శ్యాంసుందర్ ఎంత పలుకుబడి కలవాడయినా గానీ ఒక అంతర్జాతీయ నేరస్థుడి విషయంలో ప్రదర్శించిన అప్రమత్తతకి ఏ వర్గమూ అతడికి సహకరించలేకపోయింది. ఉన్మాదిలా మారిపోయిన శ్యాంసుందర్ అదేరోజు కేంద్రంలోని ఉపప్రధాని సుదర్శనరావుకి ఫోన్ చేశాడు.

 

    అసలే కొడుకు మహేంద్ర పరిస్థితేమిటో అర్థంకాక ఆందోళన చెందుతున్న సుదర్శనరావు మరింత మండిపడ్డాడు "నన్నేం చెయ్యమంటావ్? నీ అసమర్థని కాపాడుతూ నన్ను వాజమ్మలా ప్రజలముందు నిలబడాలంటావా"

 

    "అదికాద్సార్. నిజానికి షా తప్పించుకున్నది నా అసమర్థత మూలంగాకాదు. సవ్యసాచిగారి పథకంతో" చెప్పేసాడు అసలు విషయాన్ని "వాళ్ళమ్మాయితో షా కలిసివున్న ఫోటోలు పత్రికల్లో రాకుండా ఇంతపనీచేసి షాని తప్పించింది సవ్యసాచిగారే."

 

    సుదర్శనరావు షాక్ తిన్నాడేమో ఫోన్ క్రెడిల్ చేశాడు.


                                                              *  *  *


    "హల్లో" బడలికగా పలికింది దృశ్య.

 

    "ఎవరూ"

 

    "సారీ... నిద్రపోతున్నారా"

 

    అలర్టయిపోయింది దృశ్య.

 

    మాట్లాడుతున్నదెవరో ఆమెకు బోధపడిపోయింది.

 

    ఇలాంటి అపరాత్రివేళ...

 

    ఏ వ్యక్తి కలలతో క్షణాలను దొర్లిస్తూ బ్రతకడాన్ని అలవాటుచేసుకుందో, ఏ మనిషి ఆలోచనలు రేకులు విప్పుకుంటున్న ముగ్ధమోహనవాక్యాలకి స్ఫూర్తి నందిస్తున్నాయో అతడే... ..శ్రీహర్ష తనతో మాట్లాడుతున్నాడు.

 

    అది ఆనందమో లేక చిత్రమైన పులకింతో నిశీధి నీరవ సముద్రబిందువుల్లా, నిరీక్షణా జీర్ణపత్రాల్లాంటి ఆమె కనుపాపలనుంచి బొటబొటా నీళ్ళురాలాయి.

 

    మనసేకాదు... ...

 

    దేహమూ నక్షత్రాల ఆకాశమై తెంచుకోవాలనుకుంటున్న శృంఖలాల ప్రతిధ్వనుల్ని నేపథ్యంలా మోగిస్తూ మృదువుగా కంపిస్తూంది.

 

    "చెప్పండి" అంది బిడియంగా.

 

    "థేంక్స్"

 

    "దేనికి"

 

    "ముగిసిపోతుందనుకున్న నా జీవితానికి మరికొన్ని అధ్యాయాల పంక్తుల్ని అందించి కాపాడినందుకు" ఇదంతా రాణామూలంగా తెలిసిందని చెప్పలేదు శ్రీహర్ష.

 

    "మాట్లాడరేం. మిమ్మల్నే."

 

    "ఏం మాటాడను" ఆమె గొంతులో అదోలాంటి జీర.

 

    "ఏదన్నా"

 

    శ్రీహర్ష గొంతులో పూర్వం అల్లరిలేదు. అంతరాళంలో నులివెచ్చని వేడిని అందించే ప్రయత్నంతప్ప.

 

    "మూగదాన్నయిపోతున్నాను"

 

    "అదేం"

 

    "ఓ అల్లరిపిల్లనయిన నన్ను మీరు ఆ స్థాయిలో నిలబెడుతున్నందుకు."

 

    "దృశ్యా."

 

    స్వప్నంలోలా వినిపించింది.

 

    "ప్రేమనే మధురమైన స్మృతిని సమాధిచేసుకుని బ్రతుకుతున్నవాడ్ని. ఇంతకాలానికి ఆ మాధుర్యాన్నే మీ ద్వారా తెలుసుకోగలిగాను మళ్ళీ."

 

    దృశ్య కళ్ళనుంచి నీళ్ళురాలుతున్నాయి అదేపనిగా. "అదృష్టవంతురాల్ని."

 

    "మీరుకాదు నేను"

 

    "అదేమిటీ"

 

    "పాలరాతి కట్టడంలో పేర్చుకున్న పాలపుంతల్లో పదికాలాల పాటు ఆనందంగా బ్రతికే అవకాశమున్న మీ మనసుని బ్రతుకుసంధ్యలో చివరి మజిలీకోసం ఎదురుచూసే నాలాంటివాడు సాధించడం అదృష్టం కదూ."

 

    "... ... ..."

 

    "Men have died from time to time and worms have eaten them but not for love" ఇలా అన్నది "షేక్ స్పియర్" అనుకుంటా.

 

    "... ... ..."

 

    "మీ పరిచయంతో నేను అమరుడ్ని అయిపోతున్నాను."

 

    "మీకేం కాదు."

 

    "కాకూడదని మీరింత సాహసంచేసినా చివరికి నాకు జరిగేది అదే."

 

    "ప్లీజ్! మీరలా మాట్లాడొద్దు."

 

    "చెప్పండి దృశ్యా. ఏంకావాలి మీకు."

 

    "మీ బిడ్డకి..." సన్నగా కంపించిందామె. "నేను తల్లిని కావాలి. అది చాలు యీ జన్మకి."

 

    "తప్పుకదూ."

 

    "తప్పయినా ఒప్పయినా యిది నా ఇష్టం."

 

    "మొండిపిల్ల"

 

    అతడలా మాటాడ్డం ఎంత ఆహ్లాదంగా వుందని.

 

    "యింకేదన్నా కోరుకోరాదూ."

 

    "నాకేం అక్కర్లేదు."

 

    "మీ అన్నకి, నీకు కాబోయేభర్తకి ద్రోహం చేసాను."

 

    "అది వాళ్ళ స్వయంకృతం."

 

    "త్వరలో నీ సామ్రాజ్యం చిన్నాభిన్నం కాబోతూంది."

 

    "కానివ్వండి. కాని" టక్కున ఆగిపోయింది.

 

    "చెప్పు."

 

    "మా డాడీ." ఎందుకో ఆమె వాక్యాన్ని పూర్తిచేయలేకపోయింది.

 

    "చెప్పు దృశ్యా. మీ డాడీ విషయంలో ఏ హామీ కావాలి నీకు."

 

    "ప్రపంచం దృష్టిలో దుర్మార్గుడే అయినా ఆయన నాకు తండ్రి. పైగా మా అన్నయ్య విషయంలో మానసికంగా సగం చచ్చిపోయిన వ్యక్తి."

 

    "అయితే"