ఆ సమయంలో ఇలా రిలాక్స్ అవ్వండి

 

ఆ సమయంలో ఇలా రిలాక్స్ అవ్వండి

 

 

వాకింగ్ అన్నిటకంటే మంచి వ్యాయామం అంటారు నిపుణులు. కానీ సిటీలో ఉండేవాళ్లకు వాకింగ్ చేయడం కష్టమే. దగ్గర్లో ఏదైనా పార్క్ ఉంటే ఓకే. లేదంటే ట్రాఫిక్ ఉండే రోడ్లలో, వాహనాల రొద, దుమ్ము ధూళిలో నడక అసాధ్యం. అందుకే ఎక్కువమంది జిమ్ ల మీద ఆధారపడేవాళ్లు రోజు రోజుకీ పెరుగుతున్నారు. రోజూ ఉదయాన్నే అక్కడికి వెళ్లిపోయి ప్రశాంతంగా కాసేపు వ్యాయామం చేసుకోవడంలే ఉండే సుఖమే వేరు కదా! అయితే జిమ్ లో చేరాలనుకునేవాళ్లు, చేరినవాళ్లు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది.

 

ముందుగా ఆలోచించాల్సింది దుస్తుల గురించి. జిమ్ కి వేసుకునే దుస్తులు బిగుతుగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ కాదు. ముఖ్యంగా ఆడవాళ్లయితే చాలా అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంది. కదలికలకు, కొన్నిసార్లు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే కాస్త వదులుగా ఉండేవే వేసుకోవాలి. అలాగే షూ కూడా సౌకర్యవంతంగా ఉండేవి ధరించాలి.

 

వ్యాయామానికి ముందు వార్మప్ చాలా అవసరం. నేరుగా వెళ్లి మొదలుపెట్టేస్తే వెనువెంటనే గుండె వేగం పెరిగి శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. శరీరం త్వరగా శక్తిని కోల్పోయి ఆయాసం వచ్చేస్తుంది. అందుకే వార్మప్ చేశాకే వ్యాయామం మొదలు పెట్టాలి. అలాగే శరీరాన్నిహైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. జిమ్ కి వెళ్లడానికి ముందు కొద్దిగా నీళ్లో, జ్యూసో తాగండి. అలా అని కడుపు నిండేలా తాగకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట్లో మనకు మనమే ఎక్విప్ మెంట్ ని యూజ్ చేయాలని ప్రయత్నించకూడదు. కచ్చితంగా ఇన్ స్ట్రక్టర్ ని అడిగి, వాళ్లు చెప్పిన విధంగానే చేయాలి. ఎలా పడితే అలా చేసేస్తే కండరాలు పట్టేస్తాయి. ఎముకలు డ్యామేజయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాగే ఒకేసారి ఎక్కువ వ్యాయామం చేసేయాలని అనుకోకూడదు. మెల్లగా మొదలుపెట్టి సమయం పెంచుకుంటూ పోవాలి. లేదంటే విపరీతంగా ఒళ్లు నొప్పులు వచ్చి వ్యాయామం చేయడమే కష్టమైపోతుంది.

 

అదే విధంగా వ్యాయామం చేస్తున్నంతసేపూ మనసుని రిలాక్స్ చేయడం చాలా అవసరం. శరరం కష్టపడుతోంది కదా ఆ ఒత్తడిని మనసు మీద పడనివ్వకూడదు. అందుకే అయితే మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. లేదంటే వ్యాయామం చేస్తున్నంతసేపూ చక్కని సంగీతం వినండి. చాలా జిమ్స్ లో ఈ సౌకర్యం ఉంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే జిమ్ లో మీ అనుభవం ఆనందంగా ఉంటుంది. ఫలితం తృప్తికరంగా ఉంటుంది.

- Sameera