మారేడుపల్లిలో మా ఇంటిముందు గుడిసెల గూడెం ఉంది. కొంతదూరంలో కల్లు కాంపౌండు. ఆ పేదల జీవితాలు దాపరికాలు ఎరుగనివి. విచిత్రములు, విశేషములు, నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.    
    
    అక్కడి స్థలానికి విలువ లేనపుడు - అక్కడ వాళ్ళు నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు వాటికి విలువ వచ్చింది. వాళ్ళను తొలగించడానికి భూస్వామి ప్రయత్నం వారికి అన్యాయం జరగరాదని నా సంకల్పం. గిరి - నేనూ గుడిసెవాసులక్సోం పోరాటం జరిపాం. బెదిరింపులు సహించాం. పోలీస్టేషన్లో గడిపాం. మొత్తానికి భూస్వామి ఆటలు సాగనీయలేదు. అతను తోక ముడిచాడు.
    
    గొర్రె గొల్లను నమ్మదు. కసాయిని నమ్ముతుంది. గుడిసె వాసులు భూస్వామిని నమ్మారు. వాడు డబ్బు పాహ్సిమ విసిరాడు, వీరు లొంగిపోయారు. అంతే, హక్కులు వదులుకున్నారు. కనీసమా మాకు ముఖాలు చూపలేదు!
    
    ప్రజా పోరాటంలో ఎదురు దెబ్బతినడం ఇప్పుడే! దోపిడీ వేషం మార్చుకుని వస్తున్నది! రంగుల వెనక రూపాన్ని శ్రామికులు చూడలేకపోతున్నారు! కొత్త వేశపు కేపిటలిజం పేదలను మభ్యపెట్టడం నేర్చింది!
    
    దీనిని ఇతివృత్తంగా తీసుకొని ఒక నవల ప్లాను చేశాను. రచన భాయిజాన్ ఇంట్లోనే ప్రారంభించాను. ఒక అధ్యాయంలో కపటం ఎరుగని పేదల జీవితం - మరొక దాంట్లో కుట్రలు తప్ప ఎరుగని విలాస జీవితం. ఇలా నవల సాంతం సాగించాలని ప్రణాళిక.
    
    నా అలవాటు ప్రకారం తెల్లవారు జామున లేచి వ్రాసేవాణ్ణి. నిత్యకృత్యాలు ముగించుకుని, భోజనంచేసి అఆఫీసుకు వెళ్ళేవాణ్ణి. సాయంకాలం తిరిగి వచ్చేవరకు చిరంజీవి అది చదివేవారు.
    
    తొలినాటి సాయంత్రం వచ్చాను. "భాయిజాన్! సహజ కవిత్వం - సహజ రచన దీన్నే అంటారేమో! ఒక్క తుడుపులేదు. ఒక్క తప్పులేదు. గంగా ప్రవాహంలా సాగిపోతున్నది. ఎలా సాధ్యం భాయిజాన్?" అని అడిగారు.
    
    చిరంజీవి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. నేను అలా వ్రాస్తానని ఎన్నడూ అనుకోలేదు. మన విషయం కూడా మరొకరు చెపితేగాని అర్ధం కాదు!
    
    భాయిజాన్ కు తన రచన ఎంతకూ నచ్చదు. అనేకసార్లు కొట్టెయ్యాలి. అప్పుడుగాని సాపు ప్రతి సిద్దంకాదు. అందువల్ల నా రచన చూచి ఆశ్చర్యపడ్డారు.
    
    నేనూ కొంత ఆలోచించిగాని సమాధానం చెప్పలేకపోయాను. "భాయిజాన్! మీరు అడిగేదాకా నేనూ ఆలోచించలేదు. రెండు కారణాలు కావచ్చును అనుకుంటా.
    
    1. ప్రణాళిక చాల ముందుగా సిద్దం చేసుకుంటాను.
    
    2. వ్రాసేపుడు సమాధిలోకి వెళ్ళిపోతాను. మరే ధ్యాసా ఉండదు. ఏ పదం - వాక్యం - పాత్ర - సంఘటనలలో ఉంటానో అందులో లీనం అయిపోతాను."
    
    భాయిజాన్ దీర్ఘంగా ఆలోచించారు. వారు ఎటో విహరించివచ్చారు. "కావచ్చు, భాయిజాన్! ఈ తొలివాక్యం బాగులేదని కాదు. నాకు ఎలాగో ఉంది. మార్చడం మంచిది అనిపిస్తున్నది" అన్నారు.
    
    ఆ వాక్యం ఏమిటో చిత్తగించండి.
    
    "నీగ్రోయువతి బుగ్గలా తారురోడ్డు మెరుస్తుంది." ఆ రోడ్డుమీద - అర్దరాత్రి - తాగిన నలుగురూ తందనాలాడుతుంటారు - అదీ కథాక్రమం.
    
    ఏ పరిస్థితిలోనూ తారురోడ్డు నీగ్రోయువతి బుగ్గ కావడానికి వీల్లేదంటారు. అంతటి మెత్తనిది ఆ మనసు! మార్చాక తప్పలేదు. సీను మొత్తం మార్చాను. కల్లు దుకాణం నుంచి ప్ర్రారంభించాను.
    
    'తాగినన్క ఊరుకుంటే మజ ఏమున్నది? పాడవే పోచన్నా!" పిచ్చయ్య ప్రోత్సహించాడు. పోచయ్య అందుకున్నాడు.
    
    "చమేలీకె మండ్వే తలె
    దోబదన్ ప్యార్ కీ ఆగ్ మెఁ జల్ గయీఁ"
    
    అది మఖ్దూం పదం. అది కల్లుదుకాణందాకా పోదు - మార్చమంటాడు బాయిజాన్!
    
    ఆ సాయంత్రం ఒక వింత జరిగింది. నేను టాక్సీలో వస్తున్నాను. డ్రైవరు ముస్లిం వృద్దుడు. ట్రాఫిక్ రెడ్ లైట్ వచ్చింది, టాక్సీ ఆగింది నేను డ్రైవరుతో 'సుర్జ్ సవేరా గయా' అన్నాను. డ్రైవరు ఆవేశభరితుడు అయినాడు. "సుర్జ్ సవేరా" అనే మఖ్దూం కవిత చదవడంలో పచ్చలైటు వచ్చిందీ గమనించలేదు. నేను చెపితే నడిపించాడు. మఖ్దూం గురించి చెపుతూనే ఉన్నాడు. "లీడర్ దో తరహకె హోతేహైఁ సాబ్! ఏక్ అప్నాఘర్ ఉజాడ్తాహై అవుర్ దున్యా బసాతాహై, దూస్రా దున్యా ఉజాడ్తా హై అవుర్ అప్నాఘర్ బసాతా హై మఖ్దూం సహలే దర్జేకా లీడర్ థా సాబ్! హౌజింగ్ బోర్డ్ కా మెంబర్ రహా బినా మకాన్ కె మరా" (నాయకులు రెండు రకాలవాళ్ళుంటారండీ! ఒకరకం తన ఇల్లు కూల్చుకుంటాడు - లోకాన్ని నిర్మిస్తాడు. రెండోరకం లోకాన్ని నాశనం చేస్తాడు - తన ఇల్లు నిర్మించుకుంటాడు. మఖ్దూం మొదటిరకం నాయకుడు హౌజింగ్ బోర్డు మెంబర్ అయ్యిన్నీ ఇల్లులేక గతించాడు)
    
    డ్రైవరు చిరంజీవి ఇల్లు చేరేవరకూ చెపుతూనే ఉన్నాడు. ఇల్లు వచ్చింది. భాయిజాన్ను పిలిచాను. మఖ్దూమ్ ను గురించి డ్రైవరు చెప్పిన నిరంతర ఉపన్యాసంతో చిరంజీవి ఉక్కిరి బిక్కిరి అయినారు. డ్రైవరుకు చాయ్ తాగించి పంపించారు. కల్లు దుకాణంలో మఖ్దూం కవితను గురించి పెదవి విప్పలేదు.
    
    నవలకు భాయిజాన్ "మాయజలతారు" అని పేరుపెట్టారు.
    
    లక్ష్మి - పోచయ్య భార్యాభర్తలు పోరాట సందర్భంలో దుర్మార్గుల వలలో చిక్కుకుంటారు. పోచయ్య స్మగ్లర్ల బంధంలో చిక్కుకుంటాడు. ముంబాయిలో పట్టుబడ్తాడు. జేలుకు వెళ్తాడు. లక్ష్మి దుర్మార్గులచేత చిక్కుతుంది. బోగం కొంపకు చేరుతుంది, సర్వనాశనం అవుతుంది.
    
    నవల చివరలో లక్ష్మి - పోచయ్య గూడెం చేరుకుంటారు, పోచయ్య  లక్ష్మిని చూస్తాడు. "లచ్చీ!" అని పరిగెత్తుతాడు.
    
    "ఆగు, నన్ను తాకకు నేను చెడినదాన్ని" అంటుంది లక్ష్మి.
    
    "నా లచ్చి అగ్గి దానికి చెదలు అంటదు, నువ్వు నా లచ్చివి అప్పుడూ నా లచ్చివే, ఇప్పుడూ నా లచ్చివే" అని పోచయ్య ఆమెను కౌగలించుకుంటాడు.
    
    ఇది కథకు నా ప్లాను. 'లచ్చి ముద్దుబిడ్డ - ఆమె చెరచబడరాదు భాయిజాన్! ఆ పిల్లను చెరిస్తే నేను సహించలేను. ఏమయినా చేయి ఆమె శీలం చెడరాదు" అంటారు భాయిజాన్.
    
    "లక్ష్మి నవలలో పాత్రమాత్రమే! ఆమె చెడితేనే పోచయ్య పవిత్ర ప్రేమ వ్యక్తం అవుతుంది" అని భాయిజాన్ కు నచ్చచెప్పడానికి, నా శక్తివంచిన లేకుండా, ప్రయత్నించాను. భాయిజాన్ వప్పుకోలేదు మార్చక తప్పలేదు.
    
    లక్ష్మి కూలి పనిచేస్తూ నాలుగో అంతస్సునుంచి పడిపోతుంది. ఆమె పూర్వస్మృతులు కోల్పోతుంది. ఆమెను ఎవరు తాకినా 'టచ్ మీనాట్' లా ముడుచుకుపోతుంది. అలా లక్ష్మి శీలాన్ని కృత్రిమంగా పరిరక్షించాల్సివచ్చింది. అందుకుగాను అసహజ సన్నివేశాలు కల్పించాల్సివచ్చింది. నవలలో అసహజాలు ఉండవచ్చు - ఆపాకృతాలూ - అవాస్తవాలూ ఉండరాదంటాడు 'రాల్ఫ్ పాక్స్'.
    
    అసహజమునకు - అవాస్తమునకూ భేదం ఏమి? అసహజం జరగడానికి అవకాశం ఉన్న సంఘటన. యాదృచ్చికంగా పాత్రలు కలుసుకోవడం - విడిపోవడం లాంటివి. స్మృతి కోల్పోవడం లాంటివి. అప్రాకృతం - అవాస్తవం మానవజీవితంలో జరగడానికి వీలులేని సంఘటనలు. చనిపోయినవాడు లేచి రావడం - యువకుడు బాలుడు అయిపోవడం లాంటివి.
    
    అసహజాలకు నవలలో అవకాశం ఉంటే ఉండవచ్చు. కాని సామాజిక నవలలో అలాంటివి ఉండరాదని నా అభిప్రాయం. ఏదో ఒక రకంగా నావి అన్నీ సామాజిక నవలలే. ఒక్క 'మాయజలతారు'లో లక్ష్మిపాత్ర విషయంలో తప్ప  అసహజత ఇందులోనూ చేర్చలేదు. 'లక్ష్మి' విషయంలో భాయిజాన్ భావుకతకు వారి జీవితంలో సంబంధం ఉందని అటుతరువాత అర్ధం అయింది.
    
    రచయిత భావుకుడు కావాలి. కాకుంటే బహుశః రచనలు చేయలేడు. అయితే అతనికి - ఆమెకు ఉండాల్సిన లక్షణాల్లో అది ఒకటి మాత్రమే! భావుకత మాత్రమే రచయితను చేయలేదు. భాయిజాన్ ఇప్పటిదశలో భావుకతలో కొట్టుకుపోతున్నాడు. వ్యక్తి ఎల్లప్పుడూ ఒకే దిశలో - దశలో ఉండడు! మార్పు ప్రకృతి లక్షణం! వారు అప్పుడు అలా ఉన్నారు. అంతే!
    
    ప్రగతి వారపత్రికలో "చిల్లరదేవుళ్ళు" ముగియవచ్చింది. ప్రగతి సంపాదకులు చంద్రంగారు అచంచల దేశభక్తులు నిజాయితీకి నిజరూపం. వయోవృద్దులు వారికి నా రచనల మీద వాత్సల్యం. 'మాయజలతారు' ప్రచురించే అవకాశం తమకు కల్పించాల్సింది అని జాబు వ్రాశారు. జాబు భాయిజాన్ కు చూపించాను. 'ఆంద్రప్రభ నవలల పోటీకి పంపుతాం. ఆర్ధికంగా అవసరాలలో ఉన్నావు. అక్కరకు వస్తుంది' అన్నారు.
    
    నా మనసు 'ప్రగతి - చంద్రం' గారి వైపే గుంజుతున్నది. కాని ఎందుకో చిరంజీవి భాయిజాన్ ముందు నీరసపడిపోతాను, 'ఆంద్రప్రభకే పంపడం జరిగింది.
    
    భాయిజాన్ నిరంతర ప్రయత్నం తరువాత కూడా 'మాయజలతారు'కు బహుమతి రాలేదు. కామరాజుగారు అప్పుడు ప్రభలో పనిచేశారు. వారి ప్రయత్నంవల్ల 'మాయజలతారు' సాధారణ ప్రచురణకు అంగీకరించబడిందని భాయిజాన్ నాకు వివరించారు! నేను వారి మాట నమ్మకుండా ఉండలేదు.