మరకలు పోగొట్టేద్దాం... మెరిపించేద్దాం...!

మరకలు పోగొట్టేద్దాం... మెరిపించేద్దాం...!

 

 

మనం నచ్చిన బట్టల పైన కానీ, ఏదైనా వస్తువుల పైన కానీ మరకలు పడిన లేదా జిడ్డుగా మారి దుర్వాసన వచ్చేలా అయితే మనకు చాలా బాధగా ఉంటుంది కదా! మరి అలాంటపుడు ఆ మరకల నుండి, దుర్వాసనల నుండి మన వస్తువులను ఎలా కాపాడుకోవాలో ఒకసారి చూద్దామా...!

చెమట మరకలు :- చెమట మూలంగా షర్టులు, బ్లౌజులు మరకలతో దారుణంగా తయారవుతాయి. చూడడానికి కూడా ఎంతో అసహ్యంగా ఉంటాయి. అందువల్ల ముందుగా ఆ మరకల వద్ద లిక్విడ్ డిటర్జెంట్ సబ్బుతో రుద్ది, ఆ తర్వాతే సబ్బుతో ఉతికి చూడండి. మరీ మొండి చెమట మరకలైతే మాత్రం వెనిగర్ తో కేవలం ఆ ప్రాంతాన్నిమాత్రమే రుద్ది, ఆ తర్వాత మాములుగా సబ్బుతో కడిగేయవచ్చు. వెనిగర్ లేకుండా గోరువెచ్చని నీటిలో నాలుగు ఆస్పరిన్ బిళ్ళలు వేసి, ఆ నీటిలో దుస్తులు నానబెట్టి ఉతికేయండి. మరకలు మాయమైతాయి. తెల్లని దుస్తులైతే మాత్రం కాస్త హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను మరకలపై కొద్దిగా రాసి అయిదు నిముషాల తర్వాత ఉతకండి.

లిప్ స్టిక్ బాల్ పెన్ మార్క్స్ :- ముందుగా మరకపడిన బట్టను ఓ పాత టవల్ పై ఉంచండి. మరకపైకి వచ్చేలా ఉంచి ఓ చిన్న పాత గుడ్డను ఆల్కాహాలులో ముంచి దాన్ని మరకపై తట్టినట్టుగా పదేపదే చేయండి. ఆ తర్వాత వాష్ చేయండి. మరకలు మరీ జిడ్డుగా అంటుకున్నట్లుగా అనిపిస్తే కిరోసిన్ తీసుకుని మరకపై పూసి అయిదు నిముషాల తర్వాత శెనగపిండితో గట్టిగా రుద్ది కడిగేయండి.

కార్పెట్ పై క్యాండిల్ చుక్కలు :- అందమైన, ఖరీదైన కార్పెట్ పై క్యాండిల్ చుక్కలు పడితే... అందుకే ఓ స్టీలు గిన్నెలో ఐసుముక్కలు వేసి దాన్ని ఈ క్యాండిల్ చుక్కలపై కాసేపు ఉంచండి. చల్లదనానికి ఈ క్యాండిల్ వ్యాక్స్ మరింతగా గట్టిగా మారుతుంది. అప్పుడు ఏదైనా స్పూన్ మొనతో దానిని చెక్కేసి బ్రష్ తో శుభ్రంగా తొలగిస్తే సరిపోతుంది.

డిన్నర్ ప్లేట్ లపై పసుపు రంగు :- ప్లాస్టిక్ ప్లేట్లపై పసుపు మరకలు తొలగించాలంటే ప్లేట్లను గోధుమ పిండితో గట్టిగా రుద్ది కడిగేయండి చాలు. నిత్యం వాడే బకెట్లు మగ్ లపై ఉండే జిడ్డు మరకలు పోవాలంటే ముందుగా వాటిని కిరోసిన్ లో తడిపిన గుడ్డతో గట్టిగ తుడిచి, ఆ తర్వాత సబ్బుతో కడగాలి.

ప్లాస్కు దుర్వాసన:- ప్లాస్కు లో దుర్వాసన పోవాలంటే నాలుగైదు కోడిగుడ్డు పెంకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని ప్లాస్కులో వెయ్యాలి. దానిపై వేడినీటిని పోసి మూతపెట్టాలి. మధ్యమధ్యలో బాగా కదిలిస్తూ ఓ గంటన్నర పాటు ఉంచండి. ఆ తర్వాత సబ్బుతో కడిగేయండి. ఇక పొడిగా ఉండేలా తుడుచుకున్న తర్వాత ఓ చెంచాడు పంచదార అందులో వేసి మూతపెట్టి దాచుకోండి. దుర్వాసన రాకుండా తాజాగా ఉంటుంది.