పిల్లల మాటకు విలువివ్వండి

 

 

పిల్లల మాటకు విలువివ్వండి

 

 

"ఎన్నిసార్లు చెప్పాలే... లేచి తయారవ్వమంటే అవ్వవే. ఫంక్షన్ కి టైమవుతోంది''... అరుస్తూనే ఉంది మాధవి. పదేళ్ల సిరి మాత్రం ఉన్నచోట నుంచి కదలడం లేదు. తయారవ్వడం లేదు. మాధవికి కోపం పెరిగిపోయింది. వచ్చి రెండు దెబ్బలేసింది. సిరి ఏడవడం మొదలుపెట్టింది. కానీ లేచి రెడీ మాత్రం అవ్వలేదు. కూతురి తీరు అర్థం కాక తల పట్టుకుంది మాధవి. ఎప్పుడూ చలాకీగా ఉండే పిల్ల ఎందుకింత డల్ అయిపోయిందో... బైటికంటే చాలు హుషారుగా రెడీ అయిపోయేది ఎక్కడికి రమ్మన్నా ఎందుకు కదలడం లేదో అర్థం కావట్లేదు మాధవికి. ఆమెకే కాదు. చాలామంది తల్లులకి తమ పిల్లల్లో హఠాత్తుగా మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాదు. అరుస్తారు, తిడతాడు, కొడతారు. అది చాలా తప్పు. ఎందుకంటే పిల్లల్లో వచ్చిన ఆ మార్పుకి కారణం... వేధింపు కావచ్చు.

 

వేధింపులనేవి చాలా రకాలుగా ఉంటాయి. కొట్టడం, తిట్టడం, లైంగికంగా హింసించడం, మనసు గాయపడేలా విమర్శించడం, కఠినమైన శిక్షలు విధించడం ఇలా. నిజానికి సరైన ప్రేమ చూపించకపోవడం కూడా హింసే అంటున్నారు మానసిక నిపుణులు. అయితే వీటిన్నిటిలోకీ లైంగిక హింసే అధికంగా ఉంటోందని రికార్డులు చెప్తున్నాయి. లైంగిక హింస శరీరాన్నే కాదు, మనసును కూడా తీవ్రంగా గాయపరుస్తుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల మనసును చదివే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పిల్లలు నోరు విప్పి చెప్పుకోలేరు. కొన్నిసార్లు అది హింస అని, దాన్ని ఎవరికైనా చెప్పాలని అన్న ఆలోచన కూడా వాళ్లకి రాదు. అందుకే మౌనంగా, దిగులుగా అయిపోతారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు కొన్ని విషయాలు గమనించుకోవాలి.

 

స్కూల్లో టీచర్లు, ఇంటి చుట్టుపక్కలవారు, తరచుగా ఇంటికి వచ్చే స్నేహితులు బంధువులు పిల్లల పట్ల ఎలా ప్రవరిస్తున్నారో ఓ కంట కనిపెట్టాలి. ఏమైనా తేడా కనిపిస్తే వాళ్లని దూరంగా ఉంచాలి. ఏం జరిగింది అని పిల్లల్ని సున్నితంగా అడగండి. నువ్వు బాధపడితే నేను చూడలేను, నిన్ను బాధపెట్టిన వాళ్లెవరైనా సరే ఊరుకోను అంటూ వాళ్లకి భరోసా ఇవ్వండి. ధైర్యం వచ్చి నోరు మెదుపుతారు. మీ వల్ల కాకపోతే చైల్డ్ సైకాలజిస్టు సాయం తీసుకోండి.


    అయితే ఆ పరిస్థితి రాకుండా ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది. వీలైనంత వరకూ పిల్లల్ని పరాయివాళ్ల ఇళ్లలో వదిలిపెట్టడం, పరాయివాళ్లతో బైటికి పంపడం చేయవద్దు. మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారు, ఏయే విధంగా ప్రవర్తిస్తారు, ఎప్పుడు అనుమానించాలి, ప్రవర్తన ఎలా ఉంటే దూరంగా ఉండాలి అనే విషయాలను పిల్లలకు వివరించాలి. లోబర్చుకోడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో, వాటికి లొంగకుండా ఎలా ఉండాలో నేర్పించాలి. తాకకూడదని చోట తాకుతున్నా, దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా ఏం చేయాలో, ఎలా తప్పించుకోవాలో తర్ఫీదునివ్వాలి. చిన్నపిల్లలు కదా అని పెద్ద విషయాలు చెప్పడానికి సంకోచిస్తే... తరువాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.


    అయితే ఈ సమస్యలో ఇంకొక కోణం కూడా ఉంది. కొంతమంది పిల్లలు నోరు తెరచి తల్లిదండ్రులకు విషయం చెప్తారు. ఫలానా అంకుల్ ఇలా చేస్తున్నాడనో, ఫలానా అన్నయ్య ఇబ్బంది పెడుతున్నాడనో చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ల మీద ఉన్న సదభిప్రాయంతో పిల్లల మాట తీసిపారేస్తారు కొందరు తల్లిదండ్రులు. ఆ నిర్లక్ష్యానికి మూల్యం... మీ చిన్నారి జీవితం. అందుకే ఎప్పుడూ అలా చేయకండి. వాళ్ల మాటకు విలువివ్వండి. ఎందుకు చెప్తున్నారో ఆలోచించండి. చాడీలు చెప్పకు అని కోప్పడ్డారో... ఇంకెప్పుడూ వాళ్లు మీకు ఏ నిజమూ చెప్పరు... గుర్తుంచుకోండి. లోకమంటే ఏమిటో తెలియని చిన్నారులు. ఏ ప్రమాదం వస్తుందో ఎటు నుంచి వస్తుందో వాళ్లకు తెలియదు. కాబట్టి వాళ్లని కాచుకోవాల్సిన బాధ్యత మనదే. ఆలోచించండి.

-Sameera