"ఫర్వాలేదమ్మా!"

 

    "మీరు ధర్మసత్రం మెంటైన్ చేస్తున్నారా... హోటల్ మెంటైన్ చేస్తున్నారా?" అడిగింది మహతి.

 

    రాజేంద్రప్రసాద్ పట్ల గౌరవాన్ని చాటుకుందామనుకున్న మేనేజర్ అయిష్టంగానే బిల్లు తెచ్చిచ్చాడు.

 

    రాజేంద్రప్రసాద్ తన జేబులో చెయ్యి పెట్టబోయాడు.

 

    "బిల్లు నేను పే చేస్తాను"

 

    యాభై రూపాయల నోటు తీసి అందించింది.

 

    మరో అయిదు నిమిషాల తర్వాత-

 

    ఇద్దరూ బయటకొచ్చారు.

 

    కారెక్కి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు రాజేంద్రప్రసాద్.

 

    "కారెక్కమ్మా... నువ్వెక్కడ కెళ్ళాలో అక్కడ డ్రాప్ చేస్తాను" కూతురి ముఖంలోకి చూస్తూ అన్నాడు రాజేంద్రప్రసాద్.

 

    "నో... థాంక్స్... నడవడానికే రోడ్డుమీద కొచ్చాను డాడీ... లెట్ మీ వాక్..."  

 

    ఇగ్నీషన్ కీ తిప్పాడు. కారు స్టార్టయింది.

 

    "ఓ.కే... బేబీ... విష్ యూ ఆల్ ది బెస్ట్...."

 

    "డాడీ..." ఆ మాట విన్పించుకోనట్టుగా పిల్చింది మహతి.

 

    "ఏం బేబీ..."

 

    "మమ్మీ... మమ్మీ ఎలా వుంది....?"

 

    రోడ్డుమీద దీపాల అస్పష్టపు వెలుతురు వాళ్ళిద్దరి మధ్యా పడుతోంది.

 

    "నీకు తెలుసు... మీ మమ్మీ ఎలా వుంటుందో."

 

    "ఎస్... ఎస్... డాడీ ఐనో దట్..." మనసులోనే అనుకుంది.

 

    "మీ గడువు ఇంకా మూడు నెలలే వుందనుకుంటాను. అవునా?"

 

    తలూపింది మహతి.

 

    "ఈ మూడు నెలలూ... నిన్ను వదిలి నేనుండగలను. కానీ... మీ మమ్మీ..." అంతకంటే..." మాట్లాడదలచుకోలేదాయన.

 

    కారు ముందుకెళ్ళిపోయింది.

 

                       *    *    *    *    *

 

    చాలాసేపటికిగానీ మనిషి కాలేకపోయింది మహతి.

 

    "మీ గడువు ఇంకా మూడు నెలలే వుందనుకుంటాను ..." తండ్రి మాటలే జ్ఞాపకం వస్తున్నాయి.

    అంటే-

 

    తన గురించి నిరంతరం ఆలోచిస్తున్నారన్న మాట. ఆ ఆలోచన రాగానే మహతి మనసు లోపల్నించి దుఃఖం పొంగుకొచ్చింది.

 

    తల్లీ, తండ్రినీ తలచుకుని ఎంతసేపు ఏడ్చిందో తెలీదు.

 

    ఆశలు వేరు, ఆశయాలు వేరు, ఒంటరిగా బ్రతకడం వేరు.

 

    చాలా సేపయింతర్వాత, తనను తనే ఓడార్చుకుంది. ఎందుకేడ్చింది తను? ఇంకా తనలో పిరికితనం పోలేదా? బేలతనం పోలేదా? నవ్వొచ్చింది.

 

    "మీ గడువు ఇంకా మూడునెలలే వుందనుకుంటాను..." తండ్రి మాటలే జ్ఞాపకం వస్తున్నాయి.

 

    మూడు నెలలు.

 

    మూడు నెలలు.

 

    ఎవరు గెలుస్తారు... మధుకరా...

 

    తనే గెలుస్తుంది...

 

    తనే...

 

    గబగబా టేబిల్ డ్రాయర్ తీసి, అందులోంచి బ్యాంక్ ఎకౌంట్ బుక్ తీసింది.

 

    అప్పుడప్పుడు వేసిన మొత్తం పదివేల వరకూ వుంది.

 

    కేలండర్  లోని 'డేట్' వేపు చూసింది.

 

    ఆ నెలకు ఆరోజు ఆఖరు రోజు.

 

    రేపు ఫస్టు.

 

    రేపు ఉదయాన్నే తను మొట్టమొదట చెయ్యాల్సిన పని బ్యాంకు కెళ్లడం...

 

    ఆ తర్వాత... నాగార్జునని కలవడం...

 

    నాగార్జున తన ప్రపోజల్ కు ఒప్పుకుంటాడా? తనకు హెల్ప్ చేస్తాడా?

 

    కనురెప్పలు మూతపడేవరకూ ఆలోచిస్తూనే వుంది.

 

                            *    *    *    *    *

 

    భోంచేసి రూమ్ కొచ్చి కూర్చున్నాడు మధుకర్. స్టాఫ్ ఇంటర్వ్యూలు, అపాయింట్ మెంట్లతో గత మూడ్రోజుల నుంచీ చాలా 'బిజీ'గా వున్నాడు మధుకర్.

 

    రేపట్నించి ఆఫీస్ కొత్త 'స్టాఫ్' తో కళకళలాడుతుంది. తన స్వంత ఆఫీసులో... తన స్వంత స్టాఫ్.

 

    మనసులో తొంగిచూస్తున్న ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడతను.

 

    ఏదో ఆలోచిస్తున్న మధుకర్ చూపు కేలండర్ మీద పడింది.

 

    ఆ నెలకు ఆ రోజు ఆఖరు రోజు...

 

    రేపు ఫస్టు...

 

    అంటే...

 

    రేపు తను బ్యాంకుకెళ్ళాలి... లేచి గబగబ సూట్ కేస్ తెరిచి చూశాడు.

 

    ఎకౌంట్లో వెయ్యడానికి దాచిన ఎమౌంట్ ని లెక్కపెట్టాడు.

 

    తొమ్మిదివేల ఏడువందలు...

 

    ఈసారి ఎలాగయినా పదివేలు ఎమౌంట్ లో వెయ్యాలని ఎప్పుడో అనుకున్నాడు మధుకర్.

 

    ఆఫీసు డబ్బు ఏభై వేలవరకూ వుంది.

 

    అందులోంచి మూడొందలు తీసుకుంటే...

 

    మనస్కరించలేదు మధుకర్ కి. ఆ మూడువందలూ తన స్వంత డబ్బు కావాలి! మహతి ఎకౌంట్ లో యెంత డబ్బు వేసిందో? ఆ ఆలోచన రాగానే తను ఎలాగైనా పక్కాగా పదివేలు వెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

 

    చిల్లర, మల్లర కోసం గదిని, జేబుల్ని వెతికాడు.

 

    మరో పైసా ఎక్కడా లేదు.

 

    ఏం చెయ్యాలి?

 

    చేతి వాచీవేపు చూసాడు.

 

    పదీ నలభై అయింది. ఏదో ఆలోచనరాగానే, గబుక్కున రూమ్ తాళం వేసి నారాయణగూడా పెట్రోల్ బంక్ దగ్గరకొచ్చాడు.

 

    పెట్రోల్ బంక్ దగ్గర వుండాల్సిన మిత్రుడు లేడు.

 

    ఓనరున్నాడు...

 

    "ఏం మధూ... ఏదో స్వయంగా వ్యాపారం చేస్తున్నావటగదా! బాగుందా... మీవాడు కూడా ఏదో సినిమా ప్రొడక్షన్ కంపెనీలో ఆఫరొచ్చిందని వెళ్ళిపోయాడు. ఇంకా వారం రోజులు కూడా కాలేదు" చెప్పాడు ఓనర్.

 

    "నైట్ డ్యూటీ ఎవరు చేస్తున్నార్సార్?" ఆఫీస్ రూంలో తన స్థానంలో కూర్చున్న కొత్త వ్యక్తిని చూస్తూ అడిగాడు మధుకర్.

 

    "ఇలాంటి ఉద్యోగాల్లో ఎవరు పర్మినెంట్ గా వుంటారు చెప్పు" అన్నాడు ఓనర్.

 

    ఆ రాత్రికి తనక్కడ ఓవర్ టైమ్ చేద్దామని వచ్చాడు మధుకర్. ఏం చెయ్యాలో పాలుపోలేదు.

 

    "ఏం మధూ! సిన్మాకెళ్లొస్తున్నావా?" మళ్ళీ అడిగాడు ఓనర్.