డైపర్ తో కాస్త డేంజరే!

డైపర్ తో కాస్త డేంజరే!

 


పిల్లలన్నాక పక్క తడుపుతారు. కానీ అస్తమానం పక్క మార్చలేక, దుప్పట్లు ఉతకలేక డైపర్ తొడిగేస్తుంటారు చాలామంది. ఏ బైటికి వెళ్లినప్పుడో బట్టలు పాడవకుండా డైపర్ వేయడంలో తప్పు లేదు కానీ... రోజంతా డైపర్ వేసి ఉండటం వల్ల ఒక్కోసారి పిల్లలకు ర్యాషెస్ వచ్చేస్తుంటాయి. పాపం దురద, మంట పిల్లల్ని వేధిస్తుంటాయి. అందుకే డైపర్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

 * డైపర్ వేసేముందు ఓసారి వేడి నీటిలో ముంచిన బట్టతో శుభ్రంగా ఒళ్లు తుడిచి, తర్వాత పొడి బట్టతో తుడవండి. చక్కగా పౌడర్ రాసి అప్పుడు డైపర్  వేయండి.

 * డైపరే కదా అని అలా వదిలేయకండి. తరచూ చెక్ చేయండి. పాస్ పోసినా, మల విసర్జన చేసినా వెంటనే తీసి శుభ్రం చేయండి. కాసేపు అలా వదిలేసి ఒళ్లు ఆరిన తర్వాతే డైపర్ వేయండి.

 * డైపర్ మామూలుగా తొడిగేస్తుంటారు చాలామంది. కొన్నిసార్లు కొన్ని డైపర్ల వల్ల పిల్లలకు కంఫర్ట్ ఉండదు అన్న విషయాన్ని గమనించరు. మరీ టైట్ గా ఉన్నా, మెటీరియల్ పడకపోయినా పిల్లలు ఇబ్బంది పడటమే కాదు, చర్మ సమస్యలు కూడా వస్తాయి జాగ్రత్త.

 * ఒకవేళ డైపర్ వల్ల ర్యాషెస్ కనుక వస్తే అవి తగ్గే వరకూ మళ్లీ డైపర్ వేయకండి. 

 * ర్యాషెస్ వచ్చిన చోట ఆలివ్ ఆయిల్ తో కాసేపు మసాజ్ చేసి, వేడి నీటితో కడిగేయండి. తరచూ అలా చేస్తూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. కొబ్బరి నూనె  అయినా ఫర్వాలేదు. 

 * అన్నిటికంటే ఉత్తమం ఏమిటంటే.. బైటికి వెళ్లినప్పుడు తప్ప ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ వేయకండి. కాస్త గాలి తగలనిస్తూ ఉండటం చాలా అవసరం. పిల్లలకు కూడా హాయిగా అనిపిస్తుంది. 

    ఈ జాగ్రత్తలు కనుక తీసుకోకుండా డైపర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సేఫ్టీ కోసం వాడే డైపరే డేంజరస్ గా మారి... పిల్లలకు చర్మసంబంధిత సమస్యలు, అలర్జీలు రావడం మాత్రం ఖాయం.

-Sameera