కోయలగూడెం నిర్మానుష్యం అయింది. పిట్టలు ఎగిరిపోయాయి. పొద్దుగూకితేగాని తిరిగిరావు. గూళ్ళన్నీ రిత్తబోయాయి. గూడెం రిక్తంగా వుంది. బోసిగావుంది. బోడిగా వుంది. గడచిన రాత్రికి వెక్కిరిస్తుంది. నవ్వుతూంది.

 

    రాత్రి చెదిరిపోయింది. చెరిగిపోయింది. సంబరాలు మాయం అయినాయి. అంబరాల్లో కలిసిపోయాయి. అయినా కోయల మనస్సులో ఆ రాత్రి ఇంకా గిలిగింతలు పెడుతూనేవుంది. ఆలాపనలా పిల్లనగ్రోవి పాడుతూనేవుంది. కలలా కళ్ళల్లో కదలాడుతూనే వుంది. అదీ పోయింది.

 

    ఆ రేయి కలలా కరిగిపోయింది
    సెలయేటిలా పారిపోయింది
    మంచులా మాయం అయింది.
    పూల జల్లులా రాలిపోయింది


    
    కోయకు కష్టం లెక్కకాదు. సూర్యుడు అలాకాదు. అలిసిపోయాడు. కొండచాటుకు చేరాడు. పశ్చిమాన పద్మరాగాలు పొదిగాడు.అడవిలో చీకట్లు గుంపులు గుంపులుగా చేరుకుంటున్నాయి; పిట్టలతోపాటు కోయలు గూళ్ళకు వచ్చారు. కోయ బుడతలు పసువులను మళ్ళించుకొని వస్తున్నారు. పడుచులు అరకలతో తిరిగి వస్తున్నారు. పడతులు గంపలతో తిరిగి వస్తున్నారు. పాడుతూ వస్తున్నారు. ఆడుతూ వస్తున్నారు. గంతులువేస్తూ వస్తున్నారు. సూర్యునివలె అలసిపోయేవాడు కాదుది కోయ. శ్రమలో అందాన్నీ, ఆనందాన్నీ సంతరించుకునే వాడతాను. ఆనందంతోనే తిరిగి వచ్చారు. గూడెం ప్రాణం పోసుకుంది. సందడి మొదలయింది. కేకలు అరుపులు కేరింతలు వంటలు కోయగూళ్ళలోంచి పొగ మబ్బులు లేస్తున్నాయి.

 

    గూడెం మొగదలలో గజ్జె ఘల్లుమన్నది. గుండె జల్లుమన్నది. అది బల్లెనికికట్టినగంట. దాని ధ్వని గూడేనికి తెలుసు. అది పట్టుకున్నవాడు తలారి శివుడు. కావాలనే గూడెం ముందు ఘల్లు మనిపించాడు శివడు. గూడెంలో ప్రవేశించాడు. గుడిసెల్లోంచి జనం బయటికి వచ్చి చూడసాగారు. శివుడు సాగిపోతున్నాడు. అతడు అధికారానికి చిహ్నం. కోయ పులితో పోరగలడు. కొండలను నుసిచేయగలడు. కాని అధికారులంటే హడలిపోతాడు. అది వారి బలహీనత, అదే దొరతనపు బలం.

 

    శివుడు బల్లేన్ని గల్లుమనిపిస్తూ సాగిపోతున్నాడు. కోయల గుండెలు పీచు పీచు మంటున్నాయి. ఈ బల్లెం రాబోయే తుపాకికి చిహ్నం. ఎవరు రామన్నారో! ఏం చేయాలో? ఈ భయమే ప్రతి కోయకంట్లో కనిపించింది. మూగగా కండ్లు మాట్లాడుకున్నాయి. అవి బెదిరిన లేళ్ళ కళ్ళు!

 

    శివుడు నేరుగా సమ్మయ్య ఇంటికి గూడికి చేరాడు. సమ్మయ్య దొరలకు దొర. గూడేనికి అతడంటే గురి. అతని కనుసన్నలమీద నడుస్తుంది గూడెం. అంటే అతని గుడిసె పెద్దదని కాదు. అతడు వంటినిండా బట్ట కట్టుకోడు. అతడూ అందరిలాంటివాడే. అయినా అతడు పెద్ద. అది అనూచానంగా వస్తున్న సాంప్రదాయం.

 

    గుమ్మంలో గజ్జల చప్పుడు విని మంచంలో కూర్చున్న సమ్మయ్య దిగ్గున లేచాడు. శివుడు రావటం సమ్మయ్యను పక్కకు నెట్టడం, మంచంలో వాలిపోవడం క్షణంలో జరిగాయి.

 

    సమ్మయ్య బొమ్మలా నుంచున్నాడు పక్కన.

 

    "ఏందె, అట్ల నిలబడ్డవు. చచ్చిపడి వస్తునని ఎరికెలె. జరన్ని నీలన్న పోస్తరలేదా! నీలుగుడు శానెక్కింది దొరలకు" అన్నాడు మంచంలో పడుకునే శివయ్య.

 

    సమ్మయ్య కదిలాడు, నీళ్ళు తెచ్చి అందించాడు. శివనికి కోపం వచ్చింది. విసిరిపారబోశాడు. "నీలు తాగేటందుకు కోయగూడానికి వస్తామె. ఇన్ని సారానీలో, కల్లు నీలో పొయ్యాలేగాని. దొరలొస్తెగాని తెల్వదు తడాఖా, తెచ్చిపెట్టె జరన్ని సారానీలు. కాళ్ళు పీక్కపోతున్నాయి." మొదలు పెట్టింది ఉద్రేకంగానే అయినా చల్లగా ముగించాడు.

 

    సమ్మయ్య ఇంట్లో సారాయి నిండుకుంది. బయటికి ఉరికి పట్టుకొని వచ్చాడు. ఈలోగా అలసట తీర్చుకొని చుట్ట కాల్చుకున్నాడు శివడు. సమ్మయ్య అందించిన సారాయి గటగటా తాగేశాడు.

 

    సమ్మయ్య నేలమీద కూలబడ్డాడు. శివడు మీసాలు మెలేస్తూ మంచం మీద కూర్చున్నాడు. ఒక్కొక్కరూ వచ్చి మంచంచుట్టూ చేరారు.

 

    "ఏమె శివన్న మల్లెవరొస్తాన్రె" అడిగాడు సమ్మయ్య.

 

    "గిర్దావర్ దొరస్తాండు అమీన్ దొరస్తాండు"

 

    కూడినవారి గుండెలు గుబగుబలాడేయి.

 

    "మొన్ననె వచ్చిరి. ఉన్నయన్ని ఊడ్చక పోయిరి. మల్లెందుకొస్తాన్రె" సమ్మయ్య కొడుగు సింగన్న ప్రశ్న. అది అందరి మనసుల్లో మసలుతున్న ప్రశ్నే కాని అడిగింది సింగన్న. అంతా అతన్ని గుండె జల్లుమన్నట్టు చూచారు. అడగరాని ప్రశ్న అడిగినట్లు చూచారు. అనడమయితే అన్నాడు కాని సింగన్న విచారపడ్డాడు. అందరి చూపులు అతని చూపులను నేలకు దించాయి.

 

    కొరకొర చూచాడు శివుడు, "సర్కారు చేస్తాన్రా ఇంకేమన్ననా? పన్లు పడ్తయి వస్తరు. అడిగెటంద్కు నువ్వెవనివిరా?" అదిరించాడు శివడు.

 

    "ఏందో పోరడుకాదె ఎరికలేకడిగిండు గని దొరలెందుకొస్తాన్రు." అడిగాడు సమ్మయ్య.

 

    తాసిల్దార్ దొర బంగ్ల కడ్తాండు కద ఎర్కలే."

 

    "మాకే మెరికనే అడ్విలుండె టోల్లకు. బంగ్లేమన్న అడ్విల కడ్తడా?"

 

    "అడవి లెందుకు కడ్తడుగని, ఊళ్ళనే కడ్తాండు. పట్నంలకూడ అసువంటి బంగ్ల ఉండదంట. అనుకుంటారు."

 

    "మల్ల అడ్వికెందుకొస్తాండె?"

 

    "కట్టె కొట్టి పెట్టొద్దు కోయోల్లంత. మల్ల బంగ్లెట్ల కడ్తడు?"

 

    "ఉస్స్, వానల్ల కట్టె తెగుతాదె. గొడ్డలేస్తే జారి పడ్తది కాదే దాని అమ్మ..."

 

    "అయ్యన్ని నాకెందుగ్గని. దొరలున్నరు మీరున్నరు. జర సార నీలు చూడండి. రొండు కోడిపిల్లలు తెప్పించుండి. పొద్గాల లేచి మల్ల బోవాలె. గుడిసెకు రూపాయన్నర కట్టియ్యాలె. పోయినపాలి ఊర్కెనె ఎల్లగొట్టిన్రు. ఇయ్యకపోతిరో నీయమ్మ దొంగ భూములన్ని చూపిస్త నీ యక్క మాసూలెంత పెరుగుతదో చూడండి."

 

    కోయగూడెం అదిరిపోయింది. ఆ రాత్రికి శివనికి విందు చేసింది. రూపాయీలు మూటకట్టి పంపించేసింది.

 

    శివడు ఉత్సాహంగా సాగిపోయాడు.

 

    కోయగూడెం జవ చచ్చిపోయింది.

 

    సూర్యుడు అడవికి బంగారం పులిమి అస్తమిస్తున్నాడు. గూడానికి తిరిగి వస్తున్నాడు సమ్మయ్య. అతనికి లేళ్ళు, జింకలూ గుంపులు గుంపులుగా పరుగెత్తడం కనిపించింది. అవి బెదిరి పారిపోతున్నాయి. అంటే ఎవరో అటునుంచి వస్తున్నారని సంకేతం. పులి ఏమైనా దండయాత్ర చేస్తుందా? అనుకున్నాడు. కాని యిది పులికాలం కాదు. ఈ కాలంలో అది అడవి దాటి బయటికిరాదు. మనుషులే వస్తుండాలి. ఎవరు ఆ వచ్చేది? ఎందుకోసం వస్తున్నారు? జింకలమంద పారిపోయిన వైపే చూస్తూ నుంచున్నాడు. మనుషుల అలికిడి వినిపించింది. సర్వేంద్రియాలనూ చెవులలో కేంద్రీకరించి వింటున్నాడు. మాటలు వినిపించాయి. పాటలు వినిపించాయి. కోలాహలం వినిపించింది. గబగబ చెట్లెక్కి చూచాడు. కోయలగుంపు తన గూడెంవైపు వస్తూంది. బరిశెలు, బల్లాలు, తుపాకులు, కర్రలు పట్టుకొని వచ్చేస్తున్నారు. అర్థం చేసుకున్నాడు. ఆ వచ్చేవాళ్ళు క్రింది గూడెంవాళ్ళు. తమ గూడానికి వస్తున్నారు. బహుశా వేటకు సాగిపోవడానికి వస్తున్నారు. అది కోయల ఆచారం. ఒక గూడెంవాళ్ళు మరొక గూడానికి తరలివస్తారు. వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం యివ్వాలి. అంతా కలిసి అడవిమీద పడ్తారు. వేట సాగుతుంది. అది వారికి ఒక వేడుక. పండుగ, ఆనందం, ఆహ్లాదం, సంబరం.

 

    సమ్మయ్య చెట్టు దిగాడు. గూడేనికి ఉరికాడు. "ఒహ్హో! కింద గూడెపోండ్లొస్తున్నారు. రాండి, రాండి. అని కేకలు వేశాడు. కోయ గూడెం యావత్తూ కదిలింది. ఎదురేగింది. వచ్చేవారిని కలుసుకుంది. కౌగిలించుకుంది. ఎగిరింది. గంతులు వేసింది. పదాలూ, పాటలూ పాడుతూ గూడేనికి చేరుకున్నారు. ఇక గూడెం అంతరం అంతరించింది. ఇప్పుడంతా కోయగూడెంవారే. గూడేనికి వచ్చింతరవాత స్వపర భేదంలేదు. వచ్చినవారిని ఆదరించాలి. ఏర్పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. యువకులు, యువతులు, వృద్ధులు గుంపులు గుంపులుగా చేరి అడవిని గురించీ, అడవిలోని సంపదను గురించీ రాబోయే కాలాన్ని గురించీ నెమళ్ళ కేకలను గురించీ, పులి భయాన్ని గురించీ ముచ్చట్లాడు కుంటున్నారు.

 

    రాత్రి అయింది. ఊరి మధ్యన పెద్ద నెగడు లేచింది. దానిచుట్టూ జనం కూడారు. మాంసం కాలుతూంది. పుల్లలతో మంటల్లోంచి లాక్కొని తింటున్నారు. ఇప్పసారాయి విరివిగా ఉంది. సమృద్ధిగా ఉంది. కల్లు కుండలు వచ్చేశాయి.

 

    తాగుతున్నారు.

 

    తింటున్నారు.

 

    పదాలు పాడుతున్నారు.

 

    ఆటలాడుతున్నారు.