చావులమదుం దారిలో ఉన్న ఓ త్రీస్టార్ హోటల్లో రూం నెంబరు 96 లో అవినాష్, ఆ పక్కన రోష్ణి.

 

    "గోదావరి ఎక్స్ ప్రెస్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో- బ్లాక్ లో టిక్కెట్లు కొన్నాను-" చెప్పాడు అవినాష్.

 

    "దొరికాయి కదా-" చెమట తుడుచుకుంటూ అన్నది రోష్ణి.

 

    "నువ్వు సరిగ్గా మూడున్నరకి- సిన్మాకొచ్చినట్టుగా వస్తావేమోనని ఫోన్ చేశాను-"

 

    "మంచిపని చేశావ్... మా డాడీ ఇవాళుదయమే ఫ్లైట్లో వచ్చారు. ఆయనింటికి రాకముందే నేనొచ్చేశాను-"

 

    "ఇంకో గంట మనం జాగ్రత్తగా ఉంటే... ట్రైనెక్కెస్తాం...

 

    మనల్ని ఎవరూ పట్టుకోలేరు... రెండు మీల్స్ ఆర్డర్ చెయ్... నేను స్నానం చేసి వస్తాను-" బాత్ రూం వేపు నడిచాడు అవినాష్.

 

    మీల్స్ ఆర్డర్ చేసి గదిలో కాసేపు అటూ ఇటూ తిరుగుతూ అవినాష్ సూట్ కేసులో ఏవైనా పుస్తకాలుంటాయేమోనని ఆ సూట్ కేసు తీసింది రోష్ణి.

 

    మూడు జతల బట్టలు... ఆ బట్టల కింద ఏదో కవర్... అలాంటి కవర్ తనకోసారి వచ్చింది... తానూ, అవినాష్ భీమిలి ఫోటోలేమోనని ఆ కవర్లోని ఫోటో తీసి చూసింది రోష్ణి.

 

    చెంపమీద ఎవరో చెళ్ళున కొట్టినట్టయింది...

 

    ఆ ఫోటోలో...

 

    అవినాష్, గౌతమి...

 

    తిరుపతి కొండ మీద...

 

    గౌతమి కంఠమ్మీద పడడానికి సిద్ధంగా ఉన్న

 

    అవినాష్ చెయ్యి...

 

    రకరకాల భంగిమలు...

 

    అంటే...

 

    గౌతమి చెప్పిందంతా నిజమేనా... నిజమేనా...

 

    అవినాష్... స్కౌండ్రల్, ఛీటర్... రాస్కెల్...

 

    "అవినాష్" గట్టిగా అరిచింది రోష్ణి.

 

    స్నానంచేసి, కొన్ని లక్షలు తనవౌతున్నాయని, తను తెలివైన హంతకుడినని, తననెవరూ అధిగమించలేరని, ఆనందిస్తూ తల తుడుచుకుంటున్న అవినాష్-

 

    ఆ కేకకు ఒక్కసారి, తలుపు తెరచుకుని గదిలోకొచ్చాడు.

 

    "ఏమైంది రోష్ణీ..." అతనికి రోష్ణిని, రోష్ణి చేతిలోని ఆ ఫోటోను చూడడంతో విషయం అర్ధమైంది...

 

    "రోష్ణి... అది"

 

    "ఇది నువ్వు, గౌతమి అవునా... ఇది నీ చెయ్యేనా... ఇది నువ్వేనా... ఇది ఆమెను చంపడానికి నువ్వు ప్రయత్నిస్తున్నపుడుది... అవునా..." కేక వేస్తున్నట్టుగా అంది-

 

    "రోష్ణి... అది ట్రిక్ ఫోటోగ్రఫీ... ఆ ఫోటోగ్రాఫర్ గాడు క్రియేట్ చేసింది-" దగ్గరగా వస్తూ అన్నాడు అవినాష్.

 

    "అది ట్రిక్ ఫోటోగ్రఫీ కాదు... నీ ట్రిక్కులు..." కోపంతో చాచిపెట్టి చెంపమీద కొట్టింది రోష్ణి.

 

    "నీ అసలు స్వరూపం ఇప్పుడు నాకు తెల్సింది... యూ బాస్టర్డ్. నీ సంగతి..." రోష్ణి ముఖం ఎర్రగా అయిపొయింది- విసురుగా ఫోన్ వేపు నడిచింది.

 

    ఒక్క అంగలో ముందుకి దూకి, రోష్ణిని పక్కకు తోసేసాడు అవినాష్, రోష్ణి పక్కకు పడిపోయింది.

 

    "ఫోన్ చేస్తావా-" రూం తలుపు గెడపెట్టి, విసురుగా రోష్ణి మెడ పట్టుకుని-

 

    "మర్యాదగా మాట్లాడకుండా నాతో రా- లేకపోతే ఇక్కడే పీక పిసికి చంపేస్తాను... వెధవ వేషాలు వేశావో... ఈ గదిలో నీ శవం ఉంటుంది-" రెండు చెంపల మీద చాచికొట్టి బెడ్ మీదకు తోసేశాడు...

 

    రోష్ణి గుండె కుతకుత లాడిపోయింది.

 

    ఆమె కళ్ళంట కన్నీళ్ళు కాదు. నెత్తురు పొంగింది.

 

    అవినాష్ గురించి ఆమెకు అస్పష్టంగా ఏదో అర్ధమౌతోంది...


    
    తను నిలువునా మోసపోయానని ఆమెకు అర్ధం కావడానికి అట్టే సమయం పట్టలేదు...

 

    లాభంలేదు-

 

    తన ప్రాణాలకు తెగించి అయినా ఈ ఉచ్చులోంచి బయటపడాలి. తనని ప్రాణంగా ప్రేమించిన తండ్రిని మోసం చేసింది- నిరంతరం తనని మోసం చేస్తున్న వాడి వెనక వచ్చింది.

 

    ఉప్పెనలా కన్నీళ్లు- వరదలా కన్నీళ్ళు. నెత్తురు సముద్రంలా కన్నీళ్ళు.

 

    తనలో తాను కాలిపోతున్న పువ్వులా రోష్ణి.

 

    రోష్ణి వంటినిండా నెత్తురు మంటలు-

 

    విసురుగా లేచి బయటకు రాబోయింది రోష్ణి.

 

    "ఎక్కడికి-" అరిచాడు అవినాష్ అడ్డుగా నిలిచి.

 

    "నేను వెళ్ళిపోతున్నాను-"

 

    "రావడమే నీ వంతు- వెళ్ళడం-" మెడపట్టి విసురుగా వెనక్కి తోసాడు-

 

    "నువ్వెవరు నన్ను అడ్డడానికి-"

 

    "నేనా- నేనెవరో చెప్తాను-" రోష్ణి రెండు చేతులూ పట్టి, వెనక్కి విరిచి బాత్ రూంలోకి తీసికెళ్ళి, తువ్వాలుని రెండు ముక్కలుగా ఒక ముక్కని నోట్లో కుక్కి రెండో గుడ్డని వెనక చేతులకి కట్టేసాడు. ఆమె తలను విసురుగా గోడకేసి కొట్టాడు.

 

    ఆ తలనుంచి నెత్తురు చిమ్మింది.

 

    రోష్ణి కేక పెట్టింది- కానీ ఆ కేక ఆ గదిలోంచి, బయటకు రాలేదు-

 

    రోష్ణికి స్పృహ తప్పుతోంది-

 

    కలలన్నీ చెదిరిపోయిన రోష్ణి- బాత్ రూంలో పడిపోయింది.

 

    వెంటనే బాత్ రూం బయటికొచ్చి గెడపెట్టి బయటికొచ్చాడు.

 

    గాభరాగా అటూ ఇటూ తిరిగాడు. ఏం చేయాలో తోచలేదతనికి.

 

    టైమ్ చూశాడు.

 

    రెండున్నర దాటింది. ఇంకో గంట టైముంది-

 

    రోష్ణికి మెలుకువ వస్తే మళ్ళీ గొడవ ప్రారంభం-

 

    మెలుకువ రాకముందే- తను-