ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము...

 

    నరుడు నరుడౌట దుష్కరమ్ము సుమ్ము-ఆని గాలీబ్ ఉత్తినే అనలేదు. గాలీబ్ మాట గాలి మాట కాదు.

 

    ఆ మహతి లాంటి వాళ్ళకు దూరంగా వుండు. ఉంటేనే కోటీశ్వరుడి కొడుగ్గా, కోటీశ్వరుడి అల్లుడిగా నువ్వు నిలబడగలవు అని హెచ్చరించటానికి పిలిపించిన కొడుకులో, అంతలోనే ఎంత మార్పు?!

 

    ఏ మార్పయితే మధుకర్ లో రావాలని, కావాలని కోరుకున్నాడో, ఆ మార్పు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు.

 

    "ఇంత త్వరగా నిప్పులాంటి నిర్ణయం తీసుకోవటం వెనుక గల కారణం తెలుసుకోవచ్చా? నీ కభ్యంతరం లేకపోతే చెప్పు" తనూహించిన కారణం, తన కొడుకు చెప్పబోయే కారణం ఒకటే అయితే... ప్రపంచంలోకి ఒంటరిగా వెళుతున్న మధు అసాధ్యాల్ని, సుసాధ్యాలుగా చేయగలడన్న నమ్మకం తనకు కలుగుతుంది."

 

    మధుకర్ ఒకసారి తల్లీ , తండ్రి ముఖాలవేపు చూసాడు.

 

    "ఏకైక కారణం. నా ఆత్మాభిమానం దెబ్బతినడం- మగతనానికి అసలైన అర్థం స్వయంకృషి అని తెలీటం."

 

    "ఎవరిద్వారా తెలిసింది? ఎవరు తెలియజెప్పారో?"

 

    "మహతి..." ఒత్తిపలుకుతూ అన్నాడు మధుకర్.

 

    రాఘవేంద్రనాయుడిలో చిరు గగుర్పాటు...

 

    "ఎవరా మహతి?..." భువనేశ్వరిదేవిలో అంతులేని ఆశ్చర్యం.

 

    "మీ ఇద్దరిమధ్యా ఛాలెంజా?" నాయుడు తిరిగి అడిగాడు.

 

    "ఒక రకంగా అలాంటిదే." అంటూనే మధుకర్ ఫోన్ వేపు నడిచాడు.

 

    "ఛాలెంజ్ అన్నది- మీ వయస్సులో అయితే ఉక్రోషం, కసి, కోపం నుంచి పుట్టుకొస్తాయి. మా వయస్సులో అయితే అస్థిత్వం కోసం జరిగే పోరాటం లోంచి, సంయమనంలోంచి పుట్టుకొస్తుంది. ఛాలెంజ్ బాగానే వుంటుంది. కాని దాన్ని ఎదుర్కొనే సందర్భంలో చాలా సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు ఎదురొస్తాయి. వాటన్నిటిని చిరునవ్వుతో భరించగలిగినప్పుడే నీ ఛాలెంజ్ నిలబడుతుంది. నిలబడగలవా?" రాఘవేంద్రనాయుడు కావాలనే అలా మాట్లాడాడు.

 

    తండ్రివేపోసారి ఒకింత సీరియస్ గా చూసిన మధుకర్ చటుక్కున ఫోనందుకుని ఒక నెంబర్ డయల్ చేసాడు.

 

    వెంటనే మహతి లైన్లోకి వచ్చింది.

 

    "హలో... మధుకర్ దిస్ సైడ్. ఐయామ్ రెడీ" అని అంటూ తండ్రివేపు అదే సమాధానమన్నట్లు చూసాడు.

 

    రాఘవేంద్రనాయుడి మీసాలచాటున గర్వం...

 

    భువనేశ్వరీదేవి కళ్ళలో భయం...  

 

    "మగతనమంటే ఇది- రాత్రి చేసింది కాదు-" అంది ఫోన్ కి ఆవలి వేపునున్న మహతి తన క్రింద పెవవిని పై పంటితో నొక్కి పడుతూ.

 

    మధుకర్ ఫోన్ పెట్టేసాడు.

 

    అప్పటికే రాఘవేంద్రనాయుడు ఒక నిర్ణయానికొచ్చాడు. ఉన్న ఒక్క కొడుకును వదిలి వుండలేని పితృవాత్సల్యం, మమకారం, ప్రేమ, కొడుకులో చూసుకుంటున్న కన్నతండ్రి... సైకలాజికల్ డంకర్స్ నుంచి తప్పుకోలేకపోయాడు.

 

    కొడుకు తనకు కలిగించిన నష్టాన్ని లాభాలుగా మార్చగలిగినప్పుడు ఒకింత ఫీలయ్యాడంటే- కొడుకు దారి తప్పిపోతున్నాడే అని. దారి తప్పినా తన కనుసన్నలనుంచి, సాన్నిహిత్యం నుంచి దూరం కాలేడుగా అని ఆనందించాడు.

 

    బట్... బట్... ఇప్పుడు... తన సర్వస్వమే తననుంచి దూరమై పోతానంటుంటే తట్టుకోలేకపోతున్నాడు.

 

    ఎన్నేళ్ళగానో అనుభవాల ఒరిపిడి నుంచి ప్రోది చేసుకుంటూ వస్తున్న సంయమనం, గంభీరత, మంచికి- చెడుకి, లాభాలకు, నష్టాలకు చలించని ధీరత్వం క్రమంగా కళ్ళముందే చేతివేళ్ళ మధ్య నుంచి జారిపోయే ఇసుకలా అయ్యేసరికి కదిలిపోయాడు.

 

    "నీ నిర్ణయాన్ని నేను కాదనలేను. బట్... కనీసం ఒక్క ఇరవై నాలుగు గంటలు కలిసి నీతో గడపాలని ఒక తండ్రి ఒక కొడుకుని కోరుకోవటంలో తప్పులేదనుకుంటాను" బరువుగా వచ్చాయా మాటలు రాఘవేంద్రరావు కంఠం నుంచి.

 

    భర్త కంఠంలో అస్పష్టంగా తొంగిచూసిన వ్యధకు భువనేశ్వరీదేవి కదిలిపోయింది.

 

    మధుకర్ ఒకింత బాధపడ్డాడు.

 

    తండ్రి ఆవేదనని అర్థం చేసుకోగలిగాడు.

 

    అందుకే తండ్రి అభ్యర్థనని కాదనలేకపోయాడు మధుకర్.

 

                            *    *    *    *    *

 

    "బాబు చేసిన నష్టాల్ని, మీ తెలివితేటలతో లాభాలుగా మారుస్తున్నారు. ఇవ్వాళ లక్షలయ్యాయి- రేపు కోట్లు కావచ్చు- గొయ్యి పెద్దది కాకముందే కప్పి పెట్టాలని మీలాంటి పెద్దలు చెప్పారు. అందుచేత ముందుగా మీకు చెప్పటం నా బాధ్యత అని చెబుతున్నాను సార్- పదిరోజుల క్రితం ఆ బార్ ని కొనిపించటానికి కారణం మహతి. యూనివర్సిటీ ఆడిటోరియంలో విగ్రహాల ధ్వంసానికి కారణం ఆ మహతి. సిటిజన్స్ క్లబ్ లో జరిగిన గొడవకు కారణం ఆ మహతి. ఆ అమ్మాయి బాబుని సైడ్ ట్రాక్ పట్టిస్తోందని నా అనుమానం- ఇదిలాగే కొనసాగితే మీ ప్రెస్టేజ్ కి దెబ్బ" చెప్పటం ఆపాడు రవికిరణ్.

 

    రివాల్వింగ్ ఛైర్లో వెనక్కి జారగిలపడి ఆలోచిస్తున్న రాఘవేంద్రనాయుడు రవికిరణ్ వేపు చూసి-

 

    "ఆ అమ్మాయి వాంటెడ్ గా మనవాడ్ని ఫూల్ ని చేస్తుందనా నీ అభిప్రాయం?"

 

    "ఎగ్జాట్లీ సార్"

 

    "దానివల్ల వుపయోగం?"

 

    రవికిరణ్ సమాధానం చెప్పలేకపోయాడు.

 

    "రవికిరణ్... వాడు మిస్ గైడ్ కాకూడదు. రేపటి ఈ కోట్ల ఆస్తికి వారసుడు వాడు. వాడిమీద నాకెన్నో ఆశలున్నాయి. వాళ్లిద్దరి మధ్యా వున్న క్లాష్ ని గమనిస్తుంటే, ఇదేదో సీరియస్ ఎఫైర్ గా మారే ప్రమాదం వుందని నాకనిపిస్తోంది. అందుచేత ఇది ముదరకముందే కట్ చెయ్యడం మంచిది. బాబు జోలికి రావద్దని వార్నింగిద్దామా?"

 

    ఓ కొడుక్కి తండ్రిలా మాట్లాడాడు రాఘవేంద్రనాయుడు. ముందు తన కొడుకు కట్టుబట్టలతో నడిరోడ్డుమీదకు వెళ్ళి నిలబడే ప్రయత్నం చేస్తానన్నప్పుడు, నిజమైన జీవితం అంటే ఏమిటో అనుభవంలోకొచ్చి బాగుపడతాడనుకొని సంతోషించాడు. కానీ... ఎడబాటునే వూహించలేక మనస్సు మార్చుకున్నాడు.

 

    "నో సార్ వద్దు. ఈ వయసులో పిల్లలకి వార్నింగిస్తే ప్రమాదం. ఏది చెయ్యకూడదంటామో అదే చేస్తారు."

 

    అయిదు నిమిషాలసేపు రాఘవేంద్రనాయుడు ఏం మాట్లాడలేదు. ఆయన బ్రైన్ ఓ కంప్యూటర్ చెస్ బోర్డు లాంటిది.

 

    ఎత్తులూ, పై ఎత్తులూ, పడగొట్టడాలు , పక్కకు జరపడాలూ అన్నీ ఆటోమేటిగ్గా జరిగిపోతుంటాయి.

 

    మహతి ఆడుతున్నది ఓ ఇంటిలిజెంట్ గేమ్ అని అన్పిస్తుందాయనకు అయితే ఆ గేమ్ ఎందుకు?

 

    "మిస్టర్ రవికిరణ్! ఐ వాంట్ టు సీ హెర్. అవును...! ఆ మహతిని నేను చూడాలి. నేనా అమ్మాయితో మాట్లాడాలి."

 

    రాఘవేంద్రనాయుడి నోటినుంచి వచ్చిన ఆ మాటకు ఆశ్చర్యపోయాడు రవికిరణ్. టైమ్ వాల్యూ తెల్సిన రాఘవేంద్రనాయుడి బిజీ షెడ్యూల్ లో ఒక్కొక్క సెకండ్ విలువ ఒక్కో లక్ష రూపాయలు. ఆయనెప్పుడూ టైం వేస్ట్ చేయరు.

 

    జీవితమనే కరెన్సీ కాగితమ్మీది వాటర్ మార్క్ లాంటిది టైమ్ అంటాడాయన. వాటర్ మార్క్ లేకపోతే ఆ రూపాయి కాగితానికి విలువ లేదు. ఆయన ఇంటర్వ్యూ కోసం ఎంతోమంది ప్రముఖులు వెయిట్ చేస్తుంటారు. అయినా ఆయన పర్సనల్ గా మాట్లాడేది, అతి ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే. కానీ...