కార్లో ఆ దండని రోష్ణీ జడలో తురిమాడు. తన జడలో దండను తురుముతున్న అవినాష్ ని చూసి తన అదృష్టానికి పొంగి పోయింది రోష్ణి.

 

    "నేనంటే నీకెందుకిష్టం...అనీ..." ప్రేమగా అడిగింది.

 

    "ఎందుకా...నువ్వు నాకు దొరికిన బంగారు బొమ్మవు కాబట్టి... నా అదృష్టానివి కాబట్టి...అందుకు..." జవాబు చెప్పాడు అవినాష్.

 

    తనలో తనే నవ్వుకుంది రోష్ణి.

 

    తనలో తనే మురిసి పోయింది రోష్ణి.

 

    కారు సింహాచలం నుంచి విశాఖపర్ణం వచ్చేసింది.

 

    అవినాష్ ని అతని రూం దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది రోష్ణి.


                                                                       5


    వారం రోజులై పోయింది. ఆ రోజు గౌతమి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆమెను కలవలేదు. ఒకసారి కాలేజీకి కూడా ఫోన్ చేసింది. "లీవులో ఉన్నాడు ఇంకా రాలేదని" చెప్పించాడు.

 

    గౌతమికి అనుమానం రాకముందే మళ్ళీ ఏదో అబద్ధం చెప్పాలి- నమ్మించాలి.

 

    రోష్ణి దగ్గర్నించి వాళ్ళ డాడీ అభిప్రాయం తెలీడానికి ఇంకా ఎనిమిదిరోజులే టైముంది. ఈ ఎనిమిది రోజుల లోపల గౌతమిని వదిలించుకోవాలి.

 

    అవును....

 

    మరి తను ఎదురుతిరిగితే... దూరంగా తీసికెళ్ళి ఎవ్వరికీ కన్పించకుండా... తన దారికి అడ్డుతగలకుండా... చెయ్యాలి.

 

    అవును.

 

    స్నానంచేసి నీట్ గా తయారై, బొంబాయి డైయింగ్ సూట్ వేసుకుని అవినాష్ రూం లోంచి బయటికొచ్చి, ఆటో ఎక్కి "సూర్యానగర్" అని చెప్పాడు.

 

    పది నిమిషాల తర్వాత ఆటో సూర్యానగర్లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర ఆగింది.

 

    ఆటోకి డబ్బులిచ్చేసి హాస్టల్లోకి నడిచాడు అవినాష్.

 

    విజిటర్స్ రూంలో కూర్చుని, అక్కడున్న బాయ్ తో లోనకి కబురు పంపించాడు.

 

    పదినిమిషాల్లో గౌతమి అక్కడకొచ్చింది.

 

    వారం రోజుల్లోనే ఆమె చాలా బాగా మారిపోయింది. ముఖంలో కళ పోయింది. నిద్రలేమి వల్ల, బెంగవల్ల చాలా నీరసంగా కనబడుతోంది.

 

    కళ్ళెత్తి ఒకసారి అవినాష్ వేపు చూసి, మౌనంగా అతని కెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.

 

    'కాలేజీ కెళ్ళలేదా-" అడిగాడు అవినాష్.

 

    "లేదు...లీవ్ పెట్టాను-"

 

    "ఎన్ని రోజులు-?"

 

    "ఈ రోజే..."

 

    "ఏం..."

 

    "ఒంట్లో బాగులేదు..."

 

    "హెల్తెలా వుంది..." అడిగాడు అవినాష్.

 

    "బాగాలేదు-" చెప్పింది.

 

    వారం రోజుల్నుంచి అవినాష్ చెప్పే మాట కోసమే ఆమె ఎదురుచూస్తోంది. తమ పెళ్ళికి ఏ ఆటంకం రాకూడదని ఎన్నిసార్లు దైవాన్ని ప్రార్థించిందో తెలీదు. తను చేసిన పొరపాటుని తల్చుకుని ఎన్నెన్ని అర్థరాత్రులు వెక్కి వెక్కి ఏడ్చిందో తెలీదు.

 

    తనని తను తిట్టుకుంటూ, తనని తను అసహ్యించుకుంటూ ఎన్నిసార్లు బాధపడిందో తెలీదు.

 

    కానీ ఆ బాధను ఎవరితోనూ చెప్పుకోలేని పిచ్చిపిల్ల ఆమె... చెప్పుకోడానికి ఎవరూ లేరు కూడా.

 

    అవినాష్ ఎంతకీ చెప్పకపోవడంతో "మీ నాన్నగారేమన్నారు" మెల్లగా అడిగింది.

 

    "నేను ఇవాళుదయాన్నే ఊర్నించి వచ్చాను- రూంకెళ్ళి స్నానం చేసి ఇలా డైరెక్టుగా నీరూం కొచ్చాను-" ఆగి "మా డాడీకి చాలా సీరియస్ గా ఉంది గౌతమీ- ఏక్షణాన ఏమౌతుందో తెలీదు...అలాంటి పరిస్థితుల్లో... నేను మన విషయం మాట్లాడితే ఏం బాగుంటుంది చెప్పు..." అంటూ మొఖాన్ని ఒకింత విచారంగా పెట్టాడు.

 

    ఆమె కళ్ళల్లో అంతవరకూ మెదిలిన ఆశ చటుక్కున ఓ కన్నీటి రూపంలో రాలి కింద పడిపోయింది.

 

    "నేను ప్రతిరోజూ ఎంత యాతన అనుభవిస్తున్నానో తెల్సా... అవినాష్...మొన్న మా చెల్లి ఏదో పనిమీద ఇక్కడ కొచ్చింది-మా మాలా దానికి నా విషయం చెప్పేసింది... అమ్మకు చెప్పొద్దని ప్రాధేయపడ్డాను- చెల్లి చెప్పదు...కానీ...ఏదో నిమిషంలో చెప్పేస్తే..." కళ్ళు తుడుచుకుంటూ అంది.

 

    అవినాష్ కి ఆమె లేతమనసులో రగులుతున్న బాధ అర్థంకాదు.

 

    "మీ చెల్లిక్కూడా తెల్సిందా- పోనీ...ఏవైంది...బాధపడకు...మనం వచ్చేవారం పెళ్ళి చేసుకుందాం... సరేనా..."

 

    ఆ మాటకు గబుక్కున తలెత్తి చూసింది.

 

    "నిజం నన్నింతగా ప్రేమించే నిన్ను ఎన్నాళ్ళిలా బాధపెట్టగలను... నన్ను నమ్ము-నీకన్నా... నాకెవరున్నారు-" అని అన్నాడు అవినాష్.

 

    ఆమె లేచి అవినాష్ రెండు చేతులూ పట్టుకుని...

 

    "అవినాష్- నాకేం బిల్డింగుళు, కార్లూ...హోదా...ఏం అఖ్కర్లేదు...అవినాష్...నగలూ... నాణ్యాలూ...దర్జా బతుకు ఇవేం అఖ్ఖర్లేదు అవినాష్... పెళ్ళి కాకుండా తల్లినైన నన్ను 'తిరుగుబోతు'లా లోకం ముద్రవేయకుండా చూడు... నన్నందరూ అవమానించేలా లోకం చేయకుండా చూడు... అదొక్కటే... నాక్కావల్సింది... పెద్ద నిట్టూర్పు విడిచి, అవినాష్ కళ్ళల్లోకి చూసింది.

 

    అవినాష్ గౌతమిని దగ్గరగా తీసుకుని-

 

    "నా మాట మీద నమ్మకం లేదా? నా మనసు సాక్షిగా...నీమీద నా ప్రేమ సాక్షిగా-చెప్తున్నాను-నాకెన్ని అడ్డంకులొచ్చినా...నువ్వు నా భార్యవు... నమ్ము..." ఆవేశంగా అన్నాడు అవినాష్. మరో పది నిమిషాల తర్వాత అక్కడనుంచి కదిలాడు అవినాష్.