బొంబాయిలాంటి పారిశ్రామిక నగరంలో లక్షలు, కోట్లు, మిలియన్స్ సంపాదించే వ్యాపారవేత్తలెందరో ఉంటారు. వ్యాపారమన్నాక పోటీ అనివార్యం. ఒక్కోసారి ఆ పోటీ శృతిమించిపోతుంటుంది. అందుకు ఉదాహరణ రిలయన్స్ టెక్స్ టైల్స్ వర్సెస్ బోంబేడయింగ్.
    
    బెదిరించటం, భయపెట్టడం, తేలిగ్గా చేయిచేసుకోవడం, కాలో, చెయ్యో విరిచేయటం, హత్య చేయటం లాంటివి నేటిరోజుల్లో సర్వ సాధారణమయిపోయింది.
    
    అది ఒక వృతిగా చెలామణి అయిపోవటంతో దారితప్పిన యువత ఆ వృత్తిలోకి దిగి అందులోని మెళకువలు తెలుసుకొని చీకటి ప్రపంచాన్ని ఆసరా చేసుకొని బ్రతికేస్తుంటారు.
    
    అప్పుడు సమయం రాత్రి 2.30 అవుతుంది. ఎన్నో ఇరుకు సందులు దాటుకొని ఎవరయినా ఇక్కడకు చేరుకోలేరు. అప్పుడు సయితం అక్కడ కోలాహలంగా ఉంది.
    
    ఆ కేంద్ర స్థానం పేరు కంట్రీ క్లబ్.
    
    పురాతనమయిన ఆ బంగ్లా చాలా విశాలంగా, ఎన్నో గదులతో, కారిడార్స్ తో ఎందరికో ఆశ్రయమిస్తూంటుంది. దాన్నే డౌన్ టౌన్ క్లబ్ అని కూడా పిలుస్తుంటారు.
    
    దాని దరిదాపులకు కూడా బొంబాయి పోలీసులు వచ్చేందుకు సాహసించరు.
    
    అక్కడ మనుషుల ప్రాణాల్ని బేరమాడుకొనే ప్రమాదకరమయిన వ్యక్తులుంటారని తెలిసినా లా అండ్ ఆర్డర్ డిపార్టుమెంట్ ఆ వేపుకి కన్నెత్తి చూడదు.
    
    కంట్రీక్లబ్ బిల్డింగ్ లో ఉన్న ముఫ్ఫాయ్ గదుల్లో, వరండాల్లో, ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో పొగవలయాలు, కేరింతలు, పందాలు, మెచ్చుకోలులు, తిట్లు, మందలింపులు, కట్టల కట్టలు కరెన్సీ, స్మగుల్డ్ గూడ్స్, మారణాయుధాలు నిత్యం ఎవరికయినా దర్శనమిస్తుంటాయి.
    
    వారంతా ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో ఎవరికీ తెలీదు. వాళ్ళకు అసలు పేర్లుండవు. ఉన్నా అక్కడెవరికీ తెలీదు. తెలియజెప్పుకోరు.
    
    ఒక్కో ఎసైన్ మెంట్ కి ఒక్కో పేరుని తాత్కాలికంగా పెట్టుకుంటుంటారు.
    
    అక్కడ ఇంపోర్టెడ్ మేకప్ సామాగ్రి, విగ్గులు, లాంగ్ సూట్స్, గ్లాసెస్, హేట్స్, షూస్, వెహికల్స్, నెంబర్ ప్లేట్స్, బ్రీఫ్ కేసులు, ప్యాకింగ్ మెటీరియల్స్, స్కూటర్స్, మోపెడ్స్, మోటార్ బైక్స్, కార్లు, ట్రక్కులు, వాటి రంగుల్ని క్షణాల్లో మార్చగల స్ప్రేగన్స్, పెయింట్స్, రకరకాల మారణాయుధాలు కూడా అక్కడ అద్దెకు, అమ్మకానికి దొరుకుతుంటాయి.
    
    రకరకాల పాయిజన్స్, డెడ్లి డ్రగ్స్, మార్ఫిన్, గేస్, పాయిజనెస్ స్నేక్స్ అక్కడ తేలిగ్గా లభిస్తుంటాయి. క్రైమ్ కారిడార్స్ ఆఫ్ ది బిగ్ సిటీ-
    
    ఫన్ సిటీ- బిజీ సిటీ-
    
    పైకి ప్రశాంతంగా కనిపించే ఆ నగరం మధ్యనే, నట్ట నడిఒడ్డునే, ఆ క్రైమ్ కారిడార్స్ మసలగలుగుతున్నాయి. తన ప్రత్యర్ధిని హత్య చేయించాలను కొనే వ్యక్తినికాని, కంపెనీని కాని ఫస్ట్ పార్టీ అని, చంపబడే వ్యక్తిని సెకండ్ పార్టీ అని, ఫస్ట్ పార్టీ ప్రొఫెషనల్ కిల్లర్ ని కుదిర్చిపెట్టి రేట్లు మాట్లాడే వ్యక్తిని థర్డుపార్టీ అని ఆ క్రైమ్ కారిడార్స్ లో నామకరణం చేసుకున్నారు.
    
    ఫస్టు పార్టీ ఎప్పుడూ ఆ ప్రాంతానికి రావటం జరగదు.
    
    థర్డు పార్టీస్ ఉండే ప్రమాదరహితమయిన ప్రాంతం మరొకటి ఉంది.
    
    అక్కడికి ఫస్టు పార్టీ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు ఫస్టు పార్టీకి, థర్డు పార్టీకి మధ్య నడిచే సంభాషిణిలా ఉంటుంది.
    
    "హలో ఈజిట్ టి.పి-?" ఫస్టు పార్టీ ప్రశ్న.
    
    "ఎస్.... వాడ్డూ యూ వాంట్?" థర్డు పార్టీ సమాధానం.
    
                                ప్రపంచంలో అతి పెద్ద క్రిమినల్ ఆర్గనైజేషన్
....................................................................................................................................................................
    
    లా-కోసా-నోస్ట్రా (మాఫియా) ప్రపంచంలోనే అతి పెద్ద క్రిమినల్ కారిడార్.
    
    అమెరికా చట్టాల్ని అడ్మినిస్ట్రేషన్, న్యాయ వ్యవస్థనే సవాల్ చేస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ ఇది.
    
    ఇందులో ఒక మాఫియా కుటుంబాలకు చెందిన 5 వేల మంది సభ్యులు పనిచేస్తున్నారు. (మాఫియా కుటుంబం అంటే- ఒక ప్రాంతంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ ని ఏర్పాటు చేసుకొని, ఆ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపే క్రైమ్ యూనిట్)
    
    ఒక మాఫియా కుటుంబం తన అజమాయిషీలో ఉన్న ప్రాంతంలో నడిచే గేంబ్లింగ్, హైజాకింగ్, నార్కోటిక్స్ విపరీతమయిన- చట్ట విరుద్దమైన వడ్డీలకు అప్పులిచ్చే ఫైనాన్సింగ్, వ్యభిచారం మొదలగు స్మాఘ విద్రోహకరచర్యలకు రక్షణ కల్పిస్తుంటుంది.
    
    1982లో యు.ఎస్. న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్టు ప్రకారం అమెరికాలో 200.బిలియన్ అమెరికన్. డాలర్ల.వ్యాపారం జరిగింది. (చట్ట విరుద్దమైన)
    
    1986 మార్చి నాటికి మాఫియా గడించిన లాభం 75 బిలియన్స్.
    
    ఇన్నివేల కోట్ల వ్యాపారాన్ని మాఫియా యధేచ్చగా చేస్తున్నా అమెరికన్ పోలీస్ డిపార్ట్ మెంట్ ఏమీ చేయలేక పోతోంది.
    
    అమెరికాలోని న్యూ ఓర్లియన్స్ లో 1869 ఆరంభమైన ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ శాఖోపశాఖలుగా భూగోళం అంతటా విస్తరించుకు పోతోంది.
    
    మాఫియా అనే పదం అరబిక్ భాష నుంచి వచ్చింది. ధైర్య సాహసాలతో కూడిన అందం, అద్భుతాన్నే మాఫియా అని అరబిక్ భాష భాష్యం చెప్పింది.
    
    ఎక్కువ హత్యలు జరిగిన దేశం బ్రెజిల్ 1983లో రోజుకు 370 హత్యలు జరిగాయి.
    
    ఆ తరువాత ఎక్కువ హత్యలు జరిగే దేశం అమెరికా చికాగో క్రైమ్ కమీషన్ 1983 లెక్కల ప్రకారం అమెరికాలో జరిగిన 1081 హత్యలు (గేంగ్ వార్ ఫలితంగా) ఇప్పటికీ తేలకుండానే ఉన్నాయట.
    
    అసలు హత్యలే జరగని దేశం మాల్దీవ్స్. మాల్దీవ్స్ కి 1956లో స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి 1987 వరకూ ఒక్క హత్య కూడా జరగలేదు.
    
                                                                                                                     -రచయిత
....................................................................................................................................................................
    
    "సెకండ్ పార్టీ గురించి మాట్లాడాలి."
    
    "సెకండ్ పార్టీ వివరాలు."
    
    "ఫలానా..."