"ఇప్పుడే నాన్నతో చెప్తానుండు" అన్నాను అట్టతీసుకెళ్ళి దానికి చూపుతూ.

    "చెప్పుకోఫో" అంటూ తన చేతిలోని పుస్తకం తీసి ఈడ్చి నా మొహాన్న కొట్టింది. కళ్ళు బైర్లుకమ్మినయ్ కాసేపు నాకు. కోపం కొద్దీ దాని వీపుమీద బలంగా బాదాను నేను. ఇద్దరం పిడిగుద్దులు గుద్దుకొన్నాం. పోట్లాట వచ్చినప్పుడల్లా అది ఓడిపోయే పరిస్థితిలో ఏం చేస్తుందో నాకు తెలుసు. అప్పుడూ అదే చేసింది. తనకున్న పొడుగాటి గోళ్ళతో నా ముఖమంతా రక్కేసింది. అమ్మ వచ్చి కేకలేశాక అది అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత నా గదిలో కెళ్ళేసరికి ఎదురుగ్గా గోడకి రాక్షసుడి బొమ్మ ఒకటి వేలాడదీసి ఉంది. దానికింద నా పేరు రాసి ఉంది. ఆ పని ఎవరిదో నాకు వెంటనే తెలిసిపోయింది. అది చాలా మంచి అవకాశంగా కూడా కనిపించింది. ఎప్పుడయినా దాన్ని పెద్దాళ్లతో తన్నించాలంటే ఆ బొమ్మ నాన్నగారికి చూపించవచ్చు. దాని జాగ్రత్తగా తీసి నా పెట్టే అడుగున దాచాను. కాని ఆ రోజు ఎప్పుడూ రాలేదు. ఆ తరువాత కొద్దిరోజులకే మా కుటుంబ పరిస్థితులు హఠాత్తుగా మారిపోయాయ్. ఒకరోజు రాత్రి రెండిండికి మెలకువ వచ్చింది నాకు. అప్పుడు పక్కగదిలో నుంచి అమ్మ ఏడుపు సన్నగా వినబడుతోంది. నేను లేచి నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్ళి వినసాగాను.

    "ఇప్పుడెలాగో మీరే చెప్పండి. అందరూ చిన్నపిల్లలు. వీళ్ళను తిండి లేకుండా మాడ్చేద్దామా?" అంటోంది అమ్మ.

    "మరేం చేద్దాం చెప్పు! ప్రొద్దుట్నుంచీ రాత్రివరకూ తిరుగుతూనే ఉన్నానుగదా! ఎక్కడా మరో ఉద్యోగం దొరికే సూచనలే కనిపించటం లేదు..."

    "పోనీ- మీ స్నేహితుల నెవరినైనా అడగలేకపోయారూ?"

    "ఎవరున్నారనీ? మా కంపెనీ లాకౌట్ వల్ల అందరి పరిస్థితీ మన పరిస్థితిగానే ఉంది. నేనే ఏదొక సమయంలో ఎవరో ఒకరింట్లో భోజనం చేస్తూనే ఉన్నా! నీదీ, పిల్లలదే నాకు దిగులు. పోనీ ఓ పనిచెయ్. రేపు నీ గాజులు తాకట్లు పెట్టేసి ఇంట్లోకి కావలసిన వస్తువులు తెచ్చుకో! నేను తిరిగి వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటుతుంది."

    "ఏమిటోనండీ! నాకు భయంగా ఉంది. ఒకపూటే తింటున్నా నగలన్నీ అయిపోతున్నాయ్.... ఇంక ఈ గాజులు కూడా అయిపోతే మనకు మిగిలేదేమీ ఉండదు..."

    "భగవంతుడి మీద భారం వేద్దాం! అంతకంటే చేయగలిగిందేముంది? కానీ ఈ విషయాలేమీ పిల్లలకు తెలీనీకు! వాళ్ళు భయపడి చదువు నిర్లక్ష్యం చేస్తారేమో!"  

    నేను అక్కడినుంచి వెళ్ళి నా పక్కమీదకు చేరుకున్నాను. నా కెందుకో భయం వేసింది. నాన్నగారి కంపెనీ తిరిగి తెరిస్తే బావుండుననుకొన్నాను. తెల్లారేసరికి రాజి బిగ్గరగా కేకలుపెడుతూ ఏడుస్తోంది. తనకి చీర కొనిపెట్టాలట. నాకు దానిమీద అంతులేని కోపం వచ్చింది. ఓ పక్క నాన్నగారు ఉద్యోగం లేక అవస్థపడుతుంటే మధ్యలో దీని చీర గొడవేమిటి? అమ్మ ఎంత నచ్చచెప్పినా వినటం లేదది. చీర కొనిపెట్టకపోతే స్కూలుకి వెళ్ళనని కూర్చుంది. విసుగుపుట్టి అమ్మ దాని వీపు మీద గట్టిగా ఓ దెబ్బ వేసింది. దాంతో ఇల్లెగిరిపోయేట్లు ఏడ్వసాగిందది. అక్కయ్య వచ్చి రాజిని బయటకు ఈడ్చుకుపోయింది. "చీర కట్టాలంటే నువ్వింకా బాగా పొడుగవ్వాలే! లేకపోతే చీర పెద్దదయిపోతుంది. నువ్వు స్కూల్ ఫైనల్ పాసయేసరికి ఒకటి కొనిస్తాంలే. అమ్మ దగ్గర అలా గొడవ చేయకేం?" అంటూ నచ్చచెప్పిందామె. అప్పటిగ్గాని కొంతవరకూ శాంతించలేదు రాజి.        

    ఆ రోజు నుంచీ అది అద్దం ముందు నిలబడి గంటల తరబడి చూసుకొంటూ కూర్చునేది. ఆ విషయం అందరం దానికి తెలీకుండా చాటునుంచి చూసి నవ్వుకొంటూండేవాళ్ళం. పెద్దదయిన కొద్దీ తగ్గిపోతుందనుకొన్న దాని అల్లరి మరింత ఎక్కువయిపోయింది. స్కూల్లో కూడా అందరితో పోట్లాటే! ఓ రోజు టిఫిన్ కారియర్ పారేసుకొచ్చింది. మరో రోజు టెక్ట్స్ పుస్తకాలు పోగొట్టుకుంది. ఇంకోరోజు చెప్పులు - ప్రతిరోజూ ఏదొక గొడవ జరగాల్సిందే. ఆ పోయిన వస్తువులన్నీ కొనిపెట్టమని మరొక గొడవ. ఆ తరువాత రెండు నెలల్లో మా పరిస్థితి మరింత క్షీణించిపోయింది. పాలు కొనుక్కోడం మానేశాము. కాఫీ టీలు లేవు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు బిల్లు కట్టనందుకు కనెక్షన్ తీసివేశారు. ఆ ఇంటి అద్దె కట్టలేకపోవడంవల్ల ఊరి బయట ఉన్న ఓ చిన్న పెంకుటింట్లోకి మారిపోయాం. ఇన్ని గొడవలవుతున్నా నాన్న కంపెనీ లాకౌట్ లో ఉందన్న సంగతి నాకూ. అక్కయ్యకూ తప్పిస్తే మిగతావాళ్ళకు తెలీదు. ఏదో ఒకటి సర్ది చెబుతూండేదమ్మ. అందరికీ బట్టలు కూడా చిరిగిపోసాగినయ్. అమ్మకి అప్పుడే జబ్బుచేసింది. ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్చారు నాన్నగారు. ఆమె అనేకసార్లు మా అందరికీ కడుపునిండా భోజనం పెట్టి, ఆ తరువాత తనకేమీ మిగలకపోవడం చేత పస్తులు పడుకోవడం నాకు బాగా తెలుసు. అమ్మ హాస్పిటల్లో చేరడంతో నాన్నగారికి తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో మమ్మల్ని చూసుకోవడం - హాస్పిటల్లో అమ్మని చూడడం- తీరిక లేకుండా పోయింది. ఓ రోజు రాత్రి అన్నంలేదని రాజి పెద్ద ఏడుపు మొదలుపెట్టింది. నాన్నగారు మమ్మల్నందర్నీ దగ్గర కూర్చొ బెట్టుకొని తన ఉద్యోగం లేకపోవడం గురించీ, ప్రస్తుతం ఎదుర్కొంటున్న దారుణమయిన దరిద్రం గురించీ - మేమందరం తనకి ఎలా సహకరించాల్సిందీ క్షుణ్ణంగా వివరించారు. అలా చెప్పేప్పుడు చూశాము. కొద్ది నిమిషాలు మాట కూడా ఆగిపోయింది. ఆ రోజునుంచీ ఎవ్వరినీ ఏమీ అడిగేవాళ్ళంకాదు. మా స్కూల్ ఫీజులు కట్టకపోవడంచేత స్కూల్ కెళ్లడానికి వీల్లేకపోయింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలనుకొంది అక్కయ్య ఒక్కర్తే. చుట్టుపక్కలున్న పిల్లలు చాలామందిని పోగుచేసి వారికి ట్యూషన్లు చెప్పటం ప్రారంభించింది. ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గర అప్పుడప్పుడు డబ్బు అడిగి తీసికొని అమ్మకోసం మందులూ, పళ్ళూ కొంటూండేది. ఓ రోజు అక్కయ్యతోపాటు మేమందరం కూడా హాస్పిటల్ కు వెళ్ళాం. మమ్మల్ని చూసి కన్నీళ్ళు పెట్టుకొందమ్మ. అందరినీ దగ్గరకు తీసుకొని చాలాసేపు ఏడ్చింది.

    "ఏం తింటున్నారో, ఏమో! అస్థిపంజరాల్లా తయారయారు" అంది దిగులుగా. ఆమె ఏడుస్తూంటే మాక్కూడా ఏడుపొచ్చింది. అలాంటి దుఃఖ సమయంలో కూడా రాజి తన అల్లరి మానలేదు. తనూ అమ్మదగ్గరే ఉండిపోతానని మారాం మొదలుపెట్టింది. చివరకు దానిని హాస్పిటల్ పనివారి సాయంతో హాస్పిటల్ నుంచి బయట కీడ్చుకు రారాల్సి వచ్చింది. ఇంటి కొచ్చాక తనకు చీర కొనిపెట్టమని మళ్ళీ ఏడుపు. స్కూల్ కెళ్తానని గొడవ- ఒకటేమిటి? అక్కయ్య దాని ఎలా సహించిందో నా కిప్పటికీ అర్థం కాదు. ఆ రోజు నాన్నగారు సంతోషంగా ఇంటికొచ్చారు. కంపెనీ లాకౌట్ ఎత్తివేశారుట. మర్నాటినుంచే తను కంపెనీ కెళ్ళాలట.

    "ఇంక మనకు ఏ భయమూ లేదు. అందరూ స్కూల్ కెళ్లండి. మళ్ళీ మన పాత ఇంట్లోకెళ్ళిపోదాం! కడుపునిండా భోజనం చేద్దురుగాని..."

    "మరి... నాకు చీర కొనిపెడతారా?" రాజి అడిగిందాయనను.

    "ఓ తప్పకుండా కొంటాను." అన్నారు నాన్నగారు దానిని దగ్గరకు తీసుకొని. ఆ విషయం, అమ్మకు చెప్పడానకని హాస్పిటల్ కెళ్ళి నాన్నగారు అమ్మ శవంతో ఇంటికొచ్చారు. ఆఖర్లో ఆమె "రాజికి చీర కొనివ్వండి" అందట రెండుసార్లు. నర్సులు చెప్పారా విషయం నాన్నగారికి. వారంరోజుల వరకూ మా ఇల్లే శ్మశానంలా అనిపించిందందరికీ! ఆ తరువాత కూడా మాలో అందివరకటి సన్నిహితత్వం లోపించింది. అందరిమధ్యా అమ్మ వహించే పాత్ర అప్పుడే మాకు అర్థమయింది. జీవితం నెమ్మదిగా మళ్ళీ అదివరకటి గాడిలో పడుతోంది. రాజి అల్లరి మాత్రం ఏ మార్పూ లేకుండా అలానే ఉంది. చీర కొనిమ్మన్న దాని గొడవ మాత్రం అంతం కాలేదు. అక్కయ్య వివాహం జరిగిపోయింది. బావతో ఢిల్లీ వెళ్లడం కూడా జరిగిపోయింది. అక్కయ్య పాత్ర చెల్లి తీసుకొందిప్పుడు, అయితే అలా ఎంతోకాలం జరగలేదు. దానిక్కూడా వివాహం అయిపొయింది. మరికొద్ది రోజుల్లో అత్తగారింటికి వెళ్ళిపోతుంది. నేనూ పై చదువులకోసం వైజాగ్ వెళ్ళాల్సివచ్చింది. నాన్నగారికి ప్రమోషన్ రావడం వల్ల కాంప్ లు ఎక్కువైపోయాయ్. నెలకు ఇరవై రోజులు ఊళ్ళు తిరుగుతూనే ఉండాలి. ఈ పరిస్థితుల్లో రాజిని మామయ్య దగ్గరకు పంపించేయడం తప్పదని నిర్ణయించుకొన్నామందరం. ఆమెను తీసుకెళ్ళడానికి మామయ్య కూడా వచ్చేశాడు. ఆ మర్నాడే ఆమె ప్రయాణం. నాన్నగారు ఆ రోజు సాయంత్రం రాజి కోసం ఓ చక్కటి చీర కొనుక్కొచ్చారు. మర్నాడు ఉదయం తలంటుకొని ఆ చీర కట్టుకొమ్మని సలహా ఇచ్చింది చెల్లెలు. రాజి ఆనందం పట్టశక్యం గావడంలేదు. చుట్టుపక్కల వాళ్ళందరికి తను చీర కట్టుకోబోతోందని చాటించేసింది.