అందుకామె కిలకిలా నవ్వేసింది.

 

    "ఇంతకి 12155 అంటే ఏమిటో చెప్పకూడదూ- ఆ ఫాజిల్ తో చచ్చిపోతున్నాను" తిరిగి శ్రీధరే అన్నాడు.

 

    "చిక్కుముడి విప్పుతాను-అదిస్తావా మరి."

 

    "ఏది?"

 

    "అదే 12155"

 

    "అదేమిటో తెలీనప్పుడే అదెలా యివ్వగలను."

 

    "నేను తెలియజెప్పాక ఇస్తానని మాటివ్వు."

 

    "అది నేనివ్వగలిగేదేనా?" సందేహంగా అడిగాడు శ్రీధర్.

 

    "అది నాకు మాత్రమే ఇవ్వగలిగేది-నువ్విస్తేనే తీసుకోగలిగేది. అది ఇంకెవరూ ఇస్తానన్నా, ఎన్నిసార్లు ఇస్తానన్నా నాకవసరంలేదు. ఖర్చులేనిది, కమ్మనైనది...యిస్తావా...చెప్పు" కంఠాన్ని మార్దవంగా మారుస్తూ అంది పూజ.

 

    "సరే...అలాగే యిస్తాను చెప్పు" అన్నాడు శ్రీధర్ సస్పెన్స్ ని భరించలేక.

 

    "దట్స్ గుడ్...12155ఫ్రీగా, ఒంకర టింకరగా పది, పదిహేను సార్లు రాసుకుంటూ వెళితే మొదటి ఒకటి అంకె-రెండు ఇంగ్లీష్ లో కె అనే అక్షరంగా మార్పు చెందుతాయి. మూడో అంకె ఒకటి-ఒకటిగానే వుంటుంది. నాలుగు, ఐదో అంకెలయిన ఐదులు రెండూ రెండు యస్ లుగా మార్పు చెందుతాయి- అర్థమయిందా బుజ్జిబాబు" అని ఆమె చెపుతుండగానే శ్రీధర్ ఎదురుగా వున్న స్క్రిబ్లింగ్ పేడ్ మీద ఆమె చెప్పినట్టుగా రాసుకుంటూ వెళ్ళాడు.

 

    అప్పుడు వచ్చింది దాని ఫలితం.

 

    KISS....

 

    ముద్దు....

 

    ఎస్...తనన్నట్టు ఖర్చులేనిది-కమ్మనైనది-ఒక్క క్షణం ఆమెలోని చిలిపి తనానికి, తెలివితేటలకి, సమయస్ఫూర్తికి విస్మయపడి, వెంటనే తేరుకున్నాడు.

 

    "నేను మాట తప్పను-ఎప్పుడివ్వను? ఎలా యివ్వను? ఎక్కడివ్వను" హుషారుగా అడిగాడు శ్రీధర్.

 

    ఒక్కక్షణం ఫోన్ లో సౌండ్ లేదు.

 

    "చెప్పు...ఎక్కడ? ఎప్పుడు? ఎలా అన్నది నేను చూసుకుంటాను. మొదటి రెంటికీ సమాధానం చెప్పు చాలు."

 

    "మా నాయనే! అలా అన్నా నన్ను పట్టేసుకుందామనా? అదీ ఏ శ్రమా లేకుండా...నీ ముద్దే కావాలి- నీ ఒక్కడిదే- ఈ ప్రపంచంలో యింకే మగాడి ముద్దు నాకు అవసరంలేదు. వాడెంత గొప్పవాడయినా... ఎంత డబ్బున్న వాడైనా- ఎంత పేరు ప్రతిష్టలున్నవాడైనా నా కొద్దు."

 

    "ఓ.కె...థాంక్యూ! మరి ముద్దిచ్చే అవకాశం యివ్వవలసింది నువ్వేకదా?"

 

    "తెలివితేటలు ఉపయోగిస్తే ఆ అవకాశాన్ని నువ్వే చేజిక్కించుకోవచ్చు, వుపయోగించకూడదూ" కవ్విస్తున్నట్లుగా అందామె.

 

    శ్రీధర్ మాట్లాడలేదు. నిట్టూర్చాడు.

 

    "చూడు బంగారుకొండా... ఏదైనా కష్టపడి సాధించుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది. విలువ తెలిసినప్పుడే సద్వినియోగమనేది అనుభూతిలో కొస్తుంది...బైదిబై...నిజం చెప్పు, మాళవికకి సైట్ కొట్టాలను కుంటున్నావా...?" రవ్వంత అసూయని కంఠంలో పలికిస్తూ అడిగింది పూజ.

 

    "సైట్ కొట్టడమా? మాళవికకా? నోనో...అదేంలేదు. ఏదో...కేవలం ముఖపరిచయం, ఆ మాత్రానికే సైట్ కొట్టాలనిపిస్తుందా?" నవ్వుతూ అన్నాడు శ్రీధర్.

 

    "ఏ మాత్రానికి కొట్టాలనిపిస్తుంది? ఏమో....మీ మగాళ్ళు నాలిముచ్చులు అస్సలు నమ్మకూడదు. ఇచ్చిన మాటమీదే నిలబడరు. ఉంటా. బై" అనగానే లైన్ కట్ అయిపోయింది.

 

    కొద్ది క్షణాలవరకు ఆమె మాటలు, కవ్వింపు తాలూకు స్మృతులతో గడిపి తిరిగి తన ఆఫీస్ పనిలో లీనమైపోయాడు శ్రీధర్.


                              *    *    *    *


    సాయంత్రం 5-50 అయేసరికి రవీంద్రభారతి ముందు దిగారు శ్రీధర్, యోగి.

                                                                        ODYSSEY
                                                                             TO
                                                                          ODISSI

 

    "నాట్యమయూరి కుమారి అపర్ణకు స్వాగతం."

 

    "ప్రపంచ ప్రఖ్యాత నాట్యకారిణికి హార్ధిక స్వాగతం."

 

    లాంటి రకరకాల క్లాత్ బ్యానర్సు రవీంద్రభారతి ఆవరణ అంతా వేలాడదీశారు. చిదంబరంలోని ఫేమస్ నటరాజ్ టెంపుల్ ముందు శివతాండవం చేస్తున్న శివుడి భంగిమలో వున్న అపర్ణ పోస్టర్సు ఎక్కడబడితే అక్కడ అతికించి వున్నాయి.

 

    న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో అపర్ణ కొన్ని నెలల క్రితం ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు పండిట్ రవిశంకర్ లాంప్ వెలిగిస్తున్నప్పటి ఫోటో పోస్టర్స్ కూడా అక్కడక్కడా అతికించి వున్నాయి.

 

    ఆ ఫోటోలో అపర్ణ నాట్యానికి సిద్ధమై, ఒక మెరూన్ కలర్ శాలువా కప్పుకుని పండిట్ రవిశంకర్ దీపం వెలిగించడాన్ని ఆనందోద్వేగంతో చూస్తోంది. ఎంత అందంగా వుంది అపర్ణ...?!

 

    నిజంగా అపర్ణ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించుకునే ప్రస్థానంలో వేగంగా ముందుకు పోతోంది. పెళ్ళి పేరిట, ప్రేమ పేరిట ఆమె అభివృద్ధికి తను అడ్డుపడుతున్నాడేమో...?

 

    ఒక పోస్టర్ దగ్గర ఆగిపోయి-దానికేసే చూస్తూ ఆలోచనల్లో పడిపోయాడు శ్రీధర్. అది ఆలోచనో - ఆత్మ పరిశీలనో అతనికే తెలీదు. యోగి మందలింపుతో కదిలి ఆడిటోరియంలోకి నడిచాడు శ్రీధర్.

 

    అపర్ణ వివిఐపి ఇన్విటేషన్స్ ఇచ్చి వుండడంతో స్టేజీ ముందున్న రెండో వరుసలోనే కూర్చోగలిగారిద్దరు.

 

    అప్పటికే ముఖ్య అతిథి ప్రసంగిస్తున్నారు.

 

    "సంపాదన-తిండి-నిద్ర-భోగలాలస- ఇవే మనిషి జీవితం కారాదు. వీటిని మించిన ప్రపంచం మరొకటి వుంది. అదే సంస్కృతి, సాంప్రదాయాలు-నాగరికత-క్రియేటివిటీ-

 

    కుమారి అపర్ణ అతి పిన్న వయసులో మూడు ఇండియన్ క్లాసికల్ డాన్స్ పార్మ్స్-ఒడిస్సీ, మణిపురి, చావ్ లలో ప్రపంచప్రఖ్యాతి గడించడం అంత తేలికైన విషయం కాదు.

 

    ఆమెలోని పట్టుదల, కృషి, అకుంఠిత దీక్షే ఆమెనీ స్థితికి తీసుకొచ్చాయి.