"కాని... అమ్మా... అతడేదో తాగి, తమాషాగా అంటే... బంగారం లాంటి బార్ ని అమ్ముతాననటం ... అయినా అతడేదో తాగిన మైకంలో అంటున్నాడు- నిజంగా జరిగేదేనా...?"       


    డూ... వాట్ ఐ సే... అతను మన పదిలక్షల బార్ ని పాతిక లక్షలకు కొంటాడు. ఐయామ్ ష్యూర్ ఎబౌట్ దట్... కమాన్... మూవ్... అరగంటాగి తిరిగి ఫోన్ చేస్తాను. అటూ, ఇటూ అయిందో... క్షమించను."

 

    "ఐయామ్ సారీ అమ్మా... అతనేదో ఉడుకునెత్తురు. అతన్ని అలా ప్రేరేపిస్తే అలా అంటున్నాడు. నువ్వు చిన్నపిల్లవు - నువ్వూ అలా అంటే ఎలా?" మేనేజర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.

 

    "బార్ నా పేరుమీదుంది. అవునా?"

 

    "అవును. కానీ నాన్నగారికీ ఒకమాట చెప్పాలి. అయినా తాగుబోతు మాటల్ని సీరియస్ గా తీసుకోవటం ఏమిటమ్మా... కుర్రచేష్టలు కాకపొతే?"

 

    "విల్ యూ ప్లీజ్ షట్ యువర్ మౌత్ అంకుల్?"

 

    మేనేజర్ బిత్తరపోయాడు.

 

    "కొన్ని నిర్ణయాలు క్షణాల్లో తీసుకోవాల్సి వుంటుంది. క్షణకాలం... లక్షల విలువ, ఒక్కసారి కోట్లు. వ్యాపారవేత్త ఎప్పుడూ అవకాశం కోసం ఎదురుచూస్తుండాలి. మీరాపని ఇమ్మీడియట్ గా చేయాలి. కావాలంటే నేనిలా చెప్పానని నాన్నగారికి చెప్పండి. అంతా క్షణాల్లో జరిగిపోవాలి" అరుస్తున్నట్లుగా అంది మహతి ఫోన్ లో.

 

    మేనేజర్ క్షణకాలం విస్తుపోయాడు.

 

    "ఒక్కోసారి అతి చిన్న సంఘటన అనుకున్నదే తిప్పగల నేర్పు వుంటే అతి పెద్ద మలుపుకి దారితీస్తుంది. డోంట్ హెజిటేట్ టు ఒబే మై ఆర్డర్స్" తిరిగి అంది మహతి.

 

    ఈసారి నిజంగానే మతిపోయింది మేనేజర్ కి.

 

    ఆమె తండ్రికి కూడా మహతిమీద, ఆమె మాటమీద, నిర్ణయం మీద మంచి గురి. కూతురి మాటెప్పుడూ తండ్రి కాదనడు.

 

    ఫోన్ ని అలాగే చెవికానించుకుని గొడవ జరుగుతున్నవేపు చూశాడు. అది అంతకంతకు తీవ్రరూపం దాల్చుతోంది.

 

    "మీ ముద్దుల కూతురు సుధారాణి ఇప్పుడు నా దగ్గరే వుంది. చెప్పినట్లు చేయలేదనుకోండి, ఆమెని మీకు దక్కకుండా చేస్తాను. నేననుకున్నది జరక్కపోతే ఎవర్నీ క్షమించలేనని మీకు బాగా తెలుసు. ఇప్పుడు నేననుకున్న మాట దక్కటమా, దక్కకపోవటమా అన్న దానికంటే మాకు పదిహేను లక్షల నష్టం కూడా వస్తుంది.పదిహేను లక్షలు మాటలు కాదు. మీ జీవితాంతం మీరు నాకు ఊడిగం చేసినా పదిహేను లక్షలు సంపాదించి పెట్టలేరు. ఈ వయసులో మీరు పిల్లల్ని కనలేరు.

 

    ఆ డీల్ లో మీకు ఐదులక్షలు నేనిస్తాను. ఐదులక్షలు కేష్, కూతురు దక్కటం, లేదా సర్వనాశనం. బాగా ఆలోచించుకోండి. సందర్భాన్ని మనకు అనుకూలంగా మల్చండి. లేదంటే మీకు తెలుసు నేను తలుచుకుంటే ఏం చేయగలనో?"

 

    ఫోన్ కట్ అయింది.

 

    మేనేజర్ కి ఫోన్ పెట్టేసాక కొద్దిక్షణాలు ఏమీ అర్థంకాలేదు. కాళ్ళు చేతులు ఆడలేదు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి.

 

    సరిగ్గా అదే టైమ్ లో మహతి మడికేరీ నుంచి ఇంటికి కాంటాక్ట్ చేసి తన తండ్రితో మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది.

 

    "ఏమిటే ఇదంతా? బార్ అమ్మటమేమిటి? ఏమంటున్నారు మా నాన్నగారు?" సుధారాణి ఆశ్చర్యపోతూ అడిగింది.

 

    మహతి నిర్విరామంగా తన తండ్రిని ఫోన్ లో కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందే తప్ప ఆమె అనుమానాన్ని నివృత్తి చేయలేదు.

 

    "చెప్పవే! ఏం జరిగిందక్కడ?" ఈసారి మేరీ అడిగింది తనలో పెల్లుబుకుతున్న ఆతృతని బలవంతాన అణచుకొనే ప్రయత్నం చేస్తూ.

 

    "మధుకర్ మా బార్ కొచ్చాడు. బాగా తాగాడు - తప్ప తాగాడు. అతని ప్రక్కన ఒక ఎఫ్.ఎస్. గాడున్నాడు. మా బార్ లో సర్వీస్ బాగా లేదని రెచ్చిపోయి బార్ రేటెంతో చెప్పు, కొంటానని రెచ్చిపోతున్నాడట. పదిలక్షలు ఖరీదుచేసే బార్ ని పాతిక లక్షలకు అమ్మమని చెప్పాను. అర్థమైందా? కాసేపు నోరు మూసుకుని కూర్చుని ఏం జరుగుతుందో చూడండి" అని ఒక్క క్షణం ఆగి - "హలో! ఈజిట్ 223224?" ప్రశ్నించింది పెద్దగా మహతి.

 

    మేరీ, సుధారాణి షాక్ తిని అలాగే చూస్తుండిపోయారు.

 

                              *    *    *    *    *

 

    అప్పుడు సమయం రాత్రి పదిన్నర...

 

    పొగమంచు ఆ పర్వతశ్రేణుల్ని దుప్పటిలా కప్పేసుకుంది. ఫైర్ ప్లేస్ చుట్టూ పడకల్ని సర్దుకుని నిద్రలోకి జారుకున్నారా ప్రాంత ప్రజలు.

 

    పగలు విరాజ్ పేట, అక్కడి నుంచి కేరళ సరిహద్దుల వరకు వెళ్ళి వచ్చిన స్టూడెంట్స్ అలసిపోవటమే కాక, చిరుజల్లులకు తడిసి వుండటంతో కడుపులోకి మోకాళ్ళను ముడుచుకుని నిద్రలోకి జారుకున్నారు. చలి విశ్వరూపం ధరించింది.

 

    గెస్ట్ హౌస్ నిశ్శబ్దంలో, నిశీధిలో కలిసిపోయింది. ప్రస్తుతం మహతి, మేరీ, సుధారాణి వున్న గదిలోనే ఒక లైట్ వెలుగుతోంది.

 

    ఎంత ప్రయత్నించినా నెంబర్ దొరక్క మహతి చిరాకుపడిపోతోంది.

 

    ఆమె ప్రయత్నాన్ని చూసిన మేరీ, సుధారాణి కన్నార్పకుండా అలా చూస్తూ శిలాప్రతిమలయిపోయారు.

 

    అందం, ఆకర్షణ, మేని ఒంపుసొంపుల్లో సెక్సీనెస్, తెలివితేటలు, సమయస్ఫూర్తి, చురుకుదనం, పట్టుదల, ఆత్మాభిమానం, అభిజాత్యం, సోషల్ గ్రేసెస్ తో పాటు బలంగా, ఆరోగ్యంగా, అణువణువునా యౌవ్వనం తొంగిచూసే మహతి వారికెప్పుడూ ఒక ఎనిగ్మాగానే మిగిలిపోతుంది. ఇది ఆమె మనస్థత్వం అని ఖచ్చితంగా నిర్వచించలేని ఆమె ఎప్పటికీ అన్ స్క్రూటబుల్ గానే వుండిపోతుందా?"

 

    మధుకర్ ని అమితంగా ప్రేమించింది.

 

    చూడకుండా ఒక్కక్షణం వుండలేకపోయేది.

 

    ఎప్పుడూ అతని ఊసులతోనే తన ఆలోచనల్ని నింపుకొనేది.  

 

    ఎవర్నీ లెక్కచేసేదికాదు. వాళ్ళ మధ్య నడిచిన స్వీట్ నథింగ్స్... కథలు కథలుగా కాలేజీ క్యాంపస్ ని ఎప్పుడూ వెచ్చదనంతో నింపేవి. అతనూ అంతే.

 

    అప్పుడు ఎవర్నీ కేర్ చెయ్యలేదు. ఇప్పుడు విబేధాలొచ్చి విడిపోయే స్థితికి చేరుకున్నా ఎవ్వర్ని లెక్కచేయటంలేదు. ఎవరి సలహాలు వినటం లేదు.

 

    మడికేరి మంచుపొరల మృదుత్వంలో, చిరుజల్లుల చిత్తడి అనుభూతిలో, బయోలాజికల్ నీడ్స్ కి అవకాశం కల్పించుకొని, మధురానుభూతుల్ని అనుభూతించలేకపోవటం దురదృష్టం కాదా!     

 

    సుధారాణికి కన్నుగీటి, చెప్పులు లేకుండా, మెత్తటి మృదువైన పాదాల్ని మంచుగడ్డల్లా వున్న చలువరాతి బండలపై వేస్తూ, పిల్లిలా గది దాటి వరండాలో స్థంభం చాటునున్న యువకుడ్ని చేరి లతలా పెనవేసుకుపోయింది మేరీ.

 

    స్త్రీ, పురుషుల మధ్య నడిచే శృంగార కార్యక్రమానికి ప్రకృతి, వాతావరణం కూడా సహకరిస్తే, ఆ అనుభూతి రెట్టింపవుతుందంటాడు వాత్సాయనుడు. చలి, ఒంటరితనం, నిశ్శబ్దం, మూగసాక్షిగా మిగిలిపోయిన ప్రకృతి, చిరుజల్లులు, వెచ్చదనం వెతుకులాటలో ఉద్భవించిన స్వేదం, దరిచేరని అలసట, చలిని తరిమేందుకయినా దగ్గరకాక తప్పని వాతావరణం, ఐదడుగుల వెడల్పు, పొడవు వున్న పూర్వకాలంనాటి సున్నం స్థంభం మాటున ఊర్పులు, నిట్టూర్పులు, ఆతృత, ఆరాటం, పెనుగులాట...  

 

    మేరీ ప్రవర్తన, కదలిక, సుధారాణిలో పెనుతుఫానుని రేపింది. ఆమేం చేయటానికి వెళ్ళిందన్న ఆలోచనలే ఈమెని నిలువనివ్వలేదు. మహతి అలాగే ఫోన్ లో కుస్తీ పడుతుండగా సుధారాణి లేచింది. పరుగులెత్తుతున్న ఆలోచనలు, ఆవిర్లు చిమ్ముతున్న శరీరం, తడారిపోతున్న గొంతుక, సన్నగా వణుకుతున్న పెదవులు, అదురుతున్న పాదాలు, ద్వారబంధంవేపు కదిలాయి.