నిత్య నేర్పిన జీవిత పాఠం

 

1) మొన్న మా పక్కింటి పాపాయి నుంచి నేనో మంచి విషయం నేర్చుకున్నానండి. ఏడేళ్ళు వుంటాయి 2వ తరగతి చదువుతోంది- వాళ్ళ క్లాసు వాళ్ళని పిక్నిక్ కి తీసుకువెళ్తున్నారని పదిరోజుల ముందు నుంచి అపార్ట్ మెంట్ అంతా తిరిగి అందరికి చెప్పింది. అరోజు తేసుకువెళ్ళటానికి కొత్త బ్యాగు,లంచ్ బాక్సు వంటివి వాళ్ళమ్మతో కొనిపించుకుంది. తీరా పిక్నిక్ ఒకరోజు ముందు తనకి విపరీతమైన జ్వరం. మర్నాటికి ఏమాత్రం తగ్గినా పంపిచేస్తానంది వాళ్ళ అమ్మ. కాని పాపం తగ్గలేదు. మర్నాడు ఉదయం 6 గంటలకి తను స్కూలు దగ్గరకి వెళ్ళాలి. వెళ్ళుతుందో, లేదో,తనకి ఎలా వుందో కనుక్కుందామని వాళ్ళంటికి వెళ్ళాను. అప్పటికే లేచి సోఫాలో కుర్చుని వుంది. ఇంకా జ్వరం తగ్గలేదు, నాకు చాలా బాదేసింది. పాపం ఎప్పటినుంచో సరదా పడుతోంది కదా అనిపించింది.
2)  మా పక్కింటి నిత్య వాళ్ళ అమ్మ కళ్ళల్లో అయితే కన్నీళ్ళు ఆగటం లేదు. ఎంత సరదా పడిందో, ఇప్పుడే రావాలా ఈ జ్వరం. లాస్ట్ ఇయర్ నేనే చిన్నదని పంపించలేదు. ఈ సంవత్సరం ఇలా అయ్యింది పాపం. అంటూ ఆమె కన్నీళ్ళు పెట్టుకోగానే ఆ సిసింద్రీ టక్కున లేచి వాళ్ళమ్మ మెడచుట్టూ చేతులు వేసి ఏమందో తెలుసా "అమ్మ నా ఫ్రెండ్స్ తో పిక్నిక్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకన్నాను. కాని కుదరలేదు కదా ఈరోజు అమ్మతో పిక్నిక్ చేసుకుంటాను. ఏముంది అందులో. " నేనూ, వాళ్ళమ్మ ఒక్క నిమిషం అలా నిలబడిపోయాం. ఎక్కడ అది ఏడ్చి గోల చేస్తుందో అని నేనూ ఎంత భయపడ్డానో, అలాంటిది అంత తేలికగా తను అలా అనేసరికి భలే ఆశ్చర్యపోయాను. అనటమే కాదు తను అరోజుంతా వాళ్ళమ్మతో ఎంచక్కా ఎంజాయ్ చేసింది కూడా.
3) ఒకోసారి పిల్లలు మనకి జీవితపాటాలని నేర్పిస్తారు. తను కోరుకున్నది జరగకపోయినా తను ఆనందంగా ఉండగలనని చెప్పకనే చెప్పింది మా నిత్య. తను కొనుక్కున కొత్త బ్యాగులో బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ వంటివి పెట్టుకుని వచ్చి వాళ్ళమ్మని కూడా బాగా తయారవ్వమని వాళ్ళ బాల్కనీలో పాటలు పెట్టుకుని అక్కడే టిఫిన్, భోజనం చేసి వాళ్ళమ్మతో రకరకాల గేమ్స్ అడుకుందట సాయంత్రం దాకా.  పైగా ఫొటోలు కూడా తీయమందట, మర్నాడు వాళ్ళమ్మగారు ఈ విశేషాలన్ని చెబుతూ, నా కూతురుతో నాకు ఇది ఓ మంచి అనుభవం. ఎంత ఎంజాయ్ చేసానో చెప్పలేను. తన ప్రవర్తన చూసి గర్వపడుతున్నాను అని చెప్పరు.
4) ఎన్నోసార్లు మనం కోరుకున్నవి, కోరుకున్నట్టు జరగకపోతే ఎంతో మదనపడిపోతాం. వెంటనే చిరాకు, కోపం వచ్చేస్తాయి. ఎప్పుడూ ఇంతే అంటూ మన జీవితాన్ని, కాలాన్ని నిందిస్తాం. కాని పోనిలే కోరుకున్న విధంగా జరగ పోతేనేం, జరుగుతున్న దానిని ఆనందంగా స్వీకరిద్దాం అని ఆలోచించం. నిత్య ఇంట్లో ఉన్న సమయాన్ని ఏడుస్తూ గడపలేదు. తనుకున్న అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. వాళ్ళమ్మతో కలసి ఓ రోజంతా హాయిగా గడపచ్చు అనుకుంది. అలాగే చేసింది కూడా ఆరోజు తన దృష్టిలో ఆనందంగా గడిపినట్టే. తను ముందు నుంచి కోరుకున్నట్టు కాకపోయినా సరే ఆరోజు ఓ మంచి జ్ఞాపకంగా మిగుల్చుకోగలిగింది.
5) మన జీవితపు ప్రయత్నంలో అన్ని అనుకున్నట్టు, మనం ఆశించినట్టు జరగవు ఒక్కోసారి. అంతమాత్రాన చిన్నబుచ్చుకుని, మనసుని కష్టపెట్టుకోనక్కర్లేదు. జరగని విషయాన్ని పదే పదే గుర్తుచేసుకుంటే  వేరే దారులు కనిపించవు ఎప్పటికి, సరే ఈ దారి పూర్తిగా మూసుకుపోయింది, మరి వేరే దారి ఉందేమో చూద్దాం అనుకుంటే తప్పకుండా వేరే దారి కనిపించక మానదు. మనం గట్టిగ కళ్ళుమూసుకుని దారులన్ని ముసుకుపోయాయినుకుంటే ఎప్పటికీ మూసుకునే వుంటాయి. మన అడుగుల వడిని అపే అడ్డంకి ఏదైనా ఎదురయితే మరింత ఉత్సహంగా వేరే దారి వైపు వడివడిగా అడుగులు వేయగలిగితే మనకి " జీవించటం" వచ్చినట్టే.

-రమ