"నాన్నా!!" అంది నిశ్చేష్టురాలైన శక్తి.
"ఏవీ లేకపోతే తన ఇంట్లోనే ఎందుకు తెచ్చి పెట్టుకుంటాడూ? బండి నడపడం ఎందుకు నేర్పిస్తాడూ అని లోకం అనుకోదూ!" కోపంగా అన్నాడాయన.
శక్తికూడా కోపంగా "నా గురించి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నదీ?" అంది.
"ఏం? అనుమానించడం, అపార్ధాలు చేసుకోవడం నీ ఒక్కదానికే చేతనవునా?" ఇంకా కోపంగా అడిగాడు.
తండ్రి తనతో ఇలా మాట్లాడటం ఎన్నడూ అలవాటులేని శక్తి కొయ్యలా నిలబడి చూస్తూండిపోయింది.
"ఒక మగాడు నీకు అన్నివిధాలా ఆసరా అవుతూ సహాయాలు చేస్తుంటే తప్పులేదు. పైగా ఎవరూ అనుమానించకూడదు. కానీ నీకు మాత్రం అనుమానించి అవతలి మనిషి చెప్పేది వినిపించుకునేపాటి సహనం కూడా లేదు! నువ్వేం చేస్తున్నావో ఒకసారి నువ్వే తీరిగ్గా ఆలోచించుకో" అని తండ్రి వాకిట్లోకి వెళ్ళిపోయాడు.
శక్తి దిగ్భ్రమగా చూస్తుండిపోయింది.
"శక్తీ... శక్తీ..." అన్న పార్వతమ్మగారి పిలుపు వినిపించి ఆవిడ వాటాలోకి వెళ్ళింది.
"విన్నావా తల్లీ.... గాయత్రి వస్తోందట" ఆవిడ సంతోషంగా చెప్పింది.
"ఔను! విన్నాను. చాలా సంతోషం నాకు టైం అవుతోంది. వెళ్ళొస్తానండీ" అని శక్తి తన ఇంట్లోకి వచ్చి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది.
                                                 * * *
సెంటర్లోని ఆ బట్టల దుకాణం చాలా రష్ గా వుంది. ఇంద్రనీల్ కళ్ళకి వున్న కూలింగ్ గ్లాసెస్ తీసి షాప్ ఓనర్ని అడిగాడు.
"ఇక్కడ చందూ అనే కుర్రాడు కొత్తగా చేరాడట. ఓసారి పిలుస్తారా?"
"అలాగే సార్" అని అతను ఓకుర్రాడితో చందూకి కబురు పెట్టాడు.
ఇంద్రనీల్ ఆయనతో "అతను నాకు చాలా దగ్గరవాళ్ళ అబ్బాయి. ఓసారి బయటికి పంపిస్తారా?" అని అడిగాడు.
ఆయన తల నిమురుకుంటూ "చాలా రష్ గా వుంది. చూశారుగా ఎంత బిజీ టైమో!" అన్నాడు.
"వాళ్ళ మదర్ కి సీరియస్ గా వుంది" చెప్పాడు ఇంద్రనీల్.
ఆలోచించి "సరే" అన్నాడాయన.
ఇంతలో ఓ పొడవాటి కుర్రాడు బిక్కమొహం వేసుకుని వచ్చి "బాబాయ్.... మీరా?" అన్నాడు.
"పద... నీతో పనుంది" చందూ భుజంమీద చెయ్యివేసి బైటికి నడిపించాడు ఇంద్రనీల్.
చందూ నాలుగు అడుగులు వేసి "నేను ఆ ఇంటికి రాను బాబాయ్. అంతకన్నా నరకం నయం" అన్నాడు.
ఇంద్రనీల్ నవ్వి "నరకం ఎప్పుడు చూశావు?" అన్నాడు.
చందు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"అమ్మకోసం కూడా రావా? నీకోసం బెంగపడి మంచంపట్టింది" అన్నాడు.
చందూ తలెత్తి "మరి.... మరి... ఆరోజు నాన్న నన్ను కొడుతుంటే నన్నే తిట్టిందిగా! ఆవిడా ఆయన పార్టీయే. పిల్లల్నీ, పెళ్ళాన్నీ మా నాన్న తన పనివాళ్ళలా చూస్తాడు. ఆయన సొమ్ముతో చదువుకోవడం కంటే... ఇలా పనిచేసుకుని ఒక్కపూట తిన్నా మేలు" అన్నాడు.
ఇంద్రనీల్ కి అరుంధతి మొహం జ్ఞాపకం వచ్చింది. పెద్దబొట్టు పెట్టుకుని, తలనిండా పూలు పెట్టుకుని ఏదొచ్చి ఎటుపోయినా తన సౌభాగ్యాన్ని మాత్రం కాపాడుకుంటుంది. సంతానంగురించి పెద్దగా పట్టించుకోదు. పెద్దకొడుకు ఇల్లు వదిలేసి పారిపోయాక కళ్ళు తెరుచుకుని లబలబలాడుతూ ఇంద్రనీల్ కనిపిస్తే, కొడుకుని వెతికిపెట్టమని ఏడ్చింది.
"మీ నాన్నవల్ల జీవితంలో అందరికన్నా కష్టపడింది మీ అమ్మ. అసహాయురాలు కాబట్టి ఆ అవమానాలు సహిస్తూ మీకోసం అక్కడ పడివుంది. మొగుళ్ళంటే అంటారూ, కొడ్తారూ....అదే కాపురం చేయడం అనుకుందా అమాయకురాలు. ఇప్పుడు మీరు పెద్దయ్యారు. లోకం చూస్తున్నారు మీ నాన్నకి బుద్దిచెప్పి మీ అమ్మని సుఖపెట్టాల్సిందిపోయి, ఇంకా మనస్తాపం తెచ్చే పనులు చేస్తావా? తప్పుకదూ?" అని మందలించాడు.
"ఆయనకి ఎవరేం చెప్పినా బుద్దిరాదు. అమ్మని ఇప్పటికీ అనరాని మాటలంటాడు. ఒంగదీసి వీపుమీద బెల్టుదెబ్బలు కొడతాడు. అడ్డు పడ్డానని ఒకసారి నన్నూ చచ్చేట్లు కొట్టాడు. అమ్మకూడా నన్నే తిట్టింది. ఇంకా ఆ ఇంట్లో వుండాలంటారా?" ఉద్రేకంగా అడిగాడు చందు.
"అందుకని నీ సుఖం నువ్వు చూసుకుని అమ్మనీ, తమ్ముళ్ళనీ వదిలేసి వచ్చేస్తావా?"
"వాళ్ళు నాతో రమ్మంటే వస్తారా?"
"అడిగి చూశావా?"
"అమ్మ ఒక్కనాటికీ ఒప్పుకోదు. చావైనా బతుకైనా ఆ ఇంట్లోనే ఆయనతోనే అని డిసైడ్ అయిపోయింది."
"ఎదుటివాళ్ళు చెప్పేది వినకుండా మొండిగా మీ శక్తి పిన్నిలా వాదించకు! అమ్మని వదిలిపెట్టి రావడం బుద్దున్నవాళ్ళు చేసే పనికాదు" కఠినంగా అన్నాడు ఇంద్రనీల్.
"నేను ఇక్కడ వున్నట్లు ఎలా తెలిసింది?"
"ఇంద్రనీల్ తలచుకుంటే తెలుసుకోలేని సంగతులేవీ వుండవు. నీ క్లోజ్ ఫ్రెండ్స్ ని పట్టుకుని రాబట్టాను గానీ... పద ఇంటికి పోదాం"
"ఆ ఇంటికా"
"ఒద్దు! మా ఇంటికిరా అమ్మనీ తమ్ముళ్ళనీ కూడా తీసుకుని రా."
"నాన్న వూరుకుంటాడా?"
"ఊరుకోకూడదు. అందుకేగా ఈ ప్లాను."
"పద చెప్తాను" అతని భుజంమీద చెయ్యివేసి స్కూటర్ దగ్గరికి తీసుకెళ్ళి "ఎక్కు" అన్నాడు ఇంద్రనీల్.
చందు మాట్లాడకుండా ఎక్కి కూర్చున్నాడు.
    
                                                                  * * *