శారీ లాంటి గౌన్... గౌన్ లాంటి శారీ!

 

 

చీర ట్రెడిషనల్... గౌను మోడ్రన్. ఈ రెండిటినీ కలిపితే?! ఐస్ క్రీమ్ లో ఆవకాయ్ కలిపినట్టుంటుంది అనుకుంటున్నారు కదూ! అలా అనుకుంటే కొత్త ఫ్యాషన్లు పుట్టవు కదండీ. ఆల్రెడీ ఆ ఆలోచన ఒకరికి రావడం, చీరనూ గౌనునూ కలిపి ఓ సరికొత్త డ్రెస్సును క్రియేట్ చేయడం జరిగిపోయింది. అదిప్పుడు ఎంత సంచలనం సృష్టిస్తోందంటే... బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ సెలెబ్రిటీలకూ ప్రియమైనదైపోయింది. చివరికి మనవాళ్లను చూసి కొందరు హాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఈ డ్రెస్సును వేసుకోవాలని ముచ్చటపడుతున్నారంటే ఆలోచించండి.

    శారీగౌన్ చూడటానికి ముందు శారీలా కనిపిస్తుంది. కానీ శారీ కాదు. జాగ్రత్తగా గమనిస్తే గౌనులా ఉంటుంది. కానీ గౌనూ కాదు. కానీ అటు చీరలోని సోయగాన్నీ ఇటు గౌనులోని గ్లామర్ నూ కలిపి ఒలికించి చూపరుల మతి మాత్రం పోగొడుతుంది. అక్కడితో ఆగిపోలేదు దీని సొగసు. రకరకాల డిజైన్లు, వివిధ రకాల ఎంబ్రాయిడరీ, బీడ్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వంటి వాటితో చూడగానే అబ్బ.. ఎంత బాగుందో అనిపించేలా తయారవుతున్నాయి శారీగౌన్స్.

 

 

    మొదట్లో దీపికా పదుకొనె, శిల్పాశెట్టి లాంటి వాళ్లు ఈ శారీగౌన్లు వేసి ర్యాంప్ మీద నడుస్తుంటే... వారేవా, ఏం ఫ్యాషన్ అంటూ అందరూ చప్పట్లు చరిచారు. అందరూ శారీగౌన్స్ తో వార్డ్ రోబ్స్ ని నింపేశారు. మెల్లమెల్లగా వీటి ధర అందుబాటులోకి కూడా రావడంతో ఇప్పుడు కాలేజీ అమ్మాయిలు పార్టీల్లో వీటిని ధరించి ప్రత్యక్షమవుతున్నారు. కొందరైతే బర్త్ డేలు, రిసెప్షన్లకు కూడా మంచి మంచి శారీ గౌన్స్ ని డిజైన్ చేయించుకుంటున్నారు. చక్కని నెక్స్, పల్చని హ్యాండ్స్ వంటివి ఈ డ్రెస్సులకు అదనపు ఎసెట్స్. నడుము చుట్టూ వడ్డాణం పెట్టినట్టుగా ఉండే డిజైన్స్ కూడా వీటి అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. 

    మరి ఇంత స్పెషల్ డ్సెస్సుని మీరు వేసుకోకపోతే వెనుకబడిపోతరూ! అందుకే వెంటనే ఓ శారీగౌన్ ని కొనేయండి. అటు ట్రెడిషనల్ లుక్కునూ ఇటు మోడ్రన్ కిక్కునూ ఒకేసారి అందరికీ రుచి చూపించండి!

- Sameera