"ఎలిజిబెత్ ఎవరూ?" దగ్గరగా వచ్చి ఆత్రంగా అడుగుతోంది.
    
    "లూయిన్ స్కీ సిస్టర్!" అన్నాడు.
    
    "ఆమె ఎవరూ?" రోషంగా అడిగింది.
    
    "మా విశాలాక్షి అత్తయ్య కూతురు!" అన్నాడు.
    
    "అదేం పేరు విస్కీలాగా?" మొహం వెగటుగా పెట్టి అంది.
    
    "ముంబైలో పుట్టిందిగా .... అందుకే అలా పెట్టారు" అన్నాడు.
    
    "లుయినసఖి బావుంటుందా?" జడని ముందుకు వేసుకుని సవరిస్తూ అడిగింది.
    
    ఆమె ఆ పేరును మార్చిన తీరుకి మాధవ్ కి ఆపుకోలేనంత నవ్వొచ్చింది. అతనలా నవ్వుతుంటే పొలమారింది.
    
    ఆమె కోపంగా "మీ లూయీన.... అదే తలుచుకుంటోంది!" అంది.
    
    "నేను తిరిగింది ఎలిజబెత్ తో!" అన్నాడు.
    
    ఆమె వెంటనే "తిరిగారా?" అంది.
    
    "పెళ్లి కూడా చేసుకున్నాను!" అన్నాడు.
    
    "ఆఁ!" ఆమె గుండెలమీద చేతులేసుకుంది.
    
    "ఒక బాబు కూడా! న్యూయార్క్ లో ఉంటారు!" అన్నాడు. రాధ గిరుక్కున తిరిగి పరుగెత్తింది.

    "రాధా ....! రాధా!" మాధవ్ ఆమె వేగాన్ని అందుకోలేక పోయాడు.
    
    రాధ వేగంగా పరుగెత్తుతూ వెళ్ళి కాలవలో బుడుంగున దూకేసింది.
    
    మాధవ్ కూడా దూకేశాడు.
    
    ఆమె మునిగిపోతున్నట్టుగా బుడబుడమని బుడగలు పైకొచ్చాయి.
    
                                                             * * *
    
    "ఎందుకలా చేశావు?" అలుగుటయే ఎరుగని అజాత శత్రువు అలిగినట్లుగా ఉంది సీతారామయ్యగారి మొహం "పిచ్చిపిల్లకి ఏమైనా అయి ఉంటే?"
    
    "దొరికింది పెద్దనాన్నా! అన్నాడు మధురమైన నాదం ఏదో విని రాగం పట్టేసినవాడిలా ఉత్సాహంగా మాధవ్.
    
    "ఏం దొరికిందిరా?" అడిగాడు సీతారామయ్య.
    
    "నేను వెదుకుతున్నది!" అన్నాడు.

    "ఏమిటది?" ఆయన కంగారుపడుతూ అడిగాడు.
    
    "కడగంటి చూపుల్లో సిగ్గు చివురులు పూయిస్తూ ముసిముసి అమాయకత్వాన్ని పెదవి అంచున బిగబట్టే ముగ్ధత్వం!" పారవశ్యంగా అన్నాడు.
    
    "అంటే? తెలుగులో చెప్పి ఏడు!" చిరాగ్గా అన్నాడాయన.
    
    "ఎఱుగరుగా యొకద్భుతము! నా చెలి దీర్ఘిక దీర్ధమాడ నా యురులు దగిల్చిపోవు దరహాసము!" అన్నాడు మాధవ్.
    
    "నాకు అర్ధమయ్యే భాషలో చెప్పు! అన్నాడాయన నల్లమందు అరచేతిలో నలుపుతూ.
    
    "మాధవ్ వెడ్స్ రాధ అని శుభలేఖలు కొట్టించమని నాన్నతో చెప్పు! నేను రాధ ఎలా ఉందో చూసి వస్తాను!" లేచి గబగబా అడుగులేస్తూ చెప్పాడు మాధవ్.
    
                                                               * * *
    
    హాస్యానికైనా ఇంకెప్పుడూ అలాంటి అబద్దాలు చెప్పద్దు! కన్నీళ్లు తుడుచుకుంటూ అంది రాధ.
    
    "ఇప్పుడు అర్ధమైందా ప్రేమంటే?" చిలిపిగా అడిగాడు.
    
    "బాధ!" అంది. వాళ్ళిద్దరూ గుడి మెట్లమీద కూర్చున్నారు!
    
    "ఆకర్షణ ప్రేమగా మారటానికి ముందు పుట్టే స్థితులే ఈ అసూయలూ, అలకలూ, ఏడుపులూ, బతిమిలాటలూ!" నవ్వుతూ అన్నాడు.
    
    "నాకెంత భయమేసిందో తెలుసా?" భయాన్ని కళ్ళనిండా నింపి చూపిస్తూ అంది.
    
    "ఇంకెప్పుడూ వెయ్యనివ్వనులే," భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా తీసుకుంటూ చెప్పాడు.
    
    మృగశిరకు ముందే వచ్చిన మబ్బుల్ని, పెళ్ళికి నెలముందే వచ్చిన చుట్టాలని చూసినట్లుగా తెల్లబోయి చూస్తోంది ఆకాశం.
    
    "అమెరికాలో చదివి వచ్చారుగా! ఈ పల్లెటూరి మొద్దుని చేసుకుంటానంటే మీ అమ్మా, నాన్నా ఒప్పుకుంటారా?" సంశయంగా అడిగింది.
    
    అతను ఆమె పాపిట్లో ముద్దు పెట్టి చెప్పాడు "మా వాళ్ళు నామాట కాదనరు. వస్తే మీ వాళ్ళనుంచే ఏదైనా అభ్యంతరం రావాలి గానీ..." ఎక్కడో పిడుగు పడిన శబ్దం.
    
    "రాదు!" నమ్మకంగా అంది రాధ. తండ్రి చిన్నాన్నతో మాధవ్ గురించి చెప్పడం ఆమె వింది.
    
    గాలి ఒక్కసారిగా గుబులుగా వీచింది.
    
    "నాకు ఎడమ కన్ను అదురుతోంది!" అన్నాడు మాధవ్.
    
    "అయ్యో! మగవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిది!" ఆందోళనగా అంది.
    
                                                           * * *
    
    గాజుల చేతుల్తో చల్ల చిలుకుతున్నట్లు లయగా వినిపిస్తోంది బారేజ్ మీద నుండి రైలు వెళ్తున్న శబ్దం.
    
    సీతారామయ్య కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
    
    మాధవ్ కి తను వచ్చేటప్పుడు దిగులుగా చూసిన రాధ ఎలా ఉందో చూసి వస్తాను!" లేచి గబగబా అడుగులేస్తూ చెప్పాడు మాధవ్.
    
    సుబ్బారాయుడు సీతారామయ్యతో "నేనూ, పార్వతీ మంచి రోజు చూసుకుని బయలుదేరి వస్తాం. ఈలోగా నువ్వు కేశవుడితో సంబంధం విషయం కదుపు. మగపెళ్ళివారిలా వేషాలెయ్యక....! నువ్వు ఆడపిల్ల వైపున పెద్దగా వెళ్తున్నావని గుర్తుంచుకో!" అన్నాడు.
    
    మాధవ్ కి వాళ్ళ మర్యాదలు గుర్తొచ్చి నవ్వొచ్చింది.
    
    ఊరంతా కదిలొచ్చింది తమని బండెక్కించడానికి.
    
    రాధ మాత్రమే రాలేదు. కానీ ఆమె తాలూకూ జ్ఞాపకాలు నీడలా వెంటాడుతున్నాయి. వచ్చేటప్పుడు ఖాళీ హృదయంతో వచ్చి, వెళ్ళేటప్పుడు ఆమె తలపులు నింపుకుని వెళ్తున్నాడు. మనసుచుట్టూ పరుచుకున్న మల్లెతెరలు, గాలివీచినట్లు వస్తున్న జ్ఞాపకాల అలలకి అల్లనల్లన ఊగుతూ కమ్మగా గుభాళిస్తున్నాయి.
    
    'ఐ లవ్ యూ రాధా!' అనుకున్నాడు.
    
                                                              * * *
    
    స్నానం చేసొచ్చి విభూది కట్టుపట్టిస్తూ నేలమీద కూర్చున్న అన్నగారి ముందు, పైన కూర్చోలేక ఇబ్బందిగా కింద కూర్చుంటూ "ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు. నాకంతే చాలు అన్నయ్యా!" అన్నాడు కేశవరావు.
    
    "భోజనానికి లేవండి!" యశోద వచ్చి చెప్పింది.