ఆడపిల్లలలో డిప్రెషన్ ఎక్కువట. ఎందుకంటే...

డిప్రెషన్- ఒకప్పుడు ఎవరూ వినని మాట. ఇప్పుడో! ఇది ఇంటింటి సమస్య. డిప్రెషన్‌ని తేలికగా తీసుకోకూడదనీ, సైకాలజిస్టుని సంప్రదిస్తే... ఉపయోగం ఉంటుందనీ ఇప్పుడు అందరికీ అవగాహన ఉంది. కానీ ఆడవారిలో ఈ సమస్య ఎక్కువని చెబుతున్నారు పరిశోధకులు.

డిప్రెషన్ తీరుతెన్నుల గురించి తెలుసుకునేందుకు కొందరు పరిశోధకులు, ఏకంగా 90 దేశాలలోని 35 లక్షల మందిని పరిశీలించారు. మగవారితో పోలిస్తే, ఆడవారు డిప్రెషన్‌తో బాధపడే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉందని వీరి పరిశీలనలో తేలింది. 12 ఏళ్ల వయసు నుంచే ఆడవారిలో తీవ్రమైన డిప్రెషన్‌ సమస్యలు కనిపించడం ఆశ్చర్యపరిచే విషయం.

సాధారణంగా 12 - 13 ఏళ్లు వచ్చేసరికి ఆడ, మగ అన్న తేడాలు మొదలవుతాయి. అందుకనే ఈ దశను టీనేజి దశగా పేర్కొంటాము. ఆ వయసు నుంచి ప్రభావం చూపించే హార్మోనుల వల్లే స్త్రీలలో డిప్రెషన్‌ వచ్చే అవకాశం ఎక్కువ. పైగా టీనేజి ఆడపిల్లల చుట్టూ ఉండే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. సమాజం వారిపట్ల చూపే వివక్ష, విధించే నిబంధనలు... ఆడపిల్లల మనసు మీద ప్రభావం చూపుతాయి. వీటన్నింటికి తోడు టీనేజి వయసులోని ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు జరిగే ప్రమాదం ఎక్కువ. ఈ సమస్యలన్నింటినీ పంటిబిగువున భరిస్తూ, ఆడపిల్లలు డిప్రెషన్‌తో క్రుంగిపోతుంటారు.

ఆడపిల్లలు వయసు పెరిగే కొద్దీ శారీరికంగానూ, మానసికంగానూ వారు ఎదుర్కొనే సమస్యలూ పెరుగుతుంటాయి. దాంతో ఏదో ఒక దశలో వారు డిప్రెషన్ బారిన పడుతూ ఉంటారు. ఈ పరిశోధనలో తేలిన మరో విచిత్రం.... మగవారితో సమానంగా పనిచేసే చోట స్త్రీలు మరింత డిప్రెషన్‌కు లోనుకావడం! మగవారితో దీటుగా నిలిచే క్రమంలో, తమలో ఉండే ఆందోళనలను అణచిపెట్టే ప్రయత్నం జరుగుతుందనీ... అదే చివరికి తీవ్రమైన డిప్రెషన్‌కు దారితీస్తుందని విశ్లేషిస్తున్నారు.

ఏతావాతా పరిశోధకులు చెప్పేదేమిటంటే- మనసుని తీరని దిగులు వేధిస్తూ, రోజువారీ జీవితం మీద ప్రభావితం చేస్తుంటే... అది డిప్రెషన్‌ లక్షణమై ఉంటుందని భావించాలి. అలాంటి సందర్భంలో వైద్యుని సంప్రదించేందుకు మొహమాటపడకూడదు. అంతేకాదు! తమ ఇంట్లో టీనేజి పిల్లలు, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటే... వారి మానసిక స్థితిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. డిప్రెషన్‌ను ఆరంభదశలోనే గుర్తిస్తే కౌన్సిలింగ్‌తోనూ, మందులతోనూ డిప్రెషన్‌ను శుభ్రంగా తగ్గించవచ్చు. లేకపోతే అది మరిన్ని తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.

- నిర్జర.