"అమ్మా... ఆకలమ్మా!"

 

    "కొంచెం అన్నం వుంటే పెట్టమ్మా!"

 

    "మంచమ్మవి కదమ్మా...!"

 

    పొగచూరిన ప్రకృతిలా మారి ఆకలితో బక్కచిక్కిన గొంతులో పదాలను కూడగట్టుకుంటూ నిస్సత్తువగా చేతులు చాచి పిలుస్తున్నాడు నానీ.

 

    ఆ నిశీధివేళ నానీ ఆక్రందన తల్లిపాలకోసం తపిస్తున్న ఒక లేగదూడ ఆర్తనాదాన్ని గుర్తుచేస్తూంది.

 

    తొణికిన ఒక అపూర్వస్వప్నానికి ప్రతీక అయిన నానీ అలసిన కన్నుల్లోంచి ఒక్కో నీటిబొట్టు ఆర్తిగా రాలుతుంటే, ఆయవారానికి బయలుదేరిన వటువులా ఆ ఇంటిముందు దీనంగా అర్థిస్తున్నాడు.

 

    తలుపులు తెరుచుకోలేదు.

 

    అయినా నానీ తన ప్రయత్నాన్ని మానలేదు.

 

    "అమ్మా! ఆకలమ్మా..." ఎదగోడలనుంచి కనుకొనల అంచులదాకా కన్నీళ్ళు పొరలుగా చిమ్ముతుంటే నిస్త్రాణగా పిలుస్తూనే వున్నాడు "కొంచెం అన్నం పెట్టమ్మా."

 

    ఎవరూ పలకరేం! ఏ అమ్మకీ జాలి కలగదేం! అమ్మా... అమ్మా! ఎందుకే చచ్చిపోయావ్? ఇదేంటి, నేను నీకెంత ముద్దొచ్చేవాడ్ని! మరందరికీ నేనంటే కోపమెందుకమ్మా?

 

    ఇలాంటి రీతిలో నిలబడే ఓ రోజుంటుందని, అపశృతుల బ్రతుకులో అమ్మపదాన్నే ఆసరాగా తీసుకుని చేయిచాచి అడుక్కునే క్షణాలు తనకీ తప్పనిసరని ఏనాడూ తెలీని ఆ పసికందు కాళ్ళు తేలిపోతుంటే వెక్కిపడుతూ చివరగా అన్నాడు "వెళ్ళిపోతున్నానమ్మా! అమ్మ ముద్దుపాట పాడుకుంటూ నిద్రపోతానన్నమాట.

 

    నానీ వెనుతిరుగుతుండగా ద్వారం తెరుచుకుంది.

 

    ఆశగా నిలబడిపోయాడు ఆ చప్పుడుకి.

 

    ద్వారందగ్గర నిలబడ్డ యువతి అమ్మలా లేదు. కాని ఆ పసిబిడ్డ పిలుపుకు అమ్మ ప్రేమ కదిలిన ఆడదానిలా వుంది.

 

    నిన్న హరించుకుపోయిన ఆమె అందం నేడుసైతం యింకా ఆకర్షణ్ణి కోల్పోకపోయినా ఆమె మగనాలికాదు. వెలకమ్మబడే వెలయాలిలాగే వుంది.  

 

    బడలికగా అంతదాకా ఆమె ఎదురు చూస్తున్నది విటుడికోసం కాని వటుడు ప్రత్యక్షమయ్యాడు చిత్రంగా.

 

    ఆకలికోసం ఒళ్ళమ్ముకునే ఇన్నాళ్ళు బ్రతుకుచీకటి తొలిసారి చూసింది తనను 'అమ్మా' అంటూ పిలిచిన మరోప్రాణిని.

 

    "అమ్మా..." మరోమారు పిలిచాడు నానీ. "అన్నం పెట్టమ్మా!"

 

    గుండెకొండలలో మారుమ్రోగుతున్న యుగాల రాధనాదం.

 

    "అమ్మా!" ఇంకోసారి.

 

    కాలం ఇరుసులోపడి నలిగిపోతున్న బ్రతుకులో కన్నీళ్ళ నవ్వులకి పరిమితమైన తనకి ఇంత అదృష్టాన్ని కలిగిస్తున్నాడేమిటీ ?

 

    "అమ్మా..."

 

    తివాసీలా పరుచుకున్న శరీరం లోపలి మనస్సుని తట్టి అశృవుల్ని ఆశావర్షంగా మార్చి ఇంత అలరిస్తున్నాడేమిటీ?

 

    ఎవరు తండ్రీ నువ్వు? ఎవరి కొండవి? ఏ తల్లిపొత్తిళ్ళనుంచి జారిపడిన చిట్టితండ్రివి?

 

    అదేంటీ... దేవుడే దత్తత తీసుకునేటంత ముద్దుల్ని మూటగడుతున్నావే? నీకిదేం శాపమయ్యా!

 

    నిజంగా నువ్వు యాచనకే వచ్చావా?

 

    లేక మూడడుగుల నేలను యాచించే వారసుడిలా నాముందు ప్రత్యక్ష్యమై మూడు ముద్దలడిగి నా నికృష్టజీవితానికి మోక్షాన్ని ప్రసాదిద్దామనుకుంటున్నావా?

 

    ఇదేంటబ్బా... ఏడవటం మరిచిపోయాననుకున్నాను. కన్నీళ్ళు ఇంకిపోయాయనుకున్నాను. నేనూ ఏడవగలుగుతున్నానే!

 

    నాలో ఇంతటి సంచలనాన్ని కలిగిస్తున్న నా చిన్నారి దేవుడూ! చేతులు చాచి నన్నింకా సిగ్గుపడేట్టు చేయకు.

 

    అప్పటికే ఆమె నానీని సమీపించింది.

 

    వీధి లైటుకాంతిలో చూసింది.. అర్చన లేక మకిలిపట్టిన దేవుడిలా కనిపించాడు నానీ.

 

    మనస్సు ద్రవించింది. ఒక్క ఉదుటున ఉన్మాదిలా అక్కున చేర్చుకోబోయింది కాని మళ్ళీ అంతలోనే ఆగిపోయింది.

 

    "పిచ్చి గీతల నా తలరాతను అరక్షణంపాటైనా మార్చే ప్రయత్నంగా నాయింటి ముంగిట నిలిచిన ఓ బాలబ్రహ్మా! ఒక లిప్తపాటు నీకు అమ్మనై ఒడిలోకి లాక్కోవాలని వున్నా ఇది మైలపడిన దేహమని సంకోచిస్తున్నానయ్యా! ఎలా నిన్ను అక్కున చేర్చుకునేది? నా కన్నీళ్ళతో నిన్ను అభిషేకించి పునీతను కానా? లేక అమ్మలాగే నిన్ను తాకి ఆ అరక్షణపు ఆనందంతో భస్మమైనా చాలు అని సరిపెట్టుకుని నిన్ను ముద్దుపెట్టుకోనా?" ఆమె కళ్ళు నీటికుండలు కాగా గుండెలోతుల్లోకి చూస్తున్న నానీని తాకలేక, వెనక్కి మరలలేక వూగిపోతూంది.   

 

    ఆ కొద్దిపాటి ఆత్మీయతకేనా నోచుకోగలిగిన ఆనందమేమో నానీ పెదవులు అస్పష్టంగా గొణుగుతున్నాయి.

 

    "త్వమేవ మాతాచ"

 

    తొలకరి జల్లుతో తడిసినట్టుందామెకి.

 

    "పితా త్వమేవ..."

 

    ఆ జల్లు ఆమె శిరోజాలను అభిషేకించి క్రిందకు దిగింది.

 

    "సభాత్వమేవ..."

 

    ఆ చినుకు పాలిండ్లవరకూ పాకగా ఆమె ముత్యపుచిప్పగా మారిపోయింది.

 

    అంతే... ఏ గుండెవాగుకి గండిపడిందో యిక నిభాయించుకోలేనట్టు నానీని అమాంతం దగ్గరకి లాక్కుంది.