పసుపుతో చేసిన మందులతో కేన్సర్ మాయం

పసుపుతో చేసిన మందులతో కేన్సర్ మాయం

 

 

భారతీయ స్త్రీలకు పసుపు అంటే ఎంత ఇష్టమో తెలియంది కాదు. ఇంట్లో పసుపు నిండుకుంటే, వారికి రోజంతా లోటుగానే తోస్తుంది. కూరలో కాస్త రుచి కావాలన్నా, మొహం కాంతిగా ఉండాలన్నా, చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా.... ఆఖరికి కొత్త బట్టలు వేసుకోవాలన్నా చిటికెడు పసుపు లేనిదే పని జరగదు. పసుపులో ఉండే ఔషధగుణాల వల్లే మన సంప్రదాయంలో దానికి అంత ప్రాముఖ్యత అంటారు.

పసుపుకి ఉండే ఔషధి గుణాల గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ఓ నాలుగు గ్రాముల పసుపు నోట్లో పడితే జీర్ణాశయం దగ్గర నుంచి గుండె వరకు మన ఒంట్లో అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయని చెబుతారు. కేన్సర్‌ని నిరోధించడంలోనూ పసుపు ప్రభావం గురించి ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే కేన్సర్‌కు మందుగా పసుపుని ఉపయోగించడం ఎలాగా? అన్నది ఇప్పటిదాకా ఓ సమస్యగానే ఉంది. ఇప్పుడు ఆ సమస్యకి పరిష్కారం కనుగొన్నారన్న శుభవార్త వినిపిస్తోంది.

పసుపు ఆ రంగులో ఉండేందుకు, అది ఒక ఔషధంగా ఉపయోగపడేందుకు... అందులో ఉండే సర్కుమిన్ అనే రసాయనమే కారణం! అయితే ఈ సర్కుమిన్ను నేరుగా కేన్సర్ కణాల మీద ప్రయోగించడం సాధ్యం కాదు. సర్కుమిన్కు కరిగే గుణం తక్కువ, స్థిరత్వమూ తక్కువే! దాంతో నానోపార్టికల్స్ అనే ప్రక్రియ ద్వరా దీనిని కేన్సర్‌కు మందుగా వాడే ప్రయత్నం చేశారు. ఇందుకోసం Cerium oxide అనే సూక్ష్మకణాలకు (nano particles) సర్కుమిన్ను జోడించారు. దీనికి dextran అనే ఒక తరహా గ్లూకోజ్‌ను పైపూతగా పూశారు. ఇక మందు సిద్ధమైపోయింది! పరిశోధకులు రూపొందించిన ఈ మందుని Neuroblastoma అనే ఒక అరుదైన కేన్సర్ మీద ప్రయోగించి చూశారు. ఎక్కువగా పసిపిల్లలని కబళించే ఈ తరహా కేన్సర్‌ని చాలా ప్రాణాంతకంగా భావిస్తూ ఉంటారు. నాడీవ్యవస్థని ప్రభావితం చేసే ఈ కేన్సర్ మన అడ్రినల్ గ్రంథులలో మొదలై శరీరం అంతటా వ్యాపిస్తుంది. ఈ కేన్సర్ కణాలు సంప్రదాయవైద్యానికి ఓ పట్టాన లొంగవని చెబుతారు. చికిత్స తర్వాత కేన్సర్ తగ్గినట్లు కనిపించినా మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఎక్కువే. అదృష్టవశాత్తూ వ్యాధి నయమైనా కూడా ఇతరత్రా దుష్ప్రభావాలు చాలానే ఉంటాయి.

ఇలాంటి సంక్లిష్టమైన Neuroblastoma కేన్సర్ మీదకు పసుపుతో చేసిన నానోపార్టికల్స్‌ను ప్రయోగించి చూశారు. ఫలితం ఊహించినదే! పసుపుతో చేసిన ఈ మందులు కేన్సర్ కణాలను నిర్వీర్యం చేసిపారేశాయి. ఈ క్రమంలో అవి శరీరంలోని ఇతరత్రా ఆరోగ్యకరమైన కణాలను ఎటువంటి హానీ తలపెట్టలేదు. కేన్సర్ వల్ల మృత్యువాత పడే పిల్లలలో 15 శాతం మంది ఈ Neuroblastomaతోనే చనిపోతున్నారట. కాబట్టి ఈ సరికొత్త ప్రయోగంతో అలాంటి మరణాలను నిస్సందేహంగా ఆపవచ్చని ఆశిస్తున్నారు. ఇదే తరహా చికిత్సను ఇతరత్రా కేన్సర్లకి కూడా ప్రయోగించే రోజులూ వస్తాయి. అదే కనుక జరిగితే... ఇక మానవాళి కేన్సర్ నుంచి విముక్తి చెందినట్లే!

- నిర్జర.