మరునాడు ఉదయమే ఆమె కిరణ్ ని కలుసుకుంది. తనకోసం అతను నిర్మించిన ప్రేమసౌధంలో.
    
    'నీ పాదాల స్పర్శతో ధాత్రి వీణమల్లే కంపిస్తుందా?
    
    నన్ను చూసి రాత్రి కళ్ళనుండి హిమబిందువులు రాలుతాయా?
    
    అన్నాడు టాగూర్ తేడా అర్ధం కావాలంటే ప్రేమలో పడాలి. అంతకన్నా వేరే మార్గంలేదు అన్నాడు చలం.
    
    ఆకాశంలో నీలిరంగు వుండటం ఎంత నిజమో, జీవితంలో కోరికలన్నీ ఈడేరిన మనిషి వుండటం అంతే నిజం! కానీ కిరణ్ జీవితంలో కోరికలన్నీ ఈడేరినట్లే వున్నాయి ఆ నిమిషాన!
    
    చాయ అతని బెడ్ రూమ్ లో....అతని మంచంమీద పడుకుని క్రిందకీ, పైకీ వూగుతూ....కిరణ్ మార్వలెస్, నిజంగా నాకు ఇదంతా నమ్మశక్యంగా లేదు. నేను మాట వరసకన్నవన్నీ నువ్వు ఇంత కష్టపడి సాధించావంటే.....ఓహ్! కిరణ్, నేనెంత పిచ్చిదాన్ని? ఎంతటి ప్రేమని దూరం చేసుకున్నానూ? ఇంకొక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టి వుండలేను" అంటూ అతని చేయిపట్టి లాగి మంచంమీద పడవేసింది. అతని గుండెలమీద వాలి, నాలుక కొసతో అతని ముఖాన్ని స్పృశిస్తూ "కిరణ్! నువ్వు నన్నింతగా ప్రేమించడం నాకెంత గర్వంగా వుందో తెలుసా అంది?"
    
    అతను ఇంక ఆగలేనట్టు ఆమె నడుముని ఓ చేత్తో చుట్టేసి, ఆమె గుండెల మధ్యన తల దాచుకుంటూ "ఇదంతా కల కాదుకదా.....కరిగిపోయి నన్ను పరిహసించే ఆ చీకటి నాతో మిగలదు కదా?" అన్నాడు.
    
    "కళ్ళు తెరిచి చూడు....ఎంత నిజమో!" అంది.
    
    "ఉహూ! నాకు భయం....నువ్వు కనిపించకుండా ఆ ఆశాభంగం నేను తట్టుకోలేను." అన్నాడు. అతని కంఠం వణికి కంటి కొసలనుండి వెచ్చని కన్నీరు జాలువారింది.
    
    "కిరణ్....నీ చాయ....నీ ఖజురహో సుందరి పిలుస్తోంది. కళ్ళు తెరు" నవ్వుతూ అంది చాయ.
    
    మోహనవంశీపై ఆనందభైరవి రవళించినట్లుగా వుంది ఆమె స్వరం.
    
    కిరణ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
    
    ఎదురుగా చాయ....ఆమె శరీరాన్ని నిడుపాటి కురులతో కప్పుకుని అతన్ని చూసి కొంటెగా నవ్వింది.
    
    ఖజురహో శృంగార శిల్పానికి ప్రఖ్యాతి గాంచింది. చాయ శరీరాన్ని బహుశా ఆ శిల్పులే శృంగార రసంలో ముంచితీసిన వులులతో చెక్కారేమో.... ఆమె అణువు-అణువునా మోహావేశం అభిషిక్తమై పొంగులువారే కోరిక కళ్ళనుండి ప్రవహిస్తూ వరద గోదారై అతన్ని వెన్నెలలో ముంచెత్తసాగింది.
    
    ప్రతి మెట్టులో ఓ అద్బుతరాగం పలికిస్తూ అతన్ని ఆరోహణ వరకూ తీసుకువెళ్ళింది. చరణంనుండి గమకం పలికేలోగా అతన్ని వారిస్తూ....
    
    "నువ్వు సంధ్యని చేసుకుంటున్నావట కదా!" అంది.
    
    కిరణ్ ఖిన్నుడై చూసాడు.
    
    చాయ అతన్ని సున్నితంగా వెనక్కితోసి తనే అతని మీదకు వాలుతూ-
    
    "జే.సీ. ఆస్తి మొత్తం సంధ్య పేరిట వ్రాసాడుట తెలుసా?" అంది.
    
    కిరణ్ ముఖంలో రకరకాల భావాలు మారి ఏ భావం ముందు బయల్పడాలో తోచనట్లుగా వుండిపోయాడు.
    
    ఆమె చొరవ తీసుకుని అతని ముఖాన్ని ముద్దాడింది.
    
    "ఎంతటి అదృష్టం నీ స్వంతం కాబోతోంది కిరణ్! ఎప్పుడయినా కలలోనైనా అనుకున్నావా అసలు? ఓ అనాధ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలనుకున్నావు! కానీ అదృష్టాన్ని ఎవరాపగలరు?
    
    కోటీశ్వరుడి ఏకైక పుత్రికని చేపట్టి మొత్తం ఆస్తికి హక్కుదారుడివి కాబోతున్నావు. అయామ్ 'రియల్లీ వెరీ హేపీ!" అంది.
    
    అతని ముఖంలో దెబ్బతిన్న భావం కదలాడింది.
    
    "చాయా....నువ్వు ఇదంతా నమ్ముతున్నావా? నాకు నీకన్నా ఈ ఆస్తులూ, అంతస్తులూ ఎక్కువా? నీ ప్రేమకోసం ప్రాణాలయినా ఇవ్వడానికి సిద్దంగా వున్నాను నేను.....ఆఫ్ట్రాల్ తుచ్చమైన ఆస్తికోసం సంధ్యని పెళ్ళాడతానా?
    
    నా గురించి ఇదేనా నువ్వు తెలుసుకున్నదీ....ఇదేనా నువ్వు అర్ధం చేసుకున్నదీ...." అన్నాడు బాధగా.
    
    "రిలాక్స్-" అతన్ని తమకంగా అల్లుకుంటూ అంది చాయ.
    
    "నాకోసం నువ్వు ఏమ్ధయినా చేస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు. నీకు నేను తప్ప వేరే ప్రాణమే లేదు!"
    
    కిరణ్ కళ్ళల్లో ఆమె తనని అర్ధం చేసుకున్నందుకు ఆనందం రెపరెపలాడింది.
    
    "నేను ఏం కోరినా చేస్తావు కదూ? మాట్లాడవేం?"
    
    అతన్ని మాట్లాడనీయకుండాచేసి అడిగింది.
    
    అతను గభాల్న తలూపాడు.
    
    "అలాకాదు...చేతిలో చెయ్యివేసి మాటివ్వు" ఆమె తన చెయ్యి జాపింది.
    
    "చాయా.....ఐలవ్ యూ.....ఇప్పుడు చెప్పు ఏం చెయ్యమంటావో?" ఆమె కురులలో ముఖాన్ని దాచుకుంటూ అడిగాడు కిరణ్.
    
    "అయితే నాకోసం నువ్వు సంధ్యని పెళ్ళిచేసుకో."
    
    అతను విస్మయంగా తలెత్తి చూసాడు.
    
    "ఆస్తికి మొత్తం నువ్వు యజమానివి కావాలి" చాయ కంఠం పదునయిన కత్తిలా వుంది.
    
    "చాయా.....నిన్ను వదిలి వేరొకర్ని...." భరించలేని విషయం వింటున్నట్లుగా వుంది అతని స్వరం.
    
    "నేనూ చేసుకుంటాను జయచంద్రని.
    
    పిడుగుపాటు తిన్నవాడిలా చూసాడతను.
    
    ఆమె లేచి కూర్చుని జ్ఞానబోధ చేస్తున్నట్లుగా-
    
    "నేను చెప్పేది సావధానంగా విను. నేను మనిద్దరి మంచి ఆలోచించే చెపుతున్నాను. జయచంద్రని నేనూ, సంధ్యని నువ్వూ పెళ్లిచేసుకుందాం. అతను తన కోట్ల ఆస్తి మొత్తం సంధ్య పేరిట అంటే.....నీ భార్య పేరుమీద వ్రాసేస్తాడు. ఆ తర్వాత హనీమూన్ కి ఖజురహో వెళతాం...." అని ఆగి చిన్నగా నవ్వింది.
    
    కిరణ్ అర్ధంకాని భాష వింటున్నట్లుగా ముఖం పెట్టాడు.
    
    "కానీ మన హనీమూన్ నువ్వు నీ భార్యతో నేను నా భర్తతో...." అని పకపకా నవ్వింది.
    
    "చాయా ఆర్ యూ మేడ్?" ఆపుకోలేకనంత కోపంగా అడిగాడు కిరణ్.
    
    "చెప్పేది పూర్తిగా విను" చాయ గొంతులో ఆజ్ఞాపన కంగుమంది.