"అలాగా తీసుకురాలేదూ? మరి నేను రెండు గంటలనుంచీ దాన్నే పరిశీలిస్తూ కూర్చున్నానే భలే! అదండీ సంగతి, ఇవాళ ఉదయమే యింకొకరు కూడా అభిప్రాయం చెప్పమని మరో చిత్రం యిచ్చివెళ్ళారు. అది మీదే అనుకున్నాను." అని గర్వంగా ఫోను క్రింద పెట్టేశాడు - తిరిగి అతనేం చెబుతున్నాడో వినిపించుకోకుండా.
    
    స్కూల్ రోజుల్లో తన ఫోటోగ్రాఫ్ మిత్రుడు బడి ఎగ్గొట్టించి తన గదిలో కూర్చోబెట్టి చెప్పుకుపోతున్నాడు- "ఫోటో తీశాక డెవలపింగ్ ప్రింటింగ్ యిత్యాదులను స్టూడియోలకు యిచ్చి బోలెడు డబ్బు వేస్ట్ చేయడం నాకు యిష్టంలేదు. అందుకని ఓ మార్గం ఆలోచించాను. ఈ గదిలోనే ఓ డార్క్ రూమ్ ను ఏర్పాటు చేయడం....."
    
    తను ఆశ్చర్యంగా ఆవులించి 'ఎలా? యింత చిన్నగదిలోనా? పొడవు ఎనిమిదడుగులు, వెడల్పు ఆయిదడుగులు.'
    
    "అందులోనే వుంది తమాషా చూడు. అందుకోసం నేను పధ్నాలుగు మార్గాలు కనిపెట్టాను."
    
    "పధ్నాలుగు?"
    
    "అవును విను" అని ఆ మార్గాలన్నీ వరుసగా విపులీకరించడం మొదలు పెట్టాడు. తనకు భయంవేసింది. వాడడాని వారిద్దామనుకున్నాడు మొదట కానీ వాడి ప్రవాహంముందు తనమాట ఓ పాయగానన్నా నిలువలేదు. ఓ గంటన్నర టైము పుచ్చుకుని, ఆ పధ్నాలుగు రకాలూ ఏకరువు పెట్టాడు. తను వింటేగా, పెద్దపులి కథరాసి పిల్లల పత్రికకి పంపించాడే....అందులో రాజకుమారి ఆ పెద్దపులి నోట్లో ఇసుకకొట్టిందని రాశాడా....లేక కళ్ళలో కొట్టిందని రాశాడా? కవరు మీద పొరపాటున ఓ అణాస్టాంపును ఎక్కువ అంటించాడే...ఎట్లా? బడి మానేసి ఇక్కడ కూర్చున్నాడే...ఇంగ్లీషు మాష్టారు నాన్నారికి చెప్పరుగదా? మధ్యాహ్నం ఇంట్లో ఓవల్టీన్ తాగనా? నాన్నారికి తెలీకుండా కాఫీతాగనా? పళ్ళరసం తాగితే బలం వస్తుందా? కోడిగ్రుడ్డు తింటే బలం వస్తుందా?
    
    జీవహింస చేయరాదు.
    
    కానీ కోడిగ్రుడ్లు బ్రాహ్మలుకూడా తింటారు. బెంగాల్ లో బ్రాహ్మలు చేపలు తింటారు. అంతెందుకూ? కాకా హోటల్ లో కోడిపలావ్ రహస్యంగా తిన్నానని, ఎవరితోనూ చెప్పనని తను ఒట్టు వేశాక రహస్యంగా చెప్పాడు శాస్త్రి. అది యిలా అభివర్ణించాడు, "ముందు చేతిలోకి తీసుకున్నాను. మెత్తగా వుంది. అక్కడక్కడా గట్టిగా వుంది. నెయ్యి ఓడుతోంది. అక్కడక్కడ ఏమిటో ఎర్రగా కనిపిస్తున్నాయి. కొంచెం అసహ్యంగానే వుంది. కానీ ఎలాగైనా తినాలని పట్టుబట్టాను. మరేమో కళ్ళు మూసుకున్నాను. నోట్లో పెట్టుకున్నాను. కరకర నమిలాను. మెత్తగా రబ్బరులా సాగింది. మింగాను. గొంతుకు అడ్డుపడింది. ముందుకూ రాదు, వెనక్కూ పోదు. సర్వర్ ని మంచినీళ్ళు తెమ్మందామంటే మాటరాదు."
    
    ఇహ వాడ్ని ఆపమని బ్రతిమిలాడి "ఆమ్లెట్ అయితే ఫర్వాలేదు. కానీ కోడిపలావ్ అయితే ఘోరం" అన్నాడు.
    
    ఇంతలో భుజంమీద బరువుగా చెయ్యివేసి "నీకు వీటన్నిటిలో ఏ మోడల్ బాగుందిరా?" అన్నాడు ఫోటోగ్రాఫర్.
    
    తను తడుముకోకుండా 'పదకొండోది' అని చెప్పాడు.
    
    'పదకొండోదా? కానీ నే నేవరుసలో చెప్పానో గుర్తులేదే'
    
    "అదేరా! తమాషాగా వుంటుంది. గది తలుపులన్నీ మూసేసి, దుప్పటి కప్పుకుని...."
    
    "ఓహో! అదా? మంచాన్ని తిరగత్రిప్పి నాలుగుకోళ్ళమీదా పరుపువేసి చుట్టూరా దుప్పటికప్పి, ఓ చాపద్వారా డ్రాయరుకూ దీనికి కనెక్షన్ ఏర్పరచి ఓ ట్రాన్స్ ఫార్మర్ లోపలపెట్టి, రెడ్ లైటు లేదు కాబట్టి మామూలు బల్బుకు ఎర్రకాయితం చుట్టి డ్రాయర్ క్రింద ఖాళీని రెండుమూడు పీటలతో పూడ్చి..."
    
    "అదే అదే"
    
    ఆ అవస్థ అట్లా గడిచింది.
    
    ఈ ఆలోచనలు యిట్లా ఉండగానే- గోవిందు పైకివచ్చి 'భోజనానికి లేవండయ్యా' అన్నాడు.
    
    "వాళ్ళంతా తిన్నారా?" అన్నాడు ఆలోచనల గిరినుండి పూర్తిగా బయటకు వచ్చి.
    
    "ఆఁ"
    
    'సరే పద" అని అతని వెనుక బయల్దేరాడు. కాఫీలు బాగా త్రాగడంవల్ల అన్నం సహించలేదు. గుత్తివంకాయ కూర మీకు యిష్టమని చేశాను. అలా వదిలేశారేం?' అన్నాడు గోవిందు.
    
    "ఆకలి లేదు."
    
    "కొద్దిగా తినండి ఇవాళ బాగా కుదిరింది."
    
    "నీ చేతివంట బాగా కుదరనిదెప్పుడు గోవిందూ?" అని నవ్వి యిహ అతడు గట్టిగా బలవంతం చేయడం తాను తినటం ఎలానూ తప్పదని తెలుసుకుని రెండుమూడు ముద్దలు మింగాడు. గోవిందు తెలివైన వంటవాడు. ఈ భయంకరమైన గాలివాన సమయంలో వంకాయవంటి యజమాని కిష్టమైన వంటకాన్ని తయారుచేసి తన పనివాడితనం నిరూపించుకున్నాడు.
    
    "వాళ్ళంతా పడుకున్నారా?"
    
    "ఆ! ముసుగులు బిగించి."
    
    భోజనం అయినాక శివనాథరావు పైకి వచ్చేస్తూ వాళ్ళు పడుకుని వున్న మధ్యగదిలోకి చూశాడు. ముసలివాళ్ళిద్దరూ గుర్రుపెట్టుకుని నిద్రపోతున్నారు. నడివయసు స్త్రీ కూడా అదే స్థితిలో వుంది. యువతి అటూఇటూ పొర్లుతోంది. ఆమె ముఖంమీద కప్పివున్న దుప్పటి తొలగింది. అస్పష్టమైన కాంతిలో ఆమె పెదాలమీది చిరునగవు గోచరించింది, మళ్ళీ ముసుగు కప్పుకుని గోడవైపు తిరిగి పడుకుంది.
    
    పైకివచ్చి అటూ యిటూ తిరగనారంభించాడు. నెమ్మదిగా పదిదాటింది. బయట వాతావరణంలో ఇసుమంతకూడా మార్పులేదు. నిద్రరావడం లేదు అతనికి. ఇవాళ చిత్రమైన రోజే. తన తల్లితండ్రులు యిక్కడవుంటే యివాళ రాత్రి వాళ్ళందరికీ యిక్కడ ఆశ్రయం యివ్వగలిగే ధైర్యం తనకు వుండేదికాదు. గాలి వుండి వుండి మూసివున్న కిటికీ తలుపులగుండా దారిచేసుకుని లోపలకు వస్తోంది. చీకట్లో మబ్బులు ఫెళ్ళున విరుగుతున్నట్లుగా గోల పాకల్లో మనుషులు చెట్టుక్రింద సంసారాలు, యింటిప్రక్క నూతన దంపతులు క్రమంగా గుర్తుకు వచ్చారు.
    
    గోవిందు క్రింద సామానులు సర్దుతుండడం, తలుపులు వేస్తూండటం అస్పష్టంగా వినబడుతోంది మంచంమీద వాలి హాయిగా రగ్గు కప్పుకుని పడుకున్నాడు. ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు.    
    చాలాసేపటికి కళ్ళు విప్పి చూశాడు. కలతనిదరే పోయింది. సరోజిని వెయ్యిసార్లు కనిపించింది. వాళ్ళ ఊళ్ళో గాలివాన కురుస్తోందా? వాళ్ళ యింటి పెంకులు ఎగిరిపోతున్నాయి కాబోలు! మొద్దునిద్దర అలవాటైన సరోజిని "నీవు తప్ప ఎవరు గలరు నాకు?" అంటోంది. హఠాత్తుగా భయం వేసింది. బల్లమీది చిన్నదీపం మందంగా వెలుగుతోంది. టైము ఎంతయిందో తెలియదు.
    
    లేచి కూర్చున్నాడు. ఇప్పుడెవరన్నా కబుర్లు చెప్పే వాళ్ళుంటే ఎంత బాగుండును! పచార్లుచేస్తే ఉత్సాహం వస్తుందేమోనన్న ఆశ కలిగింది. వసారాలోకి వచ్చి తుళ్ళిపడ్డాడు. ఓ మూల నల్లగా ఏదో ఆకారం మెదుల్తోంది. ఒక్కక్షణం భయపడి, వెంటనే సర్దుకున్నాడు. చప్పుడుగాకుండా నడిచి, వెనక్కి వెళ్ళి హఠాత్తుగా రెండు భుజాలమీదా చేతులువేసి అదిమాడు, తర్వాత నవ్వాడు ఠీవిగా.
    
    "అమ్మో!" అంది స్త్రీ కంఠం.
    
    శరీరం గగుర్పొడిచింది. చప్పున వదిలేసి "నువ్వాడదొంగవా?" అనడిగాడు.
    
    "నేనండీ! దొంగనుకాను" అంది వణుకుతూన్న కంఠంతో.
    
    "ఎవరూ?" ముఖంలో ముఖంపెట్టి పరిశీలనగా చూశాడు. మరుక్షణం అతని తల నేలకు వాలిపోయింది. "మీరా?" అన్నాడు చివరకు.
    
    తలవంచుకుని వణికిపోతూ నిలబడింది. అతనికి క్షమాపణ ఎట్లా చెప్పుకోవాలో బోధపడలేదు. పాపం! ఎంత బెదిరిపోయిందో?
    
    "క్షమించండి"
    
    ఈ మాట అన్నది అతనుకాదు, ఆమె.
    
    "ఎందుకూ?" అన్నాడు ఆశ్చర్యంతో.
    
    "నే నపరాధం చేశాను."
    
    "మా యిల్లుకాదు, నాకింత చొరవేమిటి? పైకి రావడం తప్పుకాదా మరి?"
    
    "అవును, ఎందుకు వచ్చారు?"
    
    మౌనంగా ఊరుకుంది.
    
    "చెప్పకూడదా?"
    
    జవాబు చెప్పలేదు.