ఈసారి యస్సై ఫోన్ చేశాడు అమెరికన్ హాస్పటల్ ఎమర్జన్సీ వింగ్ కి.

 

    సరిగ్గా అయిదు నిమిషాలలో అంబులెన్స్ వేన్ టెలిఫోన్ బూత్ ని క్రాస్ చేస్తుంటే ఆపిన శ్రీహర్ష అందులో కూర్చున్నాడు... నిజానికి యస్సై అనుసరించేవాడే కాని తీరుబాటుగా సవ్యసాచి గారి దగ్గర క్రెడిట్ సంపాదించాలనుకుని అప్పటి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

 

    పది నిముషాలలో సవ్యసాచి భవంతిని చేరుకున్న అంబులెన్స్ చప్పుడు వినగానే అప్పటికే మేడమీదనుంచి దృశ్యని క్రిందికి దింపిన సవ్యసాచి కూతుర్ని వెనుక డోర్ తెరిచి స్ట్రెచర్ పై పడుకోబెట్టాడు.

 

    అంబులెన్స్ కోసం ఎవరు ఫోన్ చేసిందీ ఆలోచించే స్థితిలో లేని సవ్యసాచి తన గారాల కూతురికొచ్చిన కష్టానికి చాలా కలవరపడుతూ కూతురితోబాటు తల్లిని ఫాలో అవమన్నాడు.

 

    వేన్ కదలింది.

 

    వెనుక హోండా కారులో డేవిడ్ తో సహా అనుసరిస్తున్నాడు సవ్యసాచి.

 

    "గ్రాండ్ మా" పక్కన కూర్చున్న నానమ్మతో అంది దృశ్య రొప్పుతూ "విషం చాలా బలంగా పనిచేస్తున్నట్టు నా గుండెలో ఎగశోష మొదలయిపోయింది."

 

    "నీకేం కాదే పిచ్చిపిల్లా" కంట తడిపెట్టేసుకుంటోంది ఆ వృద్ధురాలు. "మీ నాన్న మొత్తం డాక్టర్లని రంగంలోకి దింపేస్తాడు"

 

    "అయినా నేను బ్రతకనే. ఆ విషయం నాకు అర్థమైపోయింది"

 

    "ఏమిటే. ఈ అశుభం పలుకులేమిటి?"

 

    "చూడు గ్రాండ్ మా... ఈ వేన్ లో నీ పక్కన ఓ డాక్టరున్నాడా."

 

    చూసింది దృశ్య నానమ్మ... నిజమే. చేతిలో స్టెతస్కోప్ తో ఓ డ్యూటీ డాక్టరు వున్నాడు కాని ఏం చెబితే ఏమవుతుందో అని కంపించిపోతున్నాడు.

 

    "ఉన్నాడు దృశ్యా..." ఉక్రోషంగా అందామె. "తనే ప్రాణహానిలో కూరుకుపోయినట్టు నీ కంటే యెక్కువగా కంపించిపోతున్నాడు."

 

    "అది కంపించడం కాదు గ్రాండ్ మా... నిస్సహాయత... పాపం నేను బ్రతకనని ఆ డాక్టరుకీ తెలిసిపోయినట్టుంది." దృశ్య పదాల్ని కూడగట్టుకుంటోంది.

 

    "అది కాదు మేడమ్" వెంటనే జోక్యం చేసుకున్నాడు డాక్టర్. "ఇలాంటి పాయిజన్ కేసులు డీల్ చెయ్యాల్సింది అంబులెన్స్ వేన్ లో కాదు. ఎమర్జన్సీని ఎదుర్కోటానికి హాస్పటల్ లో ఈపాటికి రంగం సిద్ధమై పోయుంటుంది. మీరేం దిగులు పడకండి".

 

    అంబులెన్స్ వేన్ ఎగిరెగిరి పడుతూంది.

 

    "ఏమిటి నాయనా కాస్త నెమ్మదిగా నడపొచ్చుగా."

 

    "ఈ కుదుపులకే దాని ప్రాణం పోయేట్టుంది" బామ్మగారు ఆందోళన ప్రకటిస్తుంటే అర్ధోక్తిగా ఖండించింది దృశ్య "పాపం డ్రయివర్ కీ తెలిసిపోయినట్టుంది గ్రాండ్ మా..."

 

    "ఏమని."

 

    "నా ప్రాణాలు పోతున్నాయని."

 

    "అప్రాచ్యపు మాటలు మానేయవే."

 

    వేన్ వేగం మరింతగా పెరిగింది. బామ్మగారు గుండె లుగ్గబట్టుకుంటూ అరిచారు "కొంచెం నెమ్మదిగా నడపమను నాయనా" ఎవరో వెంటాడుతున్నట్టు ఈ పరుగేమిటి."

 

    "అయిపోయింది నానమ్మా" స్వప్నంలోలా అంటూంది దృశ్య "నా శరీరం కూడా తూలిపోతూంది."

 

    "దీనికి కారణం వేన్ కూడా తూలిపోవడమేనే"

 

    "లేదు గ్రాండ్ మా... నాకంతా తెలిసిపోయింది. ఇక నన్నెవరూ రక్షించలేరు" క్షణం ఆగి అంది దృశ్య "ఒక్క హామీ యివ్వగలవా గ్రాండ్ మా... హామీ కాదు. మాటివ్వాలి."

 

    అంత్యసమయం ఆసన్నమైనట్టు దృశ్య మాట్లాడుతుంటే మరింత కంగారు పడిపోయింది బామ్మగారు. "ఒసేవ్... ముసలిముండని. అలా మాటాడితే నీకంటే ముందు నా గుండె ఆగిపోతుందే"

 

    "లేదు నానమ్మా, నువ్వు నూరేళ్ళు బ్రతకాలి."

 

    "ఏం బావుకుందామని."

 

    "నీకు తోచింది"

 

    "తోచడమేమిటే"

 

    "నువ్వు బావుకుందామనుకున్నది"

 

    "హమ్మో" ఆ వృద్ధురాలు గుండెలు బాదుకుంది. "దీనికి సంధిప్రేలాపన మొదలయిపోయింది. హమ్మా దృశ్యా. ఏదో మాటివ్వమన్నావ్ అదేమిటే."

 

    "గ్రాండ్... మా..." ఆ స్థితిలో నానమ్మ తన చివరికోరిక గురించి గుర్తు చేయడంతో చాలా పులకించింది దృశ్య "ఇంకెప్పుడూ..."

 

    "ఇంకెప్పుడూ?"

 

    "మన ఇంటిలో ఎవరికేమైనాగానీ..."

 

    "చెప్పవే" తొందరచేసింది.

 

    "ఎంతటి ప్రాణాపాయ స్థితిలో కానీ..." పదాలని కూడపలుక్కుంటూంది దృశ్య.

 

    "నా పిచ్చితల్లీ వాక్యం పూర్తిచేయవే"

 

    "అంత్యసమయంలో అందరూ ఇలాగే రొప్పుతూ మాటాడుతారు నాయనమ్మా"

 

    "నా ముద్దుల మనవరాలు అందరిలో ఒకర్తె కాకూడదు"

 

    "హు" బాధగా మూలిగింది దృశ్య "మృత్యువుముందు అందరూ ఒకటే బామ్మా. జీవితం నీటి బుడగలాంటిది కదా"

 

    "నీ వేదాంతం మండ. సంగతి చెప్పవే" బామ్మగారు ఇందాకటి దృశ్య వాక్యాన్ని గుర్తుచేసుకుంటూ అంది "ఎంతటి ప్రాయాపాయస్థితిలో కానీ... చెప్పు... నన్నేం చెయ్యమంటావ్."

 

    "కారులోనే హాస్పటల్ కి తీసుకెళ్ళాలి."

 

    ముందు అర్థంకాలేదు బామ్మగారికి.

 

    "అవును గ్రాండ్ మా... ఇక ముందు మన యింటిలో ఎవరికే ప్రాణహాని కలిగినా, దరిద్రగొట్టు అంబులెన్స్ వేన్ పిలిపించకండి. కారులో తీసుకెళ్ళండి. ఆ మాట నా చివరిమాటగా డాడీకి చెప్పి..."

 

    చెబుతున్న దృశ్య ఆగిపోయింది. ప్రాణం పోయికాదు వేన్ ఆగడంతో.

 

    ముందు తేరుకున్న బామ్మగారు పక్కనున్న డాక్టరుని చూస్తూ "రా నాయనా. నా మనవరాల్ని వెంటనే..." ఆమె మాటలు పూర్తికాకముందే వేన్ తలుపు తెరుచుకుంది.

 

    "దిగండి బామ్మగారు. యూటూ డాక్టర్."

 

    ఆదేశంలా వినిపించింది శ్రీహర్ష కంఠం.

 

    "ఎవరు... ఎవరు మీరు" ఎదుట నిలబడివున్న వ్యక్తిని, నిర్జనంగా వున్న పరిసరాల్ని చూస్తూ "హూ ఆర్యూ" అంటూ అడ్డం పడబోయాడు డాక్టర్.

 

    "అనవసరమైన రాద్ధాంతంతో ప్రాణహాని తెచ్చుకోకండి డాక్టర్. బామ్మగార్ని దూరంగా తీసుకెళ్ళండి"

 

    నగర పొలిమేరల్ని సూచిస్తూ చుట్టూ పొదలు, కీచురాళ్ళ రొద, అర్థరాత్రి తీతువు అరుపు. బామ్మగార్ని ఎంత ఆందోళనపరిచిందీ అంటే వెంటనే శ్రీహర్ష చేతులు పట్టేసుకుంది. "నువ్వెవరో నాకు తెలీదునాయనా. నా మనవరాలు అసలే ఘడియో, క్షణమో అన్నట్టుంది. దానిమీద ఏ అఘాయిత్యం చేయకు."