మాతృత్వంతో మెదడు మారిపోతుంది

మాతృత్వంతో మెదడు మారిపోతుంది

 

 

మాతృత్వం తరువాత తల్లి జీవితం మారిపోతుంది. ఆరోగ్యంలో చిన్నాచితకా మార్పులు వస్తాయి. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే! కానీ ఆమె మెదడులో సైతం మార్పులు వస్తాయనీ... కొన్ని ఏళ్ల తరబడి ఆ మార్పులు ఆమెలో ఉండిపోతాయనీ తేలింది.

మాతృత్వం ముందు – తరువాత

తల్లి మెదడులో మార్పు నిజమా కాదా తెలుసుకునేందుకు స్పెయిన్లోని పరిశోధకులు ఓ 25 మంది స్త్రీలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 30 ఏళ్లు దాటినవారే. త్వరలో తల్లి కావాలని ఆశిస్తున్నావారే. ఆ సమయంలో వీరి మెదడుని స్కానింగ్ చేశారు. తిరిగి వారు గర్భం ధరించిన తరువాతా, పిల్లల్ని కన్న తరువాత కూడా వారి మెదడుని పరిశీలించారు.

మార్పు కనిపించింది

మాతృత్వం తరువాత స్త్రీల మెదడులోని కొన్ని ప్రాంతాలలో స్పష్టమైన మార్పులు కనిపించాయి. ఇతరుల అవసరాలను, అభిప్రాయాలను నిశితంగా పరిశీలించగలిగే భాగంలో ఈ మార్పు కనిపించింది. అయితే దీని వలన వారి జ్ఞాపకశక్తిలో ఎలాంటి లోటూ రాకపోవడాన్ని గమనించారు. కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా మాతృత్వం సాధించినా, సహజ పద్ధతులలోనే గర్భాన్ని ధరించినా కూడా ఈ మార్పు కనిపించి తీరింది. అయితే మగవారిలో మాత్రం ఇలాంటి మార్పులేవీ కనిపించలేదు. తండ్రిగా మారక ముందు వారి మెదడు ఎలా ఉందో, తరువాత కూడా అదే తీరు కొనసాగింది.

కారణం ఉందట!

తల్లి మెదడులో ఈ మార్పు నిష్కారణం ఏమీ కాదంటున్నారు పరిశోధకులు. అప్పుడే పుట్టిన పసిపిల్లలు చాలా అల్పంగా, నిస్సహాయంగా ఉంటారు. వారి అవసరాలను గమనించుకోవాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. తల్లి మెదడులో ఏర్పడే ఈ మార్పు ఆమెలో అప్రమత్తతను పెంచేదిలా ఉంటుందట. అందుకనేనేమో పిల్లలకు రెండేళ్లు వచ్చేవరకూ కూడా తల్లిలో ఈ మార్పు అలాగే ఉంది. ఆ తరువాతే వారి మెదడు సాధారణ స్థితికి చేరుకోవడాన్ని గమనించారు.

పిల్లల్ని చూడగానే

మాతృత్వం పొందిన తల్లిలో మార్పు ఆమె పిల్లల సంరక్షణకేనా అని ధృవీకరించేందుకు మరో ప్రయోగం చేశారు పరిశోధకులు. తల్లులకి వారి పిల్లల ఫొటోలను చూపించి, ఆ సమయంలో వారి మెదడులో ఏమన్నా మార్పులు ఏర్పడుతున్నాయోమో పరిశీలించారు. ఆశ్చర్యంగా, తమ పిల్లల ఫొటోలను చూడగానే వారి మెదడులోని అనేక భాగలు చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టాయి!
పసిపిల్లలను నిశితంగా గమనించుకునేందుకు, వారు ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టేలా శిక్షణ ఇచ్చేందుకు తల్లి మెదడులో ఈ మార్పులు జరిగినట్లు తేలిపోయింది. స్త్రీల మాతృత్వంలో ముఖ్య పాత్రని వహించే ఈస్ట్రోజెన్, ప్రొగెస్టెరాన్ అనే హార్మోనులే ఈ మార్పుకి కూడా కారణం అవుతున్నాయని ఊహిస్తున్నారు. 

- నిర్జర.