హెయిర్ ప్రాబ్లెమ్స్‌కి ఫుడ్‌తో పరిష్కారం!

 

హెయిర్ ప్రాబ్లెమ్స్‌కి ఫుడ్‌తో పరిష్కారం!

 

 

ముఖానికి మరింత అందాన్ని తెచ్చేది శిరోజాలు. కానీ వయసు పెరిగేకొద్దీ, ఒత్తిళ్లు ఎక్కువయ్యేకొద్దీ జుత్తు రాలిపోయి టెన్షన్ పెడుతూ ఉంటుంది. నిజానికి మనం రోజు వంద వరకూ వెంట్రుకలని కోల్పోతూ ఉంటామని, అది సహజమేనని నిపుణులు చెబుతుంటారు. కాబట్టి తల దువ్వుకున్నప్పుడు నాలుగు వెంట్రుకలు రాలిపోయాయని కంగారుపడిపోవాల్సిన అవసరం లేదు. మరీ పెద్దమొత్తంలో ఊడిపోయినప్పుడు మాత్రమే టెన్షన్ పడాలి. అసలు అలాంటి సమస్యే రాకుండా ఉండాలంటే ఓ పని చేయాలి. మనం తినే ఆహారంలో మూడు పోషకాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

ఐరన్ - ఆహారంలో దీని పాళ్లు ఎక్కువ ఉంటే జుత్తుకి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఎగ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్, సీఫుడ్, మటన్ లివర్ వంటి వాటితో పాటు ఆకుకూర్లలో విరివిగా ఉంటుంది ఐరన్. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

సి విటమిన్ - బత్తాయి, నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల జుత్తు ఎక్కువగా రాలదు. పైగా ఆరోగ్యంగా పెరుగుతుంది.

జింక్ - ఇది జుత్తుకి చాలా అవసరం. హెయిర్ బలంగా పెరగాలన్నా, కాంతివంతంగా బలవర్ధకంగా ఉండాలన్నా ఇది కావాలి. అందుకే జింక్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. గుమ్మడి గింజలు, సీఫుడ్, డార్క్ చాక్లెట్, మటన్, వేరుశనగలు, పుచ్చకాయ గింజల్లో జింక్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఇవి ఎక్కువ తింటే హెయిర్ ప్రాబ్లెమ్స్ గురించి చింత అవసరం లేదు.

ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటూ... జుత్తుని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే శిరోజాల సోయగాలు పెరుగుతాయే తప్ప ఎన్నటికీ తరగవు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా హెయిర్ డ్యామేజ్ అవుతున్నా, హెయిర్ ఫాల్ ఎక్కువున్నా థైరాయిడ్ ప్రాబ్లెమ్ ఏమైనా ఉందేమో టెస్ట్ చేయించుకోవడం మంచిది.

- Sameera