క్రిందకు దిగుతూ ఈ విషయం అన్నయ్యకు చెబుదామా అనుకుంది. కాని మెల్లగా తమాయించుకుని తను చెప్పటమెందుకులే. ఎలాగూ తర్వాత తెలుస్తుంది కదా అని ఊరుకుంది.

 

    ఆ సమయానికి లలితమ్మగారు పెరట్లోంచి లోపలకు వస్తోంది. "రారా బాబూ రా, వేడినీళ్ళు కాచాను. ఏమిటి యీసారి ప్రయాణం విశేషాలూ?" అనడిగింది.

 

    రామం ఇందాక ఇంట్లోంచి వస్తున్నప్పుడే ఆమె అతన్ని చూసి పలకరించటం అయిపోయింది. అతను మెట్లు ఎక్కిపైకి వెళ్ళకముందే కుశలప్రశ్నలూ కులాసా కబుర్లూ అయిపోయినాయి.

 

    "ఏముంటాయమ్మా. నా బిజినెస్ గొడవలూ, నేనూ"

 

    అతను పెరట్లోకి అడుగిడబోతూ అటుప్రక్కనుంచి లోపలకు చాటుగా వెళ్ళిపోతూన్న వ్యక్తినిచూసి యెవరా అనుకున్నాడు. ఆమెవెనుక భాగంమాత్రం అతనికి క్షణకాలం కనిపించి, మాయమైపోయింది. సుభద్రనే చూసి అలా భ్రమపడినానేమోననుకున్నాడు. తర్వాత అడుగుదాములే అనుకుంటూ బాత్ రూంలోకి దారితీశాడు.

 

    అతను స్నానంచేసి వచ్చి క్రింద వంటింట్లోనే కూర్చుని మస్తుగా ఫలహారం చేసి, కాఫీ త్రాగేసి పైకి వచ్చాడు. అతని తలుపులు దగ్గరగా వేసి వున్నాయ్, మెల్లిగా తోసి లోపలకు అడుగు వెయ్యబోయి నిర్ఘాంతపోయి నిల్చుండి పోయాడు.

 

    లోపల అతని బల్లమీద సామాను సర్దుతూ తలుపు చప్పుడవగానే యిటు వైపు తలత్రిప్పి చూసింది ఓ యువతి చేస్తున్న పనిని ఆపి అతనివంక భయంగా గగుర్పాటుతో చూస్తూ అలానే నిలబడిపోయింది.

 

    "నువ్వా?" అన్నాడతను ఆశ్చర్యంగా.

 

    ఎప్పుడు వచ్చిందిక్కడకు? ఎవరు రానిచ్చారు! తల్లీ, తండ్రీ అంతా ఈ విషయం తెలిసి ఏమీ తెలియనట్లుగా దాచిపెట్టి ఊరుకున్నారు.

 

    ఒక్కనిముషం అలా జవాబులేని స్థితిలో నిశ్శబ్దంగా గడిచిపోయింది.

 

    "మళ్లీ ఎందుకొచ్చావ్?" అని రామం కఠినంగా ప్రశ్నించాడు.

 

    మనోరమ ఆకస్మికంగా వచ్చి శరవేగంతో అతని పాదాలమీద వాలిపోయింది. తన రెండుచేతుల్తో వాటిని బలంగా చుట్టేసింది. తన కన్నీటి ప్రవాహంలో వాటిని అభిషేకం చేసింది.

 

    "ఛీ!ఏమిటిది? నా కాళ్ళు విడిచిపెట్టు, విడిచిపెట్టు" అంటూ రామం తన పాదాలు వెనక్కి లాక్కుందామని బలవంతంగా ప్రయత్నం చేస్తున్నాడు.

 

    "ఉహుఁ! విడిచిపెట్టను. నన్ను క్షమించండి" అని అర్థిస్తోంది మనోరమ హృదయపూర్వకంగా.

 

    అతను సిగ్గుతో, అసహ్యంతో, కోపంతో కదిలిపోతున్నాడు ఏనాటి మనోరమ? విస్కృతిలో పడిన, పడని అనుభూతితో తిరిగి ఏమిటి యీ సాక్షాత్కారం? ఎందుకు పునర్దర్శనం? మనోరమ! మనోరమ! మనోరమ!


                                                                     *  *  *


    ఆనాడు మనోరమ వంటవాడితో రైలెక్కి కూర్చున్న తర్వాత ఆమెకు కొంచెంగా భయమేసింది. కాని ఆమెలోని అభిజాత్వం, అహంభావం ఆ భయాన్ని అణచివేసినై.

 

    తను రామం పైపై మెరుగులు చూసి మోసపోయింది. అతను ఆఖరికి భార్యపై చెయ్యిచేసుకునే అవ్యక్త ప్రవర్తనుడు, సంస్కారహీనుడు. తను ఎంతో సహృదయురాలు కాబట్టి అతన్తో యిన్నాళ్ళు కాపురం చేసింది! మరో ఆడదైతే?

 

    చీకటినీ, నిశ్శబ్దాన్నీ చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోతోంది రైలుబండి. మనోరమ తలకి మఫ్లర్ చుట్టకుని కిటికీ దగ్గరగా కూర్చుని ఆ నైశగాఢాంధకారంలోకి అవలోకిస్తోంది. అది సెకండ్ క్లాస్ కంపార్టుమెంటు, పెట్టెలో యింకా చాలామంది మనుషులున్నారు. చాలామంది నిద్రమత్తులో జోగుతున్నారు. వంటవాడు కొంచెం దూరంలో కూర్చుని అటూ యిటూ వొత్తిగిలుతూ అప్పుడప్పుడు ఆమెవంక దృక్కులు సారిస్తున్నాడు.

 

    "పాపం! మంచివాడు. నాకోసం ఉద్యోగానికి తిలోదకాలు యిచ్చి వచ్చేశాడు" అని ఆమె అతన్ని చూసి జాలిపడింది.

 

    రైలు మెల్లగా బెజవాడ స్టేషన్ చేరుకునేసరికి ఉదయం తొమ్మిది దాటింది. ఆమె ఏలూరులోనే ముఖం కడుక్కుని కాస్త కాఫీ త్రాగింది.

 

    వెంటనే మద్రాస్ పోవటానికి సరైన ట్రైన్ ఏమీలేదు. రాత్రికి మెయిల్లోనే పోవాలి. అప్పటిదాకా ఏం చేసేటట్లు? ఎక్కడ గడిపేటట్లు?

 

    రిటైరింగ్ రూం తీసుకుని గడుపుదామా అనుకుంది కాని స్టేషన్ వాతావరణంలో అంతసేపు వుంటే తెలిసినవాళ్ళు ఎవరైనా కనిపించే ప్రమాదం వుందని భయపడింది.

 

    "కాఫీ ఏమైనా తీసుకుంటారా?" అని అడిగాడు వంటవాడు.

 

    "ఇప్పుడు దానికేమి తొందర లేదులేవోయ్. రాత్రిదాకా ఎక్కడన్నా గడిపే సదుపాయం చూడు" అన్నది మనోరమ.

 

    అతను ఆలోచించి "ఏదన్నా హోటలుకి వెడితే?" అని సూచించాడు.

 

    ఈ సలహా బాగానే వున్నట్లు తోచింది ఆమెకు. "సరే పద" అంటూ కదిలింది.

 

    ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు.

 

    మనోరమకు బెజవాడ కొత్త. ఆమె స్టేషన్ మీదుగా రైల్లో చాలాసార్లు ప్రయాణం చేసిందేకాని, ఊళ్ళో ఎప్పుడూ దిగలేదు. వంటవాడికి కాస్త తెలిసినట్లుగా వుంది. ఇద్దరూ రెండురిక్షాలు ఎక్కి గవర్నరుపేటలో వున్న ఓ హోటలికి వెళ్ళారు.

 

    గదిలోకి వెళ్ళగానే మనోరమ మంచంమీద వున్న మెత్తని పరుపులమీద చతికిలబడి, "హమ్మయ్య! ఫర్వాలేదు. ఈ హోటలు బాగానే వుంది. సాయంత్రం దాకా హాయిగా గడపవచ్చు" అని బయటకే అన్నది.

 

    వంటవాడు నిలబడే వున్నాడు. ఆమె అతన్ని నిల్చోమనిగానీ కూర్చోమని గానీ అనలేదు. ఒకసారి బద్ధకంగా ఒళ్లు విరుచుకుని "ఆ బెల్ నొక్కి కాఫీ తెప్పించవోయ్. కాస్త బద్ధకం తీరితేగానీ స్నానం చెయ్యాలనిపించటంలేదు" అన్నది.

 

    అతను ఆమె చెప్పినట్లే చూశాక "నువ్వు క్రిందకి వెళ్ళి కాఫీ తాగిరా" అంది మనోరమ.