"బాబూ రాఘవా! నీకో చిన్న విషయం కానీ గొప్ప విషయమని నేను భావిస్తున్న విషయం చెప్తాను విను. సాధారణంగా మనుషులు భరించలేని దుఃఖం వచ్చినప్పుడు ఏకాంతాన్ని కోరుకుంటారు. సహించగలిగే సుఖం వచ్చినప్పుడు ఏకాంతాన్ని కోరుకుంటారు. కానీ వ్యాపారవేత్తకు కావలసింది భరించలేని దుఃఖం వచ్చినప్పుడు పదిమంది మధ్య ఉండటం. సహించగలిగే సుఖం వచ్చినప్పుడు కూడా ముందు వ్యాపారం, ఆ తర్వాతే సుఖం అనుకో- నువ్వు వ్యాపారవేత్తగా రాణిస్తావ్- కానీ నిజమైన వ్యాపారవేత్తకు ఉండాల్సిన ఇంకో లక్షణం నిజాయితీ. నీ కోసం కష్టపడేవాడి అవసరాన్ని గమనించు. వాడు నీ వెనకే వుంటాడు. ఒకడు నీతో పాటు, నీ మంచి కోరి వుండాలంటే, నువ్వు వాడి జీవితం పట్ల అపారమైన ప్రేమతో వుండాలి. వాడు ఎంత చిన్న ఉద్యోగి అయినా ఫర్వాలేదు. వాడింటికి వెళ్ళు. వాడిని, వాడి భార్యని, పిల్లల్నీ ఆత్మీయంగా పలకరించు. నీ హోదా కూడా గుర్తించకుండా, నువ్వొచ్చావని వాడు నీకోసం వాడి లైఫ్ మొత్తం ధారపోస్తాడు."

 

    ఇన్నాళ్ళకు తన కొడుక్కి ఏ విషయమూ చెప్పలేదు తను. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాల్సిన అవసరం వుంది. బాధ్యత తెల్సిన తండ్రిలా ఆ విషయాలు చెప్పాలి.

 

    "బాబూ! మధూ... ఒక్కగానొక్క కొడుకువి కాబట్టి నిన్ను కొంచెం ప్రేమగా పెంచి వుండొచ్చు కానీ... జీవితం అంటే ఇది కాదని నీకు తెల్సినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. నువ్వెన్నో తప్పులు చేసావ్. ఆ తప్పుల్ని నేను క్షమించాను. కానీ నీ తప్పుల్ని నేను ఒక బిజినెస్ మెన్ గా, ఒక తండ్రిగా క్షమించాను. అప్పుడు నువ్వు నా బిడ్డవు. కాని ఇప్పుడో- ఒక వ్యాపారవేత్తవు కాబోతున్నావ్. బిజినెస్ మెన్ కి అవలక్షణాలు వుండాలని నేను కోరుకోవడం లేదు. ఒక అవలక్షణం నిన్ను ఆక్రమించుకునే ముందు, దాన్లోకి నువ్వెందుకు వెళుతున్నావో, దానికి కారణాలేమిటో ఒక్కక్షణం ఆలోచించు.

 

    చిన్న విషయం...

 

    అప్పుడు నాకు ఇరవై ఏళ్ళ వయసు. పల్లెటూళ్ళో బతకలేక, ఏదో చెయ్యాలని, ఏదో సాధించాలని మొట్టమొదటిసారి హైద్రాబాద్ వచ్చాను. ఎవరూ, ఏ ఒక్కరూ తెల్సినవాళ్ళు లేరు. ఎక్కడకెళ్ళాలో తెలీదు. ఏం చెయ్యాలో తెలీదు. హిందీ భాష రాదు. రోడ్డు పక్క చిన్న సూట్ కేస్ పట్టుకుని నడుస్తున్న నాకు ప్రతీదీ వింతగా, ఆశ్చర్యంగా కనిపించింది.

 

    జీవితంలో నేనెప్పుడూ అనుకోలేదు హైద్రాబాద్ వస్తానని.  

 

    రోడ్డుకి అటూ ఇటూ కన్పిస్తున్న ఎన్నో భవనాలు, కులాసాగా కార్లలో పోతున్న మనుషులు...

 

    ఎప్పటికైనా నేను వాళ్ళలా కారులో తిరగగలనా? ఖరీదైన బిల్డింగ్ లో వుండగలనా? ఆ సమయంలో నా ఆలోచనలకు నాకే నవ్వొచ్చింది.

 

    సినిమా వాల్ పోస్టర్ చూసిన ప్రతివాడూ తనకేమిటి, తనూ యాక్టర్ కాగలననుకుంటాడు. తనకేం తక్కువ సత్యజిత్ రే, రాఘవేంద్రరావు, మాన్ మోహన్ దేశాయ్, సుభాష్ ఘాయ్, రామ్ గోపాల్ వర్మ కాగలననుకుంటాను.  

 

    ప్రతి అమ్మాయీ నేనేం శ్రీదేవికి తీసిపోయానా, మాధురీ దీక్షిత్ కి తీసిపోయానా అని అనుకుంటుంది. ప్రతీ యువకుడూ ఎన్టీఆర్ కి, ఏఎన్నార్ కి, తీసిపోయానా అనుకుంటాడు.

 

    నేను జార్జిబుష్ ని అవగలను. గోర్భచేవ్ ని అవగలను. ఎల్సిన్ ని అవగలను. హెన్రీ ఫోర్డ్ ని అవగలను. లీ అయికోకాని అవగలను. అమితాబ్ బచ్చన్ని అవగలను. అద్వానీని అవగలను... అని అనుకుంటారు. కలలు కంటారు.

 

    అనుకోవడంలో తప్పేంలేదు. కలలు కనటంలో కూడా ముప్పేం కాని అవకాశాల్ని చక్కగా వినియోగించుకోవడంలోనే మనిషి ప్రతిభ కన్పిస్తుంది.

 

    ఇప్పుడు నేను చెప్పిన నటులు, వ్యాపారవేత్తలు, పొలిటీషియన్స్ ఒక్క రాత్రిలో అంత స్థాయికి ఎదగలేదు. వాళ్ళేం కావాలో వాళ్ళనుకున్నారు- వాళ్ళు కన్న కలల్నీ నిజం చేసుకోవాలని వారి వారిరంగాల్లో అనవరతం శ్రమించారు, శ్రమిస్తున్నారు. ఊరికే అనుకొని- చలాగ్గా కలలు కని వాళ్ళు ఊరుకోలేదు. అందుకే ఎదిగారు.  

 

    ఒకటి గుర్తుంచుకో... నువ్వు చేసే పనులే, నీ భవిష్యత్ కు ఆధారాలౌతాయి నాకు అదృష్టం కల్సి వస్తే తప్ప నేనేమీ కాలేనని అనుకుని ఓ మూల కూర్చున్నా వనికో... నువ్వేమీ కాలేవు. దేశంలో వాణిజ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులొస్తున్నాయి. దేశం బాగుపడవచ్చేమో... మొత్తానికి ఇప్పటికైనా దేశాన్ని పారిశ్రామిక పథంవేపు శరవేగంతో నడిపించిన ది గ్రేట్ జె.ఆర్.డి. టాటాకు భారతరత్న ఇచ్చి సత్కరించారు. అదెప్పుడో జరగాల్సింది. ఇప్పటికైనా జరిగినందుకు సంతోషం. ఈ మార్పు నీలాంటి కొత్త ఎంటర్ ప్రెన్సూల్ కి అవకాశాల్ని, ఆశాభావాన్ని కలిగిస్తుంది, కలిగించాలి కూడా.కష్టించి పని చేయటానికి ప్రత్యామ్నాయం లేదని జె.ఆర్.డి. జీవితం రుజువు చేసింది.

 

    అందుకే సాలెపురుగు నాకిష్టం. ప్రతి మనిషి సాలెపురుగు కావాలి. ఆహారం దొరికినా, దొరక్కపోయినా సాలెపురుగు గూడు అల్లుతూనే వుంటుంది. నిర్మాణ కార్యక్రమం... నిరంతర నిర్మాణ కార్యక్రమం, అలుపుసొలుపు లేని నిర్మాణ కార్యక్రమం, ఆ నిర్మాణ కార్యక్రమాన్ని మనిషి నిరంతరం అలవరచుకోవాలి.

 

    అప్పుడు

 

    ఆరోజు-

 

    అలా నడిచి, నడిచి నేనెక్కడకు వెళ్ళానో నాకు తెలీదు. కాళ్ళు పీకేవరకూ నడిచాను.

 

    అలసట వచ్చాక ఓచోట కూర్చున్నాను.

 

    అదొక ఏకాంత ప్రదేశం. పాడుపడిన పాత బిల్డింగ్. ఆ బిల్డింగ్ అరుగు మీద కూర్చున్నాను. నాకు కొంచెం దూరంలో ఓ నలుగురు మనుషులు. వాళ్ళు బెగ్గర్ కాదు- రోడ్డుమీద చెత్త కాగితాల్నీ, పాత సీసాల్ని, రేకు డబ్బాల్నీ ఏరుకునే వాళ్ళు. వాటిని ఏరుకుని, వాళ్ళేం చేస్తారు?

 

    ఇంతమంది పిల్లాపాపా ఎలా బతుకుతారు?

 

    ఏమొస్తుంది?

 

    నాలో ప్రశ్నలు తలెత్తాయి. వాళ్ళు అప్పుడే, తమ కార్యక్రమానికి వెళ్తున్నారు.

 

    నీవు నమ్మవ్-

 

    వాళ్ళు వెళ్ళిన ప్రతీచోటకు నేను వెళ్ళాను. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాళ్ళతోనే వున్నాను.

 

    మధ్యాహ్యం మూడుగంటల వరకూ వాళ్ళు చెత్తాచెదారాల్ని ఏరుకున్నారు. ఆ తర్వాత ఒకచోట కూర్చుని దేనికదే విడదీసారు. మూటలు కట్టుకున్నారు. అక్కడ్నించి మార్కెట్ కు వెళ్ళారు.

 

    వాళ్ళంతా ఆ రోజు సంపాదించింది ఎంతో తెలుసా?

 

    యాభై రూపాయలు.

 

    అంటే...

 

    కళ్ళుంటే చూస్తే, కాళ్ళుంటే నడిస్తే, చేతులుంటే పనిచేస్తే, మనసుంటే ఆలోచిస్తే, ప్రతిచోటా, నువ్వు డబ్బును సృష్టించగలవ్.

 

    నాలో కలిగిన మొట్టమొదటి నమ్మకం అది. ఈ సంఘటన నీకెందుకు చెప్తున్నానో తెల్సా?

 

    ప్రతీ మనిషీ కష్టపడడంలో చీమలా వుండాలి. చురుకుదనంలో డేగలా వుండాలి. ఆలోచనలో ఆకాశంలా వుండాలి. గంభీరత్వంలో సముద్రంలా వుండాలి. ఇవన్నీ నువ్వు అలవర్చుకున్ననాడు, నువ్వు సమాజంలో ఏమైనా కాగలవు.

 

    డబ్బు సంపాదించటం ఒక్కటే ధ్యేయం కాదు. మరికొందరికి నువ్వు మార్గదర్శకం కావాలి. నువ్వు సుఖంగా వుండడానికి అవసరమైనంత డబ్బు సంపాదించు. నీ డబ్బు నీకు అతి సుఖాన్ని ఇస్తోందని తెలియగానే దానికి దూరంగా వుంటూ, సంపాదించటం మాత్రం మానేయకు. ఒక దశ దాటాక ఆ డబ్బు నీకేం బంగారపు బియ్యాన్ని, వెండి గోధుమల్ని తెచ్చిపెట్టలేదు. కాని నిన్ను నమ్ముకునేవార్ని బ్రతికిస్తుంది. ఆపైన దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతమవుతుంది. అతి సుఖం, అజీర్తిలాంటిది- అది నిన్ను మింగేస్తుంది- గుర్తుంచుకో-" రాఘవేంద్ర నాయుడు కొడుకువేపు చూసాడు. తండ్రి చెప్తున్న ప్రతి విషయాన్నీ, శ్రద్ధగా మననం చేసుకుంటున్నాడు మధుకర్.