"నమస్కారం...మీరు రాఘవరావుగారు కదూ?" అన్న పలకరింపుకి అందరం అటు చూశాం.

 

    ఓ పాతికేళ్ళ అబ్బాయి నాన్నగారితో "నేను కేశవరావుగారి అబ్బాయి మాధవ్ ని" అన్నాడు.

 

    "ఓరి...కేశవ కొడుకువా?" నాన్నగారి కళ్ళల్లో వెలుగు. "చిన్నప్పుడెప్పుడో చూశాను. అందుకే గుర్తు పట్టలేకపోయాను. నాన్న ఎక్కడున్నాడూ?" ఆప్యాయత ధ్వనించింది ఆయన గొంతులో.

 

    "నాన్నగారు పోయారు. అమ్మా చెల్లీ నా దగ్గరే ఉన్నారు. నేను ఎమ్ టెక్ పూర్తిచేసి ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను" అన్నాడు.

 

    "ఈ ఊళ్ళోనేనా?" నాన్నగారి కళ్ళల్లో ఆశ్చర్యం.

 

    "ఔను! నాన్నగారు పోయినప్పుడు మీ పాత ఎడ్రెస్ కి తెలియబరిచాము" అన్నాడు మాధవ్.

 

    అది విన్న నాన్న బాధపడ్తూ "నాకన్నా ఓ సంవత్సరం చిన్నవాడేనే!" అన్నారు.

 

    "కిడ్నీలు పాడయిపోయాయి" అన్నాడతను.

 

    చిన్నక్క కళ్ళద్దాలు సవరించుకుంటూ "రెండూనా? మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ డొనేట్ చెయ్యడానికి ముందుకు రాలేదా?" అని అడిగింది.

 

    మాధవ్ విస్మయంగా ఆమెని చూశాడు.

 

    నాన్నగారు వెంటనే "మా రెండో అమ్మాయి కాళింది. డాక్టర్" అని పరిచయం చేశారు.

 

    మాధవ్ వాళ్ళ నాన్నగారి కేసు వివరించాడు. వాళ్ళిద్దరూ ఆ కేస్ గురించే మాట్లాడుకున్నారు.

 

    నాన్నగారు నన్నూ పెద్దక్కనీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అతను నవ్వి ఊరుకున్నాడు.

 

    మాధవ్ చాలా బావున్నాడు. కానీ చాలా పెద్దమనిషి తరహాగా ఉన్నాడు. కొంతమంది యువకుల్ని చూస్తే గౌరవించాలనిపిస్తుంది! పాపం!


                                                         *  *  *


    ఇంటికొస్తుంటేనే ఆపుకోలేక అమ్మ "కుర్రవాడు బుద్ధిమంతుడిలా ఉన్నాడుకదండీ!" అంది.

 

    హోటల్లో అరగంటలో అమ్మకి అతని బుద్ధిమంతతనం ఏం తెలిసిందో!

 

    ఆవిడకి తెలిసిందల్లా ఇంకా పెళ్ళికాని ఎలిజిబుల్ పెళ్ళికొడుకనీ! ఆడపిల్లల తల్లిదండ్రులకి ఒక ఛానెల్ ఎప్పుడూ పిల్లల పెళ్ళి గురించి వర్క్ చేస్తూనే ఉంటుంది!

 

    "ఆదివారం వాళ్ళ అమ్మనీ, చెల్లెల్నీ తీసుకురమ్మన్నాగా!" నాన్నగారు అర్థవంతంగా అని "కేశవ నాకు బాల్యమిత్రుడు. మంచివాడు. వాడి పోలికలే వచ్చి వుంటే మాధవ్ బుద్ధిమంతుడే అయ్యుంటాడు" అన్నారు.

 

    "ఈ వాతావరణమంతా చూడబోతే ఏదో పెళ్ళి సంబంధం గురించి మాట్లాడేస్తున్నట్లుంది...ఏమ్ ఐ...కరెక్ట్!" అడిగింది చిన్నక్క.

 

    "కాళింది పక్కన ఆ కుర్రాడు బావుంటాడు!" పెద్దక్క సర్టిఫై చేసేసింది.

 

    "అక్కా...నేను ఇందాకే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను వినండి...నాన్నగారి బాధ్యతలన్నీ నావే! అంటే ఆముక్త చదువూ, పెళ్ళీ! అవన్నీ అయిపోయాక నా సంగతి ఆలోచిస్తాను. అంతవరకూ నన్ను చదువుకోనీయండి. నేను ఎమ్.ఎస్. చెయ్యాలి" అంది.

 

    "నీ ధోరణి సరే...మా మనశ్శాంతి సంగతి ఆలోచించవేం? పెళ్ళి చేసుకోకుండా ఆడపిల్ల సంపాదిస్తుంటే హాయిగా ఉండగలమా?" అమ్మ కినుకగా అడిగింది.

 

    "హు! ఆడపిల్ల...మీరే అలుసు చేస్తే ఇంకోళ్ళు చెయ్యరా? అదే మగపిల్లాడైనట్లయితే మీరిన్ని ఆంక్షలు పెట్టేవారా!" బాధగా అడిగింది చిన్నక్క.

 

    "కాళిందీ...ఏ వయసుకి ఆ ముచ్చట!" అంది పెద్దక్క.

 

    "నిన్ను చూస్తుంటే తెలుస్తోందిగా. హాయిగా చదువుకుని నీ కాళ్ళమీద నువ్వు నిలబడకుండా ఏమీ తెలీని వయసులో పెళ్ళి చేసుకుని పురుళ్ళతో, పిల్లలతో ఆరోగ్యం పాడు చేసుకున్నావు" అంది చిన్నక్క.

 

    వాతావరణం వేడెక్కుతుండటంతో నాన్న "సరే...నువ్వుకాదంటే ఆముక్తకి చూద్దాంలే! మంచి పెళ్ళికొడుకుని వదులుకుంటామా?" అన్నారు.

 

    "ముక్తకి చైతన్య ఉన్నాడుగా!" అంది పెద్దక్క.

 

    "ఫర్లేదు. ఇద్దర్నీ చేసుకుంటాలే!" అన్నాను కోపంగా.

 

    "ఇంకో ముగ్గుర్ని కూడా వెతకనా?" వేళాకోళంగా అడిగింది పెద్దక్క.

 

    "పాంచాలి పిచ్చిదేం కాదు! తనకు కావల్సిన క్వాలిటీస్ అన్నీ ఒక్కడిలో దొరకవు కాబట్టి ఐదుగుర్నీ ఆ లక్షణాలున్న వాళ్ళని పట్టి పెళ్ళాడేసింది!" అంది చిన్నక్క.

 

    "సరిపోక ఆరోవాడిని కూడా మనసులో కోరుకుందిట!" నెమ్మదిగా అన్నాను.

 

    'ఔను! ఆడపిల్ల కోరుకునే లక్షణాలన్నీ ఒక్కడిలో లభ్యమౌతాయా? పాంచాలి ఎంత అదృష్టవంతురాలూ!' అనుకుని నా ఆలోచనకి నేనే నవ్వుకున్నాను.


                                  *  *  *


    చిత్ర కళ్ళల్లో అంతులేని సంతృప్తి!

 

    వైజయంతీ, నేనూ ఆమె పక్కన నిలబడ్డ ఆమె ఫారెన్ రిటర్న్ డ్ బావని సంభ్రమంగా చూశాం.

 

    పొట్టిగా, పీలగా, సోడాబుడ్డి కళ్ళద్దాలతో చిత్రముందు చిన్నపిల్లాడిలా ఉన్నాడు.

 

    "చిత్ర అదృష్టవంతురాలు" అన్నాను.

 

    "అతన్ని చూశాకకూడా ఆమాట అంటున్నావా?" విస్మయంగా అడిగింది వైజయంతి.

 

    "చూశాకే అనిపిస్తోంది. దానికి ఉన్న దాంట్లో ఆనందం వెతుక్కోవడం బాగా తెలుసు కాబట్టి జీవితంలో హాయిగా ఉండగలదు!" అన్నాను.

 

    "ఏమో బాబు! నువ్వు ఈ మధ్య చాలా లోతుగా మాట్లాడ్తున్నావు" అంది వైజయంతి.