ముగ్గురూ కలసి తిరిగివచ్చి మళ్లీ కారు ఎక్కారు. ఈసారి సుందరం భార్యకు మరీ దగ్గరగా జరిగి కూర్చున్నాడు. ఆమె సున్నితమయిన వ్రేళ్ళను తనచేతిలోకి తీసుకున్నాడు.

 

    అక్కడ మూడు నిద్రలయిపోయాక మనుగుడుపులకని అతన్ని అత్తవారింటికి తీసుకుపోయారు.

 

    అక్కడ ఎంత కొత్తగా వుంటుందోనని హడలిపోయాడు సుందరం. కాని అనుకున్నంత ఇబ్బంది అనిపించలేదు. అత్తవారింట్లో మరదళ్ళతోనూ, అక్కడి మిగతా వ్యక్తులతోనూ చాలా సులభంగా కలిసిపోయాడు.

 

    వెళ్ళిననాటి రాత్రి పదకొండూ, పన్నెండుగంటలదాకా మాట్లాడుతూ కూర్చున్నాడు. అంతవరకూ ఎంత మొత్తుకున్నా అతడ్ని నిద్రపోనివ్వలేదు మరుదులూ, మరదళ్ళూనూ. జ్యోతి నిద్ర వస్తోందని చెప్పి ముందుగానే వెళ్లిపోయింది. క్రమంగా అంతా వెళ్ళిపోయి అతను ఒంటరిగా మిగిలాడు.

 

    అతనికి నిద్రపట్టలేదు. ఈ నాలుగురోజులకే ఆమెని విడిచి ఉండలేని స్థితికి వచ్చాడా అనిపిస్తోంది. భార్య తన దగ్గరవుండి కబుర్లు చెబితే బాగుండు ననుకున్నాడు. ఆమె ఏ గదిలో పడుకుని వుందో అతను చూశాడు. అక్కడికి వెళ్ళాలనిపించింది. ఎవరైనా చూస్తే...? తప్పేముంది? జ్యోతి తన భార్య అనుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని మెల్లిగా లేచాడు. కాని ఆమె గదిని సమీపిస్తూండేసరికి అతని గుండె వడివడిగా కొట్టుకోసాగింది.

 

    బెడ్ లైట్ వెలుతుర్లో పరుపుమీద పడుకుని అమాయకంగా నిద్రపోతున్న జ్యోతి అతనికి మనోహరంగా కనిపించింది. ఈ నాలుగు రోజులలో ఎప్పుడూ లేనిది ఈ సమయంలో ఆమె సున్నిత సౌందర్యం అతడ్ని ప్రలోభపెట్టింది. అతడు మోహితుడయినాడు. మెల్లగా ఆమెముఖంమీదకు వంగాడు. మెలికలు తిరిగిన ఆమె పెదవుల్ని చుంబించాలనిపించింది. ఆ చిన్న హృదయం పైన తలవుంచి సేద తీరాలనిపించింది. అతని ముఖం ఆమె ముఖానికి మరింత దగ్గరకు వచ్చింది. ఇంతట్లో జ్యోతి నిద్దట్లో కదిలింది. అతను అప్రతిభుడయాడు. ఒక్కనిముషం స్తబ్దుగా వుండిపోయాడు. తిరిగి ధైర్యం చాలలేదు. తన గదికివచ్చి ప్రక్కమీద దిగులుగా పడుకున్నాడు.

 

    మరునాటి ఉదయం జ్యోతి కాఫీ తీసుకువచ్చినప్పుడు ఆమె ముఖంలోకి చూడటానికి సిగ్గేసింది. ఆమె మామూలుగా నవ్వుతూ మాట్లాడుతున్నది.

 

    స్నానంచేసి ముస్తాబయినాక కాసేపు ఎటయినా తిరిగి వద్దామనుకున్నాడు కాని తనకు ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళెవరూ లేరు. అందువలన చేసేదిలేక గదిలోనే కూర్చుని అక్కడున్న నవలేదో తీసుకుని చదువుకోసాగాడు.

 

    జ్యోతికి క్రింద ఏమీ తోచలేదు గావును, పైకి చక్కా వచ్చేసింది.

 

    "నీ చెయ్యి పట్టుకోనా?" అనడిగాడు సుందరం వున్నట్లుండి.

 

    "ఇప్పుడంత అవసరం ఏముంది చెప్పండి" అంది జ్యోతి.

 

    "అవసరంతో నాకు నిమిత్తం లేదు" అంటూ అతను ఆమెచేతిని మృదువుగా పట్టుకున్నాడు.

 

    "ఎవరన్నా చూస్తారండీ" అంది జాలిగా జ్యోతి.

 

    "నేను పరాయివాడ్ని కాదుగా"

 

    "అయినా, అసలు మనమిద్దరం ఇలా మాట్లాడుకోకూడదు, గదిలో వొంటరిగా వుండకూడదు."

 

    "ఏమో"

 

    "ఎందుకో మీకు తెలీదా చెప్పండి" అంది జ్యోతి కనురెప్పలు క్రిందికి వాల్చి.

 

    అతనికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక ఆమె చేతిగాజుల్ని సవరిస్తూ మోచేతివరకూ మెల్లగా అలా రాశాడు.

 

    "మీ వ్రేళ్ళు స్వాధీనం తప్పుతున్నాయి" అని జ్యోతి కాస్త వెనక్కి జరిగి నిలబడింది.

 

    "యీ నెక్లెస్ మేము పెట్టిందేనా?" అంటూ అతను ఆమె కంఠాన మెరుస్తున్న నెక్లెస్ సవరించసాగాడు.

 

    జ్యోతి అతనివంక కోపంగా చూసి "మీ వేషమంతా నాకు తెలుసునుగానీ అక్కడినుంచి చెయ్యి తీసెయ్యండి" అంది.

 

    "తియ్యకపోతే?"

 

    అబ్బబ్బా! ఏమి పెంకితనం చేస్తారండి? మిమ్మల్ని బ్రతిమాలుకుంటాను."

 

    "సరే" అని సుందరం కుదురుగా కూర్చుని "రాత్రి నీ గదికి వద్దామనుకున్నాను జ్యోతి. వస్తే ఏం చేసేదానివి?" అన్నాడు.

 

    "బాబోయ్! అంతపని మాత్రం చెయ్యకండి. గదితలుపులు తెరుచుకొని పడుకోవటం ప్రమాదమే అయింది" అంది జ్యోతి భయంగా.

 

    "అహ! అసలు వస్తే ఏం చేసేదానివి?"

 

    "గట్టిగా అరిచేదాన్ని"

 

    అలా అని, యింటిలో ఎవరో వస్తూన్న అలికిడి విని చల్లగా అక్కడినుంచి వెళ్ళిపోయింది జ్యోతి.

 

    ఆ రాత్రి తిరిగి అదే అవస్థ సంప్రాప్తమయింది సుందరానికి. లేచి వెళ్ళి చూశాడు. తలుపులు వేసివున్నాయి. మెల్లిగా తోశాడు. తెరచుకోలేదు. "గడుసుదే. గడియ వేసుకుని పడుకుంది" అనుకొని విసుక్కుంటూ వచ్చేశాడు.

 

    ఇంకోరోజు గడిస్తే తను వెళ్లిపోవాలి. సెలవులు అయిపోయినాయి. మళ్లా కాలేజి, మళ్ళా గది.

 

    అతని శరీరం గగుర్పొడిచింది.

 

    మూడోరోజంతా అతనికి ఆందోళనగానే గడిచింది. రాత్రి అయింది. గదిలో వంటరితనం అతనికి దుస్సహనం అనిపించింది. ఆమె గది తలుపులు వేసివుంటే తట్టి పిలుద్దామనుకున్నాడు. ఆమె ఎదుటపడగానే తన కళ్ళనీళ్ళు కారుతుండగా "జ్యోతి! నిన్ను విడచి వుండలేను. నువ్వెప్పుడూ నాకెదురుగా వుండాలి" ఇట్లా ఆవేశంగా చెప్పుకుపోదామనుకున్నాడు.

 

    ఆమె గది దగ్గరకు చిన్నగా నడిచి వెళ్ళాడు. తలుపులు మూసేవున్నాయి. అతను తోశాడు. జ్యోతి గడియవేయటం మరిచిపోయింది. చప్పున తెరుచుకున్నాయి.

 

    కాని ఆమె నిద్రపోవటంలేదు. నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతూ ఆలోచిస్తూ పడుకుంది. తలుపులు తెరుచుకోగానే ఉలికిపడి చూసింది.

 

    బెడ్ లైట్ సన్నని వెలుతురులో సుందరరావు!

 

    ఆమె కలవరపాటుతో చప్పునలేచి నిలబడి "మీరా?" అంది కంపిత స్వరంతో.