రవి ఎన్ రోల్ అయ్యాడు. జీవచ్ఛవంలా కోర్టుకిపోయి వస్తున్నాడు. కానీ ఈ ఆడంబరమంతా దేనికి? ఆనాటి సంఘటన తర్వాత చిన్నక్కకు ముఖం చూపించటానికే సిగ్గువేస్తుంది. ఇదంతా చేతులారా చేసుకుంది తను. తుచ్ఛుడు, బలహీనుడు, పాపి. సుమారు పదకొండు సంవత్సరాల క్రితం తను కళ్ళారా చూసిన సంఘటన తనను తారుమారు చేసింది. దృఢనిశ్చయపరుడ్ని చేసింది. ఆ నిశ్చయం మంచాచెడా అని ఆలోచించే విచక్షణాజ్ఞానం అప్పుడు తనకు లేదు. తీరా ఆ జ్ఞానం అబ్బాక యుక్తా యుక్తులు నిర్ణయించుకునే సమర్ధత చేయి దాటిపోయింది. కానీ అప్పటికీ పర్యవసానంగురించి ఊహించటంగానీ భయపడటంగానీ జరుగలేదు. అది మొండితనం, వెర్రితనం . వెర్రివాడు ఏం చేస్తాడు? ఎవరినో ప్రేమించాననుకుంటాడు. ఎవరినో ప్రేమిస్తాడు. అంతేకాక తాను చాలా తెలివిగలవాడి ననుకుంటాడు. ఒకోసారి నిప్పుల్లో దూకి "ఆహా చల్లగా వున్న"దనుకుంటాడు. నిజానిజాలు బుగ్గిపాలయినాయి. రేపో మాపో తను పెళ్ళికొడుకు - శశి భర్త. కానీ ఏ మనశ్శాంతికోసమై తానీ సంఘర్షణలోకి దిగాడో , ఆ మనశ్శాంతి లభించలేదు సరికదా, స్వార్ధపరుడై చరిస్తున్నాడు. కఠినుడిగా వుండదలిచాడు. వికలమనస్కుడయ్యాడు. ప్రేమతో చెలగాటాలాడాలనుకున్నాడు. పరాజయం పొందాడు. అంతేకాక, ఛీ! ఏదో సౌఖ్యాన్ని ఆకాంక్షిస్తున్నాడు. తహతహ అంటే ఏమిటో అర్ధం చేసుకున్నాడు. అతనికి శశి ఎప్పుడు గుర్తుకువస్తుందంటే రాగిణిగురించి తలుచుకుని వ్యధ చెంది, ఎంతో తిరిగి, నిద్దురలేక కలతలపాలై తల నేలకేసి బాదుకుందామని అనుకుంటుండగా కేశవులు వచ్చి "ఏమిటయ్యగారూ అలా వున్నారు? మిమ్మల్ని చూస్తే నాకు ఎలానోవుంది" అని కళ్ళు తుడుచుకున్నప్పుడు "శశీ!" అనుకునే వాడు కోపంగా. ఇందులో శశి తప్పు ఏమీలేదనీ, ఈ ఘోరపాపం అంతా తనదేననీ అతనికి తెలియకపోలేదు.

 

    మొదట్లో పాత స్నేహితులు వచ్చేవారు. వాళ్ళని తూష్ణీభావంతో ఎప్పుడూ చూడలేదు గానీ ఇతని ప్రవర్తనా, వాలకంచూసి బెదిరి వాళ్ళే రావటం మానేశారు. సాయంత్రాలు ఎక్కడికీ తిరగటంలేదు. తనగదిలో ఏదో పుస్తకం ముందు వేసుకునో, రాసుకుంటూనో కూర్చునేవాడు. కానీ అంతా ముగిశాక తను చేసింది ఏమీ లేదని తెలుసుకుని నవ్వుకునేవాడు కాదు, ఒక్కోసారి చిన్నక్క గదిలోకూర్చుని రోజంతా ఆలోచన్లతోనే గడిపెసేవాడు. అతని ఉద్దేశంలో అది చాలా పవిత్రమైన గది. అక్కడ మనోనిబ్బరం, ఆత్మశాంతి వుంటుందన్న నమ్మకం కుదిరింది. కానీ అదీ లాభంలేదు. అప్పుడు హఠాత్తుగా ఓ సత్యం స్ఫురించి అతన్ని విస్మితుడ్ని, నిర్వికారుడ్ని చేసింది. తానే ఆత్మజ్యోతిని సరియైన దివిటీతో వెలిగించగలిగితే అంతా సక్రమంగానే నడుస్తుంది. అనుకున్నదంతా సరిగా నెరవేరుతుంది కానీ విజయఫలితాన్ని సాధించిన తన కృషిని పటాపంచలు చేసి తుదికి అవతరించబోయే సంతృప్తి విచ్ఛిత్తి కలుగజేసింది. తనలోని బలహీన హృదయం ఇంకా స్వార్ధం.

 

    ఆ రాత్రి మెట్లపైనుండి క్రిందకు దిగివస్తూ కాలుజారి దొర్లిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దం. కేశవులు రాత్రి తోడుగా పడుకుంటానన్నా వద్దని పంపేశాడు. అలా నేలమీద పడిపోయి అరగంటవరకూ అక్కడినుండి కదలలేకపోయాడు. మేడమీద గదిలో ఎక్కడో లైటు వెలుగుతోంది. ఇక్కడంతా చీకటి. ఒకవేళ ఆ సమయానికి ఎవరైనా ఇంట్లోకివస్తే ఆ క్షణంలో ఓ మానవాకారం బాధనంతా బిగబట్టుకుని వుందని గ్రహించలేరు. లేదా దొంగ అని అయినా పొరబడి పలాయనం చేస్తారు. చాలాసేపటికి అతడు మెల్లిగా లేచికూర్చున్నాడు. ఎడమకాలి మడమ తీవ్రంగా మండిపోతోంది. మడతపడింది. "శశీ! నువ్వే జయించావు" అన్నాడు. "కృతజ్ఞుడ్ని" గట్టిగా పెదాలువిప్పి చిన్నగా ఆర్తనాదం చేశాడు. లేచినిల్చుంటే తూలిపోతున్నాడు. "శశీ! నేను కుంటివాడినైతే నన్ను పెళ్ళి చేసుకుంటావా?" అని మళ్ళీ తూలాడు. "ఇది నిజం, నా కాలిబొమిక విరిగిపోయింది." అనుకున్నాడు.     

 

    కుంటుకుంటూ ఇల్లంతా తిరిగాడు. పన్నెండుగూడా దాటినట్లుంది. నిశాచరుడిలా తిరుగుతూ ఇంటి కిటికీతలుపులన్నీ తెరిచాడు. చలిగాలి రివ్వుమని లోపలకు వస్తోంది. భలేవుంది ఇప్పుడు. "ఆ పాడు వెలుతురు ఎందుకు పైనా? అది ఆర్పివెయ్యాలి" అనుకుంటూ కుర్చీలూ బల్లలూ పట్టుకుంటూ మెట్లవరకూ వచ్చాడు. మొదటిమెట్టు ఎక్కేసరికి మెలిక తిరిగిన వామపాదం వణికిపోతోంది. అతనూ వణికాడు. దౌర్భాగ్యుడు. ఏం చేద్దామనుకున్నాడు? అంత మంచిగదిలో వెలుగులేకుండా ఎలా మాయచేయదలిచాడు? మెట్లమీద కూలబడి "హాయిగా వుంది, హాయిగా వుంది" అనుకోసాగాడు. మెల్లిగా ప్రక్కనవున్న కమ్మీకి తల ఆనించి పడుకున్నాడు. ఒక్కక్షణం ప్రకృతి స్తంభించింది. మళ్ళీ కనులు తెరిచాడు. యధాప్రకారం చీకటి వీచింది.         

 

    అతనికి మెలకువ వచ్చేసరికి తలుపెవరో తడుతున్నారు. కానీ కళ్ళకేమీ కనిపించకుండా నిశీధి విలయతాండవం చేస్తోంది. ఆతృతతో లేచి నిలబడి అడుగులు వేయబోయాడు. కానీ స్వాధీనం కాలేదు. తడబడి తృళ్ళిపడి నేలకు ఒరిగిపోయి బాధతో 'చిన్నక్కా!' అని మూలిగాడు.

 

    మళ్ళీ తలుపు దబదబమని చప్పుడైంది. ఓ స్త్రీ కంఠం అవతలవైపు నుంచి పిలుస్తుంది "రవీ! రవీ!"

 

    అతను నిర్ఘాంతపోయాడు. ఎవరిదీ కంఠస్వరం? ఆమెదే! ఏం జరిగింది? ఈ వేళకానివేళ ఎందుకిలా వచ్చింది? ఏమయినా ప్రమాదం.... "వస్తున్నా" అని అరిచాడు. కానీ ఆ అరుపు తనకే వినబడలేదు. వాయువేగంతో పోయి ఆ తలుపులు విడగొడదామనుకున్నాడు గానీ లేవలేదు. యావచ్ఛక్తినీ వినియోగించి భూమిమీద కాళ్ళు నిలబెడదామని విశ్వప్రయత్నం చేశాడు. విఫలుడవటమే కాక బాధతో ఆర్తనాదం చేశాడు. బయటి పిలుపులు ఎక్కువవుతున్నాయి. వాటిల్లో పలుకుతున్న వణుకులు విని ఏ మానవుడూ స్థయిర్య చింతతో నిలువజాలడు. అస్పష్టమైన హీనస్వరంతో ఏదో గొణిగాడు. ఆవేశం అసమర్ధతను మరగబెడుతోంది. ఏదోగా వినిపిస్తున్న ఈ ఆవహంలోని సౌహార్ధ్రత విపరీతమై బాహ్య బాధను విస్మరింపజేస్తూ బలంగా దగ్గరకు లాక్కువెడుతోంది. తుదకు ఆ పని తనకు అవశ్యమని గ్రహించాడు. తలుపుల శబ్దం అధికమైంది. అది గుండెల్లోకి నేరుగా ప్రవహిస్తున్నాయి. అతనికి ముచ్చెమటలు పట్టాయి. నిర్దయతో జలజల ప్రవహిస్తున్నాయి. అవి పాలభాగం మీదనుండి కనులమీదుగా చెంపలలోకి జారినప్పుడు, అక్కడ వెలుగేగనుక వుండినట్లయితే ఎవరన్నా చూసి "అమ్మో! ఇన్ని కన్నీళ్లే!" అని గుండెలు బాదుకోవలసిందే. ప్రాకుతున్నాడు కానీ ప్రాకుతున్నట్లు లేదు. ఆ తలుపే దగ్గరకు లాక్కువెడుతోందా? అని చంచలుడౌతున్నాడు. దూరం ఎన్నో యోజనాలవలే వుంది. అలా జరిగిన కొన్ని నిముషాలు గంటల్ని మరిపించాయి. ఎట్టఎదురుగా తలుపు, నిస్సత్తువ మనిషిని విసురుగా పడవేస్తున్నది. తలుపుల్నీ, గోడనీ ఆధారంగా చేసుకుని నెమ్మదిగా లేచాడు. ఎలానో గడియ తీయటంలో నెగ్గిన రవి "చిన్నక్కా!" అంటూ ముందుకు వాలిపోయాడు.