"మురళిబాబూ!" అంది జ్ఞానసుందరి అతని జుట్టులోకి వ్రేళ్ళుపోనిచ్చి సవరిస్తూ.

    "చెప్పు!" అన్నాడతను కళ్ళు మూసుకుంటూ మగతగా.

    అలానే అతన్ని తన గుండెలనిండా నింపుకుని, ఆర్ద్ర స్వరంతో ఆమె చెప్పసాగింది. "నేనెందుకో ఎవర్నీ ద్వేషించలేను మురళిబాబూ! నాకు ప్రపంచమంతా సుందర నందనవనంగా, ప్రేమమయంగా కనిపిస్తుంది. జీవితాన్ని నేను ప్రేమిస్తాను. నా ఇష్టంవచ్చిన రీతిలో తీర్చిదిద్దుకోగలను. నేనూ దు;ఖపడే సమయాలుంటాయి. కానీ మీరు సుఖాన్ని భ్రాంతిగా తీసుకుంటే నేను దు;ఖాన్ని భ్రాంతిగా తీసుకుంటాను."

    "ఆశ్చర్యం! నేనూ వంటరినే, కానీ నలుగురిలో మసలినప్పుడు ఎలా వుంటానో, వంటరిగా వున్నప్పుడూ అలాగే మసలగలను. నేను అన్ని రకాల జీవితాలతోనూ ఆనందించగలను."

    "పల్లెటూళ్ళో పుట్టాను. కొన్నాళ్ళు పెరిగాను అక్కడి మనుషుల్నీ, పొలాలనూ, పశుగణాలనూ ప్రేమించాను."

    "కొంచెం పెద్దదాన్నయ్యాక తల్లితండ్రులతో పట్నానికొచ్చాను. అక్కడి నాగరికతనూ, నూతనత్వాన్నీ క్షణక్షణం మారే అలవాట్లనూ ప్రేమించాను. మా నాన్నగారి ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు ఐర్లెండులో గడపాల్సివచ్చింది. ఆ విదేశీ భాషనూ, వారి వేషభాషల్నీ, కట్టుబాట్లనూ ప్రేమించాను. తిరిగి స్వదేశం వచ్చాను. తల్లీ, తండ్రీ గతించారు. నాకు నచ్చిన ఉద్యోగం వెతుక్కున్నాను. నన్ను గురించి నేను చెప్పుకోవాల్సివచ్చినందుకు కించగానేవుంది. ఎలాంటి వారితోనైనా బ్రతకగల నేర్పుంది నాకు. అన్ని తరహాల మనస్తత్వాలనూ అర్ధం చేసుకోగల ఓర్పు నాకు భగవంతుడు ప్రసాదించాడు. నాకు ఓ విరోధం వుంది - కటుత్వం......"

    "మురళిబాబూ! దయయుంచి ఇది అహంభావం క్రింద భావించకండి. ఆభిజాత్యం క్రింద అపోహపడకండి. బంధం అనే ఉద్యోగానికి దరఖాస్తు పత్రం సమర్పించుకుంటే అందులో అర్హతలు తెలుపుకోవటం నా విధియై వుంది."

    ఆమె అతన్ని తన హృదయానికి మరింత గట్టిగా అదుముకుంది.

    ఇద్దరి గుండెలూ ఒకటిగా, ఒకే ఒరవడిలో కొట్టుకుంటున్నాయి.

    "ఇందాక ఆ రెస్టారెంటుకు తీసుకువెళ్ళిననప్పుడు కూడా నేను తొట్రుపాటు పడలేదు. వాళ్ళలా త్రాగితే ఏం? వారు త్రికరణశుద్ధిగా పొందిన ఆనందం నాకు ముచ్చటగొలిపింది. నిజంగా వారు అంత నిర్భయంగా, దాపరితనం లేకుండా వారి ఆనందాన్ని వారు పొందుతున్నందుకు ధన్యులు. అది ఒక జీవితం. అది ఒక పద్ధతి. నాకెంతో ఉల్లాసాన్ని కలుగజేసింది."

    "అలాగే ఏ జీవితాన్నైనా, ఏ జీవినైనా వారి పరిసరాలను అర్ధం చేసుకుని చదవగలిగితే మనకు ఉల్లాసమేగానీ అసంతృప్తి ఉండదు."

    "సంసారాల్ని విచ్ఛిన్నం చేసుకునే వాళ్ళనిగురించి నాకేం తెలియదు. అది దురదృష్టమైనా కావచ్చు. తెలివి తక్కువతనమైనా కావచ్చు."

    "నా విశ్వాసం ఏమంటున్నదో తెలుసా?"

    "ఏమిటి?" ఆమె కౌగిలిలో ప్రపంచాన్ని మరుస్తూన్న మురళి ఆతృతగా అడిగాడు.

    "అలాంటి దురదృష్టం నన్నావరించదని" యమునాతీరపు పిల్లనగ్రోవి అది.

    "ఇది....ఈవేళ......ఈ...స్వరం......ఈక్షణం....నిజంగా అపూర్వం" ఆమె వాక్కు అబద్ధం కాజాలదు. సృష్టి ఇంకా అక్కడక్కడా సహజత్వాన్నీ, న్యాయాన్ని జనింపచేస్తూనే వుంది.

    "నేను నీడను, పరిచారికను, దేవిని, తల్లిని, సోదరిని, ప్రేయసిని, మోహినిని, పరిపాలకురాలను, నీ కోర్కెను నేను. నీ తృప్తిని నేను. నీ బలాన్ని, నీ వెలుతురుని, నీ ఊపిరిని......."

    కలలో వాక్కులుగా అతని వీనుల్లో ప్రతిధ్వనులు. "చాలు......చాలు......నా సంకల్పం నెరవేరింది."

    అతనికీ లోకం తెలియట్లేదు. "ఆలుమగలకు అర్ధం ఇప్పుడు తెలిసింది. భగవాన్! సర్వత్రా ఇలానే ఉండేటట్లు చెయ్యి."

    ఆమె అతన్ని పూర్తిగా కప్పేసింది.
                                          *  సమాప్తం *