"వెళ్ళిపోయేటప్పుడుకూడా ఏమీ చెప్పలేదా?"
    
    "ఉహుఁ! నేన్నీకు రాస్తాను, నీకు రాస్తాను" అన్నాడు ఏం రాస్తాడో ఏమిటో? అమ్మ 'శుభలేఖలు అచ్చు వేయిస్తామయ్యా' అంటే నేను రాస్తాను కదత్తయ్యా" అన్నాడు.
    
    "నీకేమన్నా అనుమానముందా మనసులో?"
    
    "ఏముంటుంది? ఫారిన్ లో కొన్ని సంవత్సరాల తరబడి వుంటున్నాడుగా. అక్కడ ఏ దొరసానితోనన్నా ప్రేమలో పడటంగాని, లేక ఎవరినన్నా కట్టుకోవటం గాని జరిగిందేమో" అని నవ్వింది సరోజ. కాని ఆ నవ్వులో జీవం కనబడలేదు.
    
    "ఛ ఛ! అలా జరిగివుండదు" అనేసింది గిరిజ అప్రయత్నంగా.
    
    "నీకెలా తెలుసు?" అనడిగింది చప్పున.
    
    గిరిజ నాలిక కొరుక్కుంది. తన తప్పిదమేదో తెలుసుకున్నట్లు "నాకెలా తెలుస్తుంది? ఊరికినే అనిపించిందంతే" అంది సర్దుకుని.
    
    "నాకలా అనిపిస్తోంటే నీకలా ఎందుకనిపించాలి" అంది సరోజ గ్రుచ్చి గ్రుచ్చి అడుగుతున్నట్లు.
    
    "అతని నడవడి, వైఖరి చూస్తుంటే వ్యక్తిత్వం, సంస్కారం వున్నవాడిలా కనిపించాడు."
    
    "వ్యక్తిత్వం సంస్కారం వున్నవాడు ప్రేమలో పడడా? ఐమీన్! మరో అమ్మాయితో?"
    
    "అబ్బ! అలా వాదిస్తావేమిటే? మరో అమ్మాయిని ప్రేమించడంతప్ప యింకో సమస్య ఏదీ వుండి వుండకూడదా?"
    
    "అంత మహాసమస్య ఏమయి వుంటుంది? నాకంతు పట్టటంలేదు" అని సరోజ సాలోచనగా "గిరిజా! ఆరోజు నువ్వు మా ఇంటికి వచ్చావే. నేను శారీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఏమైనా అన్నాడా?" అనడిగింది.
    
    గిరిజ ముఖం పాలిపోయినట్లయింది. "అబ్బే లేదు" అంది పొడిగా.
    
    "అయినా నాతో అతనికంత చనువెక్కడిదీ" అంది తేరుకున్నాక.
    
    సరోజ చిన్నగా నవ్వింది. "కొన్ని విషయాలు చర్చించటానికి చనువు వున్నవారికన్నా చనువులేనివారే అనువుగా కన్పిస్తారే" అంది.
    
    గిరిజ ఏమీ మాట్లాడలేదు వెంటనే. ఆమెకు రానురానూ తమ జీవితాలు ఎక్కడికో అగాధంవైపు దారి తీస్తున్నాయనిపించింది. ఏదీ స్పష్టంగా తెలియటం లేదు. కాని ఏదో జరుగుతుంది. దానికి లొంగిపోతున్నారా? తప్పించుకుంటున్నారా?
    
    ఆమె అయోమయంలో పడిపోతోంది.
    
                                                         * * *

    ముహూర్తం రెండురోజుల్లో పడింది. పెళ్ళివారు ఆ సాయంత్రం వస్తారు. రెండువైపులా చుట్టాలూ ఒకరే కాబట్టి, పెళ్ళివారి తరపుకూడా అంతా వచ్చేసినట్లే. మనుషులతో యిల్లంతా కిటకిటలాడిపోతోంది. ఏమోవ్ లూ, వసేవ్ లూ మొదలయినాయి. పరాచకాలూ చతురోక్తులూ ముమ్మరంగా సాగిపోతున్నాయి. ఎవరికెవరు ఏమౌతారో ఆలోచిస్తేగాని బయటపడటం కష్టం. పిన్నవయస్సువాళ్ళు చాలమందికి వాళ్ళ వాళ్ళ చుట్టరికలు తెలియవు. ఏడెనిమిదేళ్ళపిల్లలు ఎవర్నో పట్టుకుని 'పిన్ని' అని పిలుస్తుంటే వాళ్ళ తల్లి వచ్చి పిన్ని కాదురా అత్తయ్య అని సరిదిద్దుతోంది. పద్దెనిమిదేళ్ళపడుచు కుర్రాడొకడు పదిహేనేళ్ళ పదునైన పిల్లను వీలుచూసుకుని సరసమాడుతోమ్తే అతని బావగారొచ్చి "తప్పురోయ్! అది నీకు చెల్లెలు వరసవుతుంది' అని మందలించాడు. స్నానాల  దగ్గర భోజనాల దగ్గర, వంటలదగ్గర ఎక్కడ చూస్తే అక్కడ గుంపులు బాత్ రూమ్స్ ఖాళీలు లేక పెరట్లో బావిదగ్గరే ఆడవాళ్ళూ, మొగవాళ్ళూకూడా స్నానాలు చేసేస్తున్నారు. ఒక్కొక్కసారి చూస్తే వీళ్ళకు సిగ్గులు లేవా అనిపిస్తుంది.
    
    సామ్రాజ్యంమాత్రం ఈ గందరగోళానికి దూరంగా ప్రేక్షకురాలిగానే మంచానికంటుకుపోయి వుండిపోయింది. తండ్రి వైకుంఠంగారితోపాటు చెల్లెలు శ్రీలక్ష్మికూడా అప్పుడే ఊరినుంచి వచ్చింది. ఆమెకు అక్కనిచూస్తే జాలి, బావగార్ని చూస్తే సానుభూతి. అంతమందిలోనూ తలలో నాల్కలాగానే తిరుగుతూ ఒకప్రక్క అక్కగారికి సపర్యలు చేస్తూనే మరోప్రక్క బావగారికి ఏవేళ ఏంకావాలో అవన్నీ అమరుస్తోంది.
    
    సరోజ గురించి తర్వాతేమీ గిరిజకు తెలియలేదు. ఇంతవరకూ తెలియలేదంటే ఏదో జరిగివుండాలి. తన పెళ్ళి శుభలేఖ ఆమెకు వెళ్ళింది. ఆమెనుంచి ఏ శుభలేఖా తనకు రాలేదు. ఇంతవరకూ రాలేద్మతే ఇహ రాదు. పాపం! సరోజ ఎలావుందో అన్న ఆలోచనతో ఆమె నలిగిపోతోంది. తాను అంధకారంలో వున్నంతమాత్రాన ఇతరుల గురించి పట్టించుకోణంత స్థితిలోకి దిగజారిపోలేదు గిరిజ. తన దుఃఖానికి సరోజదుఃఖానికి పరస్పర వైరుధ్యం వుండచ్చు. అవి రెండూ ప్రతికూల స్పందనలు కావచ్చు. అయినా దుఃఖం దుఃఖమే.
    
    పోనీ ఓసారి సరోజ యింటికి వెళ్ళివద్దామంటే- ఛీ, పాడు, తానిప్పుడు పెళ్ళికూతురాయె. బంధిఖానాలో వున్నట్లే లెక్క.
    
    గిరిజను పెళ్ళికూతుర్ని చేశారు. పెళ్ళిబట్టలూ, పదాలకు పారాణి, కళ్ళకు కాటుకరేఖలు, బుగ్గన పెళ్ళిబొట్టు, వాకిటిలో మేళాలు, చుట్టూ చుట్టాలు కాని గిరిజ కళ్ళు సరోజకోసమే వెతుకుతున్నాయి.
    
    "రాదేమో" అని నిరాశ చేసుకుంది కాని చివరకు సరోజ వచ్చింది.
    
    ఆమెముఖంలోకి ఆతృతగా చూసింది గిరిజ.
    
    ఆమె సగం చిక్కింది. కళ్ళలో వెనుకటి కాంతిలేదు. మనిషి నల్లబడింది.
    
    గిరిజ కళ్ళచుట్టూ కాటుక నలుపు.
    
    సరోజ కళ్ళచుట్టూ కాటుక చీకటి నలుపు.
    
    గిరిజ బుగ్గమీద పెళ్ళిబొట్టు.
    
    సరోజ బుగ్గన ఎండిన కన్నీటి చార.