేను పుట్టాను. అప్పటికి మా ఆఖరి అన్నయ్య తప్ప అందరూ ఇంట్లోంచి బైటికి చదువులకి, ఉద్యోగాలకి వెళ్లి పోయారు. అందరికంటే పెద్దదయిన అక్కకి పెళ్ళవడమే కాక, బాబు కూడా. నా పై అన్నకీ నాకూ పదేళ్ళు తేడా. ఇంక చూసుకోండి.. నాది ఇష్టా రాజ్యం ఇంట్లో. అమ్మని ఎంత సతాయించానో.. పగలంతా ఇంట్లో ఉండేదాన్ని కాదు. ఎప్పుడూ పక్కింట్లోనో.. ఎదురింట్లోనో.. నాలుగు వీదులవతలున్న కమలా వాళ్ళింట్లోనో.. ఇప్పుడు ఆలోచిస్తుంటే.. ఇంట్లో నేనొక్కదాన్నే ఉండటం కారణమేమో అనిపిస్తోంది. అలా ఆటల్లో పడి.. ఇంటికి ఆలిశ్యంగా వస్తే, ఎక్కడున్నానో తెలియని అమ్మ, వీధరుగు మీద కూర్చుని ఎదురు చూడాడం.. నన్ను చూడగానే, అమ్మయ్య అని నిట్టూర్పు విడవడం.. ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. నాకు ఒకటికి నాలుగు సార్లు ఏదైనా చెప్తే.. విసుక్కోడమే నా పని. . అయినా పట్టించుకోకుండా తను అనుకున్నది నేను చేసే వరకూ చెప్తూనే ఉండేది. మా పిల్లలు చిన్నప్పుడు మా ఇంట్లో ఉండి వాళ్ళని కంటి పాపల్లా చూసుకునేది. నా ఉద్దేశంలో ఏ అమ్మ కథైనా ఒకటే.. పిల్లలే పంచ ప్రాణాలూ! అందులో.. మా అమ్మకి నేనంటే అంత కంటే ఎక్కువ. మా అన్నలు, అమ్మ నన్ను గారం చేసి పాడు చేస్తోందని కోప్పడుతుండే వారు, నన్ను ఆవిడనీ కూడా. ఆవిడని సరిగ్గా చూసుకో లేదనే బాధ నాక్కూడా ఎపుడూ అనిపిస్తుండేది. ఎనభై ఏళ్ళు దాటాక, ఆవిడకి మతి మరుపు వచ్చేసింది. (ఆల్జీమర్స్) అర్ధ రాత్రి లేచి స్నానం చేస్తానని పేచీ.. అన్నం తినేసి కూడా తినలేదు మళ్ళీ పెట్టమని గొడవ. ఎప్పుడూ.. మాత్రలియ్యండి వేసుకోవాలి అంటూ వేధింపు. లోపల ఎంత బాధ ఉండేదో పాపం.. అని ఇప్పుడనిపిస్తుంది కానీ.. అప్పుడు బాగా కోప్పడేదాన్ని. అంతే.. అమ్మ కనుమరుగయ్యాకే ఆవిడ విలువ తెలుస్తుంది. మంథా భానుమతి---(రచయిత్రి)

అమ్మ అన్నదీ ఒక కమ్మని మాట అమ్మ గురించి రాయాలి... అసలు ‘అమ్మ’ అనే పదం అంటేనే ఒక మధుర కావ్యం కదా... అమ్మ గురించి రాయాలంటే నాకు ధైర్యం చాలటం లేదు... కేవలం రెండు పేజీల్లో తన గురించి ఏం రాయగలను అని... మా అమ్మ ఒక చరిత్ర... మా అమ్మ ఒక ప్రకృతి... మా అమ్మ ఒక శ్రమ... మా అమ్మ ఒక త్యాగం... అమ్మ గురించి తలచుకుంటే నా మనసు విషాదమయం అయిపోతుంది. అప్పుడే పన్నెండేళ్ళు అవుతోంది తాను వెళ్ళిపోయి, మా మనసులో దివ్వెగా మిగిలిపోయి... అమ్మ పేరు శ్రీమతి యాళ్ళ కమలమ్మ. బాధ్యతల కత్తి అంచు మీద నిలబెట్టి అమ్మను అర్థాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు నాన్న... అసలు అమ్మే ఒక పసిపాప... అందుకే తనని ఆ దుఃఖం లోంచి బయటకు లాగటానికి మాకు  మేమే పెద్దవాళ్ళం అయి నడుము కట్టాం... మా బాధను దిగమింగి, తనని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నించే వాళ్ళం...మా బాధ్యతలు మేమే నేరవేర్చుకున్నాము, అక్కా బావల సహకారంతో...వారి అండ దండలతో... అక్షరాలు తెలియని అమ్మ చదువుకోవాలని ఎంతో తాపత్రయ పడింది... మేము నేర్పితే అన్ని అక్షరాలూ, తన సంతకం తెలుగులో నేర్చుకుని ఆనందపడిపోయింది... కాని చదవటం తనకి చేతకాలేదు. సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ఏ పత్రిక కనపడినా చేతిలోకి తీసుకొని పేజీలు  అన్నీ తిరగేసి, బొమ్మలు చూసి ఆనందపడి పోయేది. అందులో ఉన్న కథలు ఏమిటో చెప్పమని అడిగేది. అందుకే నేనూ, తమ్ముడూ అమ్మకి కథలను చదివి వినిపించే వాళ్ళం. మంచి కథలను విని ఎంతో ఆనందించేది అమ్మ. నేను రాసిన కథలను కూడా చదివించుకొని ఎంతో సంబరపడిపోయేది.  అమ్మ సంతోషం కోసమైనా బాగా మంచి కథలు రాసి పేరు తెచ్చుకోవాలి అనుకునేదాన్ని. ఇప్పుడు కథలు ఎక్కువే రాసాను. తమ్ముడు కూడా రాస్తున్నాడు. కాని చూసి ఆనందించటానికి అమ్మ లేదు నా దగ్గర. అమ్మకు అక్షరజ్ఞానం లేకపోయినా లోకజ్ఞానం (జనరల్ నాలెడ్జ్) బాగానే ఉంది... అందుకు కారణం రేడియో. ఉదయం భక్తిరంజని మొదలు రాత్రి జైహింద్ వరకూ రేడియో మ్రోగాల్సిందే. అన్ని తెలుగు కార్యక్రమాలు చాలా ఆసక్తి కరంగా వినేది. ముఖ్యంగా స్త్రీల కార్యక్రమాలు, రేడియో నాటకాలు అంటే ఆమెకు పిచ్చి ఇష్టం. తెర మీద సినిమాల కన్నా, ఇంట్లో రేడియోనే ఎక్కువ ఇష్టపడేది ఆవిడ. చిన్నప్పటినుంచీ చాలా గారాబంగా చూసుకుంది అమ్మ పిల్లలందరినీ. ఎవ్వరినీ నొప్పించేది కాదు. ఎవ్వరికీ పనులూ చెప్పేది కాదు. ఇంటెడు చాకిరీ తాను ఒక్కతే చేసుకునేది. పిల్లలకి పని చెబితే నాన్న ఒప్పుకునే వారు కాదు. ‘వాళ్ళు చదువుకోవాలి, పన్లు చెప్పవద్దు...’ అనే వారాయన. ఆయన మద్దతు చూసుకుని మేమూ ఏమీ చేసే వాళ్ళమే కాదు. ఇప్పుడు బాధగా ఉంది... మళ్ళీ బాల్యం తిరిగి వస్తే, అమ్మకి చాలా సహాయం చేసే అవకాశం వస్తుంది కదాని. నాకు పెళ్లి అయిన సంవత్సరం వరకూ నాకు విశాఖపట్నం నుంచి  హైదరాబాదు [మావారు ఉన్న చోటు] కి బదిలీ కాలేదు. ఈలోగా డెలివరీ టైం. అసలు ‘బిడ్డ పుట్టే వరకూ నిన్ను ఒక్కసారి కూడా పంపను...’ అనేసింది. ఒక్క పని చేయనిచ్చేది కాదు. ఉదయం టిఫిన్ తో పాటు ఓ సారీ, మధ్యాహ్నం మూడున్నరకి [మాకు షిఫ్ట్ సిస్టం ఉండేది బ్యాంకు లో] ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు మరో సారీ, రాత్రి పడుకునే సమయంలో మరోసారీ ఒక పెద్ద గ్లాసుడు పాలు తాగాల్సిందే... ‘అమ్మా, వద్దమ్మా... చిరాగ్గా  ఉంటుంది...’ అన్నా వినేది కాదు. ‘రేడియోలో ఏం చెప్పారు? గర్భిణీ స్త్రీలకు కాల్షియం చాలా  కావాలని, తల్లికీ, బిడ్డకూ సరిపోయినంత ఉండాలని చెప్పారు కదా... అందుకని మాట్లాడకుండా తాగేయమ్మా...’ అని బ్రతిమాలి తాగించేది. బాబు పుట్టాక వాడిని క్షణమైనా వదిలేది కాదు. నాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒకరినొకరు విడవలేక విడిచి వెళ్ళాము... అమ్మ కూడా తమ్ముడు జాబ్ చేసే దగ్గరికి వెళ్ళిపోయింది. మా ఇల్లు (ఇంట్లో సామాన్లు) మూడుగా విడిపోయింది... నట్ట నడివేసవిలో కూడా వేడి నీళ్ళ స్నానం చేయటం నాకు అలవాటు. గోరువెచ్చగా ఉంటే పనికిరాదు. అందుకని నాకు స్పెషల్ గా రెండు తప్పేళాల నీళ్ళు కాచి ఇచ్చేది ఎప్పుడూ... అరిసెలు వండాలన్నా, ఆవకాయ కలపాలన్నా నేను తనకి తోడు ఉండాల్సిందే... పెళ్లి కాక ముందు, నాన్న పోయాక అమ్మా, తమ్ముడూ, నేనూ కలిసి ఉండే వాళ్ళం కదా... అప్పుడు ఓ సారి యల్టీసీ వాడుకొనే అవకాశం వచ్చింది నాకు. అమ్మా, తమ్ముడూ నాకు డిపెండెంట్స్. అనుకోకుండా ఎయిర్ లో వెళ్ళే అవకాశం. ట్రిప్ కోసం జాగ్రత్తగా ఒక ఐదు వేలు జమ చేసుకొని, విమానం టికెట్స్ బుక్ చేసుకొని, ముగ్గురమూ  వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాం ఫ్లయిట్ లో... విమానం ఎక్కిన అమ్మ ఎంతగానో మురిసిపోయింది. ఆకాశంలో ఎయిర్ బస్ వెళుతూ ఉంటే మేఘాలను చూసి ఆశ్చర్యానందాలతో తబ్బిబ్బు అయింది... గంటలో బేగంపేట ఎయిర్ పోర్ట్ వచ్చేసింది అంటే, ‘అప్పుడే హైదరాబాదు ఎలా వస్తుంది?’ అంటూ ఆశ్చర్యపోయింది. విమానం లోంచి దిగుతూ ఉంటే వినయంగా నమస్కరించిన ఎయిర్ హోస్టెస్ ని చూసి తనూ ప్రతిగా నమస్కరించి, ‘ఎంత గౌరవమో చూసావా పెద్దలంటే?’ అని చెప్పింది... ఆబిడ్స్ లోని రామకృష్ణా థియేటర్ దగ్గర ఉన్న ‘ఆహ్వానం’ హోటల్ లో స్టే చేసాం అప్పుడు. బిర్లా మందిర్, సాలార్ జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్, టాంక్ బండ్ చూపించాము. ఎంతో మురిసిపోయింది. నిజానికి మేమూ అదే మొదటిసారి హైదరాబాద్ రావటం. అమ్మతో పాటుగా అవన్నీ చూడటం మాక్కూడా ఎంతో ఆనందం కలిగించింది. అప్పటికే నాకు కలం స్నేహితురాలు, ఈనాటి ప్రముఖ రచయిత్రీ అయిన శ్రీమతి వాలి హిరణ్మయీదేవి సహకారంతో సిటీ అంతా చూడగలిగాం అప్పుడు. నాకన్నా, అమ్మా, ఆవిడా బాగా ఆప్తులు అయిపోయారు.  మూడోరోజు నాంపల్లి స్టేషన్ లో గోదావరి రైలు ఎక్కుతూ ఉంటే ఉమ (హిరణ్మయి) ని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది అమ్మ. ఆ తర్వాత ఎవరితో మాట్లాడినా, ఎవరిని కలిసినా, ‘నేనూ విమానం ఎక్కాను. మా చంటమ్మ నన్ను విమానంలో హైదరాబాద్ తీసుకు వెళ్ళింది కదా...విమానంలో అమ్మాయి నాకు నమస్తే కూడా పెట్టింది...’ అనేది మురిపెంగా... అలా ఏళ్ళ తరబడి అందరికీ చెప్పేది. అమ్మను చివరి రోజుల్లో సరిగ్గా చూసుకోలేదేమో అనిపిస్తోంది ఎప్పుడూ... నా దగ్గరే చివరి ఏడాది ఉంది... అనారోగ్యంతో మనిషి చిక్కి శల్యమైపోయింది. ఒక్క నాలుగు రోజులు తమ్ముడి దగ్గర ఉండి వస్తానని వాడితో వెళ్లి, మూడో రోజు వెళ్ళిపోయింది. అమ్మను ఇక మేము మళ్ళీ పొందలేము... అమ్మకోసం ఎంత కన్నీరు కార్చినా రాదు. ఇంకా కొంచెం శ్రద్ధ వహించి ఉంటే, ఇంకా బాగా చూసుకుని ఉంటే, అమ్మ ఇంకో పదేళ్ళు అయినా బ్రతికేది కదా... ఈ అపరాధ భావన మాత్రం నన్ను జీవితాంతమూ వదలదు... అమ్మ గురించి పంచుకోవటానికి ఈ అవకాశం కలిగించినందుకు మీకు ఎన్నెన్నో కృతజ్ఞతలు... ప్రత్యేకంగా మాతృదినోత్సవం అని కాకుండా రోజూ నేను లేవగానే తలచుకోనేది మా అమ్మనే... నా హృదయంలో ఎప్పుడూ కొలువైన దైవం మా అమ్మే... నండూరి సుందరీ నాగమణి

మా అమ్మ అమ్మంటే ఇష్టం, ప్రేమ ఉండనిదెవరికి? మనల్ని కని, పెంచి విద్యా బుద్దులు నేర్పే తొలి గురువు అమ్మేగా. మా అమ్మ శ్రీమతి మహీధర దుర్గాంబ గారి గురించి పంచుకొనేందుకు మీ ముందుకు వచ్చాను.దేశానికి రాజైనా కన్నతల్లికి పాపడే. నా వరకూ అమ్మంటే ప్రేమా,అనురాగం, ఆప్యాయతలతో బాటూ క్రమశిక్షణ, వ్యక్తిత్వం ఉన్నతమైన భావాలను ఉగ్గుపాలతో బాటే రంగరించి పోసిన మహా మనిషి... ఆమె చదువుకోలేదు కానీ చదువు విలువ బాగా తెలిసిన , చదువును గౌరవించి , ప్రేమించే తత్వం... అలాగే ఎంత ప్రేమగా పెంచినా క్రమశిక్షణ దగ్గరకొస్తే ' మిలటరీ డిసిప్లీనే '  అలా అని ఏనాడూ కొట్టడం, తిట్టడం, అరవడం లాంటివి చెయ్యలేదు కళ్ళెర్రజేసి ‘ఊఊ’ అదంటే చాలు, అసలు మమ్మల్ని ఆడుకోవడానికి ఎప్పుడైనా బయటకు పంపితేగా ... సెలవలైనా సరే ఇంట్లోనే నేనూ మా తమ్ముడూ ఆడుకోవడమే, బహుశా అందుకేనేమో ఎప్పుడూ గుడిపాములా ఇంట్లో ఉండడమే కానీ బయటకెళ్ళడం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ నాకు బాగా జ్ఞాపకం ఒక్కసారి మాత్రం అమ్మ చేతిలో దెబ్బలు తిన్నాను, మరి మా తమ్ముడు దొరికితేగా అందుకే ఇద్దరి వంతూ నాకే పడ్డాయి ఎందుకంటారా, బాగా చిన్నప్పుడు మా అన్నయ్య ఉద్యోగరీత్యా మేము ఏలూరు దగ్గర దెందులూర్ లో ఉండేవాళ్ళం. అన్నయ్య స్కూల్ లో చదివే ఓ అమ్మాయి ఓ సెలవనాడు అన్నయ్యని అడిగి అమ్మని ఒప్పించి మమ్మల్నిద్దరినీ వాళ్ళింటికి తీసికెళ్ళింది, వాళ్ళది చాలా పెద్ద ఇల్లు, చక్కగా పెద్ద తోటా... నాకు చిన్నప్పటినుండీ మొక్కలన్నా పువ్వులన్నా పిచ్చి, అందుకే ఓ చక్కటి ముద్దమందార మొక్కా అది వాలిపోకుండా ఉండడానికి (పాతగానే) ఓ వెదురుకర్ర ఇచ్చి సాయంత్రం బాగా చీకటిపడే దాకా ఉంచి అప్పుడు దిగబెట్టింది ... అంత ఆలశ్యం చేసినందుకు అప్పటికే అమ్మకి బాగా కోపం వచ్చి ఆ పిల్ల వెళ్ళే దాకా ఆగి, నా చేతిలో ఉన్న ఆ వెదురు కర్రతోనే బాగా బడితెపూజ చేసింది, మా తమ్ముడు దొరకకుండా తప్పించుకు పారిపోయాడు. ఆ తరువాత తనే దగ్గరకు తీసుకుని, దెబ్బలకు వెన్న రాసిందిలెండి. అప్పట్లో ఫోన్ లు లేవుగా మేం అంత ఆలశ్యం చేసేసరికి బాగా కంగారు పడిపోయింది పాపం ... మరి మాది తప్పేగా.   చదువులేదు, సంపాదన లేదు ... ఆస్తిపాస్తులనేవి ముందేలేవు ... నాకూ మా తమ్ముడికి ఊహ తెలిసేసరికే మా నాన్నగారు చనిపోయారు. పెద్ద పిల్లలయిన అన్నయ్యా , అక్కా మా తాతగారి దగ్గర ఉండి చదువుకున్నారు , ( పితామహులు శ్రీ మహీధర వేంకటరామశాస్త్రి గారు) అమ్మ ఇద్దరు చిన్నపిల్లలతో మా ఇంకో తాతగారింట్లో (అమ్మ నాన్నగారు శ్రీ గొడవర్తి వేంకట సుబ్రహ్మణ్యం  గారు ) ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు రాస్తున్నానంటే ఎటువంటి ఆలంబనా లేని అమ్మ కళ్ళలో ఏ రోజూ కన్నీళ్ళు , బాధా, దుఖం ,అసహాయతా కనిపించలేదు. తను తిందోలేదో, మాకు ఏ లోటూ చెయ్యలేదు ,తను తినేదాంట్లోంచే ఇంటికి ఎవరొచ్చినా ఆదరంగా పెట్టడమే తెలుసు, ఎవరినీ ఏ రోజూ ఏ సాయం అర్ధించలేదు, ఎవరి దగ్గరనుంచీ ఏమీ ఆశించలేదు... అలాంటి వ్యక్తిత్వం ఉన్న తల్లి కడుపున పుట్టడం ఎంత అదృష్టం... అనుక్షణం మా ఉన్నతి కోసం తపించేది, తన పిల్లలు అన్నింటా ముందుండాలనీ, అందరిలో ఉన్నతంగా ఉండాలనీ ఆశించేది ... ఒక్క క్షణం ఆమె వృధాగా గడిపేది కాదు మమ్మల్ని గడపనిచ్చేదీ కాదు ...  ఇప్పటికీ నాకు ప్రతి నిముషం ప్రోడక్టివ్ గా ఉండాలనే పిచ్చి , అది ఎంతగా అంటే ఒక్కొక్కసారి నా మెంటాలిటీ మీద నాకే విసుగు వస్తుంది ... మనం మనుషులం కానీ మరమనుషులం కాదు కదా ... అప్పుడూ నేను మా అమ్మనే తిట్టుకుంటా , ఎందుకంటే నా మీద ఉన్నది ఆవిడ ప్రభావమేగా ... కానీ అప్పుడప్పుడనిపిస్తుంది ఆవిడే కనక బ్రతికి ఉంటే ఈపాటికి నేను కెరీర్ పరంగా కానీ , ప్రవృత్తి పరంగా కానీ ఎంతో కొంత ప్రగతి, ఉన్నతి సాధించి ఉండేదాన్నేమో కదా అని. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏం చదువుతున్నావని అడిగి అస్తమానం అదే ఎందుకు నీకు కెమిస్టరీ అంటే భయంగా అది చదువు అనేది ... ఇలా తనకు అసలు ఆ సబ్జెక్ట్స్ ఏవీ తెలియక పోయినా, మానిటర్ చేసేది, ఒక్క చదువే కాదు సంగీతం, ఆటలు, పాటలు కుట్ట్లు అల్లికలు అన్నీ నేను నేర్చుకోవాలి, ఆఫీస్ లో అలసిపోయి వచ్చినా కొంచెం సేపు సేదదీరి సంగీతమో, కుట్ట్లో ఏదో ఒకటి చెయ్యలి కానీ పగలు అస్సలు నిద్రపోనిచ్చేదే కాదు. తనకు తెలియనిది , అఖరలేనిదీ లేదు మా స్నేహితులూ, కొలీగ్స్ ఎవరు ఇంటికి వచ్చినా వాళ్ళు ఏం చదివారో అడిగేది  ఇంకా పై చదువులు చదవమనీ, ప్రమోషన్ పరీక్షలు వ్రాయమనీ ఇలా ...  నేను ఎప్పుడూ సరదాగా అనే దాన్ని వాళ్ళను 'ఇంటరాగేట్' చెయ్యకే పాపం మన ఇంటికి రావాలంటే హడలిపోతున్నారు అని.దానికి ఆవిడనేది నేనేం వాళ్ళని దుంగలెత్తమన్నానా దూలాలెత్తమన్నానా, వాళ్ళ మంచికేగా చెబుతుంటా అని. వాళ్ళు కూడా పాపం స్పోర్టివ్ గా తీసుకుని మా అమ్మంటే చాలా అభిమానంగా ఉండే వాళ్ళు.    నాకు తెలిసి ఆవిడ సమయాన్ని వృధా చెయ్యడం కానీ, చేసే వాళ్లని ఉపేక్షించడం కానీ నే చూడలేదు ... ముప్పై ఏళ్ళ చిన్న వయసులో భర్తని పోగొట్టుకుని ఎటువంటి ఆలంబనా లేకుండా పిల్లలని అభివృద్దిలోకి తేవడమనే మహాయజ్ఞం అంత సులువని నేననుకోను. అప్పట్లో ఫేమిలీ పెన్షన్ నెలకి ముపై,నలబై రూపాయలో ఎంతో వచ్చేది దానితోటే ఎంతో జాగ్రత్తగా అన్ని అవసరాలూ తీర్చుకుని పైగా ఎంతోకొంత పొదుపు చేసేది, చదువుకోకపోయినా ఆర్ధిక శాస్త్రం, మేనేజ్మెంట్ పక్కాగా ఉండేది.   అంత ప్లానింగ్ , పద్దతి, తెలివీ ఉన్న అమ్మే కనుక చదువుకుని మంచి ఉద్యోగంలో ఉంటే కచ్చితంగా సమాజానికి ఎంతో కొంత మేలు జరిగి ఉండేది.ఆమె నా రోల్ మోడల్, ఆమె నా హీరో. ఆమె ఉన్నప్పుడు ' నయాగరా జలపాతంలా ఉండే నేను ... ఇప్పుడు చలనం లేక మందగొడిగా ' తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ' అన్నట్లు అయిపోయా ... చిన్నప్పుడెప్పుడూ  ‘అమ్మ కావాలనీ ‘ఏడవలేదు ఎందుకంటే ఆమె నీడలా కూడానే ఉన్నా కనుక ఇప్పుడు 'అమ్మ కావాలని ఏడవాలని ఉంది ... కానీ ఎంత ఏడ్చినా రాదుగా ... ఆ దేముడే కనక ప్రత్యక్షమై వరం ఇస్తే నే కోరేదొకటే మా అమ్మను మళ్ళీ నాకిచ్చెయ్యమని ... మీకు తెలుసా నేను మా అమ్మను తలుచుకోవడమే మానేసా ... ఎందుకంటే తలుచుకుంటే ఆ బాధను తట్టుకోవడం నా వల్ల కావడం లేదు ... అమ్మ 2003 దసరా , మహర్నవమి నాడు చనిపోయింది , సుమారు పుష్కరం దాటుతున్నా నా మనసు అలవాటుపడలేదు... అందుకే నేను అసలు తలచుకోవడమే మానేసా. ఇంకో విషయమండోయ్ నా పిల్లల చిన్నప్పుడు వాళ్ళను మా అమ్మే పెంచింది ( నేను ఉద్యోగానికి వెళ్ళిపోతాగా) మరీ ముఖ్యంగా మా పెద్దబ్బాయిని, చిన్నవాడి టైం కి ఆవిడ ఓపికా అయిపోయింది, మా ఆయనా మా అమ్మా మంచి స్నేహితుల్లా ఉండేవారు ... నాకు కూడా చెప్పకుండా వాళ్ళిద్దరూ బోలెడన్ని విషయాలు మాట్లాడేసుకునే వారు, నాకు అసూయ కలిగేలా ... ఇంకొక ముఖ్య విషయం రాయకుండా ఇది ముగిస్తే నాకు చాలా పాపం వస్తుంది అందరిపిల్లలలోకీ మా అమ్మకు నేనంటే ప్రత్యేకమైన ప్రేమ,అభిమానం చిన్నప్పటి నుండీ కాస్త అర్భకంగా ఉండేదాన్ననీ నాకు మా పిల్లల చిన్నప్పుడు మెనంజిటిస్ వచ్చి బ్రతుకుతానన్న ఆశ లేనప్పుడు ఆవిడా మా ఆయనా నన్ను కంటికి రెప్పలా కాపాడడం గుర్తొస్తే నాకు మనసంతా అనిర్వచనీయమైన భావంతో నిండిపోతుంది అలాంటి అమ్మను చివరిసారి మేం చూసేటప్పటికి ... మేం వెళ్ళేసరికే నిర్జీవమైన సంగతి గుర్తొస్తే నా గుండె చెరువైపోతుంది... ఒక్కసారి కాలం వెనక్కు వెళ్ళి ఆమె ప్రాణాలతో ఉండగా మమ్మల్ని చూసి ' అమ్మా మేం వచ్చాం ' అన్న మాటలు ఆమెతో చెప్పగలిగితే ఎంత బాగుండునూ. ప్చ్... అలా ఎందుకు జరగాలి?   ఆమె మనిషీ, మనసూ, జ్ఞాపకాలూ అన్నీ అందమైనవే ... అందుకే నేను ఎన్ని జన్మలకైనా ( నిజంగా అవి అంటూ ఉంటే) ఆ తల్లికే కూతురిగా పుట్టాలని మనసా కోరుకుంటూ ... ఈ అక్షరాంజలి అమ్మకే అంకితం. మీనాక్షీ శ్రీనివాస్.

 అమ్మ వళ్ళో పాపాయికి ఏమి కావాలి ''చిన్నమ్మాయి పిల్లలు ఎక్కడ ?'' అడిగింది అమ్మమ్మ. ''ఉన్నారు లేమ్మా , బయట అరుగుల పై  ఆడుకుంటున్నారు ''చెప్పింది అమ్మ. అరుగుల మీద నుండి దూకుతూ , మళ్ళీ ఎక్కుతూ ఉన్న నేను తొంగి చూసి నవ్వాను . మూడేళ్ళ పాప  ఉంటుంది ! చల్లని వెన్నెల మనసుని ఉంటుంది .ఆ  మనసు అమ్మమ్మది అయితే తనకు గంధం పూసినంత హాయిగా ఉంటుంది .   ''నా తల్లే ఆడుకోమ్మా ,  అక్క ఏది ?'' అప్పటికి అక్క ,నేను ఇద్దరమే అమ్మకి . పెదమ్మ ,మావయ్య ఆ ఊరిలోనే కాబట్టి మేము ఒక్కరమే  సెలవల్లో వచ్చే చుట్టాలం. అందుకే అమ్మమ్మకి మేమంటే అంత మురిపం. ''రాణి అక్క , శైల అక్కతో ఎక్కడికో పోయింది. నేను వనజ ఆడుకుంటున్నాము '' పెద్దగా అరిచి చెప్పాను . చిన్నగానే తల్లి  .... నవ్వుతూ వారించింది అమ్మ . ''అది ఎందుకు చిన్నగా అరుస్తుంది !వాళ్ళ నాన్నకు ఆడ పిల్ల రెండో సారి వద్దు అంటే ,ఎందుకు వద్దు అంటావు అని గట్టిగా పుట్టేసింది. ఎవరికైనా జవాబు చెప్పాలంటే అదే '' నవ్వుతూ లోపలి వెళ్ళింది అమ్మమ్మ . అమ్మ కూడా నవ్వుకుంటూ బుగ్గ లాగి ముద్దు పెట్టుకొని పనిలో మునిగి పోయింది. నాకు ఇద్దరు ఆడ పిల్లలు అయితే ఏమిటి ,దేవుడు చందమామ లాంటి పిల్లలను ఇచ్చాడు . ఇద్దరు చక్కగా పెరిగితే చాలు . ... అనుకుంటూ లోపలి వెళ్లి పోయింది . ఆడుకొనే పిల్లలను బద్రంగా చూసుకొనే పని ఎప్పుడూ ఇంటి ముందు ఉండే ఎర్ర అరుగులదే !!అవి దాటి పిల్లలు ఎప్పుడూ రోడ్ మీదకు వెళ్ళరు .                              ************* ''శశి ,అన్నం తిందువు రామ్మా '' అమ్మ పిలుపుకు సమాధానం చెప్పడానికి నేను అక్కడ ఉంటె కదా !! రెండు సార్లు పిలిచేసరికి అమ్మకి అనుమానం వచ్చింది . ఇల్లంతా వెతికింది. అక్కను అడిగినా ,పక్క వాళ్ళను అడిగినా ఒకే సమాధానం ''తెలియదు ,చూడలేదు ''అని. అమ్మమ్మకు ,అమ్మకు మావయ్య కు కంగారుగా ఉంది. ముఖ్యంగా పాప కనపడలేదు అంటే ,పాప నాన్నకు ఏమి సమాధానం చెప్పాలి. అసలే ఆయనకు కోపం ఎక్కువ . పాప పుట్టినాక కొద్ది రోజులు చూడటానికి కూడా రాలేదు . ఇప్పుడు పాప అంటే చాల ఇష్టం. అమ్మ కైతే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి . ఇంత చిన్న పాప ఎంత దూరం వెళ్లి ఉంటుంది ? కొంప తీసి ఎవరైనా చెవిలో కమ్మల కోసం ఎత్తుకొని వెళ్లి ఉంటె .... ఊహకే అమ్మ మనసు వణికి పోతుంది . ''నా బిడ్డ ఎక్కడ ఉన్నా క్షేమం గా ఉండాలి . తొందరగా దొరకాలి '' మనసులోనే ప్రార్ధన లు చేస్తూ ఉంది . తల్లి బాధ తెలియని వారెవరు ? చుట్టూ పక్కల వాళ్ళు అందరు చుట్టూ చేరి ఓదారుస్తూ ఉన్నారు ,కాని ఎవరైనా ఎత్తుకొని వెళ్లి ఉంటారా ,అనే ఆలోచన అందరిలో ఉంది. ఇంత చిన్న పాప దూరంగా వెళ్ళదు . కాబట్టి ఏమి అయి ఉంటుంది అని తర్జన బర్జనలు జరుగుతూ ఉన్నాయి . ఊరంతా టముకు వేయిస్తే దొరకొచ్చు .... ఒకరి సలహా. పోలీస్ రిపోర్ట్ ఇద్దాము .... ఇంకొకరి సలహా . అందరు తలా ఒక వైపు వెళ్లి వెతుకుదాము ..... ఓక్కొక్కరు ఒక్కో మాట. ఒకరి సలహా కంటే ఒకరిది గొప్ప అని వాదన. వింటున్న అమ్మకి మాత్రం ఒకటే ఆలోచన ,తప్పి పోయి ఉంటె ఎలాగైనా  దొరుకుతుంది . మనుషుల్లో ఇంకా కొంచెం పాపభీతి ఉంది . ఒక వేళ ఎవరైనా తీసుకెళ్ళి పోయి ఉంటె ..... ఈయనకి ఏమి చెప్పాలి ? పాప ఎలా ఉందొ !! మనసు భయం తో పరి పరి విధాల పోతూ ఏ సలహా ని స్వీకరించేటట్లు లేదు అమ్మకి . ఒకామె ముందుకు వచ్చి అడిగింది ''పాప తెల్లగా ఉంటుందా ?'' అవును గబుక్కున చెప్పింది అమ్మ . ''అయితే ఆ పాప ఇందాక అరుగు మీద నుండి దిగి తూముల వైపు వెళ్ళింది . కాంతమ్మ మనుమరాళ్ళు తెల్లగా ఉండరు కదా అనుకున్నాను. ఈ పాపని ఎప్పుడూ చూడలేదు ''చెప్పింది. అందరికీ కొంత ఆశ . ఆ వైపు వెళ్లి చూస్తె దొరకొచ్చు. ''లేదు ,టముకు వేసే వాళ్ళను మాట్లాడండి . దొరుకుతుంది ''చెప్పింది అమ్మమ్మ. అప్పటికి పాప కనపడక రెండు గంటలు దాటిపోయి ఉంటుంది. ఇంటి ముందు మూగిన జనాలను చూసి  ఇంట్లోకి వచ్చాడు చిల్లర అంగడి పుల్లయ్య. ''ఏమి జరిగినదమ్మా ?'' అడిగాడు అమ్మమ్మని. ''చిన్నమ్మాయి రెండో కూతురు శశి కనపడటం లేదు '' కళ్ళ నీళ్ళు నింపుకుంటూ చెప్పింది అమ్మమ్మ. ఒక్క నిమిషం .... ఏదో ఆలోచిస్తూ చెప్పాడు . ఏమి చెపుతాడా అని అందరు అతని వైపు చూసారు. ''విష్ణాలయం దగ్గర గాజులు అమ్మే దాసరి వాళ్ళు ఎవరో పాప ఏడుస్తుంటే చూసాము అని చెప్పారు '' అందరికీ ఉత్సాహం . కాని అది కిలో మీటర్ పైనే దూరం . మూడేళ్ళ పాప ఇల్లు వదిలి అంత దూరం పోయి ఉంటుందా !! జరిగే పని కాదు. ''అయినా సరే వెళ్లి చూసి రండి సుబ్రహ్మణ్యం '' అమ్మ వేడికోలు. కడుపు కోత  ఎలా ఉంటుంది, తొమ్మిది నెలలు మోసి నొప్పులు పడి కన్న వాళ్లకు తెలుస్తుంది . ఒక అమ్మకే ఆ బాధ తెలుస్తుంది . సరే వెళ్లి చూసి వస్తాము ,అమ్మ మాట కాదు అనలేక మావయ్య ,పుల్లయ్యతో బయలు దేరి వెళ్ళాడు ..... కాని మన పాప అయి ఉంటుంది అనే నమ్మకం లేదు .                           ********* ''అమ్మా ఇక్కడ పాప ఏడుస్తూ కనిపించింది అంట , ఆ పాప ఏది '' దాసరి వాళ్ళను అడిగారు . వాళ్ళు బయటకు వచ్చి వివరాలు అడిగారు ''అవును బాబు పిల్ల బొద్దుగానే ఉంది. ఎవరో సెట్టిగార్ల అమ్మాయి కొత్త బజారు నుండి తప్పి పోయి ఉంటుంది అని ,పక్కన ఉండే సెట్టిగార్ల ఇంటిలో వదిలి పెట్టాము '' చెప్పారు అనునయంగా . ఒక్క ఊరుకున పరిగెత్తారు అక్కడకు. మా పాపే కావాలి అని కోటి దండాలు మనసులోనే పెట్టుకుంటూ తొంగి చూసారు ఇంటి లోకి. కంచం లో అన్నం తింటూ చిన్న పాప. ''మావయ్య రా .... రా , చామ గడ్డల పులుసు భలే ఉంది. అన్నం తిందువు '' ప్రేమగా చేతిలో ముద్ద ఉంచుకొని పిలిచింది. ''నా తల్లే నా బంగారే , అక్కడ మీ అమ్మ కంటి నిండా నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంది. దామ్మా '' మావయ్య చేయి కడిగి ఎత్తుకున్నాడు. ''కొంచెం సేపు ఏడ్చింది కాని ,అన్నం పెడితే తినేసింది . పాపం బాగా ఆకలిగా ఉన్నట్లు ఉంది . ఎవరి పాపవి అని అడిగితే ''అమ్మ పాపని '' అంటుంది . ఏమి చెప్పలేదు . పోలీస్ స్టేషన్ లో చెపుదాము అనుకుంటున్నాము '' నవ్వుతూ అన్నారు వాళ్ళు . మావయ్య సంతోషంగా ముద్దు పెట్టుకొని ''నువ్వు అమ్మ పాపవే లెమ్మా ,మంచి పని చేసావు ఈ రోజు ''అని ఇంటికి తీసుకొని వెళ్ళాడు . నన్ను చూడగానే అమ్మ మనసుకు సంతోషం ,ఎత్తుకొని ''భడవా ,ఎంత కంగారు పెట్టావు ?ఏమై ఉంటావో అని భయం వేసింది ''అంది . అమ్మ వళ్ళో  ఊగుతూ ''ఉన్నాను లేమ్మా , చామ గడ్డాల పులుసు ఎంత బాగుందో తెలుసా ,నీకు తేలేదు ,నేనే తిన్నాను ''ముద్దుగా చెప్పాను . ''నాకు నీ కంటే రుచికరం అయింది ఏమి లేదులే తల్లి '' నుదుటి మీద ముద్దు పెట్టింది అమ్మ . ''పోతే పోనీలేవే చిన్న అమ్మాయి . శశి పోతే ఏమైంది , రాణి ఉందిగా '' నవ్వుతూ ఆట పట్టించింది అమ్మమ్మ . '' ఎంత మంది ఆడ పిల్లలు ఉంటె మాత్రం తల్లికి అందరు కావాలి . ఆడ పిల్లలు అయితే ఏమిటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు కావాలి అని దేవుడు వ్రాసి ఉన్నాడో ! తల్లికి ఎందరు ఉన్నా ఒక్కరు బరువు కారు '' చెప్పింది అమ్మ వడిలో నన్ను ఉంచుకొని . అమ్మమ్మకు తెలియని అమ్మ మనసా ? ముగ్గురు పిల్లలు పుట్టినాక తాతయ్య చనిపోతే పిల్లలని కళ్ళలో పెట్టుకొని తల్లిగా ఎంత కష్టపడి సాకింది . ఎప్పటి కధ ఇది ?అనడ్రు ఒకరి కష్టాలు ,సుఖాలు పంచుకొనే కాలం లోది. ఒకరి కోసం ఒకరు కన్నీళ్లు పెట్టె కాలం లోది . పిల్లలు పుట్టడం అంటే , వారు బ్రతికి బట్ట కట్టడం అంటే గొప్ప విషయం అనుకునే కాలం లోది. న్యాయంగా , ధర్మంగా బ్రతికితే ఆ ధర్మమే మన బిడ్డలను కాపాడుతుంది అనుకొనే కాలం లోది . మనకు ఉన్న దానిలోనే కొంత అన్నం ఆకలికొన్న వాళ్లకు పెట్టె కాలం లోది. ఏ కాలం అయినా మారనిది ఒకటే ..... అదే అమ్మ మనసు. వాయుగుండ్ల శశికళ.

అమ్మా నేనూ ఊహూ కాదు అమ్మా మేము మేము అంటే మేమే!  మేం ముగ్గురం.. మా శుభ, మా చిన్ని, మా బాబు అని మా అమ్మ ఎప్పుడూ ముద్దుగానూ, అప్పుడప్పుడు  కొంచం  గర్వంగానూ  చెప్పుకునే  అమ్మ పిల్లలం. “ మదర్స్ డే”  కదా!,  అని  నేనొక్కదాన్నే రాసేసుకుంటే పాపం మా చెల్లీ, తమ్ముడూ ఏమయిపోతారు?  వాళ్ళిద్దరినీ నేనే బాగా చూసుకోవాలని, నన్ను చూసే వాళ్ళు మంచీ, చెడ్డా నేర్చుకుంటారనీ అక్కని అయినప్పుడు మొదటిసారీ,  పెద్దక్కని అయినప్పుడు రెండో సారి అమ్మే చెప్పింది.  అందుకే ఇది మా ముగ్గురి తరపునా మా అమ్మకోసం.. " తను ఊపిరి తీసుకోవడం బరువూ, కొండకచో కరువూ అవుతున్నా సరే తన సర్వశక్తులూ ఒడ్డి తనలోని చిన్న ఊపిరికి వేణువులూదే  సహనమూ, శక్తీ  కేవలం అమ్మలకే  సొంతం. అది నేను అమ్మని అయినప్పుడు  నాకు అనుభవంలోకి వచ్చిన సత్యం. అమ్మ అవడానికి తగినంత వయసూ, జ్ఞానమూ లేని వయసులోనే ముగ్గురు పిల్లలకి 'మూలపుటమ్మ ' అయింది  అమ్మ. బాలాత్రిపుర సుందరి కదా మరి!! అసలు "కోదండ రాముడంట,  అమ్మలారా!  వాడు సర్వ మంగళ (నాన్నమ్మ గారి పేరు) కొమరుడంట " అని పాడుకోకుండానే తన పదమూడో ఏట,  నిజంగానే రాముడి పేరూ, తీరూ ఉన్న నాన్నతో వివాహం. మూడేళ్ళల్లో మొదట నాకూ,  మరో ఐదేళ్ళలో చెల్లికీ,  తమ్ముడికీ  అమ్మవడం సినిమా రీళ్ళలా గబ గబా జరిగిపోయాయి. వరదగోదారీ,  కోనేటి రాముడి గుడి, పచ్చని వరిచేలూ, కొబ్బరి బొండాలు, అంటు మావిడి తోటలూ, నూపప్పు జీళ్ళూ, సుబ్బారాయడి తీర్థాలూ, వేసవిలో మల్లెలూ, కొత్తావకాయలూ, బొమ్మలపెళ్ళిళ్ళూ, ఒప్పుల కుప్పలు, గొబ్బిళ్ళ పేరంటాలూ... వీటన్నింటి మధ్యనా కమ్మని కలలా,  రంగుల  హరివిల్లులా గడచిన బాల్యం అమ్మలాంటి ఆ కాలపు పిల్లలకే సొంతం. ఆడపిల్లల చదువుకి అందులో పెద్దగా చోటు లేదు.  హైస్కూల్ కి వెళ్ళాలన్న తన కోరికని సత్యాగ్రహం చేసి సాధించుకుంది అమ్మ. అందుకే మాకు మాత్రం ” ఎప్పుడూ చదువే ముందు, మిగతావన్నీతర్వాత” అని చెప్పేది, చదువుతోపాటు అన్నింట్లోనూ ముందుండాలని ప్రోత్సహించేది. పెళ్ళి అయిన వెంటనే పసితనం పెద్దతనంలోకి మారుతుంది..   ఇంటిపేరూ (ఆకాలంలో), ఉండే ఇల్లూ మారుతుంది.. కట్టూ, బొట్టూ, తీరూ, తెన్నూ మారుతుంది.. నడకా, నడతా, మర్యాదా, మన్ననా మారుతుంది.. చుట్టరికాలూ, బంధుత్వాలూ మారతాయి.. అసలు  పాపాయి పుట్టగానే అమ్మాయే మారిపోతుంది, అమ్మగా.. కానీ  అప్పటినించీ  చిత్రంగా  ఏమీ మారదు,  ఒకసారి అమ్మ అయిన తర్వాత ఎప్పుడూ అదే రీతి, రివాజు, అదే ప్రేమా, అదే అనురాగం.. ఎందుకంటే పిల్లలుపెరుగుతారు కానీ  అమ్మలు పెరగరు,  అక్కడే ఆగిపోతారు.    కాదంటారా??   లేకపోతే... ఎప్పుడో,  ఏడో క్లాస్  లో ఉన్నప్పుడే పాలు తాగడం మానేసిన నా చేత ఇప్పటికీ రోజూ పొద్దున్నే గ్లాసుడు పాలు తాగించే ప్రయత్నాలు.. " హార్లిక్స్ తాగితే  బలం  శుభడు!  చాలా బాగా కలిపాను ( ఆ సీక్రెట్ వంట ఏమిటో ఈ సారి అమ్మని అడిగి చెప్తాను) అంటూ చెప్పే మాటలూ.     “ మా పెద్దమ్మాయికి జున్నంటే ప్రాణం అని నీకు ఎప్పుడూ చెప్తాను కదా! అయినా, అది వచ్చినప్పుడు ఎప్పుడూ జున్ను పాలు పొయ్యనే పొయ్యవు!”  అని పాలబ్బాయిని  కోప్పడడం. “ మీ ఆఫీసు పనిలో పడి జాకెట్లు కుట్టించుకోవు, ఒక ఆది జాకట్టు నాదగ్గరుంచడమ్మా” అంటూ మాకు జాకెట్లూ,  ‘ఈనాడు వసుంధర’  లో ప్రతీ వారం  పిల్లల బట్టల డిజయిన్లు చూసి కొన్ని బట్టలు కొని, కొన్ని ఇంట్లోవి వాడి  చెల్లెలి పిల్లలకి పరికిణీలూ, డ్రెస్సులూ కుట్టుంచడమూ. “ వడియాలంటే మా బాబుకి ఎంతో ఇష్టం !”  అంటూ బూడిద గుమ్మడికాయని చూస్తూనే మురిసిపోవడం, గబ గబా పప్పు నానేసి వడియాలు పెట్టేయడం. “ఏమిటో అమెరికా జీవితాలు? పొద్దున్న లేస్తూనే ఉరుకులూ, పరుగులూ.. తిన్నారో, తాగారో కూడా తెలియకుండానే తెల్లవారడాలూ, సందె పడడాలూ.. అందుకే మేము ఇక్కడ ఉన్నప్పుడే మాఇద్దరికీ వీలైనన్ని వంటలూ, పని చెయ్యడం తప్ప ఇంకేం  చెయ్యగలం?” అని తమ్ముడినీ, మరదలినీ చూసి బాధ పడటం. “పొద్దున్నించీ కొంచం తల నొప్పిగా ఉందమ్మా! “అని ఫోన్ లో చెప్పగానే . " అయ్యో, రాత్రి సరిగా నిద్ర పోలేదేమో? టాబ్లెట్ వేసుకుని, వేడిగా ఏదైనా తాగమ్మా!  అని చెప్పి ఊరుకోకుండా గంటకోసారి ఫోన్ చేసి తగ్గిందో, లేదో? కనుక్కోవడం.. " నువ్వు కధలు ఎంతో బాగా రాస్తావు, క్రమం తప్పకుండా రాస్తూ ఉండు, అస్సలు మానేయద్దు" అని చిన్నపిల్లలకి చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ చెప్పడం. కౌముది లో నా కధ ప్రతీ నెలా చదివి అది నిజంగా బావున్నా,లేకున్నా 'చాలా బాగా రాసావు ' అంటూ మెచ్చుకోవడం.. కడుపు నొప్పంటే వేడి అన్నం లో నేతిలో వేయించిన వాము వేసి అన్నం కలిపి పెట్టడం,  మనకి కాలు నొప్పంటే తను కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం. మా పిల్లలెప్పుడూ అల్లరే చెయ్యలేదు, ఈ కాలం వాళ్ళల్లా పెంకితనాలూ, మంకుపట్లూ ఎరగరు అని ఆనందించడం.. “మనిషన్నాకా కాస్త దేవుడంటే భయం, భక్తీ ఉండాలి. రోజూ పొద్దున్నే లేచి దీపం పెట్టుకోండి, రోజూ ఏదైనా అమ్మవారి స్త్రోత్రాలు చదువుకోండి”  అని చెప్పడం.. ఇవన్నీ  ఎందుకు ఎప్పుడూ మారవు???? అన్నింటికంటే ముఖ్యంగా " తల్లి కళ్ళు దెయ్యం కళ్ళు, మంచి చీరలు, కొత్త బట్టలూ కట్టుకుని ఎంత బావున్నారో? నా దృష్టే తగిలేస్తుంది అంటూ ఉప్పూ, తడిగుడ్డా తెచ్చి దిష్టి తియ్యడం, " ఇంత పెద్దవాళ్ళం అయ్యాం, మాకింకా దిష్టి ఏమిటమ్మా?" అని నవ్వితే, " అలా నవ్వకండి, మీకు తెలీదు. నరుడి దిష్టికి నళ్ళరాళ్ళు పగులుతాయి అంటారు" అంటూ కంగారు పడడం.. ఇవన్నీ ఎందుకు మారవు? ఎలా మారకుండా నిత్య నూతనంగా ఉంటాయి? ఆ కళ్ళల్లో పిల్లలెప్పుడూ పెద్దవారయినట్టు ఎందుకు కనపడదు? మన ప్రతీ ఇష్టమూ, అయిష్టమూ, బాధ పడిన సందర్భమూ, గెలిచి ప్రతీ విజయమూ,  మనతో గడిపిన ప్రతీ క్షణమూ ఆ మనసుకి మరపు రాదెందుకు? ఎందుకంటే ఒక్కసారి అమ్మ అయ్యాకా ఆ పేగు బంధం మారదు, ఆ ప్రేమ, అనురాగం, అభిమానం ఏమీ, ఏమీ మారవు.. పిల్లలు పెద్దవారయ్యేకొలదీ ఆ ప్రేమ పెరుగుతుందే తప్ప తరగదు. అది తోడిన కొద్దీ ఊరే నీటి చెలమ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే "పండుకిది ఇష్టం, వాడు అమ్మమ్మా,  అంటూ ఎంతో ప్రేమగా ఉంటాడు, బంగారుకొండ” అని మా అబ్బాయి గురించీ,”ఆడపిల్లలకి జుట్టే అందం “ అని బారెడంత జడ ఉన్న మా చెల్లెలి పెద్దకూతుర్ని చూసీ మురిసిపోవడం. “ఇదేం మాట్లాడుతుందో నాకర్ధం కానే కాదు” అని చిన్నదాన్ని  చూసి ముద్దుగా విసుక్కోవడం. దాని ముద్దు మాటలు, వీడియోలు చూసి మురిసి పోవడం తర్వాత మెట్టు. అది అమ్మ కి అమ్మ అయిన అమ్మమ్మ ఆనందం. పేరులోనే రెండు అమ్మలని పొదువుకున్న ఆత్మీయబంధం కదా మరి!!అమ్మ ప్రేమలో ఎప్పుడూ, ఏదీ మారదు.. ఎందుకంటే అమ్మ హృదయం మారదు.. ఆ ప్రేమకి సంవత్సరానికి ఒక రోజు కేటాయిస్తే సరిపోదు, జన్మంతా అనుభవించినా తరగనిది, జీవితమంతా వెన్నంటి నడిచేది అమ్మ ప్రేమ మాత్రమే. ఈ మదర్స్ డే సందర్భంగా మా అమ్మకు మా ముగ్గురి తరపునా ఎన్నో వేల శుభాకాంక్షలు. ఆ ప్రేమకి వేల వేల కృతజ్ఞతలు.. వేదుల సుభద్ర. (ప్రముఖ రచయిత్రి)

 అమ్మంటే అమృతమేనా అంతకు మించింది కాదూ అమృతం అమరత్వాన్నివ్వచ్చు..కానీ..జీవితంలో తారసపడే అన్ని రుచులనూ ఆస్వాదించడం, యెదురయ్యే ఆటుపోట్లను తట్టుకోవడం యెలాగో తెలిపేది అమ్మే కదా.. అయిదుగురు అన్నగార్ల తర్వాత అపురూపంగా పుట్టి, పుట్టింటిలో అస్తారుబస్తంగా పెరిగిన పిల్ల ఒక పెద్దింటికి పెద్దకోడలై, ఆ వంశాన్ని అమృతమయం చేసి, అక్కడందరికీ తలలో నాలుకలా మెలిగిన మా అమ్మగారు  పద్మావతి గురించి యేమని చెప్పగలను? యెంతని చెప్పగలను? యెప్పటెప్పటివో జ్ఞాపకాలు అవిరామంగా మనసును కలచివేస్తుంటే ఒక్కొక్కటీ విడదీసుకుంటూ, చాలా చాలా కొద్దిగా మాత్రమే చెప్పాలంటే కష్టమే. పుస్తకాలను చేతబట్టి చదువు నేర్వకపోయినా జీవితాన్ని క్షుణ్ణంగా చదివిన ఆవిడ చెప్పిన కొన్ని జీవితసత్యాలు అక్షరసత్యాలనే అనిపిస్తాయి. అందులో ఒకటి.. మన అన్నం మనం తిన్నా యెదుటివారికి బెదరాలి..అన్నారు ఓసారి మా అమ్మగారు.. అంటే యేవిటీ అనడిగాను. దానికి సమాధానంగా.. మనం ఆకలిగా వున్నప్పుడు  పిలిచి యెవరూ అన్నం పెట్టరు కానీ మనం ఆపదలో వున్నప్పుడు మాత్రం మాటలనడానికి ప్రతివారూ ముందుంటారు, అందుకే యే పని చేస్తున్నా మనని పదిమంది గమనిస్తున్నారు అన్న స్పృహతో వుండాలి అని చెప్పారు. యెంత సత్యం ఆ మాట. మరోటి.. కట్టూ బొట్టూలో కాస్త తేడా వచ్చినా ఊరుకునేవారు కాదు. నీ కట్టూబొట్టూ చూసి నువ్వెవరి పిల్లవో తెలియాలి అనేవారు. అన్నింటికన్నా నాకు యిప్పటికీ బాగా గుర్తుండిపోయేదేవిటంటే.. ఆ రోజుల్లో మా బంధువుల్లోనే నాకంటే వయసులో చాలా పెద్దయిన హైస్కూల్ దాటని ఆడపిల్లలు కొంతమంది వుండేవారు.  వాళ్లంతా ప్రతియేడూ ఆంధ్రామెట్రిక్ అనే పరీక్షకి వెడుతుండేవారు. వాళ్లకి పెళ్ళిసంబంధాలు చూస్తున్నప్పుడు మా అమ్మాయి మెట్రిక్ చదువుతోంది అని చెప్పేవారు వాళ్ల తల్లితండ్రులు. యెప్పుడు పెళ్ళి కుదిరితే అప్పుడు చదువు ఆపెయ్యడమే. అంటే ఆడపిల్లలకి జీవితంలో పెళ్ళికున్న ప్రాముఖ్యం మరి దేనికీ వుండేదికాదు. నాకైతే పధ్నాలుగేళ్ళకే ఎస్.ఎస్.ఎల్.సి. అయిపోయింది. అ తర్వాత ఒకేడాది పి.యు.సి., మరో మూడేళ్ళు డిగ్రీ.. అంటే పధ్ధెనిమిదేళ్ళకే డిగ్రీ చేతికి వచ్చేసేయొచ్చన్న మాట. అలాంటప్పుడు ఒకరోజు నేను డిగ్రీ పరీక్ష రాయడానికి వెడుతూ, “ పరీక్షకి వెళ్ళొస్తానమ్మా.. “ అని చెప్పాను మా అమ్మగారితో. అప్పుడు ఆవిడ నాతో “యిదిగో చూడూ.. ఈ పరీక్ష పాసయ్యేలా రాయకు. ఫెయిలైపో..” అన్నారు. నాకు ఒక్కక్షణం ఆవిడన్న మాట అర్ధంకాలేదు. యెవరైనా పిల్లలు పరీక్ష రాయడానికి వెడుతుంటే  పెద్దవాళ్ళు “బాగా రాయమ్మా..” అంటారు కానీ యిలాగ ఫెయిలవమని అంటారా.. నాకు కోపంతోపాటు ఒకవిధమైన దుఃఖం కూడా వచ్చేసింది. “అదేంటమ్మా.. పరీక్షకి వెడుతుంటే అలా అంటావూ?” అన్నాను. అప్పుడు మా అమ్మగారు నెమ్మదిగా, “అదికాదమ్మా, నువ్విలా గబగబా డిగ్రీ పూర్తి చేసేసేవనుకో.. నీకు వయసెక్కువని పెళ్ళిసంబంధంవాళ్ళు అనుకుంటారు. అదే డిగ్రీ చదువుతూ వున్నావనుకో.. ఇంకా చిన్నపిల్లే..చేసుకోవచ్చు అనుకుంటారు. ఆ మెట్రిక్ కి కట్టేవాళ్లని చూడూ.. ఇంకా చిన్నవాళ్లనే అనుకుంటున్నారు..అదే నువ్వు డిగ్రీ తెచ్చేసుకున్నావనుకో.. వయసెక్కువనుకుంటారు. మంచిసంబంధాలన్నీ పోతాయి..” అన్నారు. మా అమ్మగారి తర్కానికి నాకు తల తిరిగిపోయింది. అప్పుడైతే అలా అన్నందుకు అమ్మ మీద చిరాకు పడ్డాను కానీ  తర్వాత నేనూ అమ్మనయ్యాక కానీ  అందులో వున్న ఆంతర్యం బొధపడలేదు. కూతురిని జీవితంలో బాగా స్థిరపరచడానికి తల్లి పడే ఆతృత ఆ తర్వాత కానీ తెలీలేదు. కూతురికి మంచి కుటుంబజీవితం యేర్పడాలన్న ఆ తల్లి ఆరాటం, దానికోసం తాపత్రయపడే అమాయకత్వం తల్చుకుంటే యిప్పటికీ వళ్ళు జలదరిస్తుంది. అందుకనే అమ్మ అమ్మే.. అమ్మ యేమన్నా అది తన పిల్లల భవిష్యత్తు బంగారం కావాలనే. ఈ రోజు మేమందరం యింత బాగున్నామంటే ఆ చల్లనితల్లి ఆశీర్వచనమే. ఈ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మని మరోసారి గుర్తు చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా వుంది. జి. యస్. లక్ష్మి. (ప్రముఖ రచయిత్రి)

అమ్మంటే ఎవరో తెలుసా “అమ్మంటే ఎవరో తెలుసా?” అంటూ ఒక ఆర్ద్ర గీతపు పల్లవిలో ప్రశ్న వేసి, చరణంలో ‘ తన సుఖాన్ని విడనాడి తరుణి తల్లి అవుతుంది. సంతానం కోసం బ్రతుకంత ధార పోస్తుంది’ అంటూ జవాబిచ్చారు, డా. నారాయణ రెడ్డి గారు. నా జ్ఞాపకాల దొంతరల్లో మా అమ్మ గురించిన తొలి జ్ఞాపకం, పదిమంది పిల్లల్ని తన చుట్టూ కూర్చోపెట్టుకుని, అన్నం కలిపి పెడుతున్న అన్నపూర్ణగానే. అమ్మ పేరు పార్వతి. పశ్చిమ గోగావరి జిల్లా నరసాపురంలో శ్రీ యేలేశ్వరపు జోగినాథస్వామి గారు, శ్రీమతి లక్ష్మీదేవమ్మ గార్ల నాల్గవ సంతానంగా పుట్టిన అమ్మ వివాహం నాన్నగారు శ్రీ రామకృష్ణ శాస్త్రి గారితో జరిగింది. స్వాతంత్ర్య పోరాటంలో జైలుకెళ్లి వచ్చిన తాతగారు స్వతంత్ర భారతాన్ని అన్నపూర్ణగా మార్చే యజ్ఞంలో నాన్నగారు పాలుపంచుకోవాలని వందెకరాల అడవిని కొన్నారు. చేస్తున్న ప్రభుత్వోద్యోగానికి పెళ్లైన కొత్తల్లోనే రాజీనామా ఇచ్చేసి నాన్నగారు ఆ అడవిని వ్యవసాయ యోగ్యమైన పొలంగా మార్చే పనిలోకి ప్రవేశించారు. పెట్టుబడికి డబ్బు లేదు. రాయీరప్పలతో ముళ్లపొదలతో నిండిన అడవి. నీటి వసతి లేదు. కనుచూపు మేరలో మరొక్క ఇల్లు కూడా లేని నిర్మానుష్య ప్రదేశం!విశాలమైన మండువా లోగిలిలో ధనవంతుల ఇంటి గారాల బిడ్డగా పెరిగిన అమ్మ , ఆ పరిసరాల్నీ, ఆ తాటాకు కుటీరాన్నీ చూసి బెంగపడినా సర్దుకుని ఆ ఇంట్లో భాగమై పోయింది. అత్త మామలు, ముగ్గురాడపడుచులూ, ముగ్గురు మరుదులూ, వారి పిల్లలూ, మామగారి చెల్లెలు , వారి కుటుంబం, అత్తగారి అక్కలూ , వారి పిల్లలు, ఇంకా పెదమామగారి మనవలు, స్నేహితులు వారి కుటుంబాలూ … ఇలా ఆ వనం లోని పర్ణశాలలో ఎప్పుడూ బంధువాహిని ప్రవహిస్తూ ఉండేది. ముఖ్యంగా ప్రతి వేసవిలోనూ ఆ తోటలో పారే సెలయేరులా , దూకే జలపాతంలా పాతికమంది పిల్లల హోరు ప్రతిధ్వనించేది. ఇంతమందికీ విసుగన్నది లేకుండా మామ్మ వెనకే అమ్మ చిరునవ్వుతో అన్నపానాలు ఏర్పాటు చేసేది. ఆత్మీయంగా, నిష్కల్మషంగా ఆదరించేది. వచ్చిన పిల్లలంతా ఆట పాటల వయసువాళ్లు కావడం వల్లా, వెంట వచ్చిన తల్లి తండ్రులు కొద్దిరోజులుండి వెళ్లిపోవడంతోనూ పని భారమంతా అమ్మ, మామ్మల మీదే పడేది. అయినా ఏనాడూ అమ్మ విసుక్కోగా నేను చూడలేదు. ఇల్లూ వాకిలీ శుభ్రపరచుకోవడం, ఇంతమందికీ కట్టెపుల్లల పొయ్యిమీద వండి వార్చడం, వడ్డించి , భోజనాలయ్యాక ఆ గిన్నెలన్నీ తోముకోవడం ఇలా ఎడతెరిపి లేని పని ఉండేది. వెనక్కి తిరిగి గుర్తు చేసుకుంటే ఆ ఇల్లు కూడా బంధుమిత్రుల రాక కోసం , వాళ్లు కొంతకాలం తీరుబాటుగా గడపడానికి వీలుగా కట్టినట్టు ఉండేది. ముందు పొడవాటి వరండా, మధ్యలో ఒక హాలు, వెనక విశాలమైన వంటగది , అటూ ఇటూ రెండు వసారాలు.. ఇంతే. పడక గది అనదగ్గ గదే లేదు ఆ ఇంట్లో. పక్షుల కిలకిలా రావాల మధ్య అమ్మ చల్లే కళాపి జల్లుల శబ్దంతో మాకు మెలకువ వచ్చేది. పెద్ద పెద్ద మెలికల ముగ్గులు తీర్చి , ఆవులూ గేదెల పాలు పితికి ఇంట్లో వారందరికీ పాలూ, కాఫీలూ అందించేది. అమ్మ కలిపే కాఫీ రుచి ఎంతో బావుండేది. ముందు వరండాకి అటూ ఇటూ ఉండే అరుగుల మీద కూర్చుని ప్రభాతవేళ నలుగురితో కలిసి సేవించే ఆ కాఫీ కబుర్ల  రుచి దేనితోనూ పోల్చలేనిది. వేసవి సెలవులు వచ్చాయంటే విడతలు విడతలుగా పిల్లకాయలంతా దిగేవారు. పొద్దుటి పన్లన్నీ పూర్తిచేసుకుని హాల్లో పెద్ద పెద్ద బేసిన్లలో-- చద్దెన్నంలో కొత్తావకాయ, మాగాయ, చివరగా పెరుగన్నం కలిపి పెడుతుంటే పిల్లలందరం అమ్మ చుట్టూ కూర్చుని తినేవాళ్ళం. పెరుగన్నం లో నలుచుకుందుకు కోసిన మామిడి ముక్కలు( తోటలోవి)! ఆ సమయంలో సాగే కబుర్లూ, గిల్లికజ్జాలూ, పరిహాసాలూ, నవ్వులూ వీటికి అంతే లేదు. బడిలో చదువుకునే రోజుల్లో ఒకసారి ఆటల్లో ఉండగా నా చెవి కమ్మ శీల ఊడి, ఎక్కడో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఒంటికున్న బంగారం ఆ కమ్మలు మాత్రమే. స్నేహితురాళ్లంతా చుట్టూ మూగి ‘ఇంక నీ పనయిపోయినట్టే. ఇలాగే నేను పారేసుకున్నపుడు మా అమ్మ చింత బరికె పుచ్చుకుని చితక్కొట్టింది’ అంటూ ఎవరి అనుభవాలు వాళ్లు చెప్పడం మొదలు పెట్టారు. బస్సెక్కి ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇల్లు చేరేవరకూ భయపడడం, ఇల్లు చేరగానే అమ్మకి చెప్పడం, “అయ్యో ! పోయిందా? పోనీలే… కావాలని పారెయ్యం కదా. ఏం పర్వాలేదు. పోయి ఆడుకోండి” అనడం గుర్తు. పదవ తరగతి పాసవగానే, పదిహేనేళ్లకే పెళ్ళయి అత్తగారింటికి వచ్చేసిన అమ్మ ఎక్కువగా చదువుకోలేదు. రోజంతా ఇంటి చాకిరీలోనే గడిచిపోయేది. అయినా మధ్యాహ్న భోజనాలతర్వాత దొరికే గంటా గంటన్నర సమయంలో ఏదైనా చదవని పుస్తకం ఉంటే బావుండునని వెతుక్కునేది.అమ్మ అలా శ్రద్ధగా చదివే దృశ్యం నాలో ఏదో ఉత్కంఠని రేకెత్తించేది. అలా ప్రాధమిక పాఠశాలలో ఉండగానే కనిపించిన పుస్తకాన్నల్లా వదలకుండా చదివేయడం అలవాటయింది. ఆర్ధిక ఇబ్బందులు ఎంతగా ఉన్నా ఒకటో, రెండో వార పత్రికలు తప్పనిసరిగా పోస్ట్లో తెప్పించేవారు నాన్నగారు. ఆ పుస్తకం ఎవరు ముందు అందుకుంటే వాళ్లు చదివి ఇచ్చేదాకా మిగిలిన వాళ్లు వేచి ఉండాల్సిందే. ఒకసారి మధ్యాహ్నం వేళ పోస్ట్ లో వచ్చిన వార పత్రిక నా చేతికందింది. మరో పదినిముషాలకి అమ్మ విశ్రాంతి సమయమయింది.’ ఏదర్రా పుస్తకం?’ అంటూ అమ్మ వచ్చేసరికి శ్రద్ధగా సీరియల్ చదివేస్తున్న నేను, ‘చదివేశాక ఇస్తా’నన్నాను. వెంటనే చిన్నబోయిన మొహంతో “నీకు రోజంతా బోలెడు టైముంటుంది. నాకీ కాసేపటి తర్వాత వరసగా పనుంటుంది” అంది. ఆ మొహం , ఆ కంఠం, వెంటనే పత్రిక అమ్మకి ఇచ్చేసిన ఆ సంఘటనా ఇప్పటికీ స్పష్టంగా గుర్తుండిపోయింది. అలాగే ఒక వేసవి రాత్రి, పిల్లలందరం అపుడే కొత్తగా కట్టిన డాబా మీద ఆట పాటల మధ్య సరదాగా గడుపుతూ పిట్టగోడ మీద నుంచి తొంగి చూస్తే వెనక పెరట్లో అమ్మ ఒక్కత్తీ బండెడు గిన్నెలు తోముతూ కనిపించడం, చిన్న పిల్ల గా నాకది సహజంగా అనిపించడం , నా వెంట ఉన్న మా పెద్దమ్మ గారి అమ్మాయి నొచ్చుకుని “దా మనిద్దరం వెళ్లి పిన్నికి సాయం చేద్దాం” అని వెంట తీసుకెళ్లడం నా మనసులో చెదరని దృశ్యంగా నిలిచిపోయింది. అమ్మా నాన్నగార్ల ఆ నిరాడంబర జీవనం, తోటి వారికి వాళ్లు అందించిన ప్రేమాప్యాయతలూ గుర్తొచ్చినపుడు గర్వంగా, వ్యవసాయ దారుల నిరంతర శ్రమకు ఫలితం లభించని వ్యవస్థ పట్ల విచారమూ కలుగుతాయి. నేను బియెస్సీఆఖరి సంవత్సరం చదువుతుండగా  అమ్మ కాలుజారి పడి మోకాలి లిగమెంట్  దెబ్బతినడం, నడవలేని స్థితిలో మంచాన పడడం జరిగి, అప్పటి దాకా ఇంటెడు పనీ సమర్ధించుకుంటూ వచ్చిన అమ్మ ఒక్కసారిగా నిస్సహాయస్థితికి లోనైంది. బియెస్సీ పూర్తవుతూనే ఎమ్మెస్సీకి ప్రవేశ పరీక్ష రాస్తానని వెళ్లి , సీటు తెచ్చుకుని నేను హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరాను. అయితే అమ్మకి అవసరమైన సమయంలో నేను దగ్గర లేకపోయాననే ఒక బాధ మనసులో నిలిచిపోయింది. అప్పుడు నా చెల్లెలు డిగ్రీ చదువుతూ అమ్మ దగ్గరే ఉండడం వల్ల నా పై చదువు కొనసాగింది. ఆ తర్వాత సరైన చికిత్స అందడం, అమ్మ మామూలు స్థితికి చేరడం జరిగింది గాని, మొదటి సంవత్సరం సెలవులకి ఇంటికి వచ్చిన నేను ‘డిస్క్ ప్రొలాప్స్ ‘ వల్ల తీవ్ర అస్వస్థతకి గురవడంతో నెలల తరబడి ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. అపుడు నావెంట ఉండి నాకు సేవ చేసింది అమ్మే. అంతవరకు ఆసుపత్రి ఎలా ఉంటుందో ఎరగని నాకు నెలలతరబడి ఆసుపత్రిలో ఉండాల్సి రావడం , విశ్వవిద్యాలయంలో ప్రథమ స్థానం కోసం కృషి చేస్తున్నపుడు చదువుకి ఇలా అంతరాయం కలగడం తీవ్రమైన ఆశాభంగాన్ని కలగ జేశాయి. చికిత్స తర్వాత మళ్ళీ చదువు కొనసాగించి కోరుకున్న విధంగా విశ్వవిద్యాలయంలో ప్రథమురాలిగా ఉత్తీర్ణత పొందినపుడు అమ్మ పొందిన ఆనందం ఇంతా అంతా కాదు. అప్పుడే కాదు ఆ తర్వాత కూడా పిల్లల పురుళ్ళపుడూ, వారి పసితనపు అనారోగ్యాలలోనూ, నాకు సుస్తీ చేసినపుడూ నా వెంట ఉండి సాయపడింది , నాకు ఆసరా ఇచ్చిందీ అమ్మే. ఒంటి నిండా నగలతో అత్తగారింటికి వచ్చిన అమ్మకి  తన పుట్టింటికి వెళ్లినపుడు నగలేవీ లేకుండా వెళ్లడం నామోషీగా ఉండేది. పంటలు బాగా పండి,  చేతి నిండా గాజులు వేసుకోగలగాలని కోరుకునేది. నా మొదటి పెయింటింగ్ అమ్మకమైనపుడు ఆ డబ్బుతో అమ్మకి నాలుగు బంగారు గాజులు కొనివ్వడం నాకొక మధుర స్మృతి. ఇప్పటికీ పిల్లలెవరి దగ్గరున్నా ఏదో ఒక పని అందుకుంటూ, సగంలో ఏపనైనా ఆగిపోయి కనిపిస్తే నిశ్శబ్దంగా ఆ పని పూర్తి చేసేస్తూ, మనవల్ని ఆదరిస్తూ, నిండు గోదారిలా సాగిపోయే అమ్మ నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు నేల మీద ఉదయించిన దేవతే. వారణాసి నాగలక్ష్మి(ప్రముఖ రచయిత్రి).

నేను మా అమ్మ అమ్మ అంటే ప్రేమ! అమ్మ అంటే మమతకు ప్రతిరూపం! అమ్మ లేనిదే ఈ ప్రపంచమే లేదు! అమ్మ అంటే ఒక భద్రతా! ఆమె ప్రథమ గురువు , స్నేహితురాలు, మార్గదర్శకురాలు! మంచి చెడు, సుఖం దుఖం ఎలాంటి పరిస్తితులోచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పినది అమ్మే. మా అమ్మ పేరు అయ్యగారి లక్ష్మీ దేవి. ఆ కాలం లో ఆడపిల్లకి 'చాకలి పద్దు' రాయడం వస్తే చాలనే అనుక్కునే వారు, దానికి తోడూ చిన్నతనాన్నే పెళ్ళి అవడం వల్ల మా అమ్మ4 గో క్లాస్ దాకానే చదువు కుందట. ఆవిడకీ చదువు మీద చాలా మక్కువ, అందుకే మా నలుగురి అక్కచెల్లెళ్ళనీ గ్రాడ్యుఏషన్ అయ్యాకే పెళ్ళిళ్ళని, మా నాన్నగారిని వప్పించింది. మేమందరం చదువుకోవడమే కాకుండా, ఆవిడ ప్రోత్సాహం వల్లే ఉద్యోగాలు కూడా చేసాము. మాకు కావలసిన పుస్తకాలు సర్ది పెట్టడం టిఫిన్ బాక్స్ లు తయ్యారు చెయ్యడం, ఒక్కటేమిటి, ప్రతీ అవసరం తానే చూసుకునేది. పరీక్షలకి చదువుకుంటుంటే అర్ధరాత్రయినా, మాతోటే కూర్చునేది. అసలు ఆవిడా లేనిదెక్కడా, వేనకాలే ప్రతీ అవసరానికీ మమ్మలిని ఆదుకునేది. అమ్మ గురించీ ఏమని చెప్పను ఎంతని చెప్పనూ..... నా విజయానికి, నా మనుగడకి నా జీవిత ప్రగతికి ఆవిడే కారణం.  నేను, స్కూల్ లో ఆంగ్ల మాధ్యమంలో చదువు కున్నా , అమ్మ వల్లే తెలుగు నేర్చుకున్నాను. ఆవిడ కోసం మా నాన్నగారు తీసుకు వచ్చిన, అన్ని తెలుగు వార, మాస పత్రికలన్నీ, ఆవిడ కన్నా ముందు నేనే చదివేదాన్నీ. అమ్మ లేని లోటు పూడ్చ లేనిది. ఈ మాతృ దినం నాడు అమ్మని గుర్తు చేసుకుంటూ, జన్మజన్మలకూ నేను ఆమె పుత్రికగానే జన్మించాలనీ, ఆ దేవదేవుణ్ణీ కోరుకుంటూ, ఇవే ఆమెకూ నా  స్మృత్యాంజలులు. వడ్లమాని బాలా మూర్తి.-- (రచయిత్రి.)

అమ్మంటే అమ్మ ఎంత చక్కని పదం. మనిషి జీవితం అమ్మ చుట్టే అల్లుకు పోతుంది. తొలి అడుగు వేసినప్పటి నుంచి జీవితంలో ఎన్ని అడుగులు వేసినా అమ్మే తొలి గురువు. చిన్నప్పటి నుంచి మా అమ్మతో నా అనుబంధం లోని చిరు ఙ్ఞాపకాల పందిరి....అమ్మ కాలం చేసి 25 సంవత్సరాలు గడిచినా అమ్మతో అనుబంధం ఎప్పటికీ మరువలేనిది. మా అమ్మే నా స్నేహితురాలు. స్కూల్లో జరిగే ప్రతి విషయమూ రాగానే చెప్పేదాన్ని. ఆరోజుల్లో మాయింట్లో ఆడైనా, మగైనా డిగ్రీ వరకూ కూడా చదవలేదు. మా అక్కయ్య, అన్నయ్యలు పైస్కూలుతోనే ఆపేశారు. మొట్టమొదటిసారిగా ఇంటరులో కాలేజీలో (మొదటి బాచ్) చేరింది నేనే. నా తరువాత మా చెల్లెల్లు అందరూ డిగ్రీ కూడా చేశారు. నాకు చదవాలనే కోరిక ఎంతో వుండేది. ఇంటరు తరువాత డిగ్రీలో చేరతానని అంటే ఎవరూ ఒప్పుకోలేదు. ఎక్కవ చదవాలంటే ఎక్కువ చదివిన వరుడ్ని తేవాలి అన్నారు. రెండు రోజులు అలిగి భోజనం కూడా చేయలేదు. అయినా నా కోరిక తీరలేదు. ఆ తరువాత శ్రీవారి ప్రోత్సాహంతో బి.ఏ. ఎం ఏ , ఇటీవలే ఎం  సి జె  పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచీ కష్టాలు అనుభవించిన మా అమ్మ జీవితమే మాకు పాఠాలు. . వంటింటి జీవతం నుంచి  రోజూ ఎదురయ్యే సంఘటనలు ఎలా ఎదుర్కోవాలి... ఎక్కడ పొదుపు చేయాలి... వంటచేయటం లోని మెలుకువలు....   ఎలా మాట్లాడాలి..తెలుసుకున్నాను.  జీవిత పాఠాలు నేర్పింది అమ్మే. పిల్లలు ఎంత వరకు మాట్లాడాలి... పెద్దలు మాట్లాడే టప్పుడు దూరి అవకతవకలు మాట్లాడకూడదు ఇత్యాది మంచి విషయాలూ నేర్పిందీ అమ్మే. తన కష్టాలు, అన్నీ చిన్న దాన్ని అయినా  నాతోనూ పంచుకునేది. అమ్మ చాలా వరకు మాటల్లో మన తెలుగు సామెతెలు వాడేది. అంతే కాదు అమ్మతోటే నా ఆటలు.... అంటే ఆ రోజుల్లో పచ్చీసు, అష్టా చెమ్మా, చింతపిక్కలాట, వామన గుంటలు,  ఇలా ఎన్నో.... ఆటలు.... మా అమ్మ అంటే నాకు మరీ ఇష్టం. మా  అమ్మ చేతి రాత చక్కగా ముత్యాల్లా గుండ్రంగా వుండేవి. మా అమ్మ ఉత్తరాలు రాస్తే అపురూపంగా దాచుకునేదాన్ని. ప్రతి అక్షరం విడి విడిగా లైనులో రాసేది. అదే నేను రాస్తే కన్యాకుమారి నుంచి కాశ్మీరుదాకా పైకి పోయేది లైను. ... చిన్నప్పుడు   నాకు మా అమ్మ చేతి రాత చూసి మా అమ్మ బాగా చదువుకుంది   అనుకునేదాన్ని. మా అమ్మ నేను చదువుకోలేదు. 5వ తరగతి వరకే చదివాను అని . కానీ నేను నమ్మేదాన్ని కాదు. లేదు నువ్వు అబద్ధం చెబుతున్నావు అని పోట్లాడేదాన్ని.... తరువాత అమ్మ చెప్పేది నిజమే అని తెలిసింది. అన్నిటా అమ్మే స్ఫూర్తి.  మేం ఆరుగురం పిల్లలం అయినా ఇంటి విషయాలు కానీ, పొలం వ్యవహారాలు కానీ, ఆర్ధిక వ్యవహారాలు.... ఇలా అన్ని విషయాలూ నాతో చర్చించేది. ఆవయసులో ఏమిటో గానీ... నాకు నేనే గొప్ప అనుకుని  నాకు తోచిన సలహాలూ ఇచ్చేదాన్ని.... మా నాన్నకు తన వ్యాపారంలో ఎవరికైనా ఉత్తరాలు ఇంగ్లీషులో కానీ, తెలుగులో కానీ రాయాలంటే నేనే రాసేదాన్ని. ప్చ్... ఏమిటో ఆరోజులే లేవు... మరచిపోని ఆ రోజులు. మళ్లీ రమ్మంటే రావు.... ఙ్ఞాపకాలు తప్ప.... మిగిలినవి అవే.....  ఒక లీడర్ గా పెళ్ళి కాకముందు పుట్టింట్లో మెలిగిన నేను అమ్మ అంటే వివాహం అయిన తరువాత కూడా ప్రతి విషయంలోనూ అమ్మ స్మృతులే వెంటాడేవి....  ఇప్పటికీ మా అమ్మ చేతి వంట ఎంతో రుచి. అమ్మని తలుచుకుంటూ ఇప్పటికీ అమ్మ చేసే ఏ వంట అయినా చేస్తే చాలా రుచిగా వస్తుంది. భోజనం చేసినా అందరం కలిసి తినే వాళ్ళం. మా చిన్నపుడు పిల్లందరికి ఒకే కంచం లో అందరికి కలిపి ముద్దలు పెట్టేది. ఎంత రుచిగా ఉండేదో. ఇట్టే కంచం ఖాళీ అయ్యేది. లోకం అంతా మదర్స్ డే అని జరుపుకోటం  ఈ రోజు  అమ్మ ఙ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకోవటం నిజంగా మధురమే. ఆసలు మర్చి పొతే కదా ఆ రోజే గుర్తు తెచ్చుకోడానికి. ఆ రోజుల్లో ఫోటో అంటే చాలా గొప్ప. కెమెరాలు వుండేవి కాదు. అందుకే మా అమ్మా నాన్నా కన్యాదానం చేసే ఫోటో పెట్టా. చూడండి. మణి కోపల్లె -- (రచయిత్రి.)

అమ్మతో అనుబంధం అమ్మతో పిల్లలకి ఉండే అనుబంధం చెప్పనలవి కాదు. అమ్మంటే ప్రేమ, అమ్మ దగ్గర చనువు, అమ్మ మీద విసుగు, అమ్మ ఏదన్న నచ్చని విషయం చెబ్తే కోపమ్.... ఎందుకు? మనం ఏం చేసినా అమ్మ ఏమీ అనదనే ధీమానా? ఒక వేళ ఏమైనా అన్నా మళ్ళీ దగ్గరికి తీసుకుని లాలిస్తుందనే భరొసావా ? Do we take her for granted ? Not realizing, that one day she will leave you and everything and replaces herself with you to go through her path ?? చిన్నప్పుడు, అమ్మ ఒక్క నిమిషం కనిపించక పోతే, ఏడ్చేశాను  . అమ్మ కోసం ఇల్లంతా, ప్రతి మూల మూలన, వంటింట్లో, స్టోర్ రూం లో, డాబా మీద వెతుక్కున్నాను .  చివరికి అమ్మ హాల్లో బొంత మీద పడుక్కుంటే చూసి, అమ్మ పక్కలో చేరి అమ్మ గుండెల్లో తల పెట్టుకుని నిశ్చింతగా పడుక్కున్నాను.  అలాంటిది, అమ్మని వదిలి, చదువు పేరు చెప్పి అమ్మకి దూరంగా ఎక్కడో విజయనగరంలో బాబయ్యగారింట్లో, ఒక సంవత్సరం పాటు ఉండాల్సి వచ్చింది. మా నాన్న గారికి, ప్రతీ మూడేళ్లకీ transfers అవుతూ ఉండేది. మా చదువులు పాడవుతాయని విజయనగరంలో మా బాబయ్య గారింట్లో చదివించారు. అన్న అంతకు ముందు సంవత్సరమే వెళ్ళాడు. నాన్న నన్ను కూడా అన్నతో పాటు పంపుతానంటే అమ్మ గోల చేస్తుందని, అమ్మని వదిలి, నిమిషం కూడా ఉండలేని నేను బెంగ పెట్టు కుంటానేమోనని  నన్ను ఆ మరుసటి ఏడు పంపారు. నాలుగో తరగతి నుంఛి  సెకండ్ ఫార్మ్ కి ఎంట్రన్స్ రాయడానికి విజయనగరం వెళ్ళాను. అక్కడే ఒక ఏడాది చదివాను. అమ్మ గుర్తుకువచ్చి గుబులు గుబులుగా ఉన్నా, కొత్త స్కూలు, కొత్త్తగా English నేర్చుకోవడం higher level maths , science, geography ---వీటన్నితో బిజీ ఐపోయాను. బాబయ్యగారి అమ్మాయి సుందరి తో చాల close ఐపోయాను. కాని ఎంత మంది ఉన్నా అమ్మ అమ్మే. Final Exams అయ్యాక, పిల్లందరం కలిసి, ముద్దుబిడ్డ సినిమా కి వెళ్ళాం. అందులో పాట , "చూడాలని ఉంది, అమ్మా చూడాలని ఉంది," అనే పాటని casual గా పాడుకుంటూ, ఎదురుగా ఉన్న అమ్మా నాన్నల ఫోటో చూడగానే ఏడుపోచ్చేసింది. ఏడుస్తూ కూర్చున్నాను. ఆ రాత్రి భోజనం కూడా చెయ్యకుండా పడుక్కున్నాను. దాంతో నాన్నమ్మ, బాబయ్య, పిన్ని అందరు ఏకగ్రీవంగా , ఎవరి పిల్లలు వాళ్ళ వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరుంటే మంచిది అని decide ఐపోయారు. అమ్మ దగ్గరకి వచ్చాకా, మళ్ళీ ప్రతీ చిన్న చిన్న విషయాలకి, arguments , కోపాలు, అలకలు మామూలే., రోజులు, సంవత్సరాలు, గడిచిపోయాయి. మా కోపతాపాల మధ్య, అలకలు, సాధింపులు, tantrums లన్నీఎంతో సహనంతో భరించి , అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసి, పెళ్ళిళ్ళు చేసి, మంచి భర్తని, జీవితాన్ని, ఇచ్చింది. అన్న America వెళ్లి  సెటిల్ అయ్యాక, మమ్మల్ని sponsor  చేస్తే మేం కూడా America వెళ్లాం. పిల్లలు, పెద్దవాళ్ళయి, నన్ను ఎదిరించి మాట్లాడడం, arguments , అలకలు, కోపాలు . అమ్మా! నువ్వు మాతో పడ్డ బాధ ఇప్పుడర్థమవుతోందమ్మా! ఎన్ని మంచి సూక్తులు చెప్పేది ? ఎన్ని బుద్ధులు గరిపింది.? ఈ మధ్య అమ్మ బాగా జ్ఞాపకానికి వస్తోంది . ఎప్పుడో చిన్నప్పుడు , బాలానందం కార్యక్రమం లో  నేర్చుకున్న పాట మనసులో మెదిలింది . "అమ్మ మాట ఎంతో అనడమూ మా అమ్మ మనసు మంచి గంధము. అమ్మ ముద్దు చల్లన, అమ్మ సుద్దు తెల్లన అమ్మ ముద్దు సుద్దులే ఆది గురువులు, అమ్మ మాట సాహిత్యం అమ్మ లాలి సంగీథమ్. " పాట పూర్తిగా గుర్తు లేదు . Friends లో ఎవరికైనా తెలుసేమో కనుక్కొవాలి. చిన్నక్క, బావ, వాళ్ళబ్బాయి కూడా US migrate అయిపోయారు. అమ్మకూడా వాళ్ళతో US వచ్చేసింది . చిన్న చెల్లెలి భర్త పిల్లలు మాత్రం India లొనే ఉండి  పోయారు. రోజూ  office నుంచి  అన్న ఇంటికి వెళ్లి, అమ్మని చూసి వచ్చేదాన్ని. weekends కి అమ్మని మా ఇంటికి తీసుకువచ్ఛేదాన్ని.  చిన్నప్పుడంతా  అమ్మని సతాయించాను. ఇప్పుడన్నా, అమ్మని, ప్రేమగా చూసుకోవాలి. చిన్నతనంలో miss ఐనదంతా ఇప్పడు పొందాలి. site seeing కి ఎక్కడికి వెళ్ళినా, friends ఇళ్ళకి వెళ్ళినా, గుడికి, స్వామి చిన్మయానంద గారి ప్రవచనాలకి, ఇలా నేనెక్కడికి వెళ్ళినా  అమ్మని కూడా తీసుకువెళ్ళేదాన్ని. రెండు వారాలనుంచి ఆఫీసు లో పని ఎక్కువవడంతో అమ్మని చూడడానికి వెళ్ళడానికి వీలుపడ లేదు. ఆ రోజు office కి వెళ్తూ ఉంటే అమ్మ ఫోన్ చేసింది. "ఎలాగున్నావ్? ఆఫీసు లో పని ఎక్కువగా ఉన్నట్టుంది. ఛాల రోజులైందే  నిన్ను చూసి . ఒక్కసారి కనిపించి వెళ్ళవే. పోనీ, లోపలికి రావద్దులె. ఆ cul-de-sac లో నీ ఎర్ర car అలా ఓ సారి తిప్పుకుని వెళ్ళు. నీ కారు చూస్తే నిన్ను చూసినట్లే ఉంటుంది నాకు " అంది.  అలాగెలేమ్మా, ఈ రోజు overtime ఉంది office లో. early గా పని పూర్తయితే office నుంచి డైరెక్ట్ గా వస్తాను, లేకపోతే రేపు, ఆఫీసుకి వెళ్ళే ముందు వచ్ఛి వెళ్తాను." అని చెప్పాను. ఆ సాయంత్రం ఆఫీసు నుంచి వచ్ఛే సరికి, 9, అయిపోయిన్ది. అమ్మకి phone చేసి ఇంక ఇవేళ రాలేనమ్మా అని చెబుదామనుకునే లోగా అమ్మే phone చేసింది ."ఏంటి వస్తున్నావా ?" అని. "Sorry అమ్మా ! ఇంక ఇవేళ రాలేనమ్మా, tired  గా  ఉంది . రేపోస్తాను", అన్నాను. ఏమనుకుందో ఏమో, ఎం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. నేను అన్నది, నిజం చేస్తూ ఆ మర్నాడు పొద్దున్నేఅమ్మని చూడడానికి వెళ్ళాల్సి వచ్చింది .  వదిన ఫోన్ చే శారు , "లక్ష్మి! అమ్మ అదోలా ఉన్నారు, మీరు వెంటనే బైలుదేరి రండి, నేను  Ambulance కి Phone చెయ్యాలి, మీరు, మీ అక్కకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి.", అని చెప్పేసి నేనేదైనా అడిగే లోపలే ఫోన్ పెట్టేశారు . నేను బట్టలు మార్చుకుని మా వారితో, పిల్లల్ని తీసుకుని అన్నా వాళ్ళింటికి వచ్ఛేయమని చెప్పి, అక్కకి ఫోన్ చేసి చెప్పి, కార్ తీసుకుని బయలు దేరాను. అన్నఇల్లు  మా ఇంటికి సరిగ్గా 5 నిమిషాల దూరం.  కార్ పార్క్ చేసి, అమ్మ గది లోకి వెళ్లేసరికి అన్న అమ్మ pulse చూస్తున్నాడు. నన్ను చూడగానే, "అమ్మ ఇప్పుడే వెళ్లిపోయిన్దే", అన్నాడు . నమ్మలేకపోయాను. రాత్రే కదా మాట్లాడింది ? ఇంతలోకి ఏమైంది ? కడుపులోంచి దుఖ్ఖ్హమ్   తన్నుకొచ్చింది . "ఎంత పొరపాటు చేసాను. అమ్మ కి ఎందుకు నన్నంతలాగా  చూడాలనిపించింది? తన ఆఖరి క్షణాలు, తనకి అనుభవమైన్దా? నాకెందుకు అమ్మని ఇంక చూడలేనేమో అనే భావన రాలేదు? అమ్మలకి ఉండే intuition పిల్లలకి ఉండదా? ఆగలేదు కన్నీళ్ళు. ఒక్కసారి అమ్మ మంచం మీద కూర్చుని, " సారీ అమ్మా !. నువ్వు చివరిగా అడిగిన చిన్న కోరికని కూడా తీర్చ లేకపోయాను.", అని భోరున ఏద్చేసాను. "అమ్మా, చిన్నప్పుడొక సారి నాకిష్టమైన బెండకాయ పులుసునీళ్ళ కూర చెయ్యలేదని అలిగాను గుర్తుందా?  . ఇప్పుడు  నువ్వు రమ్మన్నప్పుడు రాలేదని కోపం వచ్చిందా అమ్మా?"  ఏదో చెప్పనలవి గాని బాధ ఆవరించింది . ఆవేదన అంచులు దాటింది .  నెమ్మదిగా, అన్న నా భుజం మీద చెయ్యి వేసి ఓదార్చాడు. డెబ్భై ఏళ్ళ వయసులో కూడా  అమ్మ తెల్లవారగట్ల 3 గంటల కి లేచి స్నానం చేసి, పూజ చేసుకుని, అన్నకి ఇడ్లీలు పెట్టి గుండెల్లో నెప్పిగా ఉందని ఒదిన తో చెప్పిందిట. వదిన తో ఆయాసంగా ఉందని, ఊపిరి పీలుస్తూ ఉంటె గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పిందిట."ఇదే మరణ బాధేమోనే , ఇదే  ఐతే  భరించొచ్ఛు" అందిట.  అన్న Doctor. తను వచ్చే సరికి ఆయాసం ఎక్కువయిందిట . మాట్లాడుతూ, మాట్లాడుతూ అన్న చేతుల్లో అమ్మ ప్రాణం పోయింది. ఎన్నో కష్టాలు పడి ఎంతో ప్రేమతో , సహనంతో ఎనమండుగురు పిల్లల్ని కనీ పెంచిన తల్లి, కన్న కొడుకు చేతుల్లో అనాయాస మరణం పొందింది . ఒక మనిషికి ఉండవలసిన రెండు అదృష్టాలలో, మొదటిది -- అనుకూల దాంపత్యం పొందిందో లేదో తెలీదు కాని , రెండో అదృష్టం మాత్రం పొందింది. మనుషులు ఉండగా వాళ్ళ విలువలు తెలియవు. మన దాకా వస్తేనే గాని మనకి అమ్మ పడిన  కష్టం ఏమిటో తెలీదు. అమ్మతో మనసారా ఎప్పుడూ 10 నిమిషాలు స్థిమితంగా కూర్చుని మాట్లాడలేదు . అమ్మ ఎప్పుడూ మడి, తడి అంటూ, వంటింట్లో వంటలు వండుతూ పూజలు చేస్తూఉండేది , విజయవాడ జంక్షన్ అవడం తో వచ్చే పోయే బంధువులతో ఎప్పుడూ ఊపిరి సలిపేది కాదు అమ్మకి. మేం పిల్లమంతా మా friends, మా ఆటలు, చదువులు తప్ప అమ్మతో close గా మసలలేదన్పిస్తుంది  మా అమ్మ తన పిల్లలకి home work చెయ్యడానికి హెల్ప్ చేయకపోవచ్చు. వాళ్ళకి కావాల్సిన బట్టలు, పుస్తకాలు కొనివ్వలేక పోయి ఉండవచ్చు. కానీ, తన సంతానానికి, తన సత్వ గుణాన్ని సమానంగా పంచి పెట్టింది. ఈనాడు, మాలో ఏమన్నా మంచీ, మానవతా ఉన్నాయంటే, అవి మా అమ్మ, మాకిచ్చిన ఆస్తి. అమ్మ ఇచ్చిన సంపద "మానవత, మంచి తనం ", అవి చాలు మాకు కల కాలం. -- లక్ష్మి కర్రా

నేను అమ్మ కన్నా మంచి అమ్మను కాను అమ్మ మనకు మనము తెలియకమున్దె మనము తెలిసిన వ్యక్తి అమ్మ. మన పేరు చెబితె చాలు ప్రపన్చమ్ మనలని గుర్తిన్చాలని తపన పడే వ్యక్తి అమ్మ. తన వూరూ, పేరు కన్న మన పేరు బయట లోకాని కి తెలియాలని తపత్రయపడేది. చిన్నపుడు అమ్మ తిడితె - మన్చి చెడు నేను చెప్పకపోతే ఎవరు చెప్పుతారు? అమ్మ పెన్చిన బిడ్డ,అయ్య పెన్చిన బిడ్ద అని అడుగుతారు అని అన్నప్పుడు అర్థము కానిది, కాపురము మొదలైనప్పుడు బాగా తెలిసివచ్చిన్ది తొన్దర్గ తెమలన్డి,టైమ్ ప్రకారము వున్డాలీ అని చెపితే అబ్బా నస, అనుకొనే దాన్ని,ఇప్పుడు పిల్లల్లకు టైమ్ ప్రకారము నేర్పిన్చినప్పుడు-అచ్చు అమ్మ లాగానే మాట్లాడుతున్నాన్నె. ......... ఆడపిల్లవి-గెన్తకు,దూకకు,అల ఎవరితొ పడితె వాల్లతొ మాటలడకు-అన్నప్పుడు నా అన్త ఫెమినిస్టు వున్దదెమో.ఇప్పుడు నా కూతూరి కి చెప్పే మాటలు అన్ని జాగ్రతలు అని నేను చెబితే మీరు నమ్మాలి. అమ్మ కన్న బాగా చదువుకొన్నా, లోకము చూసినా, మా అమ్మ కన్నా నేను మన్చి అమ్మను కాలేను. మరి అన్త మన్చి అమ్మ కు అమ్మైన అమ్మమ్మ ఇన్కా ప్రియము. మీ అమ్మ, అమ్మమ్మ కూడా మీకు అన్తే కదా. --కనకదుర్గ జొన్నలగడ్డ

నీడలా మా అమ్మే నా వెంట అమ్మతో నా అనుబంధం గురించి రాయాలంటే ఒక ఉత్గ్రంధమే అవుతుంది.  చిన్న వ్యాసంలో చెప్పాలంటే కష్టమే.  నేను పుట్టినప్పుడు మొదటిసారి తన చేతుల్లోకి తీసుకొని ఎంత ప్రేమగా నా తల నిమిరి ఆతన గుండెలకు హత్తుకుందో నాకు యాభై ఏళ్ళు వచ్చినా అంతే ప్రేమగా తల నిమురుతుంది.   నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది.   అందరు అమ్మలు అదే చేస్తారు.  ఇందులో గొప్పెముంది అనుకోవచ్చు.   గొప్పే మరి.   ఒక చిన్నపాటి జమీందారీ కలిగిన ఇంటికి పెద్ద  కూతురు, ఇంకో చిన్న జమీందారీ ఇంటి చిన్న కోడలు.  నిప్పులు కడిగే వంశాలు.  అనివార్య కారణాల వల్ల మానాన్న సంపాదన సరిగా లేక బాధ్యత లేకుండా తిరుగుతుంటే కష్టపడి చదివి ఉద్యోగం హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగిని అయింది.  ఇంటి ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే ఇంటి పరువు పోతుందన్న అత్తింటి వాళ్ళను పుట్టింటి వాళ్ళను ఎదిరించిది.  ఇదంతా మా చెల్లిని నన్ను తాను అనుకున్నట్టు  పెంచదానికి చదివించడానికి.    నాకు ఝాన్సీ అనిపేరు పెట్టినప్పటి నుండే ధైర్యం నూరి పోయడం మొదలు పెట్టింది.  "సమాజం తొక్కుతె మొక్కుతుంది,  మొక్కితే తొక్కుతుంది"    ఇది నాకు నేర్పిన బ్రహ్మ సూత్రం.  ప్రతి చిన్న విషయం లోను ఎంతో శ్రధ్ధ తీసుకునేది.  ఏమాత్రం సౌకర్యాలు లేని టైమ్ లోనే దూరాలు ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్ళి వచ్చేది.  సాయంత్రం వచ్చి నన్నుచెల్లిని చదివించేది.    ఒంట్లో బాగాలేక పోయినా పరీక్ష లో మార్కులు బాగా రాక బాధపడుతున్నా  ధైర్యం చెప్పి వెన్నంటే ఉండేది.  టెన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు,  ఉద్యోగాలాకోసం  కంపిటేటివ్ పరీక్షలు ఒకటేమిటి ఏ సందర్భం తలచుకున్నావెనుక కొండత అండగా మా అమ్మే ఉన్నట్టు కనబడుతుంది.   ఇవన్ని ఒక ఎత్తు ఐతే నాకు . పుస్తకాల పైన ఇష్టాన్ని పెంచింది. ప్రపంచంలోని వ్యక్తులను అర్థం చేసుకోవడానికి ఇంతకంటే సులువైన మంచి సాధనం లేదని చెప్పింది.   ఇప్పటికీ తాను చదివిన మంచి పుస్తకంలో విషయాలు నాతో పంచుకుంటుంది.     ఉన్న ఉళ్లోనే సంబందం చేయాలని కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగింది.   అనుకున్నట్టుగానే హైద్రాబాద్ లోనే ఉండే అబ్బాయి తో పెళ్లి చేసింది.  ఉద్యోగం పిల్లలు రెండు భాద్యతలతో నేను సతమవుతూఉంటే  పిల్లలను తనతో ఆఫీస్ కి తీసుకేళ్లేది.  తన పని చేసుకుంటూనే వాళ్ళను కూడా చూసుకునేది.    ఇప్పటికీ ప్రతి ఏడాది దీపావళికి మా నలుగురికీ ఉన్నంతలో బట్టలు పెడుతుంది.  ఎన్దుకమ్మా నీకు శ్రమ అంటే,   నాన్న వెంట లెక్‌పోవడం వల్ల నాకు లోటు జరిగిందని నువ్వు కానీ అల్లుడు కానీఅనుకోకూడదని అంటుంది. నేను ఈత గింజ ఇవ్వబోతే తాను తాటి పండు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది.  మా అమ్మ అనే మహా నదిలోనుంచి ప్రవహిస్తూ ఉన్న పిల్ల కాలువని నేను.    ఆనాడు మా అమ్మ కనుక అంత సాహసం చేసి సమాజానికి ఎదురు నిలిచి మమ్మల్ని చదివించక పోయి ఉంటే  నాకు ఇంత రంగుల  మయమైన రసవంతమైన జీవితం దొరికెదే కాదు.    యాభై ఏళ్ల జీవితం లో వెనక్కి తిరిగి చూసుకుంటే  నీడలా మా అమ్మే నా వెంట ఉంది. --ఝాన్సీ మంతెన

అమ్మ లేని నేనులేనే లేను అవును..పెద్దవుతున్నకొద్దీ....అమ్మలేదని తట్టుకోలేక తిట్టుకుంటానేమో కాని కన్నతల్లి తలపులు తట్టిలేపుతూండడం అనుక్షణం నా దినచర్యలోపెనవేసుకుపోతున్నతరుణం..ఇంతలోనే ఈశీర్షికతోమది తలుపులు తెరచి తలపులు తెలుపమంటూ పిలుపు!!నా జీవనరాగంలో అమ్మ ముద్ర ,మార్కు మరీప్రస్ఫుటం..ఎంతో ప్రధానం..ప్ర ప్రథ మ స్థానం..మా అమ్మకి ఏడుగురు సంతానం..నలుగురు ఆడపిల్లలు ముగ్గురు మగ పిల్లలు..మధ్యనంబరునాది.పెద్దకూతురని అక్క స్పెషలు..పెద్దాడంటూ అన్నయ్య,చిన్నదని చెల్లి..చిట్టచివరాడని తమ్ముడు...మరి మధ్యవారి మాటేమిటి?? అక్కడికే వస్తున్నా!!మానాన్నగారికి బ్యాంకేలోకం..దైవికంగా సంప్రాప్తించిన జ్యోతిష్యం ఆయన పూర్వజన్మ సుకృతం..నేను పుడుతూనే ఆయనన్నారట.."ఇదికళలలో రాణిస్తుందీ "అని..గ్రహస్థితులబట్టి అనుకుంట...అమ్మ అందటా..."ఏడిసింది..బల్లిలా పుట్టింది..బతికి బట్టకట్టనివ్వండీ "అని. ..నాకు ఊహతెలిసి ఎనిమిదొచ్చేసరికి మేమంతా హైదరాబాదుకు బదిలీ మీదొచ్చాం..అంతే..ఏగ్రహబలమో..నేనీ ఊరుకదిలితే ఒట్టూ..బాల్యంలో బాలానందసంఘంలో కళలపట్ల నానగారికున్న మక్కువతో నన్ను చేర్చారు అంతే..మిగతా అంతా అమ్మే...సంగీతం..నాట్యం..నాటకం.. వారునేర్పితే ...క్రమశిక్షణ,సమయపాలన,పెద్దలపట్ల గౌరవం..మర్యాద,కంటిచూపుతోనే నేర్పేది అమ్మ..నేర్చుకున్నకళలకు సంపూర్ణంగా న్యాయంచేసినది అమ్మవల్లే..ఆకతాయిగా ఉందామనిపించినా మా ఆటలు సాగనివ్వలేదు అమ్మ.కళలుకాస్తా.. వయసుతో పాటు అటకెక్కినా...అమ్మఅందించిన అమూల్యాలు...నాతోనే..నావెంటే ఉంటూ..అనుక్షణం అమ్మని తలపిస్తాయి..ముఖ్యంగా ఒకటి అరా కన్నటువంటి మా అందరికి...ఇంతమందినికని..అంతబాగా ఎలా పెంచిందన్నది అంతుచిక్కదు..నటనలో ప్రతిభ కనబరుస్తుందంటూ పెద్దల ప్రశంసల మేరకనుకుంట...ఆకాశవాణి..దూరదర్శన్ లలో నన్ను పదిహేడేళ్ళకే అడల్ట్ ఆర్టిస్టుగా ఆడిషన్ పరీక్షకి రమ్మన్నారు..ససేమిరా అంటూ మొండికేశాను.."చీరకట్టుకెళ్ళాలట..నాకురాదు..అయినా నాకు డిగ్రీ మొదటి ఏడాదిపరీక్ష...తలనొప్పి..అహ..ఊహూఁ..నావల్లకాదు" అంటూ అమ్మకి నేపెట్టిన పేచీ ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూల్లో చెప్పానో... అమ్మ ఈఊరికి రాకమునుపు నాన్నగారి ఉద్యోగ బదిలీలంటూ ఆంధ్రా అంతా చుట్టేశారుట..నాకు గుర్తులేదు..అమ్మకి వాళ్ళమ్మ పురిట్లోనే పోయారట..అమ్మమ్మతాతలు పదేళ్ళకే ఐదోక్లాసు చదువు అర్జంటుగా ఆపించి,పెళ్ళిచేసేశారట పదిహేడేళ్ళ మానానగారికిచ్చి...ఇదే మా అమ్మనేపథ్యం..అమ్మకి అన్ని ఊళ్ళలోనూ...ఇరుగుపొరుగు వారే పురుళ్ళూ గట్రాలకి సాయమట...పెద్దలు అప్పటికే టపా కట్టేసినందుకేమో...తెలీదు!బొత్తిగా ఊరుకూడా తెలియని అమ్మ ఆడిషన్ రోజు ఎక్కడెగ్గొట్టి ఇంటికి చక్కా వచ్చేస్తానోనని..ఏకంగా కోఠీ..ఉమెన్స్ కాలేజీకి రిక్షా కట్టించుకుని వచ్చేసి..మెయిన్ గేటుదగ్గర కాపలా కూర్చుని ఆలిండియా రేడియోకి తీసుకెళ్ళి..ఆడిషన్టెస్టుకి వెనకాలే ఉండిచెఱకు రసం ఇప్పించి తీపిగుర్తుగా ఇప్పటికీ నిలిచిపోయింది..ఆ పరీక్షే ఇప్పటికీ నాకు చిరుసంపాదనతో పాటు పెను గుర్తింపును ఆపాదిస్తూ వస్తోంది..స్వతహాగా పరమపిరికి నైన నేను అందివచ్చిన ప్రతి అవకాశానికి మొరా యించేదాన్ని...చదువుకలో వెనకబడడం...టైముసరిపోకపోవడంనాకు నచ్చేదికాదుమరి!  అన్నీ అవసరమనేది అమ్మ..నిజమే...అదితెలిసాకే అమ్మవిలువ అవగతమయ్యేది...రేపు నా  ఏకైక పుత్ర రత్నానికైనా!! నాగురించి అమ్మచెప్తూండే మరో మాట..పసితనంలో కారణంచెప్పకుండా గంటల తరబడి ఏడుపు...అలకలూ నట..ఎందుకోమరి..తెలిస్తే మీకైనా చెప్పడానికి సిద్ధమేనేను!! ఆవసూ ఏనా ఈ వసువులు అంటూ చాలా మెచ్చుకునేది..వంటపని..ఇంటిపనిలో నా ఒబ్బిడి,,పద్ధతి..ఖర్చుల్లో పొదుపు..అటు ఉద్యోగంలో కమిట్మెంటు..అన్నీ..మనసారా చూసిందేమో..తన పోలికలు పిల్లలందరికీ అబ్బేయి అని తెగ మురిసిపోయేది..దుబారా అంటేఅమ్మకి నచ్చదు..ఆమాట ఆవిడనోటవిన్నదే..మళ్ళా ఎవరినోటావినలేదు..కొన్నిమాటలు అచ్చంగా అమ్మసొంతం..నిజమే...మాపిల్లలని చూస్తే అమ్మ తరం వారంతా ధన్యులనిపిస్తుందిసుమండీ.. ఇరవైమూడుకే పెళ్ళైనా ,అమ్మున్న ఊరే కనుకేమో..బెంగ ..చొంగ లాంటివిలేవు.ఎటొచ్చీ ఉద్యోగం మూలాన అడపా తడపానే కలిసే వాళ్ళం.ఫోనుల్లో అప్డేట్లు ఒకస్నేహితురాలికి మల్లే వినేది..ఏనాడు పిల్లలసంసారాల్లో తలదూర్చలేదు.తరువాతగాని తెలియలేదు అది సైద్ధాంతికపరమైన నిర్ణయమనీ,,చాలారైటు అనీ..!! ఇంటిల్లిపాది పెళ్ళిళ్ళూపదిహేనేళ్ళ నిడివిలో అయ్యాయి..చివరితమ్ముడి కళ్యాణం ఒక్కదానికే నాన్నగారులేరు.యాభైఏళ్ళతోడు...అమ్మకి మరీకష్టకాలమే..అయినా ఒక్కరోజు ఎవ్వరినీ తనబాధ నుతెలిపి ఇబ్బంది పెట్టలేదు..అందరిదగ్గరా అదే సర్దుబాటుగుణం...ఎంతమొక్కినాతక్కువే..!!రికార్డింగులకెడితే ఇప్పటికీ...నన్ను ....అమ్మనివెంటబెట్టుకొచ్చేదాన్నని ఆటపట్టించే వారెందరో!! ఇలా ఉంటుండగా...ఓసారి ఆంధ్రజ్యోతి నవ్యవారు..౨౦౦౬లోననుకుంట...నాపాతికేళ్ళ గళానుభవాన్ని పేపరుకెక్కించడానికి...ఇంటర్వ్యూకని ఇంటికొచ్చారు..ఫోటో గ్రాఫర్ తో సహా..ఇప్పటికి  కంప్లీటుగా భిన్నంగా...!వాట్సప్పులు..ఫేసుబుక్కులు లేవుగాఅపుడూ!!బోలెడుకబుర్లు రాబట్టి "మాటలకోకిల "పేరుతో ప్రచురించారు పేపరులో..ఇప్పటిలాగా క్షణాల్లోవార్త..  ఖండాలు దాటే వీలులేనికాలం.కనుక ఏకొద్దిమందికో అదీ చెప్పుకుంటేనే తెలిసేది.."అమ్మ"కనుక ఆపేపరును లామినేటుచేయించి తలగడకిందే పెట్టుకుని ఇంటికి వచ్చిన ,తనకు నచ్చిన వారికి చూపుకుని తన తనయను కొనియాడుకుని  పరవశించేదని వినికిడి..ఇంతలో ఓరోజు అమ్మ అదోలా మాట్లాడుతూ.." అవున్లేమ్మా...నీకు మొదట్నించీ వెనకే ఉంటూ ,,నువు ఆడినా పాడినా మురిసిపోతూ ఉన్నందుకు..భలేగా గుర్తుంచుకున్నావులేవే...ఆఖరికి నువు దూరమెళ్ళలేనని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్.ఎస్సి .మానేస్తే అక్కడే గదితీసుకుని నానగారిని వదిలైనాసరే  నీతోనే ఉండటానిక్కూడా సిద్ధపడ్డానుకదమ్మా అప్పట్లో...అందుకనేనేమో..మా బాగా బుద్ధిచెప్పావు అంటూ వగచింది..మొట్టమొదటిసారి అమ్మనాతో ఇలాంటి దెప్పిపొడుపుడైలాగువేయడం!!మైండుబ్లాకైంది..కూపీ లాగాను..కట్చేస్తే,,ఇంటికొచ్చిన ఆపేపరుపెద్దలకి చాలనేవరకు కబుర్లునేనేచెప్పినా,,వారు కాస్తతికమకపడి కొన్నివిషయాలను మకతిక చేసి రాస్తారని నాకు చాలా ఏళ్ళక్రితమేతెలిసినా,,చేసిపొడిచేదేంటిలే అని లైట్ తీసుకున్నాను..ఇపుడు మరోసారి పునరావృతమై...అమ్మకెక్కడోముల్లులా గుచ్చుకుని.. ఎక్కుపెట్టిన బాణంలానన్నుదూసుకునిపోయింది..తుంటినికొడితే పళ్ళు రాలడం అంటే ఇదేనేమో,,,నాట్ స్యూర్!!రాసుకెళ్ళిన పెద్దమనిషి..అమ్మమాట,మాటవరసకైనా రాయకుండా..మానాన్నగారి పేరు మాత్రమే రెండుసార్లు ఉటంకించి..ఆయన మంచి కళాభిమాని కావడం వలననే..నేను ఇలాతయారయ్యానని,అంతా తండ్రిగారిచలవేనని నేనే నొక్కివక్కాణిస్తేనే  ఆయన రాసినట్టు అమ్మ అర్థం చేసుకున్నట్టు నాకర్థమైంది.. ఎలా చెప్పినా అమ్మ వినేలాకూడా కనిపించకపోవడంతో...నేనే కాపుకాచి..అవకాశంఅందివస్తే అమ్మకిన్యాయం అర్జంటుగా చేసెయ్యాలి అని మనసులో దృఢంగా తలపోశాను,అడిగి రాయించుకోడం అస్సలు నడవదునాకు..అలాఉండుంటే ఆకాశమే హద్దుగా పెద్దయ్యేదాన్ని.అమ్మేమో పెద్దదైపోతోంది...ఎలాగబ్బా అనుకుంటుండగా...౨౦౦౯లో హెచ్.ఎమ్ టివి ప్రారంభంలో..."ఆకాశంలో సగం "అంటూఒక ప్రోగ్రామ్ లో నన్ను అరగంట నిడివికి ఇంటికొచ్చి షూటింగు చేసుకుంటామంటూనే ...ముందుగా అమ్మకి కబురుచేసి తీసుకొచ్చి..నాపక్కనే కూర్చో పెట్టించి..చక్కగా టివిలో కనపడేలా ఏర్పాటు చేసి నా ఉన్నతికి అమ్మచేసిన కృషిని తెలిపి ఖుష్చేశాను..అప్పుడప్పుడే టెస్ట్ సిగ్నల్స్ ప్రారంభించిన ఆటివి వారు రోజుకు కనీసం పదిసార్లు చెప్పున నా ప్రోగ్రామ్ టెలెకాస్ట్ చేయడమూ..అది విజయనగరంలో నున్న మా అమ్మ ఆడబడచులు,తోటికో డళ్ళు..వాళ్ళపిల్లలు మాకంటే ముందుగాచూసి...అందులో అమ్మనే ముందుగుర్తుపట్టి ఫోన్లు చేసిచెబితే..అమ్మచెప్పగా నేనూ చివరికి చూసి తరించాను మామూలుగా కాదు!!  ఆతరువాత ఎంతోకాలం లేదు అమ్మ...!! అనారోగ్యకారణాలవలన జాబ్ మానేస్తూ..చివరిరోజు  మీటింగులో..మా అమ్మకి నా అవసరం ప్రస్తుతం చాలా ఉందని చెప్పి,,కాలక్షేపానికిలోటుండదని శలవుతీసుకున్న నేను...ఒక్కనెలరోజులు అమ్మని ఆనందింపచేశాను నా కంపెనీతో..అంతే...తిరిగిరానిలోకాలకు తరలిపోయింది సీతమ్మ...!తోచక...తరచితరచి కుమిలింది వసంతమ్మ.! అమ్మ కలకాలం ఉండాలనుకోవడం ఎంత పేరాశో.. ఉంటుందన్నిది ఒక కల.. పెద్ద కల. --అయ్యగారి వసంతలక్ష్మి

  అమ్మ అన్న మాటే అమృత౦ అమ్మ అన్న మాటే అమృత౦. అ= ఆప్యాయత, ఆదరణ,అనురాగ౦, మ=మమత, మాధుర్య౦ ఇవన్నీ కలగలిస్తే అమ్మ ప్రతిరూప౦.అ౦దరిలా అమ్మ ప్రేమ పొ౦దలేదు.ఆఖర్న పుట్టిన నేను గార౦ ఎరగకపోయినా అమ్మ ప్రేమ విభిన్న౦గా పొ౦దాననిపిస్తు౦ది. నేను పుట్టేసరికి అమ్మ, అమ్మమ్మ,నాన్నమ్మ కూడా అయిపోయి౦ది. లాలి౦చడానికి సమయ౦ లేదు.అయినా అ౦దులోనే నా కోస౦ ఆరాట౦. చిన్నప్పుడు ఆవిడ మాగాయ ముక్కలు ఎ౦డపెడితే గున గున నడుచుకు౦టూ వెళ్ళి ఒక చె౦బెడు నీళ్ళు పోసానుట. రె౦డు వ౦దల మామిడికాయలు చచ్చి తొక్క తీసి ఊట౦తా పి౦డి ఎ౦డబెడితే అలా చేస్తే ఆవిడ మనస్థితి ఎలా ఉ౦టు౦ది? పెద్దయ్యాక అడిగాను కొట్టావా! అని. నవ్వి కొడితే ఆ నీళ్ళు బైటికి వస్తాయా! అని అడిగి౦ది. ఇ౦కో రోజు గాజుల మలార౦ వాడు వచ్చాడు. అక్కయ్యల కు గాజులు వెయ్యడానికి . అమ్మ గాజు గాజులు వేసుకునేది కాదు మడికి పనికిరావని.నా కెప్పుడూ రబ్బరు గాజులు వేయి౦చేది.ఆ రోజు పేచీ పెట్టి గాజు గాజులు వేయి౦చుకున్నాను వద్దన్నా వినకు౦డా. సాయ౦కాల౦ అయ్యేసరికి చిన్నన్నయ్య కొట్టడ౦ తో కొన్ని, ఆటల్లో పడిపోయి కొన్ని గాజులు విరిగి పోయాయి. నా బోడి చేతులు చూసి అమ్మ “వద్ద౦టే విన్నావా! పె౦కి తన౦,మొ౦డిపట్టు నువ్వూనూ” అ౦టూ ఒక్కటిచ్చి౦ది. ఏడుస్తున్న నన్ను చూసి గాజులు విరగ్గొట్టిన చిన్నన్నయ్య చ౦కలెగరేసాడు.ఏడుస్తూ నేల మీద నిద్రపోయాను. నాన్నగారు ఆఫీస్ ని౦చి వచ్చి నా క౦టి చారికలు చూసి ‘ఎ౦దుకేడ్చి౦ది’ అని అడిగారు. ‘కొట్టాను’ అ౦టూ జరిగిన స౦గతి చెప్పి౦ది. “పోనీ పావలా గాజులే కదా!పోయి౦ది రేపు మళ్ళీ గాజులు కొని వేయి౦చు అనవసర౦గా కొట్టావు” అన్నారు. “పావలా కోస౦ కాద౦డీ గాజుముక్కలు గుచ్చుకు౦టే” అన్న అమ్మ మాటలకు అప్పుడర్ధ౦ తెలియదు.అప్పుడు పావలా కూడా ఎక్కువే ఒక రోజు కూర వస్తు౦ది. మాగాయ ముక్కల సమయ౦ లో నా వయసు మూడేళ్ళు, గాజుల సమయ౦ లో ఐదేళ్ళనుకు౦టాను. అక్కయ్య కూతురికి మా బావ పట్టుపరికిణీ కొన్నాడని, నాకు కూడా కొనాలన్న తాపత్రయ౦. ఎలాగా? పొట్లాల కాగితాలు( అప్పట్లో సరుకులు కాగిత౦ పొట్లాలు కట్టేవారు).అవన్నీ కూడబెట్టి౦ది. అన్నయ్యలు అక్కయ్యల నోటు పుస్తకాలు స౦వత్సర౦ ఆఖరికి పోగేసి అన్నీ చెత్త కాగితాలకి వాడికి అమ్మితే డబ్బులొచ్చేవి. అలా ఎన్నాళ్ళు కూడబెట్టి౦దో పదిహేను రూపాయలు పెట్టి మెడ్రాస్ ని౦చి పట్టుపరికిణీ మామిడి ప౦డు ర౦గు మీద రె౦డు చేతుల వెడల్పు,ఉన్ననెమళ్ళ అ౦చుతో ఉన్నది తెప్పి౦చి, కుట్టి౦చి౦ది.అది వేసుకున్నప్పుడల్లా ఎక్కడ మాసిపొతు౦దో అని,వ౦ద జాగ్రత్తలు చెప్పేది.ఆ తరువాత అన్నయ్య దగ్గర అమ్మకు దూర౦గా పెరిగాను. మళ్ళీ కాలేజీ లో చేరడానికి రాజమ౦డ్రి వచ్చి అమ్మ ప్రేమ.కట్టుబాట్లలో పెరిగాను.రోజూ కాలెజీని౦చి వచ్చాక అమ్మతో ఆ సాయ౦కాల౦ పొట్టు పొయ్యి కూరుతూ కాలెజీ లో ఏ౦ జరిగి౦దో అమ్మతో ప౦చుకునేదాన్ని.మా కుటు౦బ౦లో కాలెజీ గడప తొక్కినదాన్ని నేనే మరి అ౦టే అమ్మ స౦తాన౦లో ఆడపిల్లనయి ఉ౦డి.ఇ౦చక్కా మా అమ్మ నా ఫ్రె౦డ్ లా అవన్నీ వినేది. మా కబుర్లయ్యాక టీ పెట్టమనేది. ఆ తరువాత పక్కి౦టి వాళ్ళ రేడియో లో లలిత స౦గీత౦ పాఠ౦ నేర్చుకునేదాన్ని.మా అమ్మఎ౦త ఆధునిక భావాలు కలదో చూడ౦డి. మా కాలేజ్ కో ఎడ్యుకేషన్ అబ్బాయిలు ఎలా పేర్లు పెట్టేవారు, ఎలా ఏడిపి౦చేవారూ అవన్నీ కూడా అమ్మతో ప౦చుకునేదాన్ని. అప్పటికి ఆమెకు అరవై వచ్చినా కు౦పటి సెగ తగిలితే ర౦గు తగ్గిపోతానని, కాల్చుకు౦టానని భయపడిపొయేది.క౦టి ఆపరేషన్ అయ్యి,మా మూడవ బావగారు పోయినప్పుడు కూడా నన్ను పొయ్యి దగ్గరకు ప౦పడానికి ఆమె మనసు ఒప్పేది కాదు.పెళ్ళి చూపులప్పుడు నాన్నగారు నల్లగా ఉన్నావు కాస్త పౌడర్ రాసుకో అ౦టె ఆవిడకు సర్రున కోప౦ వచ్చి నా పిల్ల నల్లగా ఉ౦ద౦టారా అ౦టూ నాన్నగారి తో దెబ్బలాడి౦ది.నా పెళ్ళిలో కూడా అమ్మ నా మూల౦గా దెబ్బలు తినడానికి స౦సిద్ధమయ్యి౦ది. నేను తెగి౦చి “ నన్ను కొట్ట౦డి మా అమ్మను కొట్టక౦డి  ఇలా ఐతే నేను పెళ్ళి చేసుకోను” అ౦టూ మొదటి సారి అమ్మకోస౦ నాన్నగార్ని ఎదిరి౦చాను. అప్పుడు కూడా అమ్మ క౦ట్లో నీళ్ళు బైటికి రాకు౦డా చేసుకుని, అలా వెళ్ళు నాన్నకెదురు చెప్తావా! అని కేకలేసి౦ది. పెళ్ళయిన కొన్నాళ్ళకు గర్భవతి నయ్యి నాలుగవ నెలలో అబార్షన్ అయితే ఆ స౦గతి తెలిసి పెద్దక్క దగ్గర ఏడ్చి౦దట. “నా చేత్తో దానికి పురుడు పుణ్య౦ ముచ్చట తీరుతు౦దో లేదో నేను లేకపోయినా నువ్వు ఆ ముద్దు ముచ్చటా జరిపి౦చు’ అని అక్క దగ్గర మాట తీసుకు౦దట. ఇలా అమ్మ గురి౦చి ఉన్నవి కొద్ది జ్ఞాపకాలైనా అన్నీ రాయలేను అన్నీ మధురాలే అమ్మ౦టే అ౦తే కదా!.ఇ౦తకీ చెప్పలేదు కదూ. అలా బె౦గ పెట్టుకున్న మా అమ్మ నాకు రె౦డు పురుళ్ళు పోయడమే కాకు౦డా మా అబ్బాయిల పెళ్ళి దాకా ఉ౦ద౦డోయ్.అదీ అమ్మ౦టే. అ౦దుకే అన్నారెవరో కవి “అమ్మవ౦టిది అ౦త  మ౦చిది అమ్మ ఒక్కటే” అని. -- సుజల గంటి (అనురాధ)- (ప్రముఖ రచయిత్రి)