జ్ఞానసుందరి

                                                      -కొమ్మూరి వేణుగోపాలరావు

        "LIDO"

    పారడైజ్ నుంచి మురళి, జ్ఞానసుందరి బయటకు వచ్చి కారుదగ్గరకు నడవబోతూండగా ఈ అక్షరాలు ఎదురుగా ఎర్రగా మెరుస్తూ కనిపించాయి.

    "లిడో" అన్నది జ్ఞానసుందరి ఆ అక్షరాలు చదువుతూ.

    "హైక్లాస్ రెస్టారెంట్ - ఐమీన్ బార్. మనం ఎక్కడో అక్కడ భోజనంలాంటిది కానియ్యాలికదా. ఇందులో పోదామా?" అని ఆడిగాడు మురళి ఆమె ముఖంలోకి చూస్తూ.

    "మీకు ఆనందమైతే - నాకిష్టమే!" మృదువుగా అన్నది ఆమె.

    ఆమె నిశ్చలత్వానికి అతను కాస్త చలించాడు. అయినా బయటపడకుండా "పద" అంటూ అటుకేసి నడిచాడు.

    బయట దర్వాన్ లేచి నిలబడి సలాంచేసి తలుపు తెరిచాడు. ఒక్కసారిగా లోపలనుండి వివిధ శబ్ద తరంగాలు బయటకు దూకాయి. ఆమె భుజంచుట్టూ చేయివేసి అతను లోపలకు తీసుకుపోయాడు.

    ఇప్పుడు మరింత దూకుడుగా వినిపిస్తోంది. పాశ్చాత్య జంత్ర సంగీతం. ఆమె అటుకేసి తలత్రిప్పి తన విశాల నయనాలతో తిలకించింది.

    నల్లకోట్లు ధరించిన వ్యక్తులు పియానో, సితార్, మేండొలిన్ లమీద తన్మయులై వాయించేస్తున్నారు. స్త్రీ, పురుషులు ఒకరినొకరు తాకుతూ అధునాతన పాశ్చాత్యనృత్యం ప్రదర్శిస్తున్నారు. ఆ స్త్రీ సన్నగా, పొడవుగా, లేతగా, చురుకుగా వుంది. ఆంగ్లో ఇండియన్ కాదు, బహుశా ఏ పార్మీ మహిళయో, సింధీ వనితయో కావచ్చు. అలంకారంలో కూడా ఆడంబరం లేదు. చీర, జాకెట్టు....ఇత్యాదులే. హెయిర్ స్టయిల్ మాత్రం ఒక కెరటంలా పైకిసాగి అధునాతనంగా వుంది. పురుషుడు ఫ్యాంటు వేసుకుని యిన్ షర్ట్ చేశాడు. చాలా చలాకీగా, చురుగ్గా సాగిపోతున్నది డాన్స్. హాలంతా పెద్దపెద్ద టేబిల్స్, సోఫాలు, వివిధ తరహాల స్త్రీలు, పురుషులు, బల్లలమీద రకరకాల తినుబండారాలు, శాకాహారం, రంగురంగుల గ్లాసులలో పలురకాల పానీయాలు..అట్టహాసంగా వుంది. తింటూ, పానీయాలు చప్పరిస్తూ వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్య డ్యాన్స్ తిలకిస్తున్నారు.

    "ఆ సోఫా ఖాళీగా వుంది" అంటూ ఒక కార్నర్ లో వున్న సోఫాకేసి తీసుకుపోయాడు మురళి ఆమెను.

    సోఫాలో అతనిప్రక్కన కూర్చుని చూట్టూ మరోసారి కలియజూసింది జ్ఞానసుందరి. ఒక్కొక్క టేబిల్ దగ్గర నలుగురయిదుగురి దాకా కూర్చునివున్నారు. మంచి మంచి దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఎరిస్టోక్రెటిక్ ఫ్యామిలీలని చూడగానే తెలిసిపోయింది. కొంతమంది స్త్రీలు లేకుండా వచ్చారు. కొంతమంది స్త్రీలతో వచ్చారు. స్త్రీల ప్రవర్తన చాలా సభ్యతాయుతంగా, గౌరవనీయంగా వుంది. మెల్లగా ప్రక్కనున్న తమ తాలూకు పురుషులతో నవ్వుతూ మాట్లాడుతూ, వాళ్ళు తింటూ, త్రాగుతూ వుంటే తాము అప్పుడప్పుడూ గ్లాసుల్లో కలిపిపోస్తూ, తాము మాత్రం చిప్సో, ఐస్ క్రీమో, బిరియానీయో తింటూ కాలక్షేపం చేస్తున్నారు. ఒకరిద్దరు వనితలు మాత్రం అప్పుడప్పుడూ పొడుగాటి గ్లాసుల్లో బీర్ గావును చప్పరిస్తున్నారు. అక్కడక్కడా ఓ "యంగ్ లేడీ" సిగరెట్టు కాలుస్తోంది. అయినా ఎక్కడా సభ్యతకు లోటురాకుండా నియమితంగా వాతావరణం ముందుకు సాగిపోతోంది. అసలీ వాతావరణంలో ఏం చేసినా సభ్యతగానే పొడగట్టుతోంది. ఒకచోట నలుగురయిదుగురు మొగవాళ్ళు కూర్చునివున్నారు. అందులో ఒకడు, కొంచెం డోసు ఎక్కువపడిందో లేక చిలిపితనానికి కావాలనో అప్పుడప్పుడూ నిలబడి కాస్త అల్లరి చేస్తున్నాడు. డ్యాన్స్ చేసేవాళ్ళని చేతులు త్రిప్పుతూ, నడుం వంచుతూ అనుకరిస్తున్నాడు.  "లల లల్లా" అని పాడుతున్నాడు. బ్యాండ్ వాళ్ళమీద జోక్స్ విసురుతున్నాడు. అతని స్నేహితులు అతన్ని ఖుషీచేస్తూ తామూ ఆనందిస్తున్నారు. అయినా ఆ వాతావరణంలో అతని ప్రవర్తన ఎబ్బెట్టుగాగానీ, జుగుప్సాకరంగా గానీ గోచరించలేదు. అదీ నాగరికతలో ఓ భాగమే అనిపించింది. ఓ శిక్కుమనిషి - గడ్డం వుంది.....పుల్ సూటు వేసుకుని అటూ ఇటూ ఏదో పనిమీద వున్నట్లు తిరుగుతున్నాడు. అతని వాలకంచూస్తే ఆ హోటల్ యజమానిలా వుంది. జ్ఞానసుందరి అక్కడున్న స్త్రీలను మరోసారి శ్రద్ధగా, ఆసక్తికరంగా పరిశీలించింది. మళయాళీలు, సింధీలు, మహారాష్ట్రులు, ఆంగ్లో ఇండియన్ లు ఎక్కువుగా వున్నారు.

    డ్యాన్స్ అయిపొయింది. కూర్చున్నవారంతా అటు తలలు త్రిప్పి అభినందన పూర్వకంగా కరతాళధ్వనులు చేశారు. మురళికూడాచిరునవ్వు ముఖంతో చప్పట్లు కొట్టాడు. డ్యాన్స్ చేసిన వాళ్ళిద్దరూ ఒకరి ప్రక్కన ఒకరు నడిచి ఒక బల్లచుట్టూ కూర్చున్న తమ స్నేహితుల్ని చేరుకున్నారు. తాముకూడా కూర్చుని విందులో పాల్గొనసాగారు. కాసేపటివరకూ మ్యూజిక్ ఆగిపోయి నిశ్శబ్దం అలుముకుంది.

    మురళి ముందుకు వంగి సిగరెట్ వెలిగించాడు. ఒకటిరెండుసార్లు హాయిగా పొగవిడిచి "ఇక్కడ కూర్చున్నవాళ్ళంతా సభ్యమహిళలే. సరదాపుడితే వాళ్ళ భర్తలతోనో, స్నేహితులతోనో కాసేపు నృత్యం చేస్తారు. సిగ్గుగానీ అభిమానంకానీ పడరు. డ్యాన్సింగ్ క్లబ్బులు వేరే వున్నాయి. అక్కడి సందర్భం కాస్త వేరు" అన్నాడు వివరించి చెబుతున్నట్లు.

    ఆమె తల ఊపి ఊరుకుంది.

    మురళి మెనూ బుక్ చేతిలోకి తీసుకుని పేజీలు  త్రిప్పుతూ "ఏం తీసుకుంటావు జ్ఞానా?" అని ప్రశ్నించాడు ఎంతో ఆపేక్షగా.

    "నాకు ఆకలిగా లేదండీ" అన్నదామె.

    "అబ్బే! తీరా ఇక్కడకు వచ్చి ఏమీ తీసుకోకుండా వుంటే ఎలా? నీకు ఇష్టమైనది తెప్పిస్తాను. వెజిటెబుల్ కట్ లెట్, బ్రెడ్ టోస్ట్ , చిప్స్, క్వాలిటీ ఐస్ క్రీమ్ ఏం?"

    "అబ్బో! అంత లిస్టా? సరే మీ ఇష్టం" అన్నదామె నవ్వుతూ. అట్లా నవ్వుతున్నప్పుడు ఆమె లేతచిగుళ్ళు, పలుచని అందాన్నీ ప్రదర్శిస్తూ బయటపడ్డాయి.

    బేరర్ ప్లేటూ, ఫోర్క్, నైఫ్, దుస్తులు చెడిపోకుండా ఒళ్లో వేసుకునే క్లాత్ తీసుకుని అట్టహాసంగా వచ్చాడు, మురళి ఆమెకోసం కట్ లెట్ వగైరాలు, తనకోసం బిరియానీ, ఆమ్లెట్ ఆర్డర్ చేశాడు.

    "అంత ఎక్కువగా తాగకు డియర్! ఈమధ్య నీ శరీరానికి సరిపడటంలేదు."

    ఇంగ్లీషులో ఈ మాటలు వినిపించి జ్ఞానసుందరి తల ప్రక్కకు త్రిప్పి చూసింది. ఓ పార్శీ సుందరి చిత్తుగా తాగేస్తోన్న తన ప్రక్కవానితో అంటోంది. అతను విపరీతంగా తిన్నట్లున్నాడు కూడా. బల్లమీద స్థలంలేకుండా కొంచం కొంచం మిగిలిన తినుబండారాలతో ప్లేట్లు నిండిపోయివున్నాయి.